From Wikipedia, the free encyclopedia
కరివేపాకు ఒకరకమైన సుగంధభరితమైన ఆకులు గల చెట్టు. కరివేపాకును తెలంగాణల కళ్యామాకు అంటారు.
కరివేపాకు | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | Sapindales |
Family: | |
Genus: | Murraya |
Species: | M. koenigii |
Binomial name | |
Murraya koenigii (L.) Sprengel | |
కరివేపా(కళ్యామాకు)కు చెట్టు సుగంధభరితమైన ఆకులు గల ఒక అందమైన పొద మొక్క లేదా చిన్న చెట్టు. దీని ఆకులని కరివేపాకు అంటారు. కరివేపాకులని ఇంగ్లీషులో curry leaves అనిన్నీ sweet neem leaves అనిన్నీ అంటారు. దీని శాస్త్రీయ నామము స్వీడన్ దేశపు వృక్ష శాస్త్రవేత్త యోహాన్ ఏండ్రియాస్ మర్రే (Johann Andreas Murray, 1740-1791) పేరు మీదుగా "మర్రయా కీనిగీ" (Murraya Koenigii) అయింది. ఇది ఎక్కువగా ఇండియా, శ్రీలంకలలో కనిపిస్తుంది. కూర, చారు, పులుసు, వగైరా వంటకాలలో సువాసనకోసం వాడుతారు
ఇది 4 నుండి 6 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కాండం 40 సెంటీమీటర్లు వరకూ పెరుగుతుంది. భారతదేశంలో అన్ని ప్రాంతాలలోనూ కరివేప చెట్లు కనిపిస్తాయి. ఆకు నిర్మాణంలో వేపాకుని పోలి ఉంటుంది; ఈనె పొడవునా, ఈనెకి ఇరువైపులా, చిన్న చిన్న ఆకులు బారులు తీర, ఎదురెదురుగా కాకుండా, ఉంటాయి. ఈనె చివర ఒక ఆకు ఉంటుంది. ఈ లక్షణాన్ని ఇంగ్లీషులో imparipinnate అంటారు. ఆకులు అండాకారం (oval shape) లో ఉంటాయి. కొమ్మల చివర సువాసనగల పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. గుండ్రని ఆకారంలో ఉన్న కాయలు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగాను, పండితే ముదురు రక్తం రంగులోకి మారతాయి. ఒకొక్క కాయలో రెండేసి విత్తనాలు ఉంటాయి. ఈ గింజలు (seeds) లో విష పదార్ధము ఉంటుంది.
కరివేప చెట్లు తూర్పు ఆసియా, దక్షీణ ఆసియా, ఆస్ట్రేలియా ఖండాలలోని అడవులలో విపరీతంగా కనిపిస్తాయి. మొత్తం ఉన్న 12 ఉపజాతులలో రెండు మాత్రమే భారతదేశంలో కనిపిస్తున్నాయి. భారత దేశంలో చాలమంది ఈ చెట్టుని పెరట్లో పెంచుకుంటారు. మరొక ఉపజాతి మర్రయూ ఎక్సాటికాని సంస్కృతంలో కామినీ అనిన్నీ వనమల్లికా అనిన్నీ అంటారు. దీనిని తెలుగులో పూలవెలగ అంటారు. ఇంగ్లీషులో Chinese box tree అంటారు. ఈ పేరుని బట్టి కరివేప మొదట్లో చైనాలో పెరిగేదేమోనని ఒక అనుమానం ఉంది. ప్రాచీన తమిళ సాహిత్యంలో కరివేప ప్రస్తావన ఉన్నప్పటికీ కరివేప తొట్టతొలి జన్మస్థానం భారతదేశం కాదని శాస్త్రవేత్తల అభిప్రాయం.
కరివేప మొక్కల వ్యాప్తి విత్తనాల ద్వారానే జరుగుతుంది. తగినంత నీడ ఉన్న చోట విత్తులు బాగా మొలకెత్తుతాయి. మొదళ్ళ దగ్గర నీరు నిలవకుండా జాహగ్రత్త పడాలి.
"కూరలో కరివేపాకులా తీసిపారేసేరు" అనే సామెత తెలుగు దేశంలో ఉంది.
