Remove ads
రామాయణం లో మూడవ విభాగం From Wikipedia, the free encyclopedia
1987లో వచ్చిన తెలుగు సినిమా కోసం అరణ్యకాండ (సినిమా) చూడండి.
అరణ్యకాండ లేదా అరణ్యకాండము (Aranya Kanda) రామాయణం కావ్యంలో మూడవ విభాగం.
భారతీయ వాఙ్మయంలో రామాయణం ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకిమహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. చాలా భారతీయ భాషలలోను, ప్రాంతాలలోను ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. భారతీయుల సంస్కృతి, సాహిత్యము, ఆలోచనా సరళి, సంప్రదాయాలలో రామాయణం ఎంతో ప్రభావం కలిగి ఉంది. రామాయణంలోని విభాగాలను కాండములు అంటారు. ఒకో కాండము మరల కొన్ని సర్గలుగా విభజింపబడింది.
వీటిలో అరణ్యకాండ మూడవ కాండము. ఇందులో 75 సర్గలు ఉన్నాయి. ఈ కాండములోని ప్రధాన కథాంశాలు: వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణము. దండకారణ్యంలో జరిగిన కథ అంతా ఈ కాండలో చెప్పబడింది.
అరణ్యకాండ కథ సంక్షిప్తముగా ఇక్కడ చెప్పబడింది.
అత్రి మహర్షి, అనసూయల ఆశీర్వచనాలు పొంది సీతారామలక్ష్మణులు దండకారణ్యంలో ముందుకు సాగారు. ఒక మునిపల్లెలో ఋషులు వారికి మంగళాశీర్వచనాలు చేసి సత్కరించారు. తమను రక్షించమని రాముని కోరారు. ఆ రాత్రికి అక్కడ విశ్రమించి వారు ప్రయాణం కొనసాగించి ఒక భయంకరమైన కీకారణ్యంలో ప్రవేశించారు.
వారికి భారీ శరీరంతో వికృతంగా ఉన్న విరాధుడనే రాక్షసుడు ఎదురుపడ్డాడు. వాడు సావకాశంగా తినడానికి తన శూలానికి మూడు సింహాలను, నాలుగు పులులను, రెండు తోడేళ్ళను, పది జింకలను, పెద్ద యేనుగు తలను గుచ్చి భుజాన పెట్టుకొని ఉన్నాడు. అతడు అసలు తుంబురుడనే గంధర్వుడు కాని కుబేరుని శాప కారణంగా రాక్షసుడయ్యాడు. అతనికి ఏ శస్త్రంతోనూ చావకుండా వరముంది. రామునిచేతనే అతనికి శాపవిముక్తి కావాలి. ఆ విరాధుడు సీతను పట్టుకుపోసాగాడు. కాని రాముని పదును బాణాలవలన కోపించి, సీతను విడచి, రామ లక్ష్మణులను చేతులలో ఇరికించుకుపోసాగాడు.
రామ లక్ష్మణులు విరాధుని చేతులు నరికేశారు. శాపవిముక్తి కలిగిన విరాధుడు వారెవరో తెలిసికొని రాముని శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళమని చెప్పాడు. ఏనుగు పట్టేటంత గోతిని తీసి రామక్ష్మణులు వాడి దేహాన్ని పూడ్చిపెట్టారు.
బ్రహ్మ సాక్షాత్కారం పొందిన శరభంగ మహర్షి రాముని కోసమే తాను బ్రహ్మలోకానికి వెళ్ళకుండా వేచియున్నాడు. తన తపస్సు పుణ్యాన్ని రామునికి సమర్పించి, వారిని సుతీక్ష్ణ మహర్షి వద్దకు వెళ్ళమన్నాడు. తరువాత శరభంగుడు యోగశక్తితో అగ్నిని ప్రజ్వలింపజేసి అందులో భస్మమై బ్రహ్మలోకం చేరుకొన్నాడు.
