నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలానికి కేంద్రం From Wikipedia, the free encyclopedia
కొల్లాపూర్, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలానికి చెందిన పట్టణం.[1]
కొల్లాపూర్ | |
— పట్టణం — | |
తెలంగాణ పటంలో పట్టణ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16.111706°N 78.2783592°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నాగర్ కర్నూల్ |
మండలం | కొల్లాపూర్ |
ప్రభుత్వం | |
- మునిసిపల్ ఛైర్మన్ | |
జనాభా (2011) | |
- మొత్తం | 4,632 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 45 కి. మీ. దూరంలో ఉంది.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] సురభి సంస్థానాధీశుల వలన ఈ పట్టణం అభివృద్ధి చెందింది. 2011 జూన్ 15న ఈ పట్టణం మేజర్ గ్రామపంచాయతి హోదా నుంచి కొల్లాపూర్ పురపాలకసంఘంగా మార్చబడింది.[3]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం1063 ఇళ్లతో, 4732 జనాభాతో 1151 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2288, ఆడవారి సంఖ్య 2444. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 660 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 33. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576363[4].పిన్ కోడ్: 509102.
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 14, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు 9, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు 8 ఉన్నాయి. 2 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి.సమీప ఇంజనీరింగ్ కళాశాల వనపర్తిలో ఉంది. సమీప వైద్య కళాశాల కర్నూలులోను, పాలీటెక్నిక్ వనపర్తిలోను, మేనేజిమెంటు కళాశాల నాగర్‌కర్నూల్లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల వర్ద్యాల్లోను, అనియత విద్యా కేంద్రం అచ్చంపేటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల నాగర్‌కర్నూల్ లోనూ ఉన్నాయి.
కొల్లాపూర్లో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, 9 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
కొల్లాపూర్లో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
కొల్లాపూర్లో భూ వినియోగం కింది విధంగా ఉంది:
కొల్లాపూర్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
కొల్లాపూర్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
గ్రానైట్
జటప్రోలు సంస్థానం మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానది తీరాన వెలిసిన ఒక అత్యంత ప్రాచీనమైన సంస్థానం. ఈ సంస్థానాధీశులు చివరిదశలో కొల్లాపూరును రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని కొల్లాపూరు సంస్థానమనికూడా వ్యవహరిస్తారు. వీరు మొదట జటప్రోలు రాజధానిగా పాలించి తర్వాత కొల్లాపూర్, పెంట్లవెల్లి రాజధానులుగా పాలించారు. ఈ సంస్థానం కృష్ణా నది ఒడ్డున ఉన్న సువిశాలమైన నల్లమల్ల అటవీ ప్రాంతంనందు విస్తరించి ఉండేది. వీరి పాలన ఎప్పుడు ప్రారంభమైందనే విషయం ఖచ్చింతంగా వెలుగులోకి రాలేదు. అయితే చారిత్రక పరిశోధకుల ప్రకారం సా.శ.6-7 వ శతాబ్దిలో వీరి పాలన ప్రారంభమైనట్లు తెలుస్తుంది. పాలకులందరూ సురభి వంశస్థులే. అందుకే వీరికి సురభి సంస్థానాధీశులందురు. ఈ సంస్థానంలో సా.పూ. 2వ శతాబ్దానికి చెందిన పురావస్తు సంపదల ఆనవాళ్లు ఉన్నాయి. 1500 సంవత్సరాలకు పూర్వం కట్టించిన అనేక వందల పురాతన దేవాలయాలు నేటికీ ఈ ప్రాంతంలో ఉన్నాయి. కృష్ణానది ఒడ్డునే కల ప్రముఖమైన సోమశిల దేవాలయం ఈ సంస్థానానికే చెందింది. నిజాం పరిపాలనలో జటప్రోలు సంస్థానం చెప్పుకోదగిన పాత్ర పోషించింది. స్వాతంత్ర్య సమరయోధుడు మందుముల నర్సింగరావు ఈ సంస్థానాధీశుల బంధువే. ఇతను కొల్లాపూర్ నుంచి ఎన్నికై మంత్రి పదవి కూడా చేపట్టారు.
