Remove ads
1962 తెలుగు సినిమా From Wikipedia, the free encyclopedia
గుండమ్మ కథ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో 1962 లో విజయ వాహినీ సంస్థ నిర్మించిన చిత్రం ఇది. ఇందులో సూర్యకాంతం, ఎన్. టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్. వి. రంగారావు, సావిత్రి, జమున ప్రధాన పాత్రలు పోషించారు. చక్రపాణి, డి. వి. నరసరాజు ఈ చిత్రానికి రచయితలు. ఈ చిత్రంలో పాటలన్ని పింగళి రాయగా ఘంటసాల సంగీతాన్నందించాడు. 1958 లో కన్నడంలో విఠలాచార్య తీసిన మనె తుంబిద హెణ్ణు అనే చిత్రానికిది పునర్నిర్మాణం. కథలో షేక్స్‌పియర్ రాసిన ద టేమింగ్ ఆఫ్ ద ష్రూ అనే నాటకంలోని కొన్ని పాత్రల చిత్రణను వాడుకుంటూ, తెలుగు సాంప్రదాయం ప్రకారం కొన్ని మార్పులు చేశారు. అప్పటి దాకా పౌరాణిక చిత్రాలకే దర్శకత్వం వహించిన కామేశ్వరరావు ఈ సినిమాతో మొదటిసారిగా సాంఘిక చిత్రాన్ని తీశాడు. అప్పటిలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ స్టారర్, కాని "గుండమ్మ కథ" అని సూర్యకాంతం పాత్ర పేరుమీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిధ్యం అని విశ్లేషకులు ప్రస్తావిస్తారు. హాస్యం, సంగీతం ఈ చిత్రానికి విజయాన్ని సమకూర్చాయి.
గుండమ్మ కథ | |
---|---|
దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
రచన | చక్రపాణి (స్క్రీన్ ప్లే), డి.వి.నరసరాజు (మాటలు), పింగళి నాగేంద్రరావు (పాటలు) |
నిర్మాత | బి.నాగిరెడ్డి , చక్రపాణి |
తారాగణం | నందమూరి తారక రామారావు , అక్కినేని నాగేశ్వరరావు , సావిత్రి, జమున , ఎస్.వి.రంగారావు , సూర్యకాంతం |
ఛాయాగ్రహణం | మార్కస్ బార్ట్‌లీ |
సంగీతం | ఘంటసాల |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | జూన్ 7, 1962[1] |
సినిమా నిడివి | 166 ని |
భాష | తెలుగు |
గుండమ్మ (సూర్యకాంతం) భర్త చనిపోయిన ఇల్లాలు, ఆమెకు గయ్యాళిగా ఊళ్ళో పేరుంటుంది. ఆమె సవతి కూతురు లక్ష్మి (సావిత్రి), స్వంత కూతురు సరోజ (జమున), కొడుకు (హరనాథ్) ఉంటారు. ఇంటి చాకిరి మొత్తం లక్ష్మి మీద పడితే, సరోజ మాత్రం ఏ పనిపాటలూ రాకుండా పెంకెగా తయారవుతుంది. లక్ష్మికి ఎవరైనా వెనుకా ముందు లేని పనివాడికి ఇచ్చి చేసి ఇంట్లో శాశ్వతంగా ఇద్దరినీ పనివాళ్ళలా ఉంచాలని, సరోజకు బాగా డబ్బున్న, చదువుకున్న వ్యక్తినిచ్చి పెళ్ళిచేసి ఇల్లరికం తెచ్చుకోవాలని గుండమ్మ ఆలోచన. సరోజకు గుండమ్మ పెళ్ళిచేయాలని ప్రయత్నించినప్పుడల్లా ఆమె తమ్ముడు వరసయ్యే గంటయ్య (రమణారెడ్డి) పెళ్ళి చెడగొడతూంటాడు. ఎలాగైనా హత్యచేసి జైల్లో ఉన్న తన కొడుకు (రాజనాల) విడుదలయ్యాకా అతనికి ఇచ్చి చేయాలని అతని పథకం.
