Remove ads
1993 సినిమా From Wikipedia, the free encyclopedia
రాజేంద్రుడు గజేంద్రుడు 1993 లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఒక హాస్యభరిత చిత్రం. ఇది ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది.[2] ఈ చిత్రాన్ని మనీషా ఫిలింస్ పతాకంపై కె. అచ్చిరెడ్డి నిర్మించగా, కిషోర్ రాఠీ సమర్పకుడిగా వ్యవహరించాడు.[3]
రాజేంద్రుడు-గజేంద్రుడు | |
---|---|
దర్శకత్వం | యస్.వి. కృష్ణారెడ్డి |
రచన | దివాకర్ బాబు (మాటలు), ఎస్. వి. కృష్ణారెడ్డి (కథ, చిత్రానువాదం), కె. అచ్చిరెడ్డి (మూల కథ) |
నిర్మాత | కె. అచ్చిరెడ్డి (నిర్మాత), కిషోర్ రాఠీ (సమర్పణ) |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, సౌందర్య |
ఛాయాగ్రహణం | శరత్ |
కూర్పు | కె. రాంగోపాల్ రెడ్డి |
సంగీతం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
నిర్మాణ సంస్థ | మనీషా ఫిల్మ్స్ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 4, 1993[1] |
సినిమా నిడివి | 152 ని. |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అటవీ శాఖ అధికారియైన గుమ్మడి ఒక ఏనుగును (గజేంద్ర) ప్రేమగా పెంచుకుంటూ ఉంటాడు. కొంతమంది స్మగ్లర్లు ఆయన్ను హత్య చేస్తారు. ఏనుగు వాళ్ళను చూస్తుంది కానీ పట్టుకోలేకపోతుంది. యజమాని లేకపోవడంతో అది అనాథ అవుతుంది.
రాజేంద్ర (రాజేంద్ర ప్రసాద్) ఒక నిరుద్యోగి. అతని సహచరుడు గుండు (గుండు హనుమంతరావు). ఇద్దరూ కలిసి కోటిలింగం (కోట శ్రీనివాసరావు) ఇంట్లో అద్దెకు ఉంటారు. పెద్దగా సంపాదన లేకపోవడంతో కొన్ని పూట్ల తింటూ కొన్ని పూట్ల పస్తులుంటూ ఉంటారు. యజమాని అద్దె అడిగినప్పుడల్లా ఎలాగోలా మాటల్తో బోల్తా కొట్టించి తప్పించుకుంటూ ఉంటారు. ఒకసారి రాజేంద్ర కొన్న లాటరీకి ఒక ఏనుగు బహుమతిగా వస్తుంది. తమకే తిండిలేకుండా ఉంటే ఏనుగెందుకని మొదట్లో సందేహించినా కలిసి వస్తుందనే నమ్మకంతో దాన్ని ఇంటికి తీసుకు వస్తాడు. యజమాని దాన్ని ఉండటానికి అనుమతి ఇవ్వకపోయినా అతనికి మాయమాటలు చెప్పి ఒప్పిస్తారు.
కోటిలింగం కూతురు సౌందర్య. మొదట్లో తన తండ్రిని ఆటపట్టింటారని రాజేంద్రను అవమానించినా నెమ్మదిగా అతనంటే అభిమానం పెంచుకుంటుంది. రాజేంద్ర ఏనుగును ఉపయోగించి రకరకాలుగా పబ్బం గడుపుకుంటూ ఉంటాడు. ఒక రోజు రాజేంద్ర ఆకలితో బాధ పడుతుంటే చూడలేక గజేంద్ర మార్కెట్లో రౌడీలను ఎదిరించి అరటి పండ్లను బహుమానంగా తీసుకొస్తుంది. రాజేంద్ర అది దొంగతనం చేసి ఉంటుందని అవమానించి శిక్షిస్తాడు. ఇంతలో మార్కెట్ వ్యాపారులు వచ్చి జరిగిన విషయం చెబుతారు. ఏనుగు తమకు రక్షణగా ఉంటే దాన్ని పోషించడానికి రాజేంద్రకు సహాయం చేస్తామంటారు. అలా రాజేంద్ర కష్టాలు తీరతాయి.
ఒకసారి గజేంద్ర రోడ్డులో వెళుతుండగా తన పాత యజమానిని చంపిన హంతకులను చూసి వెంబడిస్తుంది. వాళ్ళు దాన్ని ఎలాగైనా పట్టుకోవాలని కోటిలింగం సాయంతో గజేంద్రను బంధిస్తారు. కానీ రాజేంద్ర వచ్చి గజేంద్రను విడిపించి హంతకుల ఆట కట్టిస్తారు.
బాల్య స్నేహితులైన ఎస్. వి. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి కలిసి సినీ రంగంలో ప్రవేశించక మునుపు అనేక వ్యాపారాలు చేశారు. కృష్ణారెడ్డికి సినిమా మీద ఉన్న ఆసక్తిని గమనించిన అచ్చిరెడ్డి ఆయన తయారు చేసుకున్న కథతో కొబ్బరి బొండాం సినిమా నిర్మించారు. ఈ సినిమాకు కాట్రగడ్డ రవితేజ దర్శకత్వం వహించగా కృష్ణారెడ్డి స్క్రీన్ ప్లే సమకూర్చడమే కాక సంగీతం కూడా అందించాడు. ఆ సినిమా విజయం సాధించడంతో ఆ లాభాలతో ఎస్. వి. కృష్ణారెడ్డినే దర్శకుడిగా పరిచయం చేస్తూ రాజేంద్రుడు - గజేంద్రుడు సినిమా నిర్మించడానికి పూనుకున్నారు.
గజేంద్రుడిగా నటించిన ఏనుగును ఈ చిత్ర యూనిట్ తమతో పాటు కొన్నాళ్ళు ఉంచుకుని ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. చిత్రీకరణ సమయంలో అది తమకు ఎలాంటి ఇబ్బందులు కలుగ జేయకుండా దానికి రకరకాలైన ఆహారాలు తినిపించేవారు.[4] ఆలీ మద్రాసులో ఉండగా మలయాళ సినిమాలు చూసి అందులో చేట అనే పదాన్ని పట్టుకుని పిచ్చి మలయాళం భాష మాట్లాడేవాడు. మలయాళంలో చేట అంటే అన్న అని అర్థం. వైజాగ్ లో జంబలకిడిపంబ చిత్రీకరణ సందర్భంలో అది విన్న మాటల రచయిత దివాకర్ బాబు దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి చెవిన వేశాడు. ఆయన దాని ఆధారంగా ఈ సినిమాలో ఆలీ చేట పాత్రను సృష్టించాడు. ఈ పాత్ర ఆలీకి మంచి పేరు తెచ్చిపెట్టింది.[5]
ఈ సినిమాకు ఎస్. వి. కృష్ణారెడ్డి సంగీతం అందించాడు. ఆకాష్ ఆడియో ద్వారా సంగీతం విడుదలైంది.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "రాజాయనమః" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం | 3:40 |
2. | "నీలివెన్నెల జాబిలి" | జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 4:33 |
3. | "కుకుకు" | భువనచంద్ర | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 3:56 |
4. | "అమ్మడు" | భువనచంద్ర | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 4:10 |
5. | "రాజేంద్రుడు గజేంద్రుడు" | జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం | 4:13 |
మొత్తం నిడివి: | 20:32 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.