షాడబ చక్కెర
From Wikipedia, the free encyclopedia
షాడబ చక్కెర లేదా గోధుమ చక్కెర అనునది కపిల లేదా గోధుమ వర్ణంలో ఉండే సుక్రోజు అనే చక్కెర పదార్థము. ఇది అలా గోధుమ వర్ణంలో ఉండటానికి గల కారణం, దీని యందు సాధారణ చక్కెరగంటే అధికశాతం చెఱకుపిప్పి(సంస్కృతం: ఇక్షుసారం, ఆంగ్లం: Molasses, మొలాసిస్) ఉండటమే. షాడబ చక్కెరను అశుద్ధ లేదా సగం శుద్ధి చేయబడిన మెత్తపంచదారకు మిగిలిపోయిన చెఱకుపిప్పిని కలిపిగాని లేదా సాధారణ శుద్ధ తెలుపు పంచదారకు ఈ చెఱకుపిప్పిని కలిపిగాని తయారుచేస్తారు.
షాడబ చక్కెరయందు ఎనభై ఎనిమిది శాతం సుక్రోజు, విలోమ చక్కెర ఉండాలని కోడెక్స్ ఎలిమెంటారియస్ అనే ప్రాపంచిక ప్రామాణిక సంస్థ నిర్ణయించింది. వాణిజ్య షాడబ చక్కెరలో 3.5 శాతం చెఱకుపిప్పి(లేత షాడబ చక్కెర) నుండి 6.5 శాతం చెఱకుపిప్పి(ముదురు షాడబ చక్కెర) పరిమాణం పరంగా ఉంటుంది. మొత్తం బరువు ఆధారంగా,సాధారణ వాణిజ్య షాడబ చక్కెరలో 10 శాతం మించి చెఱకుపిప్పి ఉండదు. ఈ రకం చక్కెర ఎక్కువగా ఆర్ద్రాకర్షకగుణం (అనగా గాలిలో ఆర్ద్రమును/తేమను ఆకర్షించేది/పీల్చుకునేది)కలిగినది. అందుకనే ఇదెప్పుడూ తెలుపు చక్కెరతో పోలిస్తే మెత్తగానే ఉంటుంది. పరిశ్రమలలో దీనికి అవసరాన్నిబట్టి రంగు కలుపుతారు. కాకపోతే ఆ కలుపడానికి కూడా ఒక హద్దును ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ షాడబచక్కెర కణపరిమాణం సాధారణ తెలుపు స్ఫటికచక్కెర కణపరిమాణం కన్నా చిన్నది. పరిశ్రమలలో ఇతర తిండిపదార్థాల(కేకులు, మిఠాయిలలో) తయారీలో వాడే చక్కెర సాధారణంగా క్యాస్టర్ చక్కెర. దాని స్ఫటికాల పరిమాణం సుమారు 0.35 మి.మీ||లు ఉంటుంది.