బి.వి.గురుమూర్తి
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
బి.వి.గురుమూర్తి అవిభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత జాతీయ కాంగ్రేసు పార్టీ రాజకీయ నాయకుడు, సికింద్రాబాద్ నగర మేయరు. కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు. తెలంగాణ ప్రాంత శాసనసభ్యులలో విశాలాంధ్ర సమర్ధకుడిగా పేరుపొందాడు బి.వి. గురుమూర్తి.[1]
బి.వి.గురుమూర్తి, 1916, జూలై 30వ తేదీన సికింద్రాబాదులో వైశ్య కుటుంబంలో[2] జన్మించాడు. ఈయన తండ్రి పేరు బి.వీరన్నయ్య. గురుమూర్తి సతీమణి ఈశ్వరమ్మ. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు.[3] ఈయన ప్రాథమిక విద్య అంతా సికింద్రాబాదులోనే సాగింది. 1933లో మహబూబ్ కళాశాలలో ఇంటర్మీడియటు పూర్తిచేయగానే ప్రజాజీవితంలోకి అడుగుపెట్టి సికింద్రాబాదులోని అనేక యువ సంఘాల్లో పాల్గొన్నాడు. ఈయన ఉత్సాహం, నిబద్ధత 1937లో స్నేహిత సంఘానికి అధ్యక్షుడు అయ్యేలా నడిపించాయి. ఆ కాలంలో ఆర్య సమాజ ఉద్యమం బాగా వ్యాప్తిస్తున్న కాలంలో ఆర్యసమాజ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొని అనతి కాలంలోనే నగర శాఖకు కోశాధికారి, ఆ తర్వాత కార్యదర్శి అయ్యాడు. ఈయన అజమాయిషీలోనే ఆర్యసమాజ భవనానికి, మహిళా అనాథశ్రమాలకు భూమి సేకరించారు.[4] క్విట్ ఇండియా ఉద్యమకాలంలో క్రియాశీలకంగా పాల్గొని ధర్నాలను ఏర్పాటు చేశాడు. సంఘ సంస్కర్తగా కులాంతర వివాహాలు, విధవ పునర్వివాహాలను ప్రోత్సహించాడు. మతకలహాలు చెలరేగినప్పుడు బాధితులకు సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాడు. 1945లో కొత్త రాజకీయ చైతన్యం వికసిస్తున్న కాలంలో కాంగ్రేసు పార్టీని నైజాం ప్రాంతంలో బహిష్కరించారు. దీనికి సమాధానంగా మూర్తి కొంత మంది సహచరులు కలిసి ప్రజా సేవాసంఘాన్ని స్థాపించారు. 1947లో రాష్ట్ర కాంగ్రేసు పోరాటంలో అనేకమంది కార్యకర్తలకు స్ఫూర్తిని, సహాయసహకారాలను అందించాడు. 1949లో సికింద్రాబాదు జిల్లా కాంగ్రేసు కమిటీ ఏర్పడినప్పుడు, మూర్తి సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత సంవత్సరం అధ్యక్షుడయ్యాడు. ఈయన అధ్యక్షతనే జిల్లా కాంగ్రేసు నగరపాలిక ఎన్నికలలో ఘనవిజయం సాధించింది. గురుమూర్తి, 1953, ఏప్రిల్ 17న సికింద్రాబాదు నగర మేయరుగా ఏకగ్రీవంగా ఎన్నికై సంవత్సరకాలం పాటు మేయరుగా పనిచేశాడు. అంతకు ముందు సంవత్సరం తిమ్మరాజు మేయరుగా ఉన్నప్పుడు 1952 నుండి 1953 వరకు గురుమూర్తి డిప్యుటీ మేయరుగా పనిచేశాడు. ఈయన మేయరుగా ఎన్నికైనప్పుడు "ప్రజల నగరపాలికకు ప్రజల మేయరు"గా అభివర్ణించారు.[4]
1952 సార్వత్రిక ఎన్నికల తర్వాత, స్వామి రామానంద తీర్థ ప్రదేశ్ కాంగ్రేసు కమిటీ అధ్యక్షుడైనప్పుడు, గురుమూర్తి అయనకొక కార్యదర్శిగా ఎంపిక చేయబడ్డాడు. స్వచ్చందసేవకుల ఉప కమిటీకి అధ్యక్షుడిగా 1953లో నానల్ నగర్ కాంగ్రేసు సమావేశం యొక్క నిర్వహణలో తన సత్తా చాటుకున్నాడు. ఇవే కాక అనేక స్థానిక సంస్థల కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పనిచేశాడు. 1954లో జరిగిన ఉప ఎన్నికలలో బి.వి.గురుమూర్తి, రాజ్యసభకు ఎన్నికై,[4] 1954, ఫిబ్రవరి 15 నుండి 1956, ఏప్రిల్ 2 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు.[5][3] సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుండి 1957లో తొలిసారిగా శాసనసభ ఎన్నికయ్యాడు. తిరిగి 1962లో అదే నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 1967లో ఖైరతాబాదు నియోజకవర్గం నుండి గెలుపొంది మూడో సారి శాసనసభ సభ్యుడయ్యాడు[5][6]
ప్రత్యేక తెలంగాణా ఉద్యమకాలంలో, ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి నమ్మినబంటుగా పేరుపొందిన బి.వి.గురుమూర్తి, తెలంగాణ మంత్రుల రాజీనామా చేయాలనుకుంటున్న విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పడంతో బ్రహ్మానందరెడ్డి తన రాజీనామా నాటకానికి తెరతీశారు. అందులో భాగంగా 1969, జూన్ 27న పరిశ్రమల మంత్రిగా ఉన్న గురుమూర్తి తొలుత రాజీనామా చేశాడు.[7] 1969లో జాతీయ కాంగ్రేసు బొంబాయి ప్లీనరీ సమావేశాల సందర్భంగా, బి.వి.గురుమూర్తి ఆంధ్రప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈయన మరణించేవరకు ఈ పదవిలో ఉన్నాడు.[8]
బి.వి.గురుమూర్తి, 1970, ఫిబ్రవరి 10న మరణించాడు[9] ఈయన స్మారకంగా సికింద్రాబాదులోని ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్‌కు బి.వి.గురుమూర్తి పేరు పెట్టారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.