కరివేప ఆకుల్లో ఖటికం (కేల్సియం), భాస్వరం (ఫాస్ఫరస్), నార (ఫైబర్), విటమిన్-ఎ, విటమిన్-సి ఉండడం వల్ల వీటికి పోషక విలువ ఉంది. వీటి సువాసన వల్ల ఆకులని కూరలు, చారు, పులుసు, పులిహోర, వంటి భోజన పదార్థాలలో విరివిగా వాడతారు.
కరివేప కలపతో వ్యవసాయపు పనిముట్లుతోపాటు చేతి కర్రలు, పిడులు, రేఖాగణితంలో వాడే గీట్లబద్ద వంటి కొలబద్దలు తయారు చేసుకుంటారు.
కరివేపాకు చెట్టులో అన్నిటికీ ఔషధపరమైన ఉపయోగాలున్నాయి. కరివేపాకు ఆకులు, కరివేపాకు కాయలు, వేరు పై బెరడు, కాండం పై బెరడు ఇలా అన్నిటినీ ఔషధ రూపంలో వాడతారు. కరివేపాకు ఒక ప్రధాన ద్రవ్యంగా తయారయ్యే ఆయుర్వేద ఔషధాలు- జాత్యాది తైలం, జాత్యాది ఘృతం. కరివేపాకుతో తయారుచేసుకున్న చూర్ణాన్ని 3-6గ్రాముల మోతాదులో వాడాలి. కరివేపాకు ముదురు ఆకుల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. లేత ఆకుల్లో సుగంధిత తైలం ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది.
అధిక చెమటతో తడిసి ముద్దయ్యేవారు పెరటి మొక్క "కరివేపాకు" ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే ఫలితం ఉంటుంది. కరివేపాకు శరీరంలో వేడిని తగ్గించటమేగాకుండా, అధిక చెమట బారినుంచి రక్షిస్తుంది. అలాగే చెమట చెడువాసను కూడా తగ్గిస్తుంది. దీనిని వివిధ రకాల ఆహార పదార్థాలతోపాటు తీసుకోవచ్చు లేదా పొడి చేసుకుని వాడుకోవచ్చు. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ కరివేపాకు చెట్టు పెరట్లో ఉండటం చాలా మంచిది. ఎందుకంటే దీనినుంచే వీచే గాలి కూడా ఆరోగ్యకరమైనదే కాబట్టి. వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉన్నచోట్ల కరివేపాకు చెట్లను నాటినట్లయితే గాలి శుభ్రపడుతుంది. విషప్రభావం కలిగించే వాయువులు ఈ మొక్క ద్వారా శుద్ధి అవుతాయి. కరివేపాకు చెట్టులోని ఆకులు, బెరడు, వేరు, గింజలు, పువ్వులు.. అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినట్టివే. వగరుగా ఉన్నప్పటికీ సువాసనా భరితంగా ఉన్న కరివేపాకులో ఐరన్ పుష్కళంగా లభిస్తుంది. ఇది శరీరానికి మంచి బలాన్నిస్తుంది. ముఖ్యంగా అనీమియా (రక్తహీనత) వ్యాధితో బాధపడేవారు కరివేపాకును ఆహారంలో ఎక్కువగా తీసుకున్నట్లయితే చక్కని ఫలితం పొందవచ్చు. కరివేపాకు పేగులకు, కడుపుకు బలాన్ని ఇవ్వటమే కాకుండా.. శరీరానికి మంచి రంగును, కాంతిని ఇస్తుంది. అజీర్ణాన్ని అరికట్టి ఆకలి పుట్టిస్తుంది. న్యూమోనియా, ఫ్లూ.. లాంటి ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సలో కూడా కరివేపాకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. అదే విధంగా మలబద్ధకంతో బాధపడేవారికి, మొలల సమస్యతో సతమతం అయ్యేవారికి కూడా కరివేపాకు దివ్యౌషధమనే చెప్పవచ్చు.