ఎందరో మునులు రాముని కలిసికొని తాము రాక్షసులవలన పడే బాధలు చెప్పుకొన్నారు. రాక్షస బాధ లేకుండా వారిని కాపాడుతానని రాముడు అభయమిచ్చాడు. తరువాత సీతారామలక్ష్మణులు సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆ మహర్షి కూడా రాముని దర్శనం కోసమే దేవలోకం వెళ్ళకుండా వేచియున్నాడు. స్వయంగా ఫలమూలాలు వారికి వడ్డించి ఆదరించాడు. మహర్షికి ప్రణమిల్లి, సెలవు తీసికొని రామ లక్ష్మణులు ఆయుధాలు ధరించి సీతా సమేతంగా దండకారణ్యంలో ఉన్న అవేక మునుల ఆశ్రమాలను చూడడానికి బయలుదేరారు.
ఆయుధ ధారులైన రామ లక్ష్మణులకు సీత ఇలా తన మనసులోని మాట చెప్పింది – ముని ధర్మం చాలా క్లిష్టమైనది. అసత్య వాక్యం, పరస్త్రీ గమనం, అకారణ హింస అనే మూడు అనుచిత ప్రవర్తనలు తపోదీక్షకు భంగం చేసే అవకాశం ఉంది. ధనుర్బాణాలు ధరించినందువలన ఆయుధ ప్రయోగానికి అనవుసర ప్రోత్సాహం లభించే అవకాశం కలుగుతుంది. కనుక ఆర్తులను కాపాడడానికి మాత్రమే శస్త్రాలను వాడదగును. కాని సమయంలో అరణ్యాలకు తగిన మునివృత్తి అవలంబించడం ఉచితం. నేను స్త్రీ సహజమైన చాపల్యం వల్లనే ఇలా చెబుతున్నాను. మీరు కర్తవ్యం తెలియని వారు కాదు. సీత మాటలను రాముడు ప్రశంసించి, ఆర్తులై తనను శరణు జొచ్చిన మునుల రక్షణ కోసమే ఆయుధ ప్రయోగం చేస్తానని చెప్పాడు.
రమ్యమైన తపోవనాలగుండా సీతారామలక్ష్మణులు ముందుకు సాగారు. దారిలో పంచాప్సరసం అనే సుందరమైన తటాకాన్ని చూశారు. మాండకర్ణి అనే మహర్షి తన తపోబలంతో దానిని నిర్మించి, అందులో నీటి అడుగున అంతర్గృహంలో అప్సరసలతో క్రీడిస్తున్నందున అక్కడ ఎప్పుడూ మధురమైన సంగీతం వినవస్తున్నది. ఇలా అనేక ఆశ్రమాలు దర్శించి మరల సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చారు. ఆయనను అగస్త్య మహర్షి ఆశ్రమానికి దారి అడిగారు.
సుతీక్ష్ణ మహర్షి చెప్పిన ప్రకారం సీతారామలక్ష్మణులు ముందుగా అగస్త్యభ్రాత ఆశ్రమానికి వెళ్ళి ఆ ముని ఆతిథ్యాన్ని స్వీకరించారు. ముందుకు సాగి అగస్త్య మహర్షి ఆశ్రమానికి చేరుకొన్నారు. అగస్త్యుడు మృత్యువును జయించిన మహాతపస్వి. వింధ్య పర్వతం పెరుగుదలను నిలిపాడు. నరమాంస భుక్కులైన వాతాపి ఇల్వలులను నాశనం చేశాడు. దక్షిణ దిక్కును మునులకు ఆవాస యోగ్యంగా చేశాడు.
సీతారామలక్ష్మణులు అగస్త్యునికి పాదాభివందనం చేశారు. అగస్త్యుడు వారిని ఆదరించి వానప్రస్థధర్మానుసారం భోజనాలు వడ్డించి కుశలమడిగాడు. విశ్వకర్మ నిర్మించిన గొప్ప వైష్ణవధనుస్సును రామునకిచ్చాడు. సీతాదేవి పతివ్రతాధర్మాన్ని శ్లాఘించాడు.