పెళ్ళిళ్ళ పేరయ్య ద్వారా ఒక జమీందారు రామభద్రయ్య (ఎస్.వి.రంగారావు) ఇద్దరు కొడుకులకు, గుండమ్మ ఇద్దరు కూతుళ్ళను ఇచ్చి పెళ్ళిచేయవచ్చునన్న సంబంధం వస్తుంది. రామభద్రయ్య చనిపోయిన తన స్నేహితుడి కుటుంబమేనని తెలియడంతో, పెళ్ళి సంబంధం మాట్లాడడానికి వచ్చి అ యింటి పరిస్థితి అర్థం చేసుకొంటాడు. లక్ష్మిని పెద్ద కొడుక్కి చేసుకోవాలంటే గుండమ్మ ఒప్పుకోదనీ, మరోవైపు సరోజకున్న పెంకెతనం, బద్ధకం తల్లి పెంపకం లోపం వల్ల వచ్చినవేనని పిల్ల మాత్రం మంచిదేనని అంచనా వేస్తాడు. ఇలా ఇద్దరూ తన కొడుకులకు సరిపోయే పెళ్ళికూతుళ్ళే అయినా గుండమ్మ, గంటయ్య ఈ పెళ్ళిళ్ళు పడనివ్వరన్న ఆలోచనతో తన కొడుకులు ఆంజనేయ ప్రసాద్ (ఎన్.టి.రామారావు), రాజా (అక్కినేని నాగేశ్వరరావు)లను పిలిచి పరిస్థితులు వివరిస్తాడు. పథకం ప్రకారం పెద్దకొడుకు ఆంజనేయప్రసాద్ అంజిగా గంటయ్య ద్వారా గుండమ్మ ఇంట్లో పనివాడిగా చేరి లక్ష్మిని మంచి మనసున్నవాడిగా ఆకర్షిస్తాడు. గుండమ్మకు కొడుకు (హరనాథ్), ప్రేమిస్తున్న అమ్మాయి(ఎల్.విజయలక్ష్మి)కి అన్నయ్యగా రాజా ప్రవేశించి, సరోజను ఆకట్టుకుంటాడు.
సరోజ మంకుపట్టు పట్టుకు తోడు అతను ఆస్తిపరుడేనని, రామభద్రయ్య కొడుకని అంజి ద్వారా తెలియడంతో గుండమ్మ పెళ్ళికి అంగీకరిస్తుంది. కానీ ఆమెకన్నా పెద్దదైన గుండమ్మ లక్ష్మి పెళ్ళి సంగతి ఏం చేయాలన్న ఆలోచన వస్తుంది. అదే సమయానికి అంజి తనకు పెళ్ళిచేయకపోతే పనిచేయనని మొండికేసి, తనకు లక్ష్మినిచ్చి పెళ్ళిచేయమని అంజి ఇచ్చిన సలహా నచ్చి అంజికి తన సవతి కూతురిని ఇచ్చి పెళ్ళిచేసేస్తుంది. అలానే తన స్వంత కూతురిని రాజాకు ఇచ్చి చేస్తుంది. రాజా తాను దుర్వ్యసనాలకు బానిసనని, దొంగనని, ఆస్తిపాస్తులూ లేనివాడినని కొత్త నాటకం మొదలుపెడతారు. ఇంతలో రాజా తప్పతాగి అల్లరిచేస్తూంటే అదుపుచేయబోగా సరోజ, గుండమ్మ తిట్టారన్న వంకపెట్టి అంజి భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు. రాజా కూడా అలిగినట్టు నటించి తన భార్య సరోజను తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. అంజి సమస్య తీరిపోవడంతో నేరుగా తన బంగ్లాకే తీసుకుపోయి తానెవరో చెప్పేస్తాడు. కానీ భార్య బద్ధకస్తురాలు కావడంతో ఆమెని సరిజేసుకునేందుకు రాజా మాత్రం తమ తోటలోనే ఓ పనివాడిగా తోటలోని ఇంట్లో ఉంటాడు. కష్టపడి స్వతంత్రంగా జీవించడంలోని తృప్తి, ఉన్నదాంట్లో సర్దుకోవడం వంటివి అనుభవంలోకి తెస్తాడు.
