Remove ads
From Wikipedia, the free encyclopedia
భాసుడు అత్యంత ప్రతిభావంతుడు.భాసుడు ప్రసిద్ధమైన కథలనే ఇతివ్రత్తాలుగా బంగారు పంటలు పండించాడు. భాసో హాసః-భాసుడు (సరస్వతీదేవి) చిరునవ్వు అన్న చాటుశ్లోక భాగం సంస్కృత భాషాపండిత లోకంలో సుప్రసిద్ధం. భాస మహాకవి సంస్కృత సాహిత్యంలో కాళిదాసు, బాణుడు, భవభూతి మొదలైన అరుదైన మహాకవుల కోవలోని వాడు. ఆయన రచించిన ఊరు భంగం నాటకం దుర్యోధనుడి మరణంతో పూర్తయ్యే విషాదాంతం కావడం, రంగంపై మరణాన్ని చూపవలసిరావడంతో ఆనాటి నాటక సంప్రదాయాలకు ఎదురు నిలిచి గొప్ప సాహసంగా నిలిచిపోయింది.
మహాకవి, సంస్కృత నాటకకర్త అయిన భాసుని కాలంపై అనిశ్చితి నెలకొనినప్పటికి నేడు అత్యధికులు భాసుని క్రీ. శ. 3 లేదా 4 శతాబ్దాలకు చెందిన కవిగా పరిగణిస్తున్నారు.[1][2] అయినప్పటికీ భాసుడు ఇంకనూ ఆర్వాచీనుడే నని భారతీయ సంస్కృత పండితులు విశ్వసిస్తారు. భారతీయ సంస్కృత సాహిత్యంలో తులనాత్మక అధ్యయనం చేసిన పాశ్చాత్య సంస్కృత పండితుడు, షెల్డన్ పొల్లాక్ (Sheldon Pollock) భాసుడు క్రీ. పూ. 4 వ శతాబ్దానికి లేదా అంతకన్నా పూర్వ కాలానికి చెందిన వాడన్న అభిప్రాయాలను కేవలం ఊహాజనితమైన అభిప్రాయాలుగా కొట్టిపారేశారు.[3] దీనిని బట్టి భాసుడు క్రీ. శ. 3 లేదా 4 శతాబ్దాలకు చెందిన కవి అని నిర్ణయించవచ్చు. భాసుడు ఏ ప్రాంతానికి చెందినవాడన్న విషయంలో ఒక నిర్ణయానికి రావడం చాలా కష్టం.
ఉత్తమశ్రేణి కవిగా భాసుడికి అనంతర కవులు మరెందరో కూడా పేర్కొన్నారు. సా.శ. ఏడో శతాబ్దంలో బాణభట్టు,ప్రణాళికా బద్ధమై,బహుభూమికలు కలిగి,సూత్రధారుడి ప్రవేశంతో ఆరంభమయ్యే భాస నాటకాలను కొనియాడాడు.తొమ్మిదో శతాబ్దంలో రాజశేఖరుడు భాసుడి నాటకాలన్నిటినీ కలిపి 'భాసనాటక చక్రం'గా అభివర్ణించాడు.పదో శతాబ్దంలో అభినవగుప్తుడూ,పదకొండో శతాబ్దంలో భోజుడూ,పన్నెండో శతాబ్దంలో జయదేవుడూ మొదలైన అలంకారికులందరూ భాసుడి రచనలలో పరిచితులే,భాసుడిని సాదరంగా స్మరించినవారే.పెద్దన్న(16వ శతాబ్దారంభం) భాసుడిని స్తుతించాడు.భాసుడు నాటకాలు చదవగానే భావాలు హృదయంలో సూటిగా ప్రవేశించి అనుభూతులు రేపుతాయి. భాసుడు తన నాటకాలలో విధి విలాసాన్ని చాలా చక్కగా చిత్రిస్తాడు. నాటకాల జాబితా:
మధ్యమవ్యాయోగం
ఈ రూపకంలోని విశిష్టత సాటిలేని ఘటనా చాతుర్యం. ఒక బ్రాహ్మణ కుటుంబం తమ బంధువులింట శుభకార్యానికి అరణ్యమార్గం ద్వారా వెడుతూండగా వెనకనుంచి రాక్షసుడు ఘటోత్కచుడు తరుముకు వచ్చి తన తల్లి ఉపవాసానంతరభోజనార్ధం వారిలో ఒకరిని రమ్మంటాడు. బ్రాహ్మణ కుటుంబం దుఃఖించి తుదకు మధ్యకుమారుణ్ణి ఇచ్చి వేయడానికి ఒప్పుకుంది. ఆ మధ్యముడు రాక్షసుని సెలవు తీసుకొని మంచినీళ్ళు తాగడానికి చెరువుకు వెళ్ళాడు. ఆలస్యం భరించలేక రాక్షసుడు మధ్యమా, మధ్యమా అని ఎలుగెత్తి అరవగా పక్క అడవిలో వ్యాయామసాధన చేస్తున్న కుంతీసుత మధ్యముడు భీముడు అక్కడికి వచ్చి "నాతో ఏమి పని" అంటాడు. భీముణ్ణి చూచిన బ్రాహ్మణుడు తన ఆపద చెబుతాడు. భీమ ఘటోత్కచులకు ఘర్షణ పెరిగి యుద్ధం జరుగుతుంది. బ్రాహ్మణ రక్షణార్ధం తుదకు భీముడు రాక్షసుడితో వెడతాడు. హిడింబ భీముణ్ణి చూసి నవ్వుకొని కొడుకుని ఆతనికి నమస్కరించమని చెబుతుంది. వాడు తెల్లబోగా విప్పిచెబుతుంది. భీముడాశ్చర్యపడగా సవిలాసంతొ చెవిలో చెబుతుంది. ఆమెపన్నుగడకు ప్రాణేశ్వరుడు ముదితుడై రాక్షసులకుకూడా హృదయం ఉంది అనుకుంటాడు. విప్రకుటుంబం సురక్షిత మవుతుంది.
ఇందులో సన్నివేశ సౌందర్యము ఎక్కడ ప్రారభం అవుతుందంటే మాతృభక్తితో రాక్షసుడు ఈ హింసాకాండకు దిగగా, పితృభక్తితో బ్రాహ్మణవటుడు ఆత్మపరిత్యాగానికి సంసిద్ధుడవుతాడు. ఇద్దరి ఉద్యమం గొప్పదే కాని ఫలితం మాత్రం హింస.
ఈ కథ భారతం లోనిది కాదు. ఐతిహాసికపాత్రలతో నాటకీయ చాతుర్యం వుట్టిపడినట్లు భాసుడు దీన్ని నిర్వచించాడు.
దూతవాక్యం
ఇది రూపకపరిభాషలో వీధి.మార్గంలో నడుస్తూఉండగా కొన్ని దృశ్యాలు మనకంటబడి పరుగెత్తుకుపోతూన్నట్లు, ఇందులో ఒక దృశ్యపరంపర యంత్రంలో అమర్చి తిప్పినట్లు మన కన్నులకు మిరుమిట్లుగొల్పుతూ నడుస్తుంది. రంగం మీద తరచు ఇద్దరు పాత్రలుంటారు.వారి చమత్కారవ్యాపృతివల్ల ఎన్నో కథాసన్నివేశాలు రంగంమీద చరచర తిరిగిపోతునట్టు కనబడుతుంది.