వారిని గోదావరీతటాన పంచవటిలో ఆశ్రమం నిర్మించుకొని నివసించమని అగస్త్యుడు సూచించాడు. పంచవటికి వెళ్ళేదారిలో వారికి జటాయువు అనే పెద్ద గ్రద్ద రాజు కనిపించాడు. తాను దశరధుని మిత్రుడనని, ఆశ్రమసమీపంలో సీతను కనిపెట్టుకొని ఉంటానని అన్నాడు.
పంచవటిలో రాముడు చూపిన స్థలంలో లక్ష్మణుడు చక్కని పర్ణశాల నిర్మించాడు. అది సీతాములకు స్వర్గంలా అనిపించింది. అక్కడ వారు చాలా కాలం సంతోషంగా గడిపారు.
రావణుని చెల్లెలు శూర్పణఖ అనే రాక్షసి ఆ అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తున్నది. ఆమె కామరూపి. ఒకమారు వారి పర్ణశాలకు వచ్చి రాముని చూచి మోహించి తనను పెళ్ళి చేసుకోమని అడిగింది. రాముడు, లక్ష్మణుడు ఆమెతో పరిహాసాలాడారు. ఆమె కోపించి సీతను తినివేయబోయింది. అపుడు రాముని ఆజ్ఞతో లక్ష్మణుడు శూర్పణఖ ముక్కూ, చెవులూ కోసివేశాడు.
శూర్పణఖ యేడుస్తూ తన సోదరుడైన ఖరునితో జరిగిన విషయం మొరపెట్టుకుంది. ఖరుడు యముళ్ళాంటి పధ్నాలుగు రాక్షసులను పిలిచి రామలక్ష్మణులను చంపిరమ్మని ఆజ్ఞాపించాడు. పదునాలుగు బాణాలతో రాముడు వారిని సంహరించేశాడు. శూర్పణఖ బావురుమంటూ ఖరునివద్దకుపోయి అతను చేతకానివాడని దెప్పిపొడిచింది. ఉద్రిక్తుడైన ఖరుడూ, అతని సేనాధిపతి దూషణుడూ వీరాధివీరులైన పధ్నాలుగు వేల రాక్షససేనతో దిక్కులు పిక్కటిల్లే పెడబొబ్బలతో, భేరీభాంకారాలతో, సాగరంవలె పొంగుతూ రామలక్ష్మణులపై దండెత్తారు.
ఆకాశంలో పుట్టిన ఉత్పాతాలను గమనించాడు రాముడు. రాముని ఆజ్ఞతో లక్ష్మణుడు ధనసు ధరించి, సీతను వెంటబెట్టుకొని, ఒక దుర్గంలా ఉన్న గుహలోనికి వెళ్ళిపోయాడు. అగ్నిలాగా వెలుగుతున్న రాముడు కవచం తొడుగుకొని ధనుర్ధారియై నారి మోగిస్తూ రాక్షసులకు ఎదురు వచ్చాడు. వారి యుద్ధం చూడడానికి ఆకాశంలో మహర్షులు, దేవ గంధర్వ సిద్ధ చారణాదులు గుమికూడి రామునకు మంగళం పలికారు.
ఖరుడు, అతని సైన్యం పెద్ద పొలికేకతో రామునిపై యుద్ధానికి దిగారు. యమపాశాల వంటి రాముని బాణాలకు ఎందరో రాక్షసవీరులు నేలకూలారు. మిగిలినవారు పారిపోయి ఖరుని శరణు జొచ్చారు. దూషణుడు క్రోధంతో రామునిపైకి వచ్చాడు. వాడి బాణాలతో రాముడు దూషణుని మహాధనుస్సునూ, గుర్రాలనూ, సారధినీ నేలకూల్చాడు. మరో మూడు బాణాలతో వాడి గుండెలు పగులగొట్టి రెండు బాణాలతో వాడి రెండు చేతులూ నరికేశాడు. నేలబడిన దూషణుని చూసి క్రుద్ధుడైపోయిన ఖరుడు తన పన్నెండుగురు ముఖ్యసేనానులతో రామునిమీదకురికారు. వజ్రసమానమైన రాముని బాణాలతో ఆ సేనాపతులు, వారి సైన్యం ఖండఖండాలుగా నేలబడ్డారు. రణభూమి అంతా రక్త మాంసాలతో నిండిపోయింది.
