హైజాకర్లు బందీలుగా పట్టుకున్న తమ పౌరులను విడిపించేందుకు ఇజ్రాయిల్ చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక From Wikipedia, the free encyclopedia
ఆపరేషన్ ఎంటెబీ అనేది ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) విజయవంతంగా జరిపిన ఉగ్రవాద వ్యతిరేక చర్య. ఈ ఆపరేషన్‌ను 1976 జూలై 4 న ఉగాండా లోని ఎంటెబీ విమానాశ్రయంలో జరిపారు.[6] అంతకు ఒక వారం ముందు, జూన్ 27న, ఎయిర్ ఫ్రాన్స్‌కు చెందిన విమానాన్ని పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్టైన్ - ఎక్స్టర్నల్ ఆపరేషన్స్ (PFLP-EO) అనే సంస్థకు చెందిన ఇద్దరు సభ్యులు, వాదీ హద్దాద్ ఆదేశానుసారం,[7] జర్మన్ రివల్యూషనరీ సెల్స్ కు చెందిన ఇద్దరు సభ్యులతో కలిసి హైజాక్ చేసారు. 240 మంది ప్రయాణీకులను బందీలుగా పట్టుకున్నారు. బందీల విడుదల జరగాలంటే ఇజ్రాయిల్ జైళ్ళలో ఉన్న పాలస్తీనా ఉగ్రవాదులు, సంబంధిత ఇతర ఉగ్రవాదులు 40 మందిని, మరి నాలుగు ఇతర దేశాల్లో ఖైదీలుగా ఉన్న 13 మంది ఉగ్రవాదులనూ విడిపించాలని షరతు విధించారు.
ఆపరేషన్ ఎంటెబీ | |||||||
---|---|---|---|---|---|---|---|
అరబ్ ఇజ్రాయిల్ ఘర్షణలో భాగము | |||||||
ఆపరేషన్ తర్వాత సాయెరెట్ మట్కల్‌కు చెందిన ఇజ్రాయెల్ కమాండోలు | |||||||
| |||||||
ప్రత్యర్థులు | |||||||
Israel |
| ||||||
సేనాపతులు, నాయకులు | |||||||
బలం | |||||||
సుమారు100 మంది కమాండోలు, విమాన సిబ్బంది, సహాయక సిబ్బంది. | 7 గురు హైజాకర్లు. +100 మంది ఉగాండా సైనికులు | ||||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||||
ఒకరు మరణించారు 5 గురు గాయపడ్డారు | హైజాకర్లు: 7 గురు మరణించారు ఉగాండా: 45 మంది మరణించారు[2] 11–30 విమానాలు ధ్వంసమయ్యాయి[3] | ||||||
ముగ్గురు బందీలు హతులయ్యారు[4][5] 10 మంది బందీలు గాయపడ్డారు |
ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్ లో బయల్దేరి పారిస్ వెళ్ళవలసిన విమానం, దారిలో ఏథెన్స్ లో ఆగి, తిరిగి బయల్దేరింది. ప్యారిస్‌కు వెళ్ళవలసిన ఈ విమానాన్ని హైజాకర్లు దారి మళ్ళించి, బెంఘాజి మీదుగా ఉగాండాకు లోని ఎంటెబీకి తరలించారు. ఉగాండా ప్రభుత్వం హైజాకర్లకు మద్దతు పలికింది. ఉగాండా అధ్యక్షుడు, ఇదీ అమీన్ స్వయంగా వారికి స్వాగతం పలికాడు. బందీలను విమానం నుండి విమానాశ్రయం లోని ఒక ఖాళీ భవనంలోకి తరలించారు. వారిలో ఇజ్రాయిలీలను, ఇజ్రాయిలేతరులైన యూదులనూ విడదీసి వారిని వేరే గదిలోకి తరలించారు.[4][5] తరువాతి రెండు రోజుల్లో 148 మంది ఇతర బందీలను విడుదల చేసి పారిస్ కు పంపించారు. 94 మంది ఇజ్రాయిలీ ప్రయాణీకులు, ఎయిర్ ఫ్రాన్స్ కు చెందిన 12 మంది సిబ్బందీ బందీలుగా ఉండిపోయారు.