శ్రీకృష్ణుడు రాయబారానకి వచ్చినట్టు తెలిసింది. భారతరాజు ధుర్యోధనుడు బంధుమిత్ర సామంతాదులతో ఒక సభ ఏర్పాటుచేసాడు. మంత్ర శాలముఖద్వారంలో అతడు ఆప్తులకు చూపిన స్వాగతం అతని సమయజ్ఞతకు బలీయమైన నిదర్శనం.ఆస్వాగతంలో నిశిత వ్యగ్యం ఉంది. ద్రోణాచార్యుడు కూర్మాసనం చూపాడు.యుద్ధ ప్రయత్నంలో ఆయనస్థితి అదన్నమాట. భీష్ముడు నకు సింహాసనం. రాబోయే సర్వసైన్యాధిపత్యానికి నాంది. శకునికి చర్మాసనం (పులిచర్మం అయిఉంటుంది). అతని క్రౌర్యానికి, పట్టుదలకి అది బహుమానం. వైకర్ణ వర్షదేవులకు ఏవో సాధారణాసనాలు. పేరు లేదు. కృష్ణుడు ప్రవేశించేదాకా ధుర్యోధనుడే రంగమంతా శతరూపాలు ధరించి కనబడతాడు. వాసుదేవుడు దూతగా సభాస్థలికి వచ్చినప్పుడు ఎవ్వరు ప్రత్త్యుత్థానం చెయ్యరాదని కట్టడిచేసి తప్పినవారికి పండ్రెండుబారువుల బంగారం అపరాధం అన్నాడు. తాను లేవకుండా ఉండాడానికి చిత్రపటంగా వ్రాయించిన ద్రౌపది అపరాధాభావం చూస్తూ ఉంటాడు.
పన్నుగడ అంతా భగ్నమయింది.కృష్ణుని చూడగానే అంతా అపరాధం మాట మరచి లేచి నిల్చుంనారు.ఈ అలజడిలో ధుర్యోధనుడు సింహాసనంనుంచి పడ్డాడు.భాసరచనకు సహజమైన మెరపు ఇక్కడ కనబడుతుంది.దూత్యమునకు వచ్చిన కృష్ణుడు ధుర్యోధన రాజవైభవం తిఅల్కిస్తూ ఉంటాడు.ఇందులోని కృష్ణపాత్రసృష్టి విశిష్టమైనది.అడుగడుగునా ఆతని రాజనీతిజ్ఞత, ప్రతిభానతత్వం స్ఫులింగాల్లా గోచరిస్తాయి.
ధుర్యోధనుడు అతితెలివిగా-పరుల సంతానమైన పాండవులుకు రాజ్యం ఎట్లా వస్తుంది? అంటే కృష్ణుడు చల్లగా - "నీతాత విచిత్రవీర్యుడు క్ష్యయరోగంతో పరమపదించగా వ్యాసుడు వల్ల పుట్టిన నీతండ్రికి రాజ్యం ఎలావచ్చిందో అలాగే" అని నోరెత్తకుండా సమాధానం చెప్పి, ఈపరస్పరద్వేషం వల్ల కురువంశం నాశంగాని లాభంలేదని లాలించి చెప్పి, తన్ను దూషిస్తే బావలపరిహాసంగా తోసివేసి సాధుమార్గం తొక్కిచూచి నిష్ప్రయోజనమని తెలుసుకొని విజృంభిస్తాడు.
ధుర్యోధనుడు కృష్ణుని బంధించడానికి ప్రయత్నించి సభలోని ప్రతిఒక్కడు, వాసుదేవుడై కనిపించగా దిగ్భ్రమచెంది ఉన్మత్తుడౌతాడు.దీనితో ఈరూపకస్థితి ఉచ్చస్థితి తాకింది.సుదర్శనం స్వామిసన్నిధిని వ్రాలి "ఏమిసెలవు?" అనిమోకరిల్లింది. సుదర్శన విన్నపంతో ప్రభ్వు శాంతించాడు.ఆయుధాలన్నీ వెనక్కి వెళ్ళాయి. అంధనృపతి సప్రశ్రయాభివాదనంతో కృష్ణస్వామి శాంతుడై పాండవశిబిరానికి వెళ్ళాడు.
