From Wikipedia, the free encyclopedia
కణ భౌతికశాస్త్రం (ఆంగ్లం: Particle Physics) అంటే పదార్థములోనూ, వికిరణం (Radiation) లోనూ కనిపించే అతి సూక్ష్మమైన కణాలు, వాటి గుణగణాలను అధ్యయనం చేసే భౌతికశాస్త్ర విభాగం. ఇక్కడ కణాలు అంటే విభజించడానికి వీలులేని అత్యంత సూక్ష్మమైన కణాలు లేదా ప్రాథమిక కణాలు (elementary particles) అని అర్థం. వీటి ప్రవర్తనకు కారణమయ్యే ప్రాథమిక చర్యల గురించి ఈ శాస్త్రంలో అధ్యయనం చేస్తారు. ప్రస్తుతం శాస్త్రజ్ఞుల అర్థం చేసుకున్నదాని ప్రకారం ఈ ప్రాథమిక కణాలు, క్వాంటం ఫీల్డ్స్ (Quantum fields) ఉత్తేజం పొందినపుడు ఏర్పడి దానికనుగుణంగా ప్రవర్తిస్తాయి. ప్రామాణిక నమూనా (Standard Model) అనే ప్రభలమైన సిద్ధాంతం ప్రస్తుతం ఈ విషయాలను వివరించగలుగుతుంది. శాస్త్రజ్ఞులంతా ఈ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసేందుకు పరిశోధనలు చేస్తున్నారు. ఉదాహరణకు ఇటీవలే కనుగొన్న హిగ్స్ బోసాన్ నుంచి ఎప్పటి నుంచో ఉన్న గురుత్వాకర్షణ శక్తి వరకు ఇందులో పరిశోధనాంశాలు.[1][2]
సృష్టిలో కనిపించే ప్రతి పదార్థం విభజించడానికి వీలులేని అతి సూక్ష్మమైన కణాలచే నిర్మించబడి ఉందనే భావన క్రీ.పూ 6 వ శతాబ్దం నుంచే ప్రాచుర్యంలో ఉంది.[3] 19వ శతాబ్దంలో జాన్ డాల్టన్ అనే శాస్త్రవేత్త స్టాయికియోమెట్రీ అనే విషయంపై పరిశోధన చేస్తూ ప్రకృతి మొత్తం ఒకే రకమైన కణాలతో నిర్మితమై ఉంటుందని పేర్కొన్నాడు.[4] పరమాణువు (ఆటమ్) అనే పదానికి గ్రీకులో విభజించడానికి వీలులేని అని అర్థం ఉంది. రసాయన శాస్త్రజ్ఞులు చాలా రోజుల వరకు పరమాణువులనే అత్యంత చిన్న కణాలుగా భావిస్తూ వచ్చారు. కానీ భౌతిక శాస్త్రవేత్తలు మాత్రం వీటి కన్నా సూక్ష్మమైన ఎలక్ట్రాన్ల లాంటి కణాలు ఉన్నాయని కనుగొన్నారు.
Seamless Wikipedia browsing. On steroids.