తమ డిమాండ్లను అంగీకరించకపోతే బందీలను చంపేస్తామని హైజాకర్లు బెదిరించారు. ఈ బెదిరింపే బందీలను కాపాడే ఆపరేషన్ కు దారితీసింది.[8] ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొస్సాద్ అందించిన సమాచారం ఆధారంగా, ఐడిఎఫ్ చర్యలు చేపట్టింది. ఉగాండా సైనిక బలగాలను ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితిని కూడా వారు తమ ప్రణాళికలో చేర్చుకున్నారు.[9]
ఈ ఆపరేషను రాత్రి వేళ జరిగింది. దీని కోసం ఇజ్రాయిలీ రవాణా విమానాలు 100 మంది కమాండోలను 4000 కిలోమీటర్ల దూరంలోని ఉగాండాకు తరలించాయి. వారం రోజుల పాటు ప్లానింగు చేసిన ఈ ఆపరేషన్ 90 నిముషాల లోపే ముగిసింది. 102 మంది బందీలను విడిపించారు. ఐదుగురు ఇజ్రాయిలీ కమాండోలు గాయపడ్డారు. దళ నాయకుడైన లెఫ్టెనెంట్ కలనల్ యొనాటన్ నెతన్యాహు మరణించాడు. హైజాకర్లందరూ మరణించారు. ముగ్గురు బందీలు, 45 మంది ఉగాండా సైనికులూ కూడా మరణించారు. ఇజ్రాయిలీ దళం ఉగాండా ఎయిర్ ఫోర్స్ కు చెందిన మిగ్-17, మిగ్-21 యుద్ధ విమానాలు పదకొండింటిని[4][5] ధ్వంసం చేసింది.[3]
ఈ ఆపరేషన్‌లో కెన్యా సైనిక బలగాలు ఇజ్రాయిల్‌కు సాయం చేసాయి. ఇందుకు ప్రతీకారంగా ఇదీ అమీన్ ఉగాండాలో ఉన్న వందలాది మంది కెన్యా జాతీయులను ఊచకోత కోసాడు. [10]
ఆపరేషన్ థండర్‌బోల్ట్ అనే మిలిటరీ సంకేత నామం కలిగిన ఎంటెబీ ఆపరేషన్‌ను, అందులో ప్రాణం కోల్పోయిన యొనాటన్ నెతన్యాహు స్మృతిలో ఆపరేషన్ యొనాటన్ అని కూడా పిలుస్తారు. అతను, తదనంతర కాలంలో ఇజ్రాయిల్ ప్రధానమంత్రి ఐన బెంజమిన్ నెతన్యాహుకు స్వయానా అన్నయ్యే.[11]
1976 జూన్ 27 న ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 139 (రిజిస్ట్రేషను F-BVGG (c/n 019)) 246 మంది ప్రయాణీకులు, 12 మంది సిబ్బందితో టెల్ అవీవ్ నుండి బయల్దేరింది. ప్రయాణీకుల్లో ఎక్కువ మంది ఇజ్రాయిలీలు.[12][13] విమానం గ్రీసులోని ఏథెన్స్ లో ఆగి, నలుగురు హైజాకర్లతో సహా 58 మంది ప్రయాణీకులను ఎక్కించుకుంది.[14][nb 1] మధ్యాహ్నం 12:30 కు అక్కడి నుండి పారిస్‌కు బయల్దేరింది. విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్టైన్ - ఎక్స్టర్నల్ ఆపరేషన్స్ (PFLP-EO) అనే సంస్థకు చెందిన ఇద్దరు సభ్యులు, జర్మన్ రివల్యూషనరీ సెల్స్ కు చెందిన విల్ఫ్రెడ్ బోస్, బ్రిగిట్ కుల్మన్ అనే ఇద్దరూ కలిసి విమానాన్ని హైజాక్ చేసారు. హైజాకర్లు విమానాన్ని మొదట లిబియాలోని బెంఘాజికి మళ్ళించారు.[15] అక్కడ ఇంధనం నింపుకోవడం కోసం ఏడుగంటల పాటు నిలిపి ఉంచారు. ఆ సమయంలో, ఇంగ్లండులో జన్మించిన ఇజ్రాయిల్ పౌరురాలు పాట్రీషియా మార్టెల్, తనకు గర్భస్రావం జరిగినట్లుగా నటించడంతో అమెను విడుదల చేసారు.[16][17] హైజాకర్లు విమానాన్ని అక్కడి నుండి బయల్దేరదీసారు. 28 వ తేదీ మధ్యాహ్నం 3:15 కు - టెల్ అవీవ్ లో బయల్దేరిన 24 గంటల తరువాత - అది ఉగాండా లోని ఎంటెబీ విమానాశ్రయానికి చేరుకుంది.[15]
ఎంటెబీలో నలుగురు హైజాకర్లకు కనీసం మరో నలుగురు తోడయ్యారు. వీరికి ఉగాండా అధ్యక్షుడు ఇదీ అమీన్ మద్దతు ఉంది.[18] హైజాకర్లు ప్రయాణీకులను ఖాళీగా ఉన్న ఒక పాత భవనంలోకి తరలించి, ఆ భవనంలోనే గట్టి కాపలాలో ఉంచారు. అమీన్ అక్కడికి దాదాపు ప్రతిరోజూ వచ్చి, తాజా పరిణామాలను వారికి చెబుతూ ఉండేవాడు. చర్చల ద్వారా వారిని విడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని వారికి చెబుతూ ఉండేవాడు.[12]
