మిరియాల రామకృష్ణ

From Wikipedia, the free encyclopedia

మిరియాల రామకృష్ణ తెలుగు రచయిత, పరిశోధకుడు. ఇతను సుమారు 36 సంవత్సరాలు విద్యాశాఖలో తెలుగు భాషా సాహిత్యాలు బోధిస్తున్నాడు. ఇతను మహాకవి శ్రీశ్రీ రచనల పై పరిశోధన చేశాడు. ఈ పరిశోధన అతిగా, అపసవ్యంగా సాగిందని విమర్శలు వచ్చాయి. ఇతను కథలు కొన్నే రాశాడు. వీరి కథలలో ఆకుపచ్చని కుక్కపిల్ల, ఆశ్చర్య చూడామణి, చెరసాలలో సరస్వతి, ఉంగరం వంటివి చెప్పుకోదగినవి. ఇతను కథలనే కాక పద్యాలను, వచన కవితలను, గేయాలను, వ్యాసాలను, బాలసాహిత్యాన్ని కూడా విరివిగా వ్రాశాడు. సుధాకిరణ్, ఆనందవర్ధన్ వంటి కలంపేర్లతో వీరి రచనలు వెలువడ్డాయి. వీరి రచనలు కళాకేళి, ఆంధ్ర పత్రిక, భారతి, తెలుగు విద్యార్థి, సుభాషిణి, నగారా మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతను 1995-96 ప్రాంతంలో గీతాంజలి పత్రికకు సంపాదకులుగా పనిచేశాడు. ఇతను హిమబిందు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ అనే సంస్థను స్థాపించి మంచి కథలను గుర్తించి, రచయితలను ప్రోత్సహించడానికి ఆయా కథకులకు అవార్డులిస్తున్నాడు.

రచనలు

  • దేశం మేలుకుంది (బాలల గేయరూపకాలు)
  • బాలాభిరామం
  • రంగురంగుల రత్నదీపాలు
  • విద్యుద్వీణలు - వెన్నెల తీగలు
  • స్నేహదేహళి
  • సాహిత్య పదకోశం (ముకురాల రామారెడ్డి తో కలిసి) - తెలుగు అకాడమీ ప్రచురణ

సాహిత్య విమర్శలు, పరిశోధనలు

మిరియాల రామకృష్ణ శ్రీశ్రీ సాహిత్యంపై పరిశోధన చేసి డాక్టరేట్ సాధించాడు. ఈ పుస్తకంపై ఆంధ్రజ్యోతి పత్రికలో పురాణం సుబ్రహ్మణ్య శర్మ వ్యతిరేక విమర్శలు రాశాడు. "శ్రీశ్రీకి మిరియాల కషాయం" పేరుతో ఏడు వారాల సీరియల్‌గా ఈ విమర్శ వచ్చింది. మహాప్రస్థానంలోని పదాలకు పొసగని వ్యాఖ్యానాలు, లేని సారస్వాలు లాగుతూ రాశాడని విమర్శ. రామకృష్ణకు ఈ రచనకు డాక్టరేట్ వచ్చినప్పుడు శ్రీశ్రీ "డియర్ డాక్టర్ రామకృష్ణా! హార్టీ కంగ్రాచ్యులేషన్స్. యువర్స్ పేషెంట్లీ శ్రీశ్రీ" అంటూ సందేశం పంపి చమత్కరించాడు.[1]

తెలుగు భాష గురించి

తెలుగు భాషలోని మాధుర్యాన్ని గురించి వివరిస్తూ రామకృష్ణ వ్రాసిన ఆటవెలది పద్యాలు.

సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృత రాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు

ఉగ్గుపాలనుండి ఉయ్యాలలోననుండి
అమ్మ పాట పాడినట్టి భాష
తేనెవంటి మందు వీనులకును విందు
దేశభాషలందు తెలుగులెస్స!

వేనవేల కవుల వెలుగులో రూపొంది
దేశదేశములను వాసిగాంచి
వేయి యేండ్లనుండి విలసిల్లు నా “భాష”
దేశ భాషలందు తెలుగు లెస్స!

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.