మధుమేహ తగ్గించే గుణము (anti Diabetic), విష పదార్దాల విసర్జనకారిణిగా (anti oxidant), సూక్ష్మ క్రిమి నివారిణిగా (anti microbial), శరీరమునకు రక్షణ ఇస్తుంది (anti inflamatary ), కాలేయాన్ని విషతుల్యమవకుండా కాపాడుతుంది (hepatoprotective ), కొలెస్టరాల్ని తగ్గిస్తుంది (anti cholesterolemic),
కరివేపాకు ముద్దను నిత్యం టీస్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే క్రమంగా టోటల్ కొలెస్ట్రరాల్ తగ్గటంతోపాటు హానికరమైన ఎల్.డి.ఎల్. కూడా గణనీయంగా తగ్గుతుంది. గర్భిణీ వాంతులు, మార్నింగ్ సిక్‌నెస్, పైత్యపు వాంతులు: కరివేపాకు రసాన్ని పూటకు రెండు టీ స్పూన్ల మోతాదులో, అరకప్పు మజ్జిగకు చేర్చి రెండుపూటలా తీసుకుంటుంటే వికారం, వాంతులు వంటివి తగ్గుతాయి. లేదా తాజా కరివేపాకు రసం ఒక టీ స్పూన్, నిమ్మరసం ఒక టీ స్పూన్, పంచదార ఒక టీ స్పూన్ కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటుంటే వేవిళ్లలో ఉపశమనం కలుగుతుంది.
కరివేపాకును ముద్దగా నూరి మోతాదుకు టీ స్పూన్ చొప్పున మజ్జిగతోగాని నీళ్లతోగాని రెండుపూటలా తీసుకుంటుంటే స్థూలకాయం తగ్గి తద్వారా మధుమేహం నియంత్రణలోకి వస్తుంది. అధిక రక్తపోటులో కనిపించే ఉపద్రవాలు: కరివేపాకు పళ్లను లేదా కరివేపాకు చెట్టు బెరడును కషాయంగా కాచి తీసుకుంటే అధిక రక్తపోటు వల్ల వచ్చే రుగ్మతలు తగ్గుతాయి. కాలిన గాయాలు: చర్మంపైన కాలి బొబ్బలెక్కిన సందర్భాల్లో కరివేపాకు ఆకులను మెత్తగానూరి నెయ్యిని గాని లేదా వెన్ననుగాని కలిపి బాహ్యంగా ప్రయోగించాలి. ఇలా చేయటంవల్ల గాయాలు త్వరితగతిన మచ్చలు పడకుండా మానుతాయి.
ఎండబెట్టిన కరివేపాకును, పసుపును సమపాళ్లలో తీసుకొని పొడిమాదిరిగా నూరి, వస్తగ్రాళితం పట్టి ఒక శుభ్రమైన గాజు సీసాలో నిల్వచేసుకొని ప్రతిరోజూ ఒక టీ స్పూన్ మోతాదులో కనీసం మండలంపాటు తీసుకుంటే దురదలు తగ్గుతాయి. అజీర్ణం మూలంగా విరేచనాలు: కరివేపాకును ముద్దగా నూరి టీ స్పూన్ మోతాదులో సమానంగా తేనెను కలిపి రెండుపూటలా తీసుకుంటే జీర్ణక్రియ గాడిలో పడి విరేచనాలు తగ్గుతాయి.
కరివేపాకు ఆకులతో కషాయం కాచి తీసుకుంటే జ్వరంలో హితకరంగా ఉంటుంది. అజీర్ణం, అరుగుదల తగ్గటం: ఎండిన కరివేపాకులు, ధనియాలు, జీలకర్రలను నెయ్యిలో వేయించి, మెత్తగా చూర్ణంచేసి, సైంధవ లవణం పొడిని కలిపి సీసాలో నిల్వచేసుకోవాలి. దీనిని ఉదయం సాయంకాలాలు భోజనంలో వాడితే జీర్ణశక్తి పెరుగుతుంది. కలరా వ్యాధిలో కూడా ఇది ఉపయుక్తమే. నీళ్ల విరేచనాలు: కరివేపాకులను ముద్దగా నూరి 1-2 టీ స్పూన్ల మోతాదులో అరకప్పు మజ్జిగతో కలిపి రోజుకు 2-3 సార్లు తీసుకుంటే అతిసారంలో హితకరంగా ఉంటుంది.