జూన్ 28 న ఒక PFLP-EO హైజాకరు ఒక ప్రకటనలో తమ డిమాండ్లను తెలియజేసాడు: 5 మిలియన్ డాలర్ల సొమ్ముతో పాటు, ఇజ్రాయిల్లో ఖైదులో ఉన్న 40 మంది పాలస్తీనా ఉగ్రవాదులతో సహా,మొత్తం 53 మందిని విడుదల చెయ్యాలని వాళ్ళు డిమాండు చేసారు.[8] ఈ డిమాండ్లను అమలు చెయ్యకపోతే 1976 జూలై 1 న బందీలను చంపడం మొదలు పెడతామని బెదిరించారు.[19]
జూన్ 29 న ఉగాండా సైనికులు బందీలతో క్రిక్కిరిసి ఉన్న వెయిటింగ్ హాలుకు ఒకవైపున ఉన్న గోడను కూల్చివేసి పక్కనే ఉన్న గదికి మార్గం చేసారు. హైజాకర్లు ఇజ్రాయిలీలను (ద్వంద్వ పౌరసత్వం ఉన్నవాళ్లతో సహా) మిగతా వాళ్ల నుండి విడదీసి[nb 2] అ గదిలోకి వెళ్ళమని చెప్పారు.[22] వాళ్ళు అలా వెళ్తూండగా నాజీ మారణహోమం నుండి బయట పడ్ద ఒక బాధితుడు తన చేతిపై పచ్చబొట్టుగా పొడిపించుకున్న అప్పటి క్యాంపు రిజిస్ట్రేషన్ నంబరును బోస్ కు చూపించాడు. బోస్ "నేను నాజీని కాను.. నేనో ఆదర్శవాదిని" అని చెప్పాడు.[27] ఐదుగురు ఇజ్రాయిలేతరులను - అమెరికా బెల్జియంలకు చెందిన అతి ఛాందస యూదు దంపతులు నలుగురు[7] ,[12] ఇజ్రాయిల్లో నివసిస్తున్న ఫ్రెంచి జాతీయుడొకరు— కూడా బలవంతంగా వాళ్లతో చేర్చారు.[24] ఫ్రెంచి జాతీయుడు మోనిక్ ఎప్‌స్టీన్ ఖాలెప్స్కీ ప్రకారం, ఆ ఐదుగురూ తమ ఇజ్రాయిలీ గుర్తింపును దాచిపెడుతున్నారని హైజాకర్లు అనుమానించి, వారిని ప్రశ్నించారు.[24] మరోవైపు, ఫ్రెంచి బందీ మిచెల్ కొయోట్ గోల్డ్‌బెర్గ్ ప్రకారం బందీల్లోని ఒక ఇజ్రాయిల్ మిలిటరీ ఆఫీసరు తన ఇజ్రాయిలేతర పాస్‌పోర్టును చూపించడంతో అతను ఇజ్రాయిలీ అని గ్రహించలేక ఇజ్రాయిలేతర బందీలతో పాటు విడుదల చేసారు.[26] అమెరికా పౌరులు జానెట్ అల్మోగ్, ఫ్రెంచి మహిళ జోసెలిన్ మోనియర్ (ఆమె భర్త/స్నేహితుడు ఇజ్రాయిలీ)[28][29] ఫ్రెంచి ఇజ్రాయిలీ ద్విజాతీయుడు జీన్ జాక్ మిమోనీలు (పేర్లను చదివినపుడు ఇతడి పేరు రాలేదు) స్వచ్ఛందంగా బందీలుగా చేరారని భోగట్టా.[30]
జూన్ 30 న 48 మంది ఇజ్రాయిలేతరులను విడుదల చేసారు. వీరిలో ఎక్కువగా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, పిల్లలతో ఉన్న తల్లులూ ఉన్నారు. వారిలో 47 మందిని పారిస్‌కు చేర్చారు. వారిలో ఒకరిని ఒకరోజు పాటు ఆస్పత్రిలో ఉంచి వైద్యం చేసారు. జూలై 1 న, ఇజ్రాయిలీ ప్రభుత్వం చర్చలు జరిపేందుకు అంగీకరించాక, హైజాకర్లు గడువును జూలై 4 దాకా పొడిగించి, మరో 100 మంది ఇజ్రాయిలేతరులను విడుదల చేసి పారిస్ కు పంపించారు. ఎంటెబీ విమానాశ్రయంలో మిగిలి ఉన్న 106 గురు బందీల్లో 12 మంది ఎయిర్ ఫ్రాన్స్ సిబ్బంది, ఓ పది మంది యువ ఫ్రెంచి ప్రయాణీకులూ కాగా, 84 మంది ఇజ్రాయిలీలు ఉన్నారు.[1][6][15][31]
దాడికి ఒక వారం ముందు, బందీలను విడుదల చేయించేందుకు ఇజ్రాయిల్ రాజకీయ మార్గాల ద్వారా ప్రయత్నించింది. సైనిక చర్య సఫలమయ్యే సూచన లేని పక్షంలో పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు ఇజ్రాయిలీ క్యాబినెట్ సిద్ధపడినట్లు కొన్ని వర్గాలు సూచిస్తున్నాయి. బరూచ్ "బుర్కా" బార్-లెవ్ అనే విశ్రాంత ఐడిఎఫ్ ఆఫీసరు ఇదీ అమీన్ ను చాలాకాలంగా ఎరిగి ఉండటమే కాకుండా అతడితో వ్యక్తిగతంగా మంచి సంబంధం కూడా ఉందని తెలిసింది. క్యాబినెట్ అభ్యర్ధనతో, అతను చాలాసార్లు ఖైదీలను విడిపించేందుకు అమీన్ తో ఫోన్లో మాట్లాడాడు. అయితే ఆ చర్చలు సఫలం కాలేదు.[32][33] బందీల విడుదల కోసం అమీన్‌తో మాట్లాడమని ఈజిప్టుఅధ్యక్షుడు అన్వర్ సాదత్‌కు చెప్పమని ఇజ్రాయిల్ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడిని అడిగింది.[34]
