భారతీయ సంగీతకారుడు From Wikipedia, the free encyclopedia
ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ సాహెబ్ ( 1916 మార్చి 21, - 2006 ఆగస్టు 21, ) భారత దేశానికి చెందిన, ప్రఖ్యాత షెహనాయ్ విద్వాంసుడు. సాంప్రదాయ వేడుకలు, ఉత్సవాలు జరిగినప్పుడు షెహనాయ్ వాద్యాన్ని ఉపయోగించడం రివాజే అయినా, దానిని కచేరి స్థాయికి తీసుకు వెళ్ళిన ఘనత మాత్రం బిస్మిల్లా ఖాన్ కే చెందుతుంది.[1][2]
2001 లో భారత ప్రభుత్వం ఆయనను భారత రత్నతో సన్మానించింది. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, రవిశంకర్ల తరువాత ఈ సన్మానమును పొందిన సాంప్రదాయ సంగీత విద్వాంసులలో బిస్మిల్లాఖాన్ మూడవ వ్యక్తి కావడం విశేషం.
భారత రత్న ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వంటి అసమాన దేశభక్తులు జన్మించిన నేల ఇది.
నేను పుట్టుకతో మహమ్మదీయుడను కావొచ్చు - నేను సరస్వతీ దేవి ఆరాధకుడను. ఆమెను తలవనిదే నా రోజు ఆరంభం కాదు.. సంగీతానికి భాషా భేదాలు, మత భేదాలు లేవు. నాది పుట్టుకతో సంగీత వారసత్వం, భారతీయత అంతా నా సంగీతములో, నా రక్తములో నిండి ఉంది . నన్ను నా దేశప్రజలు అందరూ తమ ఇంటిలోని సభ్యునిగా అదరించారు. మనం భారతీయులం. భరత మాత బిడ్డలము అని చాటి చెప్పిన మహా దేశభక్తుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్.
ఓ సారి ఆయన అమెరికా వెడితే అక్కడ ఆయన వాయించిన షెహనాయి పరవశించిన పాశ్చాతులు ఆర్యా మీరు అమెరికా వచ్చేయండి. మీరు ఇక్కడే ఉండిపోదురు.. మీ గౌరవార్థం మీరు ఉన్న ఈ వీధికి ఈ పేరు పెడతాము అన్నారట. అయ్యా నేను ఉన్నందుకు ఈ వీధికి నా పేరు పెట్టగలరు గానీ నేను అనుదినము దర్శించే కాశీ విశ్వనాథున్ని ఇక్కడ ఉన్నారా .. నేను ప్రతీ రోజూ మునిగే గంగను ఇక్కడకు తేగలరా . పైగా "గంగా మాత లేకుండా, విశాలాక్షి విశ్వనాధుల దర్శనం లేకుండా నా షెహనాయ్ పలకదు" అని చెప్పారట.. నాకు నా దేశములో ఉండటమే గౌరవ దాయకం అని అనగానే అక్కడి వారు ఆశ్చర్య చకితులయ్యారట.
బిస్మిల్లా ఖాన్ 1916 మార్చి 21 న బీహారు లోని డుమ్రాన్ జిల్లాలో, బిరుంగ్ రౌట్ కి గలిలో సంప్రదాయ ముస్లిం సంగీత విద్వాంసుల కుటుంబంలో జన్మించాడు. పైగంబర్ బక్ష్ ఖాన్, మిట్ఠన్ ల రెండవ కొడుకు అతను.[3][4] బిస్మిల్లాఖాన్ అసలు పేరు ఖమ్రుద్దీన్. అయితే అతని తాతగారు, షెహనాయ్ విద్వాంసుడు అయిన రసూల్ బక్ష్ ఖాన్, అప్పుడే పుట్టిన ఇతనిని చూసి బిస్మిల్లా అన్నాడుట. అప్పటి నుంచి అసలు పేరును వదలి, అందరూ అతనిని బిస్మిల్లా అనే పిలవడం ప్రారంభించారు.[1][4] `ఖాన్ తండ్రి డుమ్రాన్ రాజాస్థానంలో సంగీత విద్వాంసునిగా పని చేసేవాడు. అతని ముత్తాత ఉస్తాద్ సలర్ హుస్సేన్ ఖాన్, తాత రసూల్ బక్ష్ ఖాన్ లు కూడా డుమ్రాన్ రాజాస్థానంలో విద్వాంసులుగా పనిచేశారు.[3]
బిస్మిల్లా ఖాన్ పూర్వులు డుమ్రాన్ రాజు నక్కర్ ఖానా ఆస్థానంలో సంగీత విద్వాంసులుగా పనిచేసేవారు. అతని తండ్రి డుమ్రాన్ ఎస్టేట్ రాజు అయిన మహారాజా కేశవ్ ప్రసాద్ సింగ్ ఆస్థానంలో షెహనాయ్ వాయించేవాడు.