మరోవైపు గుండమ్మ కొడుకు తల్లిని లెక్కించకుండా ప్రేమించి పెళ్ళిచేసుకుని ఇంటికి తీసుకువస్తాడు. గుండమ్మ కోడలి దూరపుబంధువు దుర్గమ్మ (ఛాయాదేవి) ఆ చుట్టరికం అడ్డుపెట్టుకుని గుండమ్మ ఇంట్లో చేరుతుంది. ఇల్లు దోచేస్తూ, గుండమ్మ మీదే దొంగతనం నేరం వేసి ఆమె కొడుకు, కోడలు ముందు దొంగని చేస్తుంది. గంటయ్య కొడుకు జైలు నుంచి విడుదలై వచ్చి దుర్గమ్మ దొంగసొమ్ములో వాటా కోసం, గుండమ్మపైన ఆమె ఇంట్లోనే రౌడీయిజం చేస్తాడు. ఇంతలో అంజి, లక్ష్మి వచ్చి స్వంత ఇంట్లోనే అనాథలా బ్రతుకుతున్న గుండమ్మని కాపాడి, సమస్యగా తయారైన గంటయ్య కొడుకుని, దుర్గమ్మనీ తరిమేస్తారు. రాజా గారెలు కావాలని మరో నాటకం ఆడగా, అందుకు అవసరమైనంత జీతాన్ని యజమాని నుంచి తీసుకునేందుకు పంపుతాడు. యజమానిగా తనను ఒకసారి తన కొడుక్కి చూసుకోవడానికి వచ్చిన రామభద్రయ్యే ఉండడం, అతను తనను తన భర్తను అవమానిస్తుంటే తక్షణం అక్కడ ఉండనని బయలుదేరుతుంది. ఇంతలో తన అక్క, ఆమె భర్త అంజి అక్కడ కారులో కనిపించి జరిగినదంతా చెప్తారు. తమ యజమాని రామభద్రయ్యే తమ మావయ్య అని తెలుస్తుంది. గుండమ్మ కూడా వారింటికి రావడం, అందరిలో ఇల్లరికానికి విరుగుడుగా అల్లుడరికాన్ని తీసుకువస్తానని అంజి చమత్కరించడంతో కథ ముగుస్తుంది.
జానపద బ్రహ్మగా పేరొందిన విఠలాచార్య కన్నడంలో మనె తుంబిద హెణ్ణు పేరిట కుటుంబ కథాచిత్రాన్ని తెరకెక్కించాడు. చిత్ర నిర్మాణానికి విఠలాచార్య నిర్మాత, వాహినీ స్టూడియోస్ అధినేత బి.నాగిరెడ్డి సహకారం పొందాడు. ఆ కృతజ్ఞతతో నాగిరెడ్డి అడగగానే సినిమా హక్కుల్ని విఠలాచార్య ఆయనకి ఇచ్చేశాడు. మనె తుంబిద హెణ్ణు సినిమాలో గుండమ్మ అనే గయ్యాళికి, నోరుమెదపలేని భర్త ఉంటాడు. ఆమె తన సవతి కూతురుని ఓ పిచ్చివాడికి ఇచ్చి పెళ్ళిచేస్తుంది. ఆ విషయం తెలిసిన సవతి కూతురు మేనమామ గుండమ్మపై పగబడతాడు. అతను గుండమ్మ స్వంత కూతురికి నేరాలకు అలవాటుపడ్డ జైలుపక్షికి ఇచ్చి పెళ్ళిజరిగేలా పథకం ప్రకారం చేయిస్తాడు. ఇలా సాగుతుంది ఆ సినిమా. అయితే ఇందులో గుండమ్మ కుటుంబ వ్యవహారాలు నాటకీయంగా సాగుతూ, నాగిరెడ్డికి చాలా తమాషాగా అనిపించాయి. విజయా ప్రొడక్షన్స్ చరిత్రలోనే తొలి రీమేక్ చేయడానికి అందుకే సిద్ధపడ్డాడు.