జూలై 1 గడువు తేదీ నాడు,[35] హైజాకర్లతో చర్చలు జరిపేందుకు ఇజ్రాయిల్ క్యాబినెట్ అంగీకరించి గడువును జూలై 4 వరకూ పొడిగించమని కోరింది. గడువును పొడిగించమని అమీన్ కూడా వాళ్ళను కోరాడు. దాని వలన, అతడికి మారిషస్ లోని పోర్ట్ లూయిస్ కు వెళ్ళి అర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ అధ్యక్ష బాధ్యతలను సీవూసాగర్ రామ్‌గూలమ్‌కు అప్పజెప్పే వీలు కూడా కుదిరింది.[36] ఈ గడువు పొడిగింపుతో ఇజ్రాయిలీ దళాలు దాడి కోసం ఎంటెబీ చేరేందుకు తగినంత సమయం దొరికింది.[14]
జూలై 3 సాయంత్రం 6:30 కి, మేజర్ జనరల్ యకూటియెల్ "కుటి" ఆడమ్, బ్రిగేడియర్ డాన్ షోమ్‌రాన్ రూపొందించిన రెస్క్యూ మిషన్ ను ఇజ్రాయిల్ క్యాబినెట్ ఆమోదించింది. షోమ్‌రాన్ ను ఆపరేషన్ కమాండరుగా నియమించారు.[37]
సంక్షోభం బయటపడుతున్న కొద్దీ బందీల విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. తదనంతర కాలంలో వెలుగు చూసిన రహస్య పత్రాల ప్రకారం, సాదత్ నేతృత్వంలోని ఈజిప్టు ప్రభుత్వం పిఎల్‌వో తోటి, ఉగాండా ప్రభుత్వం తోటీ చర్చించేందుకు ప్రయత్నించింది.[38][39] పిఎల్‌వో నేత యాస్సిర్ ఆరాఫత్ తన రాజకీయ సలహాదారు హాని-అల్-హసన్ ను హైజాకర్ల తోటి, అమీన్ తోటీ మాట్లాడేందుకు పంపించాడు.[7] అయితే, PFLP-EO హైజాకర్లు అతణ్ణి చూసేందుకు కూడా నిరాకరించారు. [40]
రాజకీయ పరిష్కార ప్రయత్నాలు విఫలం కావడంతో, ఇక బందీల విడుదలకు దాడి ఒక్కటే శరణ్యమని ఇజ్రాయిలీ అధికారులు నిర్ణయించారు. ప్రధాన పైలట్ అయిన లెఫ్టెనెంట్ కలనల్ జాషువా షాని తరువాతి కాలంలో ఇలా చెప్పాడు - ఇజ్రాయిలీల తొలి ప్రణాళిక ప్రకారం నేవల్ కమాండోలు విక్టోరియా సరస్సులో దిగి, రబ్బరు పడవలలో ఆ సరస్సు ఒడ్డునే ఉన్న విమానాశ్రయానికి చేరి, హైజాకర్లను చంపి, బందీలను విడుదల చేసి, తిరిగి వెళ్ళేందుకు మార్గం ఇవ్వాలని అమీన్ను కోరాలని అనుకున్నారు. కానీ అందుకు తగినంత సమయం లేకపోవడం చేతను, విక్టోరియా సరస్సులో మొసళ్ళు ఉంటాయన్న సమాచారం వల్లనూ ఇజ్రాయిలీలు ఆ ప్రణాళికను పక్కనబెట్టారు.[41]
ఎంటెబీ వెళ్ళే మార్గంలో తమ లాక్‌హీడ్ సి-130 హెర్క్యులెస్ విమానంలో ఇంధనం నింపడం ఎలా అనే విషయమై ఇజ్రాయిలీ సైన్యం ఆలోచించింది. నాలుగు నుండి ఆరు విమానాలకు గాల్లోనే ఇంధనం నింపే సమర్ధత అప్పట్లో ఇజ్రాయిలుకు లేదు. అనేక తూర్పు ఆఫ్రికా దేశాలు ఇజ్రాయిలు పట్ల సానుభూతితో ఉన్నప్పటికీ, ఇజ్రాయిలుకు సహాయం చేసి ఇదీ అమీన్, పాలస్తీనా వారల కోపానికి గురి కావడానికి వారెవ్వరూ సిద్ధంగా లేరు.
కనీసం ఒక్క తూర్పు ఆఫ్రికా దేశం సహాయమైనా లేకుండా దాడి ముందుకు వెళ్ళే అవకాశం లేదు. ఐడిఎఫ్ టాస్క్ ఫోర్సు, కెన్యా గగనతలంలోకి ప్రవేశించి ఇప్పటి జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంధనం నింపుకునేందుకు ఇజ్రాయిల్, కెన్యా ప్రభుత్వ అనుమతి సంపాదించింది.[42] రహస్య సమాచారం సేకరించేందుకు మొస్సాద్‌ను, నైరోబీ విమానాశ్రయాన్ని వాడుకునేందుకు ఇజ్రాయిలీ ఎయిర్‌ఫోర్సుకూ అనుమతి ఇచ్చేందుకు కెన్యా వ్యవసాయ శాఖ మంత్రి బ్రూస్ మెకెంజీ, కెన్యా అధ్యక్షుడు కెన్యాట్టాను ఒప్పించాడు.[43] బ్రిటిషు గూఢచార సంస్థ ఎమ్‌ఐ6 నేత సర్ మారిస్ ఓల్డ్‌ఫీల్డ్ మెకెంజీని ఇందుకు ఒప్పించడంలో సాయపడ్డాడు.[44] కెన్యా దేశానికి చెందిన బ్లాక్ హోటళ్ళ యజమాని (యూదు జాతీయుడు), నైరోబీలోని యూదు, ఇజ్రాయిలీ సమాజమూ కూడా తమ తమ రాజకీయ, ఆర్థిక పలుకుబడిని ఉపయోగించి, ఇజ్రాయిలుకు సాయపడేందుకు కెన్యా అధ్యక్షుడు జోమో కెన్యాట్టాను ఒప్పించి ఉండవచ్చు.
