ఆంగ్‌కార్ వాట్
హిందు/బుద్ధిస్ట్ టెంపుల్ లోని కంబోడియా From Wikipedia, the free encyclopedia
హిందు/బుద్ధిస్ట్ టెంపుల్ లోని కంబోడియా From Wikipedia, the free encyclopedia
ఆంగ్‌కార్ వాట్ (ఇంగ్లీషు: Angkor Wat లేదా Angkor Vat; ఖ్మేర్ భాష: អង្គរវត្ត; దేవాలయాల నగరం / రాజధాని), ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశం, కంబోడియా లేదా కాంబోడియా (ప్రాచీన నామం 'కంపూచియా') లోని ఆంగ్‌కార్ వద్ద ఒక దేవాలయం. 12వ శతాబ్దంలో సూర్యవర్మన్ II దీనిని నిర్మించారు. ఇది 'వైష్ణవాలయం' లేదా 'విష్ణుదేవాలయం'. ఇది ఖ్మేర్ నిర్మాణ శైలిలో నిర్మింపబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణుదేవాలయం.
ఆంగ్‌కోర్ వాట్ អង្គរវត្ត | |
---|---|
భౌగోళికాంశాలు : | 13°24′45″N 103°52′0″E |
పేరు | |
ఇతర పేర్లు: | నోకోర్ వాట్ (Khmer: នគរវត្ត) |
ప్రధాన పేరు : | ప్రసాట్ అంగ్ కోర్ వాట్ |
ప్రదేశం | |
దేశం: | కంబోడియా |
ప్రదేశం: | అంగ్ కోర్, సియాం రీప్ ప్రాంతం, కంబోడియా |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ఖ్మేర్ |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | 12వ శతాబ్దం |
సృష్టికర్త: | ప్రారంభం సూర్యవర్మన్ II , పూర్తి జయవర్మన్ VII |
అంగ్ కోర్ | |
---|---|
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు | |
రకం | సాంస్కృతిక |
ఎంపిక ప్రమాణం | I, II, III, IV |
మూలం | 668 |
యునెస్కో ప్రాంతం | ఆసియాలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు. |
శిలాశాసన చరిత్ర | |
శాసనాలు | 1992 (16వ సమావేశం) |
ఆంగ్‌కార్ వాట్ దేవాలయం కంపూచియాలోని సీమ్ రీప్ పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది. భారతీయ ఇతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ దేవాలయం ఆ దేశ జాతీయ పతాకంలో కూడా స్థానం సంపాదించుకుంది. ఈ ఆలయానికి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. ఖ్మేర్ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగింది. సా.శ. 12వ శతాబ్దకాలంలో ఆంగ్‌కార్ వాట్‌ను రాజధానిగా చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మన్ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. దీన్ని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందట. ఈ దేవాలయ నిర్మాణం భారతదేశం లోని తమిళనాడు దేవాలయాలను పోలి ఉంటుంది. తమిళనాడుకు చెందిన చోళరాజుల నిర్మాణ పద్ధతులు ఈ దేవాలయాల్లో కనిపిస్తాయి. అయితే ఈ దేవాలయాలన్నీ మిగతా వాటికి భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉన్నాయి. టోనెల్ సాస్ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఎన్నో దేవాలయాల సముదాయంతో ఆహ్లాద భరితంగా ఉంటుంది.
భారతదేశం లో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదనే చెప్పాలి. అద్భుతమైన వాస్తు రీతితో ఈ దేవాలయాన్ని రూపొందించారు. కులేన్ పర్వత శ్రేణుల పాదాల చెంత నిర్మించబడ్డ ఈ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, విష్ణుమూర్తి ఆలయంగా వెలుగొందినది. ఇందులోని ఆలయాలన్నీ హిందూ సంస్కృతికి దగ్గరగా ఉంటాయి. నేడు ఇది బౌద్ధ దేవాలయంగా మార్పు చెందినది.
