From Wikipedia, the free encyclopedia
చుండి సంస్థానం తీరాంధ్ర ప్రాంతంలోని పూర్వపు జమీందారీ సంస్థానము. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వోలేటివారిపాలెం మండలం లోని చుండి గ్రామమే ఈ జమీందారి ముఖ్యపట్టణం. ఈ సంస్థాన పాలకులైన కామినేని వంశం వారు చండిక (పార్వతీ దేవి) ఆరాధకులు కనుక వారి నివాస ప్రాంతానికి చండికపురి అని పిలుచుకున్నారు. అదే కాలక్రమేణ చుండి అయ్యింది. చుండి జమీందారీలో మొత్తం 35 గ్రామాలు ఉండేవి. 19వ శతాబ్దపు చివరి దశకంలో సంవత్సరానికి 20,600 రూపాయలు పేష్కష్గా చెల్లించేది.[1] 1898లో పేష్కష్ చెల్లించలేక పోయినందుకు బదులుగా బ్రిటీషు ప్రభుత్వం పురటిపల్లి గ్రామాన్ని స్వాధీనం చేసుకుంది.[2] ప్రోలయ వేమారెడ్డి చివరి తమ్ముడైన మల్లారెడ్డి వంశీయులు, కందుకూరు రాజ్యమును పాలించిన కాలములో వారికి చుండి రాజధానిగా ఉండేది. 1427 ప్రాంతంలో చుండి విజయనగర సామ్రాజ్య పాలనలోకి పోయింది. ఆ తరువాత విజయనగర పాలకుల సామంతులైన కామినేని వారికి ఈ సంస్థానం సంక్రమించింది.[3] చుండిలోని జనార్దన స్వామి ఆలయంలో, క్రీ.శ 1640-41 నాటి కామినేని ముత్తరాజు శాసనంలో, వాల్మీకి వంశస్థులైన కామినేని వారు అమ్మసాని గోత్రజులని తెలుస్తోంది.[4]
చుండి సంస్థానం జమీందారులు బోయ నాయకులు. ఈ వంశానికి మూలపురుషుడు కామినాయుడు. ఈయన పేరు మీదే వీరికి కామినేని వారని ప్రసిద్ధి. తర్వాత విజయనగర సామ్రాజ్యం కాలంలో, 1426 ప్రాంతంలో కామినేని రామానాయడు విజయనగర సామంతునిగా ఉన్నాడు. రామానాయుడు ఉదయగిరి ప్రాంతాన్ని పాలించాడు.[3] తర్వాత గోల్కొండ నవాబుల కాలంలో ఇక్కడ అల్లర్లలను అణచినందున రామానాయుడు మునిమనమడు, కామినేని అయ్యప్ప నాయున్ని చుండి అమలుదారుగా నియమించారు. రెడ్డి రాజుల పాలనలో ఉన్న చుండి, గోల్కొండ నవాబుకు ఎదురు తిరగగా, నవాబు కోరిక ప్రకారం కామినేని అయ్యప్ప నాయుడు ఈ తిరుగుబాటును అణచి, నవాబుల దయాపాత్రుడయ్యాడు. రెడ్డిరాజులలో చివరి పాలకుడైన పుచ్చకట్ల రామిరెడ్డి సంతానం లేకుండా మరణించడంతో, గోల్కొండ నవాబు అబ్దుల్లా కుతుబ్ షా,[4] అయ్యప్ప నాయున్ని చుండి అమలుదారుగా నియమించారు. అయ్యప్ప నాయని కుమారుడు దాదినాయుడు అమలుదారుడిగా ప్రారంభించి జాగీర్దారుడయ్యాడు. తర్వాత శేఖర్ నాయకుడు, పోలి నాయుడు, ముత్తరాజు, వీర రాఘవ నాయకుడు, కుమార ముత్తరాజు, వెంకటప్ప నాయకుడు చివరగా కామినేని బంగారు ముత్తరాజు (1842-70) వరకు పరిపాలించారు. తర్వాత ఈ సంస్థానం ఈస్టిండియా కంపెనీ ఆధీనంలోకి వెళ్లింది.[3]
1899లో అప్పటి జమీందారు మరణించిన తర్వాత వారసత్వపోరు మొదలై, న్యాయస్థానం దాకా వెళ్ళింది. రాజ్యంపై అధికారాన్ని జమీందారు తమ్ముడు మరియు జమీందారు యొక్క విధవ దావా వేశారు. అయితే ఒక అంగీకారానికి వచ్చి, జమీందారు తమ్ముడికి సంతానం కలిగితే, విధవైన జమీందారిణి ఆ పుత్ర సంతానాన్ని దత్తత తీసుకొని వారసునిగా ప్రకటించేట్టు ఒప్పందం చేసుకున్నారు. 1903లో జమీందారు తమ్మునికి ఒక కొడుకు పుట్టాడు. 1903 జూన్ 27న ఈ కుమారున్ని జమీందారు యొక్క విధవ దత్తత తీసుకున్నది. కామినేని కుమార బంగార అంకప్పనాయుడు బాలుడైనందకు వళ్ళ జమీందారీ వ్యవహారాలు ఆ తరఫున న్యాయస్థానానికి అప్పగించారు.[5] చుండి సంస్థానం 20 ఏళ్ళపాటు న్యాయస్థానం ఆధీనంలో ఉన్నది. 1924, ఫిబ్రవరి 1న జమీందారిపై పూర్తి అధికారాన్ని కామినేని కుమార బంగార అంకప్పనాయుడుకు తరలించింది.[6]
Seamless Wikipedia browsing. On steroids.