ఖరుడూ, త్రిశిరుడూ మాత్రమే మిగిలారు. ముందుగా త్రిశిరుడు బీరాలు పలికి రామునిపైకి వచ్చి రామబాణాలకు బలయ్యాడు. ఇక ఖరుడు రాముడు ఎదురుపడ్డారు. ధనుర్విద్యా కౌశలంతో వారిద్దరూ ప్రయోగించిన బాణాలతో ఆకాశం కప్పుకొని దిక్కుల భేదం తెలియకుండా పోయింది. తరువాత ఖరుడు పెరికి తెచ్చిన పెద్ద చెట్టును రాముడు తునకలు చేసివేశాడు. ఖరుని దేహం తూట్లుపడేలా బాణాలతో కొట్టాడు. తన దేహం అంతా రక్తం ధారలు కారుతుండగా ఖరుడు రామునిమీదకు ఉరికాడు. దానితో రాముడు అగ్నిలా మెరుస్తున్న బాణం తొడిగివిడిచాడు. ఖరుడు నేలకొరిగాడు.
ఆకాశంలో దేవ దుందుభులు మ్రోగాయి. పూలవాన కురిసింది. దేవతల విజయఘోష విని లక్ష్మణుడు సీతతో గుహ బయటికి వచ్చి రాముని పూజించాడు. సీత సంతోషించి ప్రస్తుతించింది.
పధ్నాలుగు వేల మంది రాక్షసులూ, ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు మరణించడంతో శూర్పణఖ పెడబొబ్బలు పెడుతూ లంకకు పోయింది. తన పెద్దన్న రావణుని తీవ్రంగా నిందించి హెచ్చరించింది – నువ్వు స్త్రీలోలుడవై రానున్న అపాయాన్ని తెలిసికోలేకపోతున్నావు. రాజు అనేవాడికి సరైన చారులుండాలి. రాజు బొక్కసం నిండి ఉండాలి. రాజనీతిని అనుసరించాలి. ఈ మూడూ లేకపోతే ఆరాజు పతనం ఖాయం. జన స్థానంలో మనవాళ్ళందరూ రాముడనే నరుని చేతిలో హతులయ్యారు. దశరధుని కొడుకులైన రామ లక్ష్మణులు జనస్థానాన్ని రాక్షసవిహీనం చేస్తున్నారు. ఆ రాముని భార్య సీత నీకు తగిన అందాల రాశి. కనుక రాముని సంహరించి, సీతను నీదానిని చేసికొని రాక్షస జాతి ఋణం తీర్చుకో – అని శూర్పణఖ రావణునితో మొత్తుకొంది.
ఆమె మాటలతో రావణుడు సీతను అపహరించి తేవడానికి సిద్ధమయ్యాడు. అందుకు ఒక పన్నాగం ఆలోచించి అడవిలో తపస్సు చేసుకొంటున్న మారీచుని వద్దకు వెళ్ళాడు. సీతాపహరణం కోసం మాయలేడిగా మారి రాముని తప్పించడానికి సహాయపడమన్నాడు.
రాముడి పేరు వినేసరికి మారీచుని ముఖంలో ప్రేతకళ వచ్చేసింది. భయంతో కొయ్యబారిపోయి, రావణునికిలా హితం బోధించాడు – రాముడు మహావీరుడు. సత్యధర్మ వ్రతుడు. అతనితో వైరం పెట్టుకుంటే నీకు, నీ జాతికి పోగాలం దాపురించినట్లే. ఇదివరకు నేను వెయ్యేనుగుల బలంతో ఎదురు లేకుండా భూలోకం అంతా తిరిగేవాడిని. అప్పుడు నేను విశ్వామిత్రుని యాగం ధ్వంసం చేయబోయాను. యాగాన్ని రక్షిస్తున్న రాముడు సుబాహుడిని, నా రాక్షస గణాలను సంహరించి నన్ను మాత్రం శరాఘాతంతో నూరామడల దూరాన సముద్రంలో పారవేశాడు. అప్పటి రాముడు పన్నెండేళ్ళ బాలుడు మాత్రమే. అప్పటినుండి నాకు ‘ర’ శబ్దంతో మొదలయ్యే రథం, రత్నం వంటి పదాలంటేనే వణుకు పట్టుకుంది. కనుక మన ఇరువురి మేలు కోరి చెబుతున్నాను. ఈ ఆలోచన నీకు కలిగించినవారు రాక్షసజాతి నాశనం కోరినవారే. రామునితో వైరం మాని, శరణు వేడుకో – అన్నాడు.