ఖ్మేర్ సామ్రాజ్యంలో నీటిని నిల్వ చేసుకునేందుకు అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఇక్కడి నీరు పల్లం నుండి ఎత్తుకు ప్రవహించేదట. అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంగ్‌కార్ వాట్ దేవాలయంలో కూడా వాడారు. ఇది అప్పట్లోనే ఎలా సాధ్యమయిందదనే విషయం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఐదు మైళ్ల పొడవు, ఒకటిన్నర మైలు వెడల్పుతో విశాలమైన రిజర్వాయర్లు (వీటిని అక్కడ 'బారే'లు అంటారు) నిర్మించడం ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం. ఈ రిజర్వాయర్లను వ్యవసాయ అవసరాలకు కూడా ఉపయోగించేవారట. ఫ్రెంచ్ ఆర్కియాలజిస్ట్ ఫిలిప్ గ్లోసియర్ ఈ రిజర్వాయర్లపై పరిశోధన జరిపి ఈ విషయాన్ని ధ్రువపరిచాడు. నాసా చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధనలు జరిపిన సిడ్నీ యూనివర్శిటీ ఆర్కియాలజిస్టుల పరిశోధన కూడా ఫిలిప్స్ అభిప్రాయాన్ని బలపరుస్తోంది. ఉపగ్రహ చిత్రాల్లో అప్పటి మానవ నిర్మితమైన నీటి ట్యాంకులు, కాలువలు, డ్యాములు చాలా స్పష్టంగా కనిపించాయట.
ముఖద్వారం నుండి దేవాలయం లోపలికి వెళ్లగానే చుట్టూ పచ్చని పచ్చికతో అక్కడి వాతావరణమంతా ఆహ్లాదభరితంగా ఉంటుంది. ముఖద్వారం నుండే మూడు పెద్ద పెద్ద గోపురాలు దర్శనమిస్తాయి. ఇందులో మధ్య గోపురం నుండి లోపలికి వెళ్తే అనేక గోపురాలు కనిపిస్తాయి. ఈ దేవాలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సూర్యోదయం. ఉషోదయ వేళ ఆలయ దర్శనం అద్భుతంగా ఉంటుంది. పొద్దున లేచి గోపురం వెనుక నుండి ఉదయ భానుడు మెల్లిగా నులి వెచ్చని లేలేత కిరణాల్ని ప్రసరింపజేస్తున్నప్పుడు గుడి గోపురాన్ని చూస్తే చాలు... ఎంతసేపైనా ఆ దృశ్యాన్ని అలాగే చూస్తూ ఉండి పోవాలనిపిస్తుంది. ఎండ వేడెక్కి చుర్రుమనిపించేవరకు అలాగే ఉండిపోతారు కూడా.
ఈ దేవాలయంలో మరో అద్భుతమైన ప్రదేశం బ్యాస్ - రిలీఫ్స్ గ్యాలరీ. నాలుగు గోడలతో నిర్మించిన ఈ మండపంలో ఎక్కడ చూసినా హిందూ పురాణ గాథలే కనిపిస్తాయి. ముఖ్యంగా తూర్పున ఉన్న 'మంటన్' అనే గ్యాలరీ అందర్నీ ఆకట్టుకుంటుంది. భారత పురాణాలైన రామాయణ, మహా భారత దృశ్యాలు అనేకం ఇక్కడ మనకు సాక్షాత్కరిస్తాయి. దేవతలూ, రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మధన దృశ్యాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. తూర్పు వైపు మండపంలో విష్ణుమూర్తి పుట్టుక, అవతారాలకు సంబంధించిన శిల్పాలు ఉంటే పశ్చిమం వైపు మండపం గోడలపై యుద్ధాలు, మరణాలకు సంబంధించిన ఆకృతులు కనిపిస్తాయి. కురుక్షేత్ర యుద్ధం, రామ రావణ యుద్ధ సంఘటనలు ఎంతో చక్కగా మలచబడ్డాయి. ఇక దక్షిణ మండపంలో ఆలయాన్ని నిర్మించిన రాజు రెండవ సూర్యవర్మన్ రాజ్యానికి సంబంధించిన సైనిక పటాల దృశ్యాలు దర్శనమిస్తాయి. ఇవే కాక పురాణ పురుషులు, మునులు, కిన్నెర కింపురుషాధి అప్సరసల నాట్య విన్యాసాలు, యమధర్మరాజు కొలువుదీరిన యమసభ వంటి అనేక కళాఖండాలు ఆంగ్‌కార్ వాట్ ఆలయ గోడలపై సాక్షాత్కరిస్తాయి.