కెన్యా చేసిన సాయానికి, ఇందుకు దోహదపడిన మెకెంజీపైనా ప్రతీకారంగా మెకెంజీని హతమార్చాలని ఇదీ అమీన్ ఉగాండా ఏజంట్లను ఆదేశించాడు. 1978 మే 24 న మెకెంజీ ప్రయాణిస్తున్న విమానంలో బాంబు పేలడంతో అతను మరణించాడు.[45] తదనంతర కాలంలో, మొస్సాద్ ఛీఫ్ డైరెక్టర్ మెయిర్ అమిట్ మెకెంజీ స్మారకార్థం ఇజ్రాయిల్‌లో ఒక అడవికి అతడి పేరు పెట్టించాడు.[43]
విడుదలైన ఇజ్రాయిలేతర బందీల ద్వారా బందీలను ఎక్కడ ఉంచారు, హైజాకర్లు ఎంతమంది, ఉగాండా బలగాల ప్రమేయం ఎంతవరకు ఉంది అనే సమాచారాన్ని మొస్సాద్ సేకరించింది. 1960, 70లలో ఇజ్రాయిలీ సంస్థలు ఆఫ్రికాలో అనేక నిర్మాణ కార్యక్రమాలు నిర్వహించాయి. బందీలను ఉంచిన భవనాన్ని నిర్మించినది ఇజ్రాయిల్‌కే చెందిన సోలెల్ బోనే అనే భారీ నిర్మాణ సంస్థ. దాడికి తయారీలో భాగంగా ఇజ్రాయిలీ సైన్యం ఆ సంస్థను సంప్రదించింది. ఆ భవనాన్ని నిర్మించిన వ్యక్తుల సాయంతో ఐడిఎఫ్, భవనపు పాక్షిక నమూనాను యథాతథంగా నిర్మించింది.
విడుదలైన బందీలను చాలా విస్తారంగా ఇంటర్వ్యూలు చేసినట్లుగా తరువాతి కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో మూకీ బెట్జర్ చెప్పాడు. సైనిక నేపథ్యము, అపారమైన జ్ఞాపకశక్తీ కలిగిన ఫ్రెంచి యూదు ప్రయాణీకుడొకరు హైజాకర్ల వద్ద ఉన్న ఆయుధాల వివరాలను చెప్పాడని కూడా అతను చెప్పాడు.[46] కొన్ని రోజుల పాటు బెట్జర్ రహస్య సమాచారాన్ని సేకరించడం, ప్రణాళికలు రచించడం చేసిన తరువాత, ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్సుకు చెందిన నాలుగు సి-130 హెర్క్యులెస్ రవాణా విమానాలు అర్థరాత్రి వేళ, రహస్యంగా, ఎంటెబీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలుకు అందకుండా ఎంటెబీకు చేరుకున్నాయి.
ఇజ్రాయిలీ గ్రౌండ్ టాస్క్ ఫోర్సులో దాదాపు 100 మంది ఉన్నారు. అందులో కింది విభాగాలు ఉన్నాయి:[37]
షర్మ్ అల్ షేక్ విమానాశ్రయం నుండి బయల్దేరి,[47] టాస్క్ ఫోర్సు ఎర్ర సముద్రం మీదుగా అంతర్జాతీయ విమాన మార్గంలో ప్రయాణించింది. ఈ ప్రయాణం చాలావరకు కేవలం 30 మీటర్ల అతి తక్కువ ఎత్తులో జరిగింది. ఈజిప్టు, సూడాన్, సౌదీ అరేబియా సైన్యాల రాడార్లకు అందకుండా ఉండేందుకు ఇలా ప్రయాణించారు. ఎర్ర సముద్రపు దక్షిణ కొసన ఈ విమానాలు దక్షిణానికి తిరిగి, జిబౌటీని దాటాయి.అక్కడి నుండి కెన్యాలో నైరోబీకి ఈశాన్యాన ఉన్న ఒక స్థలానికి చేరాయి. అక్కడ పశ్చిమానికి తిరిగి, ఆఫ్రికన్ రిఫ్ట్ వాలీ, విక్టోరియా సరస్సు మీదుగా ప్రయాణించాయి.[48] రెండు బోయింగ్ 707 జెట్ విమానాలు రవాణా విమానాలను అనుసరించాయి. వైద్య సరఫరాలతో ఉన్న మొదటి విమానం నైరోబీలోని జోమో కెన్యాట్టా విమానాశ్రయంలో దిగింది. ఆపరేషన్‌కు కమాండరైన జనరల్ యకూటియెల్ ఆడమ్ రెండో విమానంలో ఉండి, దాడి జరుగుతున్న సమయంలో ఎంటెబీ విమానాశ్రయంపై ఎగురుతూ ఉన్నాడు.[49] ఇజ్రాయిలీ బలగాలు జూలై 3, ఇజ్రాయిలీ సమయం ప్రకారం రాత్రి 11 గంటల వేళ ఎంటెబీలో దిగాయి. వెంటనే ఒక నలుపు రంగు మెర్సిడెస్ కారు, కొన్ని ల్యాండ్ రోవర్ కార్లు విమానపు కార్గో బే నుండి బయటకు వచ్చాయి. అవి ఇదీ అమీన్ ప్రయాణించే కార్ల లాగా ఉన్నాయి. భద్రతా చెక్ పోస్టుల కన్నుగప్పేందుకు ఇవి ఉపయోగపడతాయని వారు భావించారు. అమీన్ ప్రయాణించే విధంగానే ఇజ్రాయిలీ దళాలు ఆ కార్లలో టర్మినల్ భవనం వద్దకు వెళ్ళారు.