రావణుడు కఠినంగా ఇలా అన్నాడు – దేవతలు ప్రార్ధించినా నా నిశ్చయం మారదు. నువ్వు బంగారు లేడివై సీతను ఆకర్షించాలి. అందుద్వారా రామలక్ష్మణులను పర్ణశాలనుండి దూరంగా పంపాలి. నేను నిన్ను సలహా అడుగలేదు. పని చెబుతున్నాను. అది చేయకపోతే నా చేతిలో నీకు చావు తప్పదు.
ఇక మారీచుడికి మార్గం తోచలేదు – రావణా మనిద్దరికీ రాముని చేత చావు తప్పదు. నీ చేత కంటే రాముని చేత చావడమే నాకు ఉత్తమం అనుకొన్నాడు. వారిద్దరూ పర్ణశాల వైపుకు వెళ్ళారు.
సీత పర్ణశాల వద్ద పూవులు కోసుకొంటూ ఇక అరణ్యవాసం ఎంతోకాలం లేదనుకొంటున్నది. ఆ సమయంలో ఆమెకు వెండి చుక్కలతో మెరుస్తున్న అపూర్వమైన బంగారు లేడి కంటబడింది. వయ్యారాలు పోతూ గెంతుతున్న ఆ లేడిని చూచి సీత అది తనకు నచ్చిందనీ, దాన్ని తెచ్చిపెట్టమనీ రాముని కోరింది. అది రాక్షస మాయ అని, లోకంలో అలాంటి లేడులుండవని లక్ష్మణుడు గట్టిగా చెప్పాడు. రాక్షసుడైతే చంపి వస్తానని, అంతవరకు సీతను జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండమని లక్ష్మణునకు చెప్పి రాముడు బయలు దేరాడు.
ఆ లేడి గెంతుతూ, మాయమౌతూ, మళ్ళీ కనబడుతూ రాముడిని చాలా దూరం తీసుకుపోయింది. ఇక లాభం లేదనుకొని రాముడు ధనుస్సు ఎక్కుపెట్టి బాణం విడిచాడు. దానితో ఆ లేడి మారీచునిగా నిజరూపం ధరించింది. మారీచుడు అయ్యో సీతా, అయ్యో లక్ష్మణా అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు విడిచాడు. ఆపదను శంకించిన రాముడు వడివడిగా పర్ణశాలవైపు సాగాడు.
ఆ ఆర్తనాదం విని, రామునికి ఏదో అపాయం సంభవించిందని సీత భయ విహ్వల అయ్యింది. త్వరగా రామునికి సహాయంగా వెళ్ళమని లక్ష్మణుని కోరింది. మూడు లోకాలూ ఎదురై వచ్చినా రాముని జయించలేరనీ, కనుక అది రాక్షస మాయయే అనీ, తాను అన్నగారి మాట ప్రకారం సీతకు రక్షణగా ఉంటాననీ లక్ష్మణుడు అన్నాడు. దానితో సీత కోపించి లక్ష్మణుని పరుషంగా నిందించింది. దుర్బుద్ధితో రామునికి కీడు జరుగాలని అతను కోరుకొంటున్నాడని దూషించింది.
లక్ష్మణుడు ఆ నిందలకు చింతించాడు. తనను అలా సందేహిస్తున్న ఆ తల్లి ఆపదల పాలౌతుందని వగచాడు. వన దేవతలు సీతను రక్షించాలని కోరుకొని, దుర్నిమిత్తాలకు భయపడుతూనే రాముని అన్వేషణకు బయలుదేరాడు.