పిల్లలమర్రి బేతల రెడ్డి / నాయుడు జటప్రోలు సంస్థానాధీశుల మూలపురుషుడే కాక, గంజాం జిల్లాలోని బొబ్బిలి రాజ వంశం, గోదావరి జిల్లాలోని పిఠాపురం, కృష్ణా జిల్లా లోని మల్లేశ్వరం, నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి మొదలైన రాజ వంశాలకు మూలపురుషుడని చరిత్రకారుల భావన. 15వ శతాబ్దం చివరిలో ఈ వంశానికి చెందిన మాదానాయుడు కృష్ణ, తుంగభద్ర సంగమ సమీపంలోని జటప్రోలు ప్రాంతానికి వచ్చి అక్కడ కోటను కట్టడం ప్రారంభించాడు. మూడు తరాల తర్వాత ఈయన వారసులలో ఒకడైన మల్ల భూపతినాయుడు 1507లో విజయనగర రాజులనుండి ఈ ప్రాంతాన్ని పాలించడానికి ఉత్తర్వును పొందాడు. కృష్ణదేవరాయల పట్టాభిషేకానికి వెలుగోటి నాయకునిగా విచ్చేసిన సామంతుడు ఇతనేనని చరిత్రకారుల అభిప్రాయం. కాకతీయ, విజయనగర సామ్రాజ్యాలు ఈ సంస్థానాధీశులకు సైనిక పోషణకై పట్టాలిచ్చారు. కానీ ఆయా సామ్రాజ్యల పతనం చెందినప్పుడు సంస్థానాధీశులు చాకచక్యంతో తమ రాజ్యాన్ని నిలబెట్టుకొని దక్షిణాపథంలో కొత్తగా ఆవిర్భవించిన శక్తులతో మనగలిగారు. 1513లో అప్పుడే కొత్తగా ఏర్పడిన గోల్కొండ సామ్రాజ్యంపై దండయాత్రకు సన్నాహాలు చేస్తూ, కృష్ణదేవరాయలు యుద్ధబలగాలను బేరీజు వేయటానికి, ఇతర సామంతులతో పాటు జటప్రోలు రాజు వెలుగోటి యాచమ నాయున్ని పిలిపించాడు. ఆ సంవత్సరం రాయచూరు అంతర్వేదిలో జరిగిన యుద్ధంలో జటప్రోలు సంస్థానం కూడా పాల్గొంది.
ఔరంగజేబు దక్షిణాపథంపై దండెత్తి కుతుబ్షాహీలను ఓడించినప్పుడు స్థానిక రాజవంశాలను నిర్మూలించక, వాటిని తన నియమించిన దండనాయకుని ఆధీనంలో వీటిని తన రాజ్యంలో సామంతులుగా విలీనం చేసుకున్నాడు. అప్పటి నుండి జటప్రోలు సంస్థానం స్వాధికారత, ప్రాబల్యం పెరగటం ప్రారంభమైంది. అప్పటి సంస్థానాధీశుడు గోపాలరావు జటప్రోలు ప్రాబల్యాన్ని దక్షిణాన జటప్రోలు నుండి ఉత్తరాన పానగల్ యల్జల్ల వరకు విస్తరించి పటిష్ఠపరచాడు. 1694లో సంస్థానాధీశుడైన నరసింగరావు మొఘలులపై తిరుగుబాటు చేసి మొఘులుల మల్లయోధున్ని బంధించి, గంజికోట (గండికోట), శ్రీకాకుళంపై ఆధిపత్యం కావాలని పట్టుబట్టాడు. మొఘలులు ఇతనిని తృప్తిపరచడానికి వీటిపై అధికారమిచ్చారు.
19వ శతాబ్దం చివరలో జటప్రోలు సంస్థాధీశునికి సంతానం కలుగక వారసుడు లేని పరిస్థితి వచ్చింది. అప్పటికే పొరుగు సంస్థానాలైన వనపర్తి, గద్వాలలో జరుగుతున్న వారసత్వపు పోరులను గమనించిన జటప్రోలు రాజు, ముందు జాగ్రత్త చర్యగా వెంకటగిరి రాజకుమారుడిని దత్తత పుచ్చుకున్నాడు. ఇతని జటప్రోలు రాజా సింహాసనం అధిరోహించిన తర్వాత తన అసలు పేరు నవనీతకృష్ణ యాచేంద్రను విడిచి రాజా వెంకట లక్ష్మణరావు బహుదూర్ అనే పట్టం స్వీకరించాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు. వెంకట లక్ష్మణరావు 1929లో మరణించాడు.
