Remove ads
గుజరాత్ రాష్ట్రంలో ఒక నగరం , బనస్కాంత జిల్లా ముఖ్యపట్టణం From Wikipedia, the free encyclopedia
పాలన్పూర్, భారతదేశం, గుజరాత్ రాష్ట్రం, బనస్కాంత జిల్లాలోని ఒక నగరం.ఇది పురపాలకసంఘం . పాలన్పూర్ బనస్కాంత జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం.ఇది భారతీయ వజ్రాల వ్యాపారుల పరిశ్రమకు పూర్వ నిలయం.
ప్రారంభ కాలంలో పాలన్పూర్ని జైన గ్రంథాలలో పేర్కొనబడిన దాని స్థాపకుడు ప్రహ్లాదన పేరు మీద ప్రహ్లాదన పటాన్ లేదా ప్రహ్లాదనపుర అని పిలుస్తారు.ఇది తరువాత పలాన్సి చౌహాన్చే పేరు ప్రజలలోకి వచ్చింది, అతని నుండి దీనికి ఆధునిక పేరు వచ్చిందని నమ్ముతారు.మరికొందరు దీనిని పాల్ పర్మార్ స్థాపించారని,అతని సోదరుడు జగదేవ్ సమీపంలోని జగనా గ్రామాన్ని స్థాపించాడని నమ్ముతారు. [1]
అబు, పరమారా ధారవర్ష సోదరుడు ప్రహ్లాదనుడు 1218లో ప్రహ్లాదనపురాన్ని స్థాపించాడని, పల్లవీయ పార్శ్వనాథునికి అంకితం చేయబడిన ప్రహ్లాదన-విహారాన్ని నిర్మించాడని జైన గ్రంథాలు పేర్కొంటున్నాయి.[2] ఈ పట్టణాన్ని పదమూడవ శతాబ్దంలో చౌహాన్లు తిరిగి పాలించారు.పదిహేడవ శతాబ్దం ప్రారంభంలో, పాలన్పూర్ రాష్ట్రాన్ని 1373లో స్థాపించి జలోర్ (రాజస్థాన్) నుండి పాలించిన పష్టున్ లోహాని తెగకు చెందిన ఝలోరి రాజవంశం స్వాధీనం చేసుకుంది. 18వ శతాబ్దం ప్రారంభంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మరణాన్ని అనుసరించి అస్థిరత కాలంలో రాజవంశం చారిత్రిక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది వెంటనే మరాఠాలచే ఆక్రమించబడింది. లోహానీలు వారికి వ్యతిరేకంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఆశ్రయించే ధోరణిని అనుసరించారు. చివరకు 1817లో అన్ని ఇతర పొరుగు రాష్ట్రాలతో పాటు అనుబంధ కూటమి వ్యవస్థలోకి ప్రవేశించి బ్రిటిష్ రక్షిత ప్రాంతంగా మారింది. [3] 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, పాలన్పూర్ రాష్ట్రం 1949లో రద్దు చేసారు. బొంబాయి రాష్ట్రంలో భాగంగా భారతదేశ ఆధిపత్యంలో విలీనమైంది. తదనంతరం, గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాకు పాలన్పూర్ రాజధానిగా మారింది. [4]
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం, పాలన్పూర్ జనాభా 1,41,592. [5] అందులో పురుషులు 53% శాతం మందికాగా, స్త్రీలు 47% శాతం మంది ఉన్నారు. పాలన్పూర్ సగటు అక్షరాస్యత రేటు 86%, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 94%, స్త్రీల అక్షరాస్యత 78%. పాలన్‌పూర్‌లో, జనాభాలో 13% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వారు ఉన్నారు.
1750లో (సంవత్ 1806), బహదూర్ ఖాన్ ఇటుకలతో మోర్టార్ నగర గోడను, పాలన్పూర్ నాగర్‌కోట్‌ను నిర్మించాడు. ఇది 3 మైళ్ల వలయాకారంలో, 17 నుండి 20 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు, ఏడు బురుజులతో కూడిన ప్రధాన ప్రవేశ ద్వారాలతో, మూలల్లో తుపాకులతో ఆయుధాలు కలిగిన గుండ్రని టవర్లు మూలల్లో ఉండేలాగున నిర్మించబడింది.ప్రస్తుతం నగర గోడల ముఖద్వారాలు ఢిల్లీ దర్వాజా, గాథమన్ దర్వాజా, మలన్ దర్వాజా, మీరా దర్వాజా, విర్బాయి దర్వాజా, సేలంపుర దర్వాజా, సదర్‌పూర్ దర్వాజా లేదా సిమ్లా దర్వాజా. మీరా దర్వాజా మాత్రమే నేడు మనుగడలో ఉంది.