ఇదే అదనుగా చూచుకొని రావణుడు సన్యాసి వేషంలో వచ్చి సీతను పలకరించాడు. రామ లక్ష్మణులకోసం ఎదురు చూస్తూనే సీత ఆ కపట సన్యాసికి అతిథి మర్యాదలు చేయసాగింది. మాటల్లో తమ వృత్తాంతాన్ని, వనవాస కారణాన్ని వివరించింది. రావణుడు తన నిజరూపం ధరించి సీతను తనకు భార్యగా కమ్మన్నాడు. సీత అగ్ని శిఖలా మండిపడి రావణుని గడ్డిపరకలా తృణీకరించింది. తనను వాంఛిస్తే రావణునికి రాముని చేత వినాశనం తప్పదని ధిక్కరించింది.
రావణుడు బలవంతంగా సీతను ఒడిసిపట్టుకొని తన రథం ఎక్కాడు. సీత ఆర్తనాదాలు విన్న జటాయువు రావణునిమీద విజృంభించాడు.
జటాయువు, రావణుడు రెండు పర్వతాలు కలియబడ్డట్లుగా ఢీకొన్నారు. రావణుని బాణాలను లెక్కచేయకుండా జటాయువు రావణుని రక్కేశాడు. రథాన్ని నేలపడగొట్టాడు. దానితో కోపించి రావణుడు జటాయువు పక్కలూ, రెక్కలూ, డొక్కలూ తెగనరికాడు. జటాయువు నేలబడి కొనప్రాణంతో మూలుగుతుండగా రావణుడు ఆకాశమార్గంలో లంకవైపు సాగిపోయాడు. దారిలో ఒక కొండపై కొందరు వానరులు కనబడ్డారు. రావణుడు చూడకుండా సీత తన నగలు కొన్ని మూటగట్టి వారి మధ్యకు పడవేసింది. రావణుడు సీతతో లంకకు చేరి ఆక్కడ ఆమెను అశోకవనంలో ఉంచాడు. రాక్షస స్త్రీలు ఆమెకు కాపలాగా ఉన్నారు.
వెనుదిరిగిన రామునికి లక్ష్మణుడు ఎదురయ్యాడు. సీతను ఒంటరిగా విడచి వచ్చినందుకు లక్ష్మణుని రాముడు తప్పుబట్టాడు. వదిన తనను అమంగళకరమైన పరుషవాక్కులతో నిష్ఠూరంగా మాట్లాడి తరిమిందని లక్ష్మణుడు దుఃఖిస్తూ చెప్పాడు. ఇద్దరూ పర్ణశాలకు వచ్చి, సీత కనపడకపోవడంతో హతాశులయ్యారు. పరమ దీనులై దుఃఖిస్తూ అంతటా వెదుకసాగారు. రాముడు గొల్లుమన్నాడు. కొన్ని లేళ్ళు దక్షిణ దిక్కును సూచించగా అటువైపు గాలిస్తూ బయలుదేరారు. వారికి రక్తసిక్తమై నేలనుబడిఉన్న జటాయువు కనిపించాడు. రావణుడు సీతను ఎత్తుకుపోయిన సంగతీ, తన రెక్కలు తెగనరికిన సంగతీ చెప్పి రాముని సమక్షంలో ప్రాణాలు విడచాడు. రాముడు అమితంగా దుఃఖించి జటాయువుకు అగ్ని సంస్కారాలు చేశాడు. మళ్ళీ అన్నదమ్ములు సీతను వెదుకుతూ బయలుదేరారు.