ఖాన్ తన ఆరవ ఏట, ఉత్తరప్రదేశ్లోని వారణాశికి తన బంధువైన అలీ బక్ష్ విలాయతు వద్దకు సంగీత శిక్షణ కోసం వెళ్ళిపోయాడు. కాశీలోని విశ్వనాథ ఆలయంలో ఆస్థాన షెహనాయ్ విద్వాంసుడైన అలీ, బిస్మిల్లాకు షెహనాయ్ నేర్పించాడు. అలా విశ్వనాథ ఆలయంతో సంబంధం మొదలైంది అతనికి.[5]
బీహార్ ప్రభుత్వం, ఖాన్ జన్మస్థలమైన డుమ్రాన్ లో అతని పేరు మీద మ్యూజియం, టౌన్ హాలు, గ్రంథాలయం నిర్మించాలని ప్రతిపాదన చేస్తోంది. వాటితో పాటుగా బిస్మిల్లా ఖాన్ విగ్రహాన్ని కూడా స్థాపించాలని అనుకుంటోంది. [6]
ప్రముఖ సంప్రదాయ సంగీత వాయిద్యం షెహనాయ్ ను ప్రాచుర్యంలోకి తీసుకు రావడంలో అతను ప్రధాన పాత్ర పోషించారు. 1937 లో కోల్కతా భారతీయ సంగీత సమ్మేళనంలో షెహనాయ్ ప్రదర్శన ఇవ్వడంతో ఆ వాయిద్యానికి మంచి ప్రాచుర్యం లభించింది. ఆ వాయిద్య విద్వాంసులలో అతనే అగ్రగణ్యుడిగా పేరు గడించాడు. అంతే కాక, షెహనాయ్ అంటే అతని పేరే గుర్తు వచ్చే అంతగా కృషి చేశాడు ఖాన్. అతను చనిపోయినప్పుడు, షెహనాయీని కూడా కలిపి పూడ్చిపెట్టారు. అంతగా అనుబంధం వుండేది ఖాన్కు షెహనాయీతో. సంగీతం గురించి మాట్లాడుతూ, మానవాళి నశించినా, సంగీతం బతుకుతుంది. సంగీతానికి కులం లేదు, అని అన్నాడు అతను.
భారతీయ శాస్త్రీయ సంగీత రంగంలో బిస్మిల్లా ఖాన్ ఎంతో ప్రావీణ్యం కలిగిన విద్వాంసుడు. దాదాపు అన్ని దేశాలలోనూ షెహనాయ్ కచేరీ చేశాడు. అతను షెహనాయ్ వాయిద్యాన్ని ఎంతగానో ప్రేమించేవాడు. తన భార్య చనిపోయిన తరువాత షెయనాయ్ ను తన బేగంగా భావిస్తున్నాను అని ఒకచోట పేర్కొన్నాడు. సంగీతం ద్వారా శాంతి, ప్రేమను విశ్వవ్యాప్తం చేయాలని అతని కోరిక.
భారత స్వాతంత్ర్యం సందర్భంగా, 1947 లో బిస్మిల్లా ఢిల్లీ లోని ఎర్రకోటలో వాద్య కచేరీ చేసే గౌరవాన్ని పొందాడు. 1950 జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా, ఎర్రకోటలో కాఫి రాగాన్ని తన షెహనాయిపై ఆలపించాడు. అతను జీవించి ఉన్న కాలంలో దాదాపు ప్రతి ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో అతను ఎర్రకోట వద్ద చేసే షెయనాయ్ వాద్య కచేరీని దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేసేది. జెండావందనం తరువాత ప్రధానమంత్రి ప్రసంగం తరువాత ఈ కచేరీ ఉంటుంది. షెయనాయ్ మేస్త్రోగా పేరొందిన ఖాన్ చేసే ఈ స్వతంత్ర దినోత్సవ ప్రత్యేక వేడుకల కచేరీని ప్రతీ ఏటా ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది దూరదర్శన్. ఈ సంప్రదాయం జవహర్ లాల్ నెహ్రూ కాలం నుంచీ కొనసాగుతూ వచ్చింది.[7]
2006 ఆగస్టు 17న, ఖాన్ ఆరోగ్యం క్షీణించడంతో, కాశీలో ఆసుపత్రిలో చేర్చారు అతని కుటుంబ సభ్యులు. అమర వీరులకు నివాళిగా ఇండియా గేట్ వద్ద కచేరీ చేయాలని అతని ఆఖరి కోరిక. కానీ ఆఖరికి ఆ కోరిక తీరకుండానే బిస్మిల్లా ఖాన్ తుది శ్వాస విడిచాడు.[8] ఆసుపత్రిలో చేర్చిన నాలుగు రోజులకు, 2006 ఆగస్టు 21న గుండె నొప్పితో ఆసుపత్రిలోనే మరణించాడు ఖాన్. ఆఖరు వరకూ అతని అయిదుగురు కుమార్తెలు, ముగ్గురు కొడుకులు, మనవలు, మనవరాళ్ళు, పెంచుకున్న కుమార్తె సోమా ఘోష్ లతో కలసే జీవించాడు బిస్మిల్లా.[9]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.