ఏప్రిల్ 16న తెలుగు నాటకరంగ దినోత్సవం From Wikipedia, the free encyclopedia
తెలుగు నాటకరంగ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 16న నిర్వహించబడుతుంది. ఆధునిక తెలుగు నాటకరంగంలో తొలి నాటకకర్త, తొలి దర్శకుడు, తొలి ప్రదర్శనకారుడైన కందుకూరి వీరేశలింగం పంతులు జన్మదినాన్ని 2007లో తెలుగు నాటకరంగ దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించడం జరిగింది.[1][2]
నాటక ప్రదర్శనతోపాటు నాటకానికి సంబంధించిన అనేక అంశాలపై సదస్సులు జరగాలని, నాటక కళాకారుల జయంతులను వర్ధంతులను నిర్వహించడం ద్వారా ప్రజల్లో నాటక కళ పట్ల ఉత్సాహం, విలువలు పెరుగుతాయని, వీటన్నింటిని సమతుల్యం చేసేలా ఉండేందుకు నాటకరంగ దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలుగు నాటక కళాకారులు భావించారు. అయితే, ఏ రోజును నాటకరంగం దినోత్సవంగా చేయాలన్న అంశంపై అనేక చర్చలు జరిగాయి. అనేకమంది అనేక పేర్లూ, తేదీలు సూచించారు.[3]
దీనికి 2000వ సంవత్సరంలో బీజం పడింది. 2000వ సంవత్సరంలో కొంతమంది యువనాటక కళాకారులతో కలిసి డా. పెద్ది రామారావు ఆధ్వర్యంలో యవనిక త్రైమాసిక నాటకరంగ పత్రిక ప్రారంభమయింది. నాలుగేళ్ళపాటు నడిచిన ఈ పత్రికలో ప్రపంచ, భారతీయ, తెలుగు నాటకరంగాలకు సంబంధించి నాటక ముఖ్యులు, ఔత్సాహికులు రాసిన అనేక వ్యాసాలను యవనిక ప్రచురించడంతోపాటు నాటకరంగ కార్యక్రమాలు, నాటకోత్సవాలను కూడా నిర్వహించింది. నాటకరంగాన్ని మరింత పటిష్టపరచడంకోసం ఇతర దేశాల, రాష్ట్రాల నాటకరంగానికి ఉన్నట్లుగా తెలుగు నాటకరంగానికి కూడా ఒక దినోత్సవం ఉంటే బాగుంటుందని భావించి, "ఏప్రిల్ 16 తెలుగు నాటక దినోత్సవం" శీర్షికతో 2000 ఏప్రిల్-జూన్ ప్రత్యేక యవనిక సంచికను ప్రచురించింది. యవనిక ఆలోచనకు "ఆంధ్రప్రదేశ్ రంగస్థల కళాకారుల ఐక్య వేదిక" సహకారం తోడైంది. తెలుగు నాటక కళాకారులంతా నాటకరంగ దినోత్సవ ఏర్పాటుపై ఏకాభిప్రాయానికి వచ్చారు.[4]
19వ శతాబ్దంలో అనువాద నాటకాలకు అధిక ప్రాధాన్యమున్న సమయంలో ప్రదర్శనలను దృష్టితో ఉంచుకొని కందుకూరి వ్యవహార ధర్మబోధిని అనే నాటకం రాసి, షేక్స్పియర్ రాసిన కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనే అంగ్ల నాటకాన్ని చమత్కార రత్నావళి పేరుతో 1880లో అనువదించి తన విద్యార్థుల చేత ప్రదర్శిపంచేశాడు.[5] అంతేకాకుండా తెలుగు నాటకరంగంలో తొలి నాటక సమాజాన్ని కూడా వీరేశలింగమే స్థాపించాడు. ఆధునిక తెలుగు నాటకరంగానికి విశిష్ట సేవలను అందించిన కందుకూరి వీరేశలింగం పంతులు జన్మదినాన్ని వివిధ నాటక సంస్థలు 2001 నుండి తెలుగు నాటకరంగ దినోత్సవంగా జరిపాయి.
ఈ క్రమంలో డా. కె.వి. రమణాచారి ఆధ్వర్యంలో తెలుగు నాటకరంగ దినోత్సవం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగా, కందుకూరి వీరేశలింగం పంతులు జన్మదినాన్ని తెలుగు నాటకరంగ దినోత్సవంగా ప్రకటిస్తూ 2007 మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ. విడుదలచేసింది. 2007, ఏప్రిల్ 16న తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా తెలుగు నాటకరంగ దినోత్సవం జరుపబడింది.[6]
వివిధ సంస్థల ఆధ్వర్యంలో తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా అనేక ప్రాంతాల్లో నాటక ప్రదర్శనలు, సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తారు. తెలుగు నాటకరంగంలో విశేష కృషి చేసిన నాటక కళాకారులకు సన్మానాలు, సత్కారాలు, పురస్కారాలు, బిరుదులు అందజేస్తారు.
Seamless Wikipedia browsing. On steroids.