Remove ads
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
మంద్సౌర్ మధ్య ప్రదేశ్ రాష్ట్రం, మాల్వా ప్రాంతంలో మంద్సౌర్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్ల ముఖ్యపట్టణం. పురాతన పశుపతినాథ ఆలయానికి మంద్సౌర్ ప్రసిద్ధి.
మంద్సౌర్ అనే పేరు మార్హ్‌సౌర్ నుండి ఉద్భవించింది. ఇది మార్హ్, సౌర్ అనే రెండు గ్రామాల విలీనంతో ఏర్పడిన పట్టణం. పురాతన కాలంలో ఈ పట్టణాన్ని దశపుర అనేవారు. ఈ నగరంలో పది పురాలుండడం చేత దీనికి ఆ పేరు వచ్చింది.
శాసనాల ఆవిష్కరణల వలన రెండు పురాతన రాజ వంశాలు వెలుగులోకి వచ్చాయి. వారు తమను ఔలికారులు అని పిలుచుకున్నారు. దశపుర (ప్రస్తుత మంద్సౌర్) నుండి పాలించారు. దశపురం నుండి పరిపాలించిన ఈ మొదటి రాజవంశం నుండి ఈ క్రింది రాజులు వారసత్వ క్రమంలో పాలించారు: జయవర్మ, సింహవర్మ, నరవర్మ, విశ్వవర్మ, బంధువర్మ. బంధువర్మ కుమారగుప్తుడు I కి సమకాలికుడు. మంద్‌సౌర్‌లో బంధువర్మ గురించి ఒక శాసనం ఉంది. పట్టు కార్మికులు ఇక్కడ సూర్య దేవాలయాన్ని నిర్మించారు. బంధువర్మ దీనికు సంవత్ 493 (సా.శ. 436) లో మరమ్మతులు చేయించాడు. సా.శ. 436 వరకు అతను అక్కడ ఉన్నట్లు ఇది సూచిస్తుంది. 1983 లో కనుగొన్న రిస్థల్ రాతి పలక శాసనం, మరొక ఔలికార రాజవంశాన్ని వెలుగులోకి తెచ్చింది. అందులో ఈ క్రింది రాజులు వారసత్వ క్రమంలో వచ్చారు: ద్రుమవర్ధన, జయవర్ధన, అజితవర్ధన, విభీషణవర్ధన, రాజ్యవర్ధన, ప్రకాశధర్మ. ప్రకాశధర్ముడి తరువాత మంద్సౌర్ను యశోధర్ముడు పాలించాడు. ఇతడికి విష్ణువర్ధనుడు అనే పేరు కూడా ఉంది. ఇతడు భయనా వద్ద స్థూపాన్ని నిర్మించాడు.ఈ స్థూపం కారణంగా భయనాకు విజయగృహ మని పేరుమారింది. ఉన్న ఆధారాల ప్రకారం ఇతడు ప్రకాశధర్ముడి కుమారుడు, వారసుడు. యశోధర్మ విష్ణువర్ధనుడు, బంధువర్మ భూభాగాలను ఆక్రమించిన తరువాత సామ్రాట్ అనే బిరుదును స్వీకరించాడు. యశోధర్మ విష్ణువర్ధనుడు 'మహారాజాధిరాజ' లేదా చక్రవర్తి అనే బిరుదును స్వీకరించాడని కూడా ప్రస్తావించబడింది.
మంద్సౌర్ నుండి సుమారు 4 కి, మీ. దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం, సోంధాని. మాహు-నిమాచ్ రహదారిపై ఉంది. సా.శ. 528 లో యశోధర్ముడు ఇక్కడ రెండు ఏకశిలా స్తంభాలను నిర్మించాడు, ఇది హూణులపై అతడు సాధించిన విజయానికి సూచిక.[2][3] మిహిరకులుడిని ఓడించినందుకు యశోధర్ముడు ఈ శాసనంలో స్వయంగా తనను తాను కొనియాడాడు.[4]
19 వ శతాబ్దంలో, మంద్సౌర్ గ్వాలియర్ రాజ్యంలో భాగంగా ఉండేది. 1818 లో మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధం, పిండారి యుద్ధాన్ని ముగించిన ఇండోర్‌కు చెందిన హోల్కర్ మహారాజా చేసుకున్న ఒప్పందానికి మంద్సౌర్ ఒప్పందం అని పేరు వచ్చింది. 20 వ శతాబ్దం ప్రారంభంలో ఇది మాళ్వా ప్రాంత నల్లమందు వాణిజ్యానికి కేంద్రంగా ఉండేది.
2011 జనగణన ప్రకారం [1] మంద్సౌర్ జనాభా 1,41,468. అందులో పురుషులు 72,370, స్త్రీలు 69,098. లింగనిష్పత్తి 898. జనాభాలో 15,721 (11.1%) మంది అరేళ్ళ లోపు పిల్లలు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.