కథలో చిన్న చిన్న మార్పులు చేసి డి.వి.నరసరాజుతో ట్రీట్మెంట్, మాటలు రాయించేశాడు నాగిరెడ్డి. సినిమాకు దర్శకునిగా నాగిరెడ్డి సోదరుడు బి.ఎన్.రెడ్డిని అనుకున్నాడు. అయితే బి.ఎన్.రెడ్డి కళాత్మక చిత్రాల తరహా దర్శకుడు కావడమూ, ఇది ఆయన తరహా సినిమా కాకపోవడంతో పాటు బి.ఎన్.రెడ్డి లాంటి అగ్ర దర్శకుడు ఓ రీమేక్ సినిమా చేస్తే బాగోదన్న అనుమానం రావడంతో నాగిరెడ్డే వేరే దర్శకునితో చేద్దామని నిర్ణయించుకున్నాడు. పి.పుల్లయ్య దర్శకత్వం వహిస్తే బావుంటుందని, ఆయనకు నరసరాజు సిద్ధం చేసిన డైలాగ్ వెర్షన్ ఆయనకు పంపాడు. అది చదివిన పుల్లయ్య ఈ కథ, ట్రీట్మెంట్ నాకు నచ్చలేదు అని ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దాంతో సినిమా నిర్మాణం మళ్ళీ వెనుకబడింది.[2]
ఈ స్క్రిప్ట్ తన సన్నిహితుడు, సహ నిర్మాత, రచయిత అయిన చక్రపాణికి ఇచ్చాడు నాగిరెడ్డి. చక్రపాణికి వికలాంగులు, పిచ్చివాళ్ళతో హాస్యం చేస్తూ సీన్లు నడపడం అంతగా నచ్చదు. దాంతో హీరో పిచ్చివాడు కావడమే ప్రధానమైన పాయింట్ అయిన ఈ సినిమా స్క్రిప్ట్ ఆయనకు నచ్చలేదు. కానీ గుండమ్మ కుటుంబ వ్యవహారాలు, ఆ పాత్రలు బాగా నచ్చిన నాగిరెడ్డి మాత్రం ఎలాగైనా సినిమా తీయాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నాడు. దాంతో చక్రపాణి మొత్తం స్క్రిప్టును తిరగరాసే పనిలో పడ్డాడు. విలియం షేక్‌స్పియర్ రాసిన ద టేమింగ్ ఆఫ్ ద ష్రూ నాటకంలో కథానాయికల పాత్రలను, వారి స్వభావాలను ఆధారం చేసుకుని చక్రపాణి కథను తిరగరాశాడు.