ఈరూపకానికి కృష్ణుడు నాయకుడై మానవత్వంలో నడచి హఠాత్తుగా దివ్యత్వం అందుకొని ఆప్రాణ్యాయుధాలనుసైతం సజీవంగా సంచలింపజేసి రాయబారం ప్రదీప్తంగా నిర్వహించి నిష్క్రమించాడు.
కర్ణభారం
కవికి కర్ణుడు యందు ఎంత గౌరవమున్నదీ ఈపేరువల్ల తెలుస్తుంది. అతని యుద్ధావరణ సమయంలో ఎన్ని బరువులు అతన్ని కుంగదీసినవో కవి ఈరూపకంలో అఖండసానుభూతితో చిత్రించాడు.శల్యుడు నడిపే రథమెక్కి ప్రకృతిగంభీరుడు కర్ణుడు తనలో తాననుకుంటాడు.మనస్సు తేలికపడడానికి తన అస్త్రవిద్యా విషాధకథ శాల్యుడికి చెప్పి కొంత ఊరటపడి, తన అస్త్రాలవైపు చూచి శక్తి తప్పినవని తెలుసుకొని నిరుత్సాహములైన గుర్రాలను, ఏనుగులను చూచి - "మరణిస్తే స్వర్గం; బతికితే కీర్తి; రెండు ఇష్టమే; యుద్ధం ఎప్పుడు నిష్పలం కాద; పోనీ రథం" అని గుండె రాయిచేసుకొని మహావీరుడిగా ముందుకు నడిచాడు. ఇక్కడనుంచి రుపకం సంఘటనతో బిగిసి కర్ణుని ఉదారధర్మదీక్షులకు మెరుగులుపెట్టి ఠీవిగా నడచి ముగుస్తుంది.ఈరూపకంలో కవి చూపిన మనస్తత్వనిరూపణం ఎన్నదగినది.
కర్ణునకు గొప్ప హృదయం ఉంది. దానిలో రాజభక్తి ఎంతదూరం ఆక్రమించినా ఏదోఒకమూలబంధుప్రేమ, ఆత్మాభిమానం, స్నేహదౌర్భల్యం ఉన్నాయి. అన్నీ కలిసి అతడు రథమెక్కుతుండగా కోలాహలం ప్రారంభించాయి. అతడంటాడు: "కోపగించినా యమునిలా విక్రమంచుపే నాకుకూడా ఈ యుద్ధమంటే ఏదో దిగులుగా ఉంది" అనుకొని, వెనువెంటనే మాతృదేవి కుంతి జ్ఞాపకంరాగా "మొదట కుంతీదేవి నన్ను కన్నది. తర్వాత రాధేయుడనైనాను. ధర్మరాజాదులు నా చిన్నతమ్ములుగదా" అని తన ఆర్ద్రహృదయం చూపుతాడు.
దూత ఘటోత్కచం
భాసుని సంభాషణల చురుకు ఘాతప్రతిఘాతాలతొ గుర్రాల్లా పరుగులెత్తి ఈరూపకంలో విశృంఖలవిహారం చేసింది. అభిమన్యుడు వధానంతరం కృష్ణసందేశంతో ఘటోత్కచుడు ధృతరాష్ట్రుడు వద్దకు వచ్చి ధుర్యోధనాదులను లెక్కచెయ్యక నిర్భీతిగా మాట్లాడి వెళ్ళడం ఇందులోని ఇతివృత్తం. ఇందులో ప్రత్యేకత గాంధారీ ధృతరాష్ట్రుల అపూర్వసృష్టి.
అభిమన్యువధవల్ల ఉత్సాహతరంగితమైన కౌరవభటలోకంనుంచి ఆవార్త ఉద్ఘోషింపబడగానే కలవరపడిన ధృతరాష్ట్రు డంటాడు - "ఎవడురా, నా చెవులను దుర్వార్తామలినములు చేశాడు? ఎవడు వీడు మాకు ప్రియమనుకుని ఈ అప్రియవార్త చాతుతున్నాడు? ఎవడయ్యా చిరుతవానిని చంపిన మావంశనాశనాన్ని ప్రకటిస్తున్నాడు?" అని దురుతిల్లుతాడు. గాంధారి ముక్తకంఠంగా విలపిస్తుంది.