ఇదంతా చదివిన తర్వాత భారతీయ సంస్కృతి ఆనవాళ్లే లేని కంపూచియాలో ఇంతపెద్ద హిందూ దేవాలయాన్ని ఎలా? ఎందుకు? నిర్మించారనే ప్రశ్న తలెత్తుతుంది. అసలు విషయానికొస్తే ప్రస్తుతం కంపూచియాగా పిలవబడే ఈ దేశాన్ని పూర్వకాలంలో 'కాంభోజ దేశం' అని పిలిచేవారు. సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్ఛరించలేని యూరోపియన్లు, కాంభోజ దేశాన్ని కంబోడియాగా మార్చేశారు. యూరోపియన్ వలస దేశాల అజమాయిషీలోకి వెళ్లిన తర్వాత కాంభోజ దేశం కాలక్రమంలో కంపూచియాగా మారిపోయింది.
పూర్వకాలంలో కాంభోజ దేశంలో హిందూ సంస్కృతే ఎక్కువగా ఉండేది. 9-15 శతాబ్దాల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించిన రెండవ సూర్యవర్మతో పాటు అనేకమంది హిందూ రాజులు కంపూచియాను పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. చైనా రికార్డుల ప్రకారం ఈ ప్రాంతమంతా భరత ఖండానికి చెందిన రాజుల పాలనలో ఉండేది. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలు కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి. చోళ రాజ్యానికి చెందిన ఒక రాజు, టోనెల్ సాప్ నదీ పరీవాహక ప్రాంతాన్ని ఏలుతున్న 'నాగ' అనే రాకుమార్తెను వివాహం చేసుకుని ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఖ్మేర్ సామ్రాజ్య పురాణగాథల ప్రకారం ఖ్మేర్ సామ్రాజ్యాధినేత అయిన 'కాము'తో భరత ఖండానికి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఖ్మేర్ నాగరికత తర్వాత కొన్ని శతాబ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కంపూచియాకు వ్యాపించింది. సంస్కృతం అధికార భాషగా హిందూ, బౌద్ధమతాలు అధికార సంప్రదాయాలుగా వెలుగొందాయి. జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా దర్శించాలనుకునే పర్యాటక ప్రాంతాల్లో ఆంగ్‌కార్ వాట్ దేవాలయం ఒకటి.
ఆంగ్‌కార్ వాట్ దేవాలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో అద్భుత ప్రదేశం ఆంగ్‌కార్ థోమ్. ఖ్మేర్ సామ్రాజ్యంలోని చివరి చక్రవర్తుల్లో ఒకరైన 'జయవర్మ - 6 ఆంగ్‌కార్ థోమ్‌ను రాజధానిగా చేసుకుని రాజ్యాధికారం చేపట్టాడనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. దీనినే 'మహా నగరం' అని కూడా అంటారు. తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ కూడా అనేక పురాణ కళాకృతులు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ బౌద్ధమత సంస్కృతి ఎక్కువగా ఉంది. ఏనుగుల మిద్దెలు, లెపర్ రాజు ప్రతిమలు, బెయాన్, బఫూన్ లాంటి అనేక నిర్మాణాలు ఇక్కడి ప్రత్యేకత. ఆంగ్‌కార్ థోమ్ మధ్యలో చిన్న చిన్న మిద్దెలతో నిర్మించిన గోర్డెన్ టవర్ (బెయాన్) ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. 54 అంతస్తులతో నిర్మించిన బెయాన్ (బుద్ధుని) దేవాలయం ఆంగ్‌కార్ థోమ్‌కి ఆకర్షణీయంగా నిలుస్తుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.