జటప్రోలు సంస్థానాన్ని సుమారు పదహారు తరాలుగా కొన్ని శతాబ్దాల పాటు పరిపాలన కొనసాగించిన 'సురభి' రాజులంటే కొల్లాపూర్ ప్రాంత జనులకు వల్లమాలిన అభిమానం. వీరి పరిపాలన 7, 8 వందల సంవత్సరాల క్రితం నుంచే ప్రారంభమైనట్లు చరిత్రకారులు చెబుతారు. కొల్లాపూర్ ప్రాంతంలో చారిత్రక భవనాలు, దేవాలయాలతో పాటు అనేకం సురభి రాజ వంశీయులు నిర్మించినవే. జటప్రోలు సంస్థానాధీశుల కోటను మల్ల నాయుడు నిర్మించగా, సింగపట్నంలోని నృసింహ సాగరాన్ని మాధవరాయుడు, పెంట్లవెల్లి గ్రామంలోని కోటను, చెరువును, శివ కేశవాలయాన్ని చిన్నమాధవ రావు, కొల్లాపూర్ కోటను ప్రథమ వేంకటలక్ష్మా రావు, జటప్రోలు మదన గోపాల స్వామి ఆలయాన్ని మాధవరాయులు, బెక్కం, చిన్నమారూరు కోటల్ని నరసింగ రావులు నిర్మించారు. వీటితో పాటు శింగవట్నంలోని శ్రీవారి సముద్రం, జటప్రోలు హజ్రత్ ఇనాయత్ షా ఖాద్రి దర్గా, అద్దాల మేడ, కొల్లాపూర్ లోని న్యాయ దర్బార్ గా పిలిచే గుండు బంగ్లా, జైలు ఖానాలను సురభి రాజులు వారి పాలనలో నిర్మించారు.
1871 లో నిర్మించిన కొల్లాపూర్ రాజా బంగ్లాను చంద్ర మహల్, మంత్ర మహల్, రాణి మహల్ గా విభజించి సుందరంగా నిర్మించారు. 140 సంవత్సరాల క్రితం నాటి మునసబ్ కోర్టు జిల్లాలోనే ప్రథమ న్యాయస్థానం ఇక్కడ ఉంది. కొల్లాపూర్ పట్టణంలో విశాలమైన రహదారులు, రహదారులకిరు వైపులా చెట్లు, డ్రైనేజీ వ్యవస్థ ఆనాడే ఏర్పాటు చేసారు. జనరేటర్ ఉపయోగించి విద్యుత్తును వినియోగించిన ఘనత కూడా వారికే దక్కుతుంది. త్రాగునీటి సరఫరా పైపులైను ఏర్పాటు చేసి కుళాయిలు ఆనాడే ఏర్పాటు చేసారు. 18 వ శతాబ్దం కాలంలోనే జటప్రోలు సంస్థానాధీశుల అధ్వర్యంలో కొల్లాపూర్ పట్టణంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ధర్మాసుపత్రిని కూడా ఏర్పాటు చేసారు. హైటెక్ పరిజ్ఞాన వినియోగంలో సురభి వంశస్థులదే అందె వేసిన చేయి. సురభి వంశస్థులు ప్రపంచ విపణిలో ఏ కొత్త వస్తువు వచ్చినా వాటిని వినియోగించుకునేవారు. వీరికి ఒక సొంత విమానం కూడా ఉండేదని. దానికి ఎయిర్ పోర్టుగా కొల్లాపూర్ పట్టణంలోని జఫర్ మైదానాన్ని ఉపయోగించినట్లుగా చెబుతారు.
సురభి రాజ వంశ వారసుడైన బాలాదిత్య లక్ష్మారావు (ఇతను సంస్థానం చివరి రాజు జగన్నాథరావు కుమారుడు) హైదరాబాదులో నివాసం ఏర్పరుచుకున్నారు.
ఇక్కడి మదనగోపాలస్వామి ఆలయం అతి పురాతనమైనదిగా పేరుగాంచింది. ప్రాచీన రాజుల భక్తిప్రవుత్తులకు నిదర్శనంగా మిగిలిన ఈ ఆలయం అడుగడుగునా సుందర శిల్పకళాశోభితంగా విరాజిల్లుతోంది. [2]
2022 జూన్ 18న తేదీన తెలంగాణ రాష్ట్ర ఐటీ-మున్సిపల్ శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు కొల్లాపూర్ పట్టణంలో 2 కోట్ల రూపాయలతో బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద డివైడర్ నిర్మాణానికి, 1.20 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద జంక్షన్ సుందరీకరణ పనులకు, 2.80 కోట్ల రూపాయలతో కరెంట్ ఆఫీసు వద్ద మేజర్ సీసీ రోడ్డు-సైడ్ డ్రైన్ నిర్మాణానికి, 90 లక్షల రూపాయలతో అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలుగు వీధిలో సీసీ రోడ్డు-సైడ్‌డ్రైన్ నిర్మాణానికి, 1.10 కోట్ల రూపాయలతో పాత బస్టాండ్ వద్ద మేజర్ సైడ్‌డ్రైన్ నిర్మాణానికి, 2 కోట్ల రూపాయలతో బండయ్యగుట్ట వద్ద పార్కు అభివృద్ధి పనులకు, సింగోటం శ్రీవారి సముద్రం నుంచి గోపాల్‌దిన్నె రిజర్వాయర్ లింక్ కెనాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక-సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు శ్రీమతి సురభి వాణీదేవి, గోరటి వెంకన్న, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.