కరివేపాకు పొడిని తేనెతో కలిపి తీసుకుంటే రక్తవిరేచనాలు, జిగట విరేచనాల్లో ఉపశమనం లభిస్తుంది. కడుపుబ్బరింపు, కడుపులో మంట: కరివేపాకు పొడిని మజ్జిగలో కలిపి తీసుకుంటే కడుపుబ్బరింపు, మంట వంటివి తగ్గుతాయి. క్రిమికీటకాల కాటు, దద్దుర్లు: కరివేపాకు కాయల రసాన్ని సమాన భాగం నిమ్మరసంతో కలిపి కీటకాలు కుట్టినచోట ప్రయోగిస్తే నొప్పి, వాపు, ఎరుపుదనం వంటి లక్షణాలు తగ్గుతాయి. దద్దుర్లు కూడా తగ్గుతాయి.
కరివేపాకు, మిరపకాయలు, ఉప్పు, ఉల్లిపాయలను కలిపి రోటి పచ్చడి మాదిరిగా చేసుకొని ఆహారంగా తీసుకుంటే జలుబు, దగ్గు, ఉబ్బసం వంటి వ్యాధుల్లో హితకరంగా ఉంటుంది. మూత్ర పిండాల సమస్యలు: కరివేపాకు వేరు రసాన్ని ప్రతిరోజూ రెండు పూటలా పూటకు టీస్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే మూత్ర పిండాల సమస్యల్లో హితకరంగా ఉంటుంది.
తాజా కరివేపాకు రసాన్ని కళ్లలో చుక్కల మందులాగా వాడితే క్యాటరాక్ట్ వేగాన్ని ఆలస్యం చేయవచ్చు. ఆర్శమొలలు: లేత కరివేపాకు రసానికి తేనె కలిపి తీసుకుంటే ఆర్శమొలల్లో ఉపశమనం లభిస్తుంది. లేదా కరివేపాకు పొడిని మజ్జిగలో కలిపి తీసుకున్నా మంచిదే. దీనివల్ల మలబద్ధకం తగ్గిపోయి ఫైల్స్ బాధ తగ్గుతుంది. సౌందర్య సమస్యలు చర్మసంబంధ సమస్యలు: కరివేపాకు, వేపాకులు సమపాళ్లలో తీసుకొని ముద్దగా నూరి ప్రతిరోజూ రెండుపూటలా పూటకు ఒక టీ స్పూన్ మోతాదుగా, అర కప్పు మజ్జిగతో తీసుకుంటుంటే చర్మసంబంధ సమస్యల్లో హితకరంగా ఉంటుంది. కంటి కింద వలయాలు: కరివేపాకు రసాన్ని పెరుగుతో గాని లేదా వెన్నతోగాని కలిపి కళ్లకింద చర్మంమీద రాస్తుంటే క్రమంగా కంటి కింద వలయాలు తగ్గుతాయి.
కరివేపాకు, గోరింటాకు, మర్రిపాలు సమపాళ్లలో తీసుకొని ముద్దగా నూరి పాదాల పగుళ్లమీద వారం పది రోజులపాటు రాత్రిపూట రాసుకుంటే పాదాల పగుళ్లు తగ్గుతాయి. చుండ్రు: కరివేపాకు, నిమ్మ పండ్లపై నుండే తోలు, శీకాయ, మెంతులు, పెసలు... వీటిని సమభాగాలు తీసుకొని మెత్తని పొడి రూపంలో నూరి, నిల్వచేసుకొని షాంపూ పొడిగా వాడితే చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది. కురుల ఆరోగ్యానికి తల నూనె: కరివేపాకును ముద్దగా నూరి, ఒకటిన్నర రెట్లు కొబ్బరి నూనె కలిపి, చిన్న మంట మీద మరిగించి, వడపోసుకొని నిల్వచేసుకోవాలి. దీనిని రోజువారీగా తల నూనెగా వాడుకుంటుంటే జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. ఆరోగ్యంగా పెరుగుతుంది. చెమటవల్ల వచ్చే దుర్గంధం: కరివేపాకు పొడిని ఆహారంలో ప్రతిరోజూ మజ్జిగలో కలిపి తీసుకుంటూ ఉంటే చెమటవల్ల వచ్చే చెడు వాసన తగ్గుతుంది.
sunny goud
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.