[50][51] అయితే, అంతకు కొద్దికాలం క్రితమే అమీన్ తెలుపు మెర్సిడెస్ కొన్న విషయం కాపలాదార్లకు తెలుసు. వాళ్ళు ఆ నలుపు రంగు కారును ఆపారు.[52] కమాండోలు సైలెన్సర్లు అమర్చిన తుపాకులతో వాళ్ళను కాల్చారు, కానీ చంపలేదు.[50] వాళ్ళు ముందుకు సాగిపోతూండగా వెనక వస్తున్న ల్యాండ్ రోవరు కారులోని ఒక ఇజ్రాయిలీ కమాండో, సైలెన్సరు లేని తుపాకితో ఆ సెంట్రీలను చంపాడు.[50] ఆ శబ్దాలకు హైజాకర్లు ముందే అప్రమత్తులౌతారని భయపడిన దాడి దళం త్వరత్వరగా టర్మినల్ భవనాన్ని చేరుకుంది.[51]
ఇజ్రాయిలీలు కారుల్లోంచి దూకి టర్మినల్ భవనం వైపు దూసుకెళ్ళారు. బందీలు రన్‌వేకు పక్కనే ఉన్న భవనపు ప్రధాన హాల్లో ఉన్నారు. భవనంలోకి వెళ్తూనే మెగాఫోనులో, "కింద పడుకోండి! పడుకునే ఉండండి! మేం ఇజ్రాయిలీ సైనికులం" అని హీబ్రూ, ఇంగ్లీషుల్లో అరిచారు. ఫ్రాన్స్ నుండి ఇజ్రాయిల్‌కు వలస వెళ్ళిన జీన్ జాక్ మైమోనీ అనే 19 ఏళ్ళ వ్యక్తి లేచి నిలబడ్డాడు. ఇజ్రాయిలీ కమాండర్ మూకి మెట్జర్, మరొక సైనికుడూ అతణ్ణి హైజాకరుగా భావించి కాల్చడంతో అతను మరణించాడు.[53] పాస్కో కోహెన్ అనే 52 ఏళ్ళ బందీ కూడా కమాండోల తూటాలకు బలయ్యాడు..[53][54] రష్యా నుండి ఇజ్రాయిల్ కు వలస వెళ్ళిన 56 ఏళ్ల ఇడా బొరోకోవిట్జ్ హైజాకరు కాల్పులకు బలయ్యింది.[53][55] ఇలాన్ హార్టువ్ అనే బందీ చెప్పిన దాని ప్రకారం, హైజాకర్లలో విల్ఫ్రెడ్ బోస్ ఒక్కడే ఆపరేషన్ మొదలైన తరువాత బందీలున్న హాల్లోకి వచ్చాడు. తొలుత అతను బందీలపైకి తన కలాష్నికోవ్ ను గురిపెట్టినప్పటికీ, వెంటనే తెప్పరిల్లి, బందీలను బాత్‌రూములో తలదాచుకొమ్మని ఆజ్ఞాపించాడు. ఈలోగా అతణ్ణి కమాండోలు హతమార్చారు. హార్టువ్ చెప్పిన దాని ప్రకారం బోస్ కమాండోలపై కాల్చాడేగాని బందీలపై కాల్చలేదు.[56] ఆ సమయంలో ఒక కమాండో హీబ్రూలో "మిగతా వాళ్ళెక్కడ?" అని హైజాకర్ల గురించి అడిగాడు.[57] బందీలు హాలుకు ఆనుకుని ఉన్న గది తలుపు వైపు చూపించారు. కమాండోలు ఆ గదిలోకి గ్రెనేడ్లను విసిరారు. ఆ తరువాత వాళ్ళు ఆ గదిలోకి వెళ్ళి మిగిలిన ముగ్గురు హైజాకర్లను హతమార్చి దాడిని ముగించారు.[14] ఈలోగా మిగిలిన మూడు సి-130 హెర్క్యులెస్ విమానాలు దిగాయి. వాటిలోంచి సాయుధ దళ వాహనాలు దిగాయి. ఇంధనం నింపుకునే సమయంలో రక్షణ కోసం వాటిని వినియోగించారు. తరువాత, తమను వెంటాడకుండా ఉండేందుకుగాను ఉగాండా మిగ్ విమానాలను ధ్వంసం చేసి, సమాచారం సేకరించకుండా ఎయిర్ ఫీల్డును స్వీప్ చేసారు.[14]
దాడి తరువాత, ఇజ్రాయిలీ దళం తమ విమానాల వద్దకు తిరిగి వెళ్ళి, బందీలను విమానాల్లోకి ఎక్కించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఉగాండా దళాలు వారిపై కాల్పులు జరిపారు. ఇజ్రాయిలీ దళాలు తమ ఏకే47 లతో ఎదురు కాల్పులు జరిపారు,[58] ఉగాండా సైనికులు ఎయిర్‌పోర్టు కంట్రోల్ టవర్ నుండి కాల్పులు జరిపారు. కొద్దిసేపు జరిగిన ఈ కాల్పుల్లో ఐదుగురు కమాండోలు గాయపడగా నెతన్యాహు మరణించాడు. ఇజ్రాయిలీ కమాండోలు లైట్ మెషీన్ గన్లతో కాలుస్తూ, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లను టవరుపై విసరగా ఉగాండా సైనికుల కాల్పులు ఆగిపోయాయి. ఇదీ అమీన్ కుమారుడొకరి కథనం ప్రకారం నెతన్యాహును కాల్చిన సైనికుడు అమీన్ కుటుంబానికే చెందిన వ్యక్తి అని, అతను ఇజ్రాయిలీల ఎదురుకాల్పుల్లో మరణించాడనీ తెలిసింది.[59] ఇజ్రాయిలీలు బందీలను, నెతన్యాహు మృతదేహాన్నీ విమానాల్లోకి ఎక్కించి బయల్దేరారు.[60] మొత్తం ఆపరేషన్ 53 నిముషాల్లో ముగిసింది. అందులో దాడి జరిగింది 30 నిముషాలే. ఏడుగురు హైజాకర్లు, 33 నుండి 45 మంది దాకా ఉగాండా సైనికులూ దాడిలో మరణించారు.[14] 11 మిగ్-17, మిగ్-21 విమానాలను ధ్వంసం చేసారు.[61] 106 గురు బందీల్లో ముగ్గురు మరణించారు, ఒక్కరిని ఉగాండాలోనే వదిలేసారు. (75 ఏళ్ళ డోరా బ్లోచ్), పది మంది వరకూ గాయపడ్డారు. 102 బందీలను నైరోబీ మీదుగా ఇజ్రాయిల్ కు చేర్చారు.[11]
