Remove ads
From Wikipedia, the free encyclopedia
ముకురాల రామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. 1976లో ఆకాశవాణి, ఢిల్లీ వారిచే 'జాతీయకవి 'గా గుర్తింపబడి, సన్మానం అందుకున్నాడు. పద్యాలు, కవితలు, పాటలు, కథలు వ్యాసాలు వంటి అనేక సాహిత్య ప్రక్రియలలో తనదైన ముద్రవేసిన సాహితీపరుడు.
ఇతడు పాలమూరు జిల్లా, కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో 1929 జనవరి 1వ తేదీన మంద రామలక్ష్ముమ్మ, బాలకృష్ణారెడ్డి దంపతులకు జన్మించాడు[1] గంగాపురం హనుమచ్చర్మ ఇతని గురువు. గ్రామంలోని కానిగి పాఠశాలలో ఉర్దూ మాధ్యమంలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. క్రమక్రమంగా పరీక్షలు ప్రైవేటుగా రాస్తూ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్రలో, తెలుగులో ఎం.ఏ. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై, పి.హెచ్.డి. చేసి డాక్టరేటు పొందాడు. ప్రాథమిక పాఠశాలలో ఎలిమెంటరీ ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా, డిగ్రీ కళాశాలలో ఉపన్యాసకునిగా, తెలుగు అకాడమిలో ఉప సంచాలకునిగా 17 సం||ల సుదీర్ఘకాలం పదవీ బాధ్యతలు ఆదర్శప్రాయంగా నిర్వహించి పదవీ విరమణ చేశాడు. 1947-48లో నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాడు. గ్రంథాలయోద్యంలో కూడా పాల్గొన్నాడు. తెలుగులో ప్రాచీన కవుల సృజనాత్మక ప్రతిభ అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టా పొందాడు. దుందుభి అనే మాసపత్రికకు సంపాదకత్వం వహించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, తెలంగాణా రచయితల సంఘం, విజ్ఞానవర్ధని పరిషత్ మొదలైన సంస్థలలో చురుకుగా పాల్గొన్నాడు.ఇతడు 2003, ఫిబ్రవరి 24న కల్వకుర్తిలోని స్వగృహంలో అనారోగ్యంతో మరణించాడు. ఇతనికి భార్య ఈశ్వరమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు[2].
ఇతడు కొన్ని కథలు వ్రాశాడు. సర్కారుకిస్తు కథలో సర్కారుకు పన్ను కట్టలేక తాను నమ్ముకున్న భూమిని అమ్ముకున్న పేదరైతు ఇక్కట్లు చిత్రించాడు. ఈ కథ 1956లో దేశోద్ధారక గ్రంథమాల వెలువరించిన పరిసరాలు అనే కథాసంకలనంలో చోటు చేసుకుంది.[1]. 1988 ఆంధ్రజ్యోతి దీపావళి సంచికలో ఇతని క్షణకోపం కోపక్షణం కథ ప్రచురితమైనది[4]. 'విడిజోడు ' కథకు కృష్ణాపత్రిక కథల పోటీలో ద్వితీయ బహుమతి లభించింది.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.