సినిమాకు దర్శకునిగా చివరకు కమలాకర కామేశ్వరరావుని ఎంచుకున్నాడు నాగిరెడ్డి. తర్వాత చక్రపాణి తిరగరాసిన కథకు ట్రీట్మెంట్, సీనిక్ ఆర్డర్ కోసం కథాచర్చలకు చక్రపాణితో, కమలాకర కామేశ్వరరావు, డి.వి.నరసరాజు కూర్చున్నారు. ఆ చర్చల్లో భాగంగా అప్పటివరకూ ఉన్న గుండమ్మ భర్త పాత్రను తీసేసి గుండమ్మను వైధవ్యం అనుభవిస్తున్నదానిగా చూపిద్దామని నిర్ణయించాడు చక్రపాణి. అయితే కళకళలాడుతూ, నగలతో పసుపుకుంకుమలతో గుండమ్మను చూపిద్దామనుకున్న దర్శకుడు కామేశ్వరరావు ఆశాభంగం చెందినా, కథకు ఉపయోగపడని, కథలో మలుపులకు కారణం కాని పాత్ర వ్యర్థమన్న దృష్టితో "పెళ్ళానికి సమాధానం చెప్పలేని వాడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ పాత్ర మన కథకు అనవసరం" అంటూ తేల్చి, పాత్రను తొలగించేశాడు చక్రపాణి. మిగతా గుండమ్మ కుటుంబాన్నంతా యధాతథంగా తీసుకున్నారు.[3]
సినిమా కథని చక్రపాణి తిరగరాసిన తర్వాత మాటల రచయిత నరసరాజు, దర్శకుడు కామేశ్వరరావు, స్క్రీన్ ప్లే రచయిత చక్రపాణిల మధ్య జరిగిన కథాచర్చల్లో నటీనటుల ఎంపిక జరిగింది. ఆ చర్చల్లోనే వెంటనే ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావులను తీసుకుందామని నిర్ణయించుకున్నారు. సినిమా అనుకున్ననాడే గుండమ్మ పాత్రకు సూర్యకాంతం అయితేనే సరిపోతారని భావించారు. గుండమ్మ నిజానికి తెలుగుపేరు కాదు కన్నడపేరు. కన్నడంలోని ఈ సినిమా మాతృకలో ఓ పాత్ర పేరు గుండమ్మ. కథను తిరగరాసే క్రమంలో ఆ గుండమ్మ పాత్రను ప్రధానపాత్రగా చేసుకున్నారు. ఆ పాత్రకు ఏ పేరుపెట్టాలా అని తర్జనభర్జనలు పడుతుంటే, మరో పేరు ఎందుకు గుండమ్మ అన్న పేరే పెట్టేద్దామని నిర్ణయించాడు చక్రపాణి. అంత కీలకమైన పాత్రకి పెట్టే పేరు తెలుగుపేరు కాకపోవడమా అన్న సందేహాన్ని చిత్రబృందం వ్యక్తం చేస్తే, "ఇందులో ఏముంది, పెడితే అదే తెలుగు పేరు అవుతుంది" అని కొట్టిపారేసి గుండమ్మ అన్న పేరు ఖాయం చేసేశాడు.
సినిమాలో నటించిన ఇద్దరు కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్నార్ అప్పటికే తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోలు. సినిమా విడుదల సమయంలో టైటిల్స్ లో ఎవరి పేరు ముందువేయాలి, ఎవరి పేరు తర్వాత వేయాలి వంటి సందేహాలు వచ్చాయి. అయితే దీన్ని పరిష్కరించేందుకు అసలు తెరపై పేర్లే వేయకుండా ఫోటోలు చూపించాలని నిర్ణయించుకున్నారు. మొదట ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, జమున, ఎస్వీ రంగారావుల ఫోటోలు ఒకేసారి తెరపై వేసి, తర్వాత ఒకేసారి సూర్యకాంతం, ఛాయాదేవి, రమణారెడ్డి, హరనాథ్, ఎల్.విజయలక్ష్మిల ఫోటోలు వేశారు.[3]