మతంగాశ్రమం సమీపంలో వారికి కబంధుడనే మహాకాయుడైన ఒక రాక్షసుడు ఎదురుపడ్డాడు. వాడికి తలా మెడా కూడా లేవు. వాని ముఖం కడుపుమీద ఉంది. వాడి చేతులు ఆమడ పొడవున్నాయి. శరీరం పర్వతంలా ఉంది. అతడు శాపవశాన రాక్షసుడైన గంధర్వుడు. వాడు తన చేతులతో రామలక్ష్మణులను ఒడిసి పట్టి తినబోయాడు. రామలక్ష్మణులు వాడి చేతులు నరికేశారు. తన శాపాన్నించి విముక్తి కలిగించే రామలక్ష్మణులు వారేనని కబంధుడు గ్రహించాడు. అతని కోరికపై వారు అతని శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశారు. అప్పుడు కబంధుడు సకలాభరుణుడైన గంధర్వుడై హంసల విమానంలో ఆకాశానికి వెళుతూ – రామా! ప్రస్తుతం నీవు దుర్దశాపన్నుడవు. నీవు సుగ్రీవునితో స్నేహం చేసుకొంటే సీతను వెదకడంలో అతను నీకు సహాయపడతాడు. పంపా సరస్సుకు పశ్చిమాన మాతంగముని ఆశ్రమంలో నీకోసం వేచి ఉన్న శబరికి నీ దర్శనం ప్రసాదించు. తరువాత ఆవల ఉన్న ఋష్యమూక పర్వతంపై సుగ్రీవుని కలుసుకోవచ్చు. అతని స్నేహంతో రాక్షసులనందరినీ సంహరించి నీ జీవితేశ్వరిని పొందగలవు అని చెప్పాడు.
సిద్ధురాలయిన శబరి మతంగాశ్రమంలో మునులకు సపర్యలు చేస్తుండేది. ఆమె గురువులు అంతకు పూర్వమే విమానారూఢులై స్వర్గానికి వేంచేశారు. ఆమె మాత్రం శ్రీరాముని దర్శనార్ధమై వేచిఉంది. రామలక్ష్మణుల పాదాలకు మ్రొక్కింది. మధురమైన ఫలాలతో వారికి అతిథి పూజ చేసింది. రాముడు ఆమెను కుశలమడిగాడు. ఆమె వారిని పూజించి ఆశ్రమం అంతా చూపించింది. ఆ మునులు తమ తపోప్రభావంతో సప్తసాగరాలను అక్కడికి రప్పించుకొన్నారు. ఆపై మహాత్ములైన తన గురువుల వద్దకు పోవడానికి సెలవడిగింది. రాముడు ఆనందించి ఆదరంతో శబరీ! నువ్వు నన్ను చాలా భక్తితో కొలిచావు. ఇక సుఖంగా నీ ఇష్టం వచ్చిన లోకాలకు వెళ్ళు అన్నాడు. వెంటనే వృద్ధ శబరి తన జీర్ణదేహాన్ని అగ్నిలో ఆహుతి చేసుకొని సుకృతాత్ములైన తన గురువులున్న చోటికి విమానం ఎక్కి వెళ్ళిపోయంది.
రామలక్ష్మణులు మాతంగాశ్రమంలో వింతలను తిలకించారు. అక్కడ ఏర్పడిన సప్తసాగర తీరాలలో స్నానం చేసి పితృదేవులకు తర్పణాలు విడచారు. అమంగళాలన్నీ నశించి శుభం కలుగబోతున్నదనే భావం వారికి కలిగింది. వేగంగా బయలుదేరి పంపాసరస్సుకు చేరుకొన్నారు. రంగురంగుల తామర, కలువ పూలతో అది రత్నకంబళంలా ఉంది. ఆ చుట్టుప్రక్కల అనేక చెట్లు పూసి, కాసి కన్నుల పండువుగా ఉన్నాయి. ఎన్నో పక్షులు, పూలతోను, నిర్మలమైన నీటితోను ఆ సరస్సు అతిమనోహరంగా ఉంది. సీత గుర్తుకు వచ్చి రాముడు మరల విచారించాడు. సుగ్రీవునికోసం ధాతుమండితమైన ఋష్యమూకపర్వతంవైపు సాగారు.
(వివిధ రచనలనుండి)
రామునిగురించి మారీచుడిలా అన్నాడు:
• రామాయణం
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.