బందీగా ఉన్న సమయంలో 75 ఎళ్ళ డోరా బ్లోచ్ కు మాంసపు ముక్క గొంతుకు అడ్డం పడడంతో కంపాలా లోని ములాగో ఆస్పత్రికి తరలించారు.[62] దాడి జరిగిన సమయంలో ఆమె ఆస్పత్రిలోనే ఉంది. దాడి తరువాత, ఆమెను ఉగాండా సైనికాధికారులు హత్య చేసారు. ఆమెకు వైద్యం చేసిన డాక్టర్లు, నర్సులు కొందరిని కూడా ఆమె హత్యను అడ్డుకున్నందుకు గాను చంపివేసారు.[53][nb 3][64] ఆనాటి న్యాయ శాఖ మంత్రి హెన్రీ క్యెంబా 1987 ఏప్రిల్లో ఉగాండా మానవ హక్కుల కమిషన్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో, బ్లోచ్ ను ఆస్పత్రి పడక మీద నుండి లాగివేసి, తుపాకితో కాల్చి, ఉగాండా ఇంటిలిజెన్స్ సర్వీసుకు చెందిన కారు డిక్కీలో పడేసి తీసుకుపోయారు అని చెప్పాడు.[65] 1979లో కంపాలాకు 32 కిలోమీటర్ల దూరంలోని ఒక చెరుకుతోటలో ఆమె దేహపు శిథిల భాగాలను వెలికితీసారు[66][63] దాడికి కెన్యా సాయపడినందుకు గాను ఉగాండాలో నివసిస్తున్న కెన్యన్లను చంపమని ఆజ్ఞాపించి, వందలాది మంది మరణానికి అమీన్ కారణమయ్యాడు.[67]
ఇజ్రాయిల్ దురాక్రమణకు పాల్పడిందంటూ ఆర్గనైజేషన్ ఫర్ ఆఫ్రికన్ యూనిటీ చైర్మన్ చేసిన ఫిర్యాదును పరిశీలించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 1976 జూలై 9 న సమావేశమైంది.[74] ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయిల్ రాయబారి చెయిల్ హెర్జోగ్, ఉగాండా విదేశీ వ్యవహారాల మంత్రి జూమా ఓరిస్ అబ్దల్లా లను ఓటింగు హక్కులు లేకుండా సమావేశంలో పాల్గొనేందుకు మండలి అనుమతించింది.[74] ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ కర్ట్ వాల్ధీమ్ ఈ దాడిని "సమితి సభ్యదేశపు సార్వభౌమత్వంపై జరిగిన తీవ్రమైన దాడి" అని మండలిలో చెప్పాడు. "అయితే ఈ వ్యవహారంలో ఉన్నది ఇది ఒక్కటి మాత్రమే కాదని నాకు బాగా తెలుసు... అంతర్జాతీయ ఉగ్రవాదం వలన ఉత్పన్నమైన సమస్యలతో వ్యవహరించ వలసిన అవసరం వివిధ దేశాలు ఉంది" అని కూడా చెప్పాడు.[74] ఉగాండా ప్రతినిధి మాట్లాడుతూ ఇజ్రాయిల్ జోక్యం చేసుకునే సమయానికి వివాదం శాంతియుత పరిష్కారానికి చేరువలో ఉంది, అని అన్నాడు. ఈ హైజాకింగులో ఉగాండాకు ప్రత్యక్ష పాత్ర ఉందని ఇజ్రాయిల్ ప్రతినిధి ఆరోపించాడు.[74] అమెరికా, బ్రిటన్లు తాము ప్రతిపాదించిన తీర్మానంలో హైజాకింగును ఖండించాయి, హైజాకింగు కారణంగా జరిగిన ప్రాణనష్టాన్ని నిరసించాయి (ఇజ్రాయిల్ ను గాని, ఉగాండాను గానీ విమర్శించలేదు), అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పాయి. పౌర విమానయాన భద్రతను మెరుగుపరచాల్సిందిగా అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చాయి. అయితే ఇద్దరు వోటింగులో పాల్గొననందున, ఏడుగురు అక్కడ లేనందువలనా ఈ తీర్మానానికి అవసరమైనంత మద్దతు రాలేదు. ఇజ్రాయిల్ ను ఖండిస్తూ బెనిన్, లిబియా, టాంజానియాలు ప్రతిపాదించిన తీర్మానం వోటింగుకు రాలేదు.