గుండమ్మ కథ సినిమాని విజయా నిర్మాతలకు చెందిన వాహినీ స్టూడియోస్‌లో నిర్మించారు. సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా మార్కస్ బార్ట్లే వ్యవహరించాడు. చిత్రీకరణలో అవసరమైన సెట్‌లను కళాదర్శకులుగా వ్యవహరించిన గోఖలే, కళాధర్ వేశారు. మేకప్ ఎం.పీతాంబరం, టి.పి.భక్తవత్సలం చేశారు.[4] సినిమాలో ముఖ్యపాత్రలు చేసిన ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఎస్.వి. రంగారావు, సూర్యకాంతం తదితరులు పరిశ్రమలో చాలా బిజీ ఆర్టిస్టులు. వీళ్ళందరిపై ఒకేసారి షూటింగ్ చేయాలంటే వాళ్ళ డేట్స్ కలిసేవి కాదు. కాల్షీట్ సమస్య వల్ల అలాంటి సన్నివేశాల వరకూ అలా కుదిరిన కొన్ని డేట్లలో తీసి మిగతా సినిమాను వేరే పద్ధతిలో తెరకెక్కించారు. ఏ షాట్, ఎవరెవరి కాంబినేషన్లో షాట్ తీయాలన్నా సమస్య లేకుండా బౌండ్ స్క్రిప్ట్ సిద్ధంగా పెట్టుకున్నారు. విజయా వారికి చెందిన వాహినీ స్టూడియోలో గుండమ్మ ఇంటి సెట్ వేసివుంచారు. రోజూ ఉదయం చక్రపాణి ఆఫీసుకు వచ్చేసి రామారావు, సావిత్రి, నాగేశ్వరరావు, ఎస్వీఆర్ మొదలై నటులకు ఫోన్ చేసేవాడు. ఫోన్లో ఆరోజు వాళ్ళ షెడ్యూల్ ఏంటో కనుక్కుని, ఒకవేళ ఎవరైనా ఈరోజు షూటింగ్ కి వెళ్ళాలి అంటే సరేనని తర్వాతి రెండ్రోజుల సంగతి తెలుసుకుని ఫోన్ పెట్టేసేవాడు. మరెవరైనా ఆ రోజు ఖాళీగా ఉన్నానంటే పిలిపించి, వచ్చినవాళ్ళలో స్క్రిప్ట్‌ని బట్టి వాళ్ళ మధ్య కాంబినేషన్ సీన్లు చూసుకుని వాళ్ళతో షూటింగ్ చేసేవాడు. సినిమాలో "కోలో కోలోయన్న" పాట ఎన్టీఆర్-సావిత్రి, ఏఎన్నార్-జమున జంటలు పక్కపక్కనే ఉండి పాడుకుంటున్నట్టు చూపించారు. కానీ నలుగురు ఒకేసారి కలిసి చేయనేలేదు. ఎవరికి ఎప్పుడు ఖాళీవుంటే వారితో అప్పుడు పాటను తీసేశారు. ఎడిటింగ్ లో ఆ తేడాలు తెలియకుండా జాగ్రత్తపడ్డారు.
సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఆడియోగ్రఫీగా ఎ.కృష్ణన్, సౌండ్ ఇంజనీర్ గా వి.శివరాం వ్యవహరించారు. గుండమ్మకథను జి.కళ్యాణసుందరం ఎడిటింగ్ చేయగా ఆయనకు సహాయకునిగా డి.జి.జయరాం వ్యవహరించాడు. సినిమా రీల్ ని విజయా లేబొరేటరీస్ లో ప్రాసెస్ చేశారు.[4] సినిమాలో పలు సన్నివేశాల్లో నటించిన నటులంతా లేకున్నా దొరికిన వారితో దొరికినట్టుగా తీసేశారు. దాంతో ఆ తేడా తెలియకుండా ఎడిటింగ్ లో జాగ్రత్తలు తీసుకున్నారు.[3]
గుండమ్మకథ సినిమా జూన్ 7, 1962న రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది.