షేర్ ముహమ్మద్ ఖాన్ 1910లో ఢిల్లీలో జరిగిన కింగ్ జార్జ్ V పట్టాభిషేక వేడుకకు హాజరయ్యాడు. 1913లో అతని పేరుతో ఒక క్లబ్‌ను నిర్మించాడు. 1918లో, అతని వారసుడు టేల్ ముహమ్మద్ ఖాన్ తన తండ్రి శౌర్యం, పట్టణం, అతని రాజవంశం చరిత్రను గుర్తు చేస్తూ రైల్వే స్టేషన్ సమీపంలో 22 మీటర్ల టవర్‌తో కీర్తి స్తంభం నిర్మించాడు. అతను 1922 - 1936 మధ్య బలరామ్ ప్యాలెస్, తరువాత జోరావర్ ప్యాలెస్ (ప్రస్తుతం న్యాయస్థాన కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు) నిర్మించాడు.1939లో, అతను ఆస్ట్రేలియన్ వ్యాపారవేత్త కుమార్తెతో తన రెండవ వివాహానికి గుర్తుగా శశివన్, గతంలో జహనారా బాగ్ అనే తోటను నిర్మించాడు.
పాత మార్కెట్ స్థలాలు నాని బజార్, మోతీ బజార్, ధల్వాస్. షాహశివాన్తో పాటు, చమన్ బాగ్ పట్టణంలోని ప్రధాన పబ్లిక్ గార్డెన్. ప్రారంభ ఝలోరీ పాలకుడు మాలిక్ ముజాహిద్ ఖాన్ 1628లో తన రాణి మన్‌బాయి జడేజాకు మానసరోవర్ సరస్సును నిర్మించి అంకితం చేసాడు.
మితి వావ్, పట్టణంలో మిగిలి ఉన్న పురాతన స్మారక చిహ్నం.ఇదిఒక మెట్ల బావి.పట్టణ తూర్పు భాగంలో ఐదుఅంతస్తులతో నిర్మించిన మెట్ల బావి.దీనిలోకి పడమర నుండి మెట్లద్వారా ప్రవేశించవచ్చు.దాని నిర్మాణ శైలిఆధారంగా,ఇది మధ్యయుగ కాలం చివరిలో నిర్మించబడిందని నమ్ముతారు,అయితే గోడలలో పొందుపరిచిన శిల్పాలు పూర్వ కాలానికి చెందినవి కావచ్చు.శిల్పాలలో వినాయకుడు,శివుడు,అప్సరసలు,నృత్య బొమ్మలు,దేవతలనుపూజించే జంటలు,పూల ఆకారాలు,రేఖాగణిత నమూనాలు ఉన్నాయి.ఎడమగోడలో పొందుపరిచిన ఒక శిల్పం మీద అరిగిపోయినశాసనం స్పష్టంగా చదవటానికిఅవకాశంలేదు,కానీ,గుజరాత్ సంవత్ ప్రకారం 1320 (సా.శ.1263) సంవత్సరం రూపొందించి ఉండవచ్చు అని పరిశోధకులు అభిప్రాయం.[6]
పాలన్‌పూర్‌లో హిందూ మతం, జైన మతానికి అంకితం చేయబడిన అనేక దేవాలయాలు ఉన్నాయి.
అన్హిల్వాడ్ పటాన్‌కు చెందిన చౌళుక్య రాజవంశ పాలకుడు జయసింహ సిద్ధరాజు పాలన్‌పూర్‌లో జన్మించినట్లు నమ్ముతారు. అతని తల్లి మీనాల్దేవి శివునికి అంకితం చేయబడిన పాతాలేశ్వరాలయాన్ని నిర్మించింది.ఇతర హిందూ దేవాలయాలు లక్ష్మణ్ టేక్రి ఆలయం, మోటా రామ్‌జీ మందిర్, అంబాజీ మాతా మందిర్ అనే ప్రముఖ దేవాలయాలు నగరంలో ఉన్నాయి.
పాలన్‌పూర్‌లో డైరీ, టెక్స్టైల్, డైమండ్ పాలిషింగ్, మార్బుల్ ప్రధాన పరిశ్రమలు. బనాస్ డెయిరీ రాష్ట్రంలోని అతిపెద్ద డెయిరీలలో ఒకటి. భారతదేశం, విదేశాలలో డైమండ్ పాలిషింగ్, మూల్యాంకన పరిశ్రమలో పాలన్‌పురి జైన్ డయాస్పోరా ఆధిపత్యం చెలాయిస్తుంది. పాలన్‌పురి అత్తర్లు వాటి సువాసనకు ప్రసిద్ధి చెందాయి. పట్టణానికి 'పూల నగరం' అనే మారుపేరును సంపాదించిపెట్టింది.