కుటుంబ స్నేహోదారములైన ఈ వృద్ధ దంపతుల హృదయాలను ఇంత ఉన్నతంగా చిత్రించిన కవులు లేనేలేరేమో.
ఊరుభంగం
ఈతని ఏకాంకములలో తుదది ఊరుభంగం. సంస్కృతసాహిత్యంలో ఏకైక విషాదాంత రచన.ఇందులో ఒక పరిణితప్రజ్ఞని వాణి వినబడుతుంది.ఈరూపకరచనలో కవి రససిద్ధుడు.ప్రారంభవిష్కంభంలో ఇతడు పరిచిన నీరవనీరస బీభత్సవిశాలకురుక్షేత్రయుద్ధానంతరచిత్ర పాఠకహృదయాలను కలచివేచి రాబోయే దురంతవిషాదాంతఘట్టానికి పదునుచేసి పక్కకు తొలుగుతుంది. ఇందులో ధుర్యోధనుడి పాత్రసృష్టి సంస్కృతసారస్వానికే ఒక విశిష్టప్రసాదం.దూతవాక్యం నుంచి దూతఘటోత్కచందాకా ధీరోద్ధతుడుగా అహంకార, కుటిలస్వభావదూషితుడిగా కనబడ్డ ధుర్యోధనుడు తుదిని దివ్యుడై మనవమలినాశయాతీతుడై తుదిసారి వెలిగి మరీ వెళ్ళిపోతాడు.
బలరాముడు "ధుర్యోధనా ! నీకు జరిగిన అన్యాయాన్ని నా నాగలితో పరిహరిస్తానంటే" ఇతడు " నమస్కారం, కౌరవకులానికి తిలోదక మేఘాలవంటి పాండవుల్ని బతకనీ" ( జీవేంతు తే కురుకులస్య నివాపమెఘాః) అని పలికిన ఔదార్యము తుదిని అశ్వత్థామ వచ్చి సపాండవంగా కృష్ణుణ్ణి చీల్చివేస్తా నంటే -
సకలరాజన్యలోకమ్ము సమసిపోయె:
శాంతనవు డీల్గె;కర్ణుండు చనియె దివికి;
ఎదుటనే భ్రాతృశతము హరించిపోయె;
మమ్ముచూచితివింక చాపమ్ము విడుము."
అన్న లోకాతీతసహనమా ఈ ఒక్క సుయోధరుడికే చెల్లింది.
విశాలకురుక్షేత్రశున్యభూమిలో భారతచక్రవర్తి ధూళిలో, నెత్తుటిలో పొరులుతూ తలయెత్తి ఏకైకవీరమూర్తిగా అక్కడికి వచ్చిన తల్లితండ్రులతోను, అసూర్యంపశ్యలైన తన రానులతోను అన్న మాటలు ఈ రూపకంలోని మనిసంపద. ఎక్కడతాకితే మానవమనస్సు స్పందిస్తుందో ఈకవికి కరతలామరకం.
ధుర్యోధన పుత్రుడు దుర్జయుడు తల్లులతో, తాతతో కురుక్షేత్రానికి వచ్చి "తాతయ్యా, కాళ్ళులాగతున్న" వంటాడు.ధృతరాష్ట్రుడు 'బాబూ, కాస్సేపు నడువు. తండ్రితొడమీద కూర్చుందువుగాని' అన్నాడు.పాపం! ఆతొడలు నలిగిపోయి నెత్తుర్లో దోగుతున్నాయని ఎరుగడు. దుర్జయుడు వెతకి వెతకి తండ్రిదగ్గరికి వెళ్ళి "నాన్నగారూ, అలసివచ్చాను; తొడమీద కూర్చోనా?" అంటే సుయోధనుడు ""ఆ,ఆ...వద్దు. నాయనా! వద్దు-
అమృతసంపర్స మిచ్చెడి అనుగుబిడ్డ!