సినిమా విడుదలకు ముందే విమర్శలు చెలరేగాయి. సినిమా రిలీజ్ కి ఇంకా పదిరోజుల సమయం ఉందనగానే, ఎల్వీ ప్రసాద్ ఇంట్లో జరిగిన పెళ్ళివేడుకల్లో గుండమ్మ కథ సినిమాను ప్రదర్శించారు. సినిమా చూసిన సినిమా వర్గాలు సినిమాలో కథే లేదని, సూర్యకాంతం గయ్యాళితనాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదని విమర్శలు ప్రచారం చేశారు. హరనాథ్-విజయలక్ష్మి చేసిన పాత్రలు అనవసరమని, జమున పాత్ర చిత్రణ సరిగా లేదని మరికొందరు విమర్శించారు. చివరికి విజయా వారి నిర్మాణంలో మాయాబజార్ సహా పలు చిత్రాలు తీసిన దర్శకుడు కె.వి.రెడ్డి సినిమా బాగోలేదని అన్నారు. ప్రివ్యూ తర్వాత నరసరాజుకు తన అభిప్రాయాన్ని చెప్తూ-"అదేం కథండీ! కృష్ణా, గుంటూరు జిల్లాల సంపన్న వర్గాల కథలా వుంది. చక్రపాణి గారే రాయగలరు అలాంటి కథలు. మీరు రాసిన డైలాగులు బాగున్నాయనుకోండి. ఒక్క డైలాగులతోనే పిక్చర్ నడుస్తూందా" అన్నారు. సినిమా విడుదలై హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నప్పుడు- విజయా వారి సినిమా, పెద్ద నటీనటులు నటించారు. మొదట్లో హౌస్ ఫుల్ అవుతాయి. పోగాపోగా చూద్దాం అనేవారు. సినిమా ఘన విజయమని స్థిరపడిపోయాకా కూడా ఆయన సమాధాన పడలేదు, ఏంటోనండి. జనం ఎందుకు చూస్తున్నారో అర్థంకావట్లేదు అంటూ గుండమ్మకథ ప్రస్తావన వచ్చినపపుడల్లా అనేవారు.[3]
సినిమా విడుదల ముందు విమర్శలు రావడంతో విడుదల సమయంలో చిత్రవర్గాలు ఉత్కంఠతో ఎదురుచూశారు. గుండమ్మ కథ ప్రివ్యూ చూసినప్పుడు ఎన్టీఆర్ నిక్కర్లో తెరపై కనిపించగానే ప్రివ్యూ చూస్తున్న చిన్నపిల్లలంతా ఒక్కపెట్టున నవ్వారు. అది చూసిన చక్రపాణి ఆ అంచనాతోనే ప్రివ్యూ అవగానే "ఎవరెన్ని అనుకున్నా సినిమా సూపర్ హిట్" అని తేల్చేశారు. ఆయన అంచనాలు నిజం చేస్తూ సినిమా అప్రతిహత విజయాలను సాధించింది.[3]
డి.వి.నరసరాజు పసందైన సంభాషణలు అందించాడు. మచ్చుకు:
సినిమాకు ఘంటసాల సంగీత దర్శకత్వం వహించారు. అన్ని పాటలూ పింగళి నాగేంద్రరావు రాశారు. పాటలకు నృత్యదర్శకత్వం పసుమర్తి కృష్ణమూర్తి వహించారు. ఘంటసాల, పి.సుశీల, పి.లీల పాటలు ఆలపించారు.[4][5] [6]
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఎంత హాయి ఈ రేయి, ఎంత మధుర మీ హాయి | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | ఘంటసాల, పి.సుశీల |
కోలోకోలో యన్నకోలో నాసామి కోమ్మలిద్దరు మాంచిజోడు | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | ఘంటసాల, పి.సుశీల |
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | ఘంటసాల, పి.సుశీల |
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే తెలుపక తెలిపే అనురాగము నీ కనుల నే కనుగొంటిలే | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | ఘంటసాల |
లేచింది నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | ఘంటసాల |
వేషము మార్చెనూ భాషను మార్చెను మోసము నేర్చెను అసలు తానే మారెను | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | ఘంటసాల, పి.లీల |
సన్నగవీచే చల్లగాలికి కనులు మూసినా కలలాయే తెల్లని వెన్నెల పానుపుపై ఆ కలలో వింతలు కననాయె | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | పి.సుశీల |
అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలూ, రుసరుసలాడే చూపులతోనే ముసిముసి నవ్వుల చందాలూ | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | పి.సుశీల |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.