పాశ్చాత్య దేశాలు దాడిని సమర్ధిస్తూ మాట్లాడాయి. దాడిని "ఆత్మరక్షణ చర్య"గా పశ్చిమ జర్మనీ వర్ణించింది. స్విట్జర్లండ్, ఫ్రాన్స్ లు దాడిని కొనియాడాయి. ఇంగ్లండు, అమెరికాలు దాడిని ప్రశంసిస్తూ, "అదొక అసాధ్యమైన ఆపరేషన్" అని చెప్పాయి. బందీల విడుదల 1976 జూలై 4 న, అమెరికా స్వాతంత్ర్యం పొందిన 200 ఏళ్ళ తరువాత జరగడాన్ని అమెరికన్లు ప్రజల దృష్టికి తెచ్చారు. ఇజ్రాయిల్ రాయబారి డినిట్జ్ తో జరిపిన ఏకాంత సమావేశంలో హెన్రీ కిసింజర్, దాడిలో ఇజ్రాయిల్, అమెరికన్ ఆయుధాలు వాడడాన్ని విమర్శించాడు. కానీ ఆ విమర్శ బయటకు రాలేదు. ఉగాండాలోని కొన్ని బలగాలు సైనిక చర్య చేపడుతాయన్న బెదిరింపుల నేపథ్యంలో, 1976 జూలై మధ్యలో USS Ranger (CV-61) అనే భారీ యుద్ధ నౌక హిందూ మహాసముద్రంలో, కెన్యా తీర ప్రాంతంలో సంచరించింది.
కెప్టెన్ బాకోస్ కు లీజియన్ ఆఫ్ ఆనర్ పురస్కారాన్ని ప్రదానం చేసారు. ఇతర దళసభ్యులకు ఫ్రెంచి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ను ప్రదానం చేసారు[68][69][70][71]
నైరోబీలో యూదు యజమానికి చెందిన నార్ఫోక్ హోటల్ లో 1980 డిసెంబరు 31 న బాంబు పేలుళ్ళు జరిగి, హోటలు పశ్చిమభాగం కూలిపోయింది. వివిధ దేశాలకు చెందిన 16 మంది మరణించారు.[72] 87 మంది గాయపడ్డారు. ఆపరేషన్ లో సాయం చేసినందుకు గాను, కెన్యాపై పాలస్తీనా మద్దతుదారుల ప్రతీకార చర్యగా దీన్ని భావించారు.[73][74][75]
తరువాతి కాలంలో బెట్సర్, నెతన్యాహు సోదరులు - ఇడ్డో, బెంజమిన్ (ఈ ముగ్గురూ సాయెరట్ మట్కల్ లో పనిచేసిన వారే) యొనాటన్ మరణానికి దారితీసిన కాల్పులకు ఎవరు కారణమనే విషయంపై జరిగిన బహిరంగ చర్చల్లో పాల్గొన్నారు.[76][77] ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న దళాల ఏర్పాటును అనుసరిస్తూ అమెరికా సైన్యం కూడా అటువంటి రక్షక దళాలను తయారుచేసింది.[78] ఈ ఆపరేషన్‌ను అనుకరించిన ఆపరేషన్ ఈగిల్ క్లా, ఇరాన్ బందీల సంక్షోభంలో ఇరాన్లో బందీలుగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందిని రక్షించడంలో విఫలమైంది.[79][80] 1976 జూలై 13 న విడుదల చేసిన లేఖలో, ఇరాన్ సైనిక బలగాల అధిపతి, ఇజ్రాయిలీ కమాండోలను అభినందిస్తూ, నెతన్యాహు 'బలిదానానికి' సంతాపం ప్రకటించాడు.[81]
2012 ఆగస్టులో, ఉగాండా, ఇజ్రాయిల్ లు ఎంటెబీ విమానాశ్రయంలో నెతన్యాహు మరణించిన చోట జరిగిన సంతాప సభలో దాడిని స్మరించుకున్నాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో తమ నిశ్చయాన్ని రెండు దేశాలు పునరుద్ఘాటించాయి. రెండు దేశాల జెండాలను పక్కపక్కనే ఎగురవేసారు. దాడి జరిగిన 40 ఏళ్ళ తరువాత, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయిల్ బృందంతో సందర్శించి, రెండు దేశాల దౌత్య సంబంధాలను మరింత బలపరచేందుకు పునాది వేసాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.