పాంశువిక్రీడలం బడి వచ్చి నీదు
హక్కుగా ననుభవించు సింహాసనమ్ము
ఊరుతల మింక నీకు లేదోయి తండ్రి!"
అని బాధతో కుమారుణ్ణి నివారించడం చూచి ఏ సరసహృదయం ధ్రవీభూతం కాకుండాఅ ఉంటుంది? ఈవిధంగా తన ప్రతిభాసారం వెల్లివిరిసేలా రచించిన ఈ నాటకాచార్యుని రూపకాలను గురుంచి ఎంతవ్రాసినా సరిపోదు.
మిగతా రచనలు
ఈ పద్నాలుగు నాటకాలను భాస నాటక చక్రం అంటారు.
భాసుడి రచన నిరాడంబరంగా,ప్రసన్నంగా,సరళంగా ఉంటుంది.ఇది మహాకవుల లక్షణమే కదా!భాసుడి వర్ణనలూ,సంభాషణాలూ క్లుప్తంగా,పొందికగా ఉంటాయి.అతని రచనలన్నీ ప్రదర్శనకు వీలుగా ఉండేవే.కాళిదాసంతటి ప్రతిభావంతుడు భాసుని రచనా సంవిధానానికి పరవశుడయ్యాడు.అతని మహా ప్రతిభకు ముగ్ధుడై జేజేలు పలికాడు.
సంస్కృత శ్రవ్యకావ్యసర్వస్వానికి వాల్మీకి మహర్షి గురుదేవుడైతే, భాసమహాకవి నాటక వాజ్మయప్రపంచానికి ఆచార్యమూర్తి. కనుకనే కాళిదాసు తన రఘువంశం కావ్యాధిని (సూచనగా) వాల్మీకిమునినీ, మాళవికాగ్నిమిత్రం ప్రస్తావనలో (వాచ్యముగా) భాసర్షీనీ ప్రశంసించి, వారియెడల తనకున్న పూజ్యభావమును వెల్లడించాడు. భాసర్షి నాటకీయపాత్రలు తక్కిన కావ్య నాటక వ్యక్తులవలె బెరకుగాను, అతిలోకగుణదోషాలతోనూ కనబడకుండా నిండుజీవంతో కదలి మానవహృదయాలకి మరీ చేరువుగా వస్తారు.ఈతని సంవిధానకౌశలమూ, ఉక్తిమాధుర్యమూ శూద్రక, కాళిదాసు, భవభూతి మరికొన్ని ప్రసిద్ధరూపకరచయితల్ని ఆకర్షించి వారి రూపకాల్లో చిత్రవిచిత్రంగా ప్రతిఫలించి రాణించాయి.ఇతని చారుదత్తమును అక్షరాలా అనుసరించియే శుద్రకవి తన మృచ్చకటికం న్ని అంతసర్వాంగసుందరంగా నిర్మించగలిగాడు. భాసుని ఉక్తిచాతుర్యానికి ముగ్ధుడై కాళిదాసు స్వప్న, అభిషేక, మధ్యమ, కర్ణభారాది రుపకావళినుంచి అనేకవాక్యాలు ఉద్ధరించుకున్నాడు.
తక్కిన కవుల నాటకరచన ఒక్కొక్క సుందరశిల్పమైతే భాసుని రుపకనిర్మాణం ఒక కైలాసాలయం, ఒక అజంతాగుహ.
ఈ విధంగా భానుడు తన అపూర్వ నాటక కళా చాతుర్యంతో,కథా కల్పనా నైపుణ్యంతో తరువాతి కవులను ప్రభావితం చేశాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.