ఝలోరీ నవాబుల పాలనలో, పాలన్పూర్ గుజరాతీ గజల్స్, కవిత్వానికి ప్రసిద్ధి చెందింది. కాంబినేషన్ సమోసాలు, కారి పట్టణంలో ప్రసిద్ధ చిరుతిండి. పాలన్‌పురి వజ్రాల వ్యాపారం సూరత్, బెల్జియంలోని వ్యాపారులకు చెందింది.[8]
పాలన్పూర్ బనస్కాంత విద్యా కేంద్రం. ప్రధాన పాఠశాలల్లో సిల్వర్ బెల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ (సి.బి.ఎస్.ఇ), వివిద్లాక్షి విద్యామందిర్, శ్రీ రామ్ విద్యాలయ, ఆదర్శ్ విద్యాసంకూల్, మాతృశ్రీ ఆర్.వి భటోల్ ఇంజి మెడ్ పాఠశాల, ఎం.బి. కర్నావత్ పాఠశాల, కె.కె. గోతి పాఠశాల ఉన్నాయి. పాలన్‌పూర్‌లో వివిధ కళాశాలలు ఉన్నాయి: బనాస్ వైద్య కళాశాల పాలన్పూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల, జి.డి. మోడీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సి..ఎల్ పారిఖ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, ఆర్.ఆర్. మెహతా కాలేజ్ ఆఫ్ సైన్స్. ఇవి కాకుండా రెండు బిసిఎ కళాశాలలు, బిఇడి. కళాశాలలు, బాలికల ఆర్ట్స్ కళాశాల ఉన్నాయి.
బనస్కాంత జిల్లాకు ప్రధాన కేంద్రంగా ఉన్న పాలంపూర్ పట్టణానికి రోడ్డు, రైలు మార్గాల ద్వారా బాగా అనుసంధానం ఉంది.
ఆగ్రా-జైపూర్-అహ్మదాబాద్ ప్రధానమార్గంలో ఉన్న పాలన్పూర్ రైల్వే స్టేషన్, భారతీయ రైల్వేల పశ్చిమ రైల్వే విభాగ పరిపాలనా నియంత్రణలో ఉంది. ఇది చెన్నై, తిరువనంతపురం, మైసూర్, బెంగుళూరు, పూణే, ముంబై, జైపూర్, జోధ్‌పూర్, ఢిల్లీ, డెహ్రాడూన్, ముజఫర్‌పూర్, బరేలీ, జమ్మూ నగరాలకు బ్రాడ్ గేజ్‌లో నేరుగా రైలు మార్గాలను కలిగి ఉంది. ఇది అహ్మదాబాద్, సూరత్, వడోద్రా, భుజ్, రాజ్ కోట్, జామ్ నగర్, పోర్ బందర్ వంటి గుజరాత్ లోని చాలా నగరాలు పట్టణాలతో అనుసంధానం ఉంది. పాలన్పూర్, సమఖియాలి మధ్య బ్రాడ్ గేజ్ మార్గాన్ని రెట్టింపు చేయాలనే భారతీయ రైల్వే ప్రతిపాదనకు ప్రభుత్వ మద్దతు లభించింది. ఈ డబ్లింగ్ వల్ల గుజరాత్ రాష్ట్రంలోని కచ్, పటాన్, బనస్కాంత జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది.
రాజస్థాన్‌లోని బేవార్ని గుజరాత్‌లోని రాధన్పూర్తో కలిపే జాతీయ రహదారి 27 దీసా-పాలన్పూర్ గుండా వెళుతుంది, తద్వారా (సిరోహి), (ఉదయ్‌పూర్) నగరాలు పాలంపూర్ నగరంతో అను సంధానం ఏర్పడింది. రాష్ట్ర రహదారులు 712, 132 పాలన్పూర్ గుండా వెళతాయి.ఇవి గుజరాత్‌లోని సమీప పట్టణాలను కలుపుతాయి. రాష్ట్ర రహదారి 41 దీనిని మెహసానా, అహ్మదాబాద్‌లతో కలుపుతుంది.
సమీప విమానాశ్రయం దీసా విమానాశ్రయం.నిజానికి పాలన్పూర్ రాచరిక రాష్ట్ర సేవలుకొరకు నిర్మించబడింది. ఇది కేవలం పాలన్పూర్ నగరం నుండి 20 కి.మీ దూరంలో ఉంది.సమీప అంతర్జాతీయ విమానాశ్రయం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం, అహ్మదాబాద్,ఇది పాలన్పూర్ నుండి 139 కిమీ దూరంలో ఉంది.
అనేక మంది ప్రముఖ వ్యక్తులు పాలన్పూర్కు చెందినవారు ఉన్నారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.