మొహర్రం (ఆంగ్లం : Muharram) (అరబ్బీ : محرم ), ముహర్రమ్-ఉల్-హరామ్, అని పిలువబడే ఈ ముహర్రం, ఇస్లామీయ కేలండర్ లోని మొదటినెల, ఇస్లామీయ సంవత్సరాది (తెలుగు నెలలలోని చైత్రమాసము లాగా).

Thumb
టాంజానియాలోని డార్ ఎస్ సలాం వద్ద షియా ముస్లింలు జరుపుకునే మొహర్రం వేడుక

చరిత్ర

మొహర్రం మాసం ఆరంభం రోజున ఇస్లామ్‌ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది అరబ్బీ కేలండర్ యొక్క మొదటి నెల. ప్రాచీన కాలంలో అరబ్బులు (అరేబియాలోని యూదులు, క్రైస్తవులతో సహా) ఈ కేలండర్ ను వాడేవారు. ప్రాచీనకాలంలో ఆషూరా దినం, అనగా ముహర్రం యొక్క పదవతేదీని, అనేక సాంప్రదాయక గుర్తుల కనుగుణంగా పర్వముగాను పండుగగానూ జరుపుకునేవారు. పద్నాలుగు శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం జరిగిన చరిత్రాత్మక పోరాటం 'మొహరం'. ఈ పేరు వినగానే పీర్లు, నిప్పుల గుండాలు, గుండెలు బాదుకుంటూ 'మాతం' చదవటాలు గుర్తుకొస్తాయి. మొహర్రం జరిగే పది రోజులు విషాద దినాలే కాని, ఎంత మాత్రం పర్వదినాలు కావు.

సా.శ. 632లో మహమ్మద్‌ ప్రవక్త (స) పరమపదించారు. ప్రజలు ప్రజాస్వామ్య రీతిలో తమ ప్రతినిధుల్ని ఖలీఫాలను ఎన్నుకోవాలి. హజ్రత్‌ అబూబక్ర్‌ సిద్దీఖ్‌, హజ్రత్‌ ఉమర్‌, హజ్రత్‌ ఉస్మాన్‌, హజ్రత్‌ అలీ ఈ విధంగా ఎన్నికైన ఖలీఫాలే. ఇమామ్‌ హసన్‌, ఇమామ్‌ హుసైన్‌- ఇరువురు దైవ ప్రవక్త మహమ్మద్‌ (స) మనవలు. హజ్రత్‌ అలీ తనయులు. హజ్రత్‌ అలీ తరువాత ప్రజలు ఇమామ్‌ హసన్‌ను ప్రతినిధిగా ఎన్నుకొన్నారు. అప్పుడు సిరియా ప్రాంత గవర్నర్‌ మావియా. అతనిలో అధికార దాహం పెరిగింది. కత్తితో రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నాడు. యుద్ధం ప్రకటించి ఇమామ్‌ హసన్‌ను గద్దెదించాలనుకొన్నాడు. యుద్ధంలో పాల్గొంటే అమాయక సోదర ప్రజలు ప్రాణాలు కోల్పోతారనే బాధాతప్త హృదయంతో రణ నివారణ కోసం ఇమామ్‌ హసన్‌ ప్రజలు తనకు కట్టబెట్టిన పదవిని త్యజించారు. మావియా కుట్ర ఫలించింది. అయితే కొద్ది వ్యవధిలోనే హసన్‌ విషప్రయోగానికి గురై హతులయ్యారు. నిరంకుశంగా మావియా తన కుమారుడు యజీద్‌ను రాజ్యాధికారిగా అనంతరం నియమించాడు. ఇస్లామీయ ధర్మశాస్త్రాన్ననుసరించి సంప్రతింపులే సమస్యల విమోచనకు మార్గాలు. చర్చలకోసం ఇమామ్‌ హుసైన్‌ రాజధాని కుఫాకు బయల్దేరారు. యజీద్‌కు విషయం తెలిసింది. పాషాణ హృదయుడైన అతడు ఇమామ్‌ హుసైన్‌ను మార్గం మధ్యలో అడ్డుకొని లొంగదీసుకోవడానికి సైన్యాన్ని పంపాడు. ఇమామ్‌ పరివారాన్ని కర్బలా అనే చోట అడ్డగించి యజీద్‌ను రాజుగా అంగీకరించమని సైన్యాధిపతి హెచ్చరించాడు లేదా యుద్ధానికి సిద్ధపడమన్నాడు. మిత్రులు, కుటుంబ సభ్యులు, స్త్రీలు, పిల్లలు కలసి మొత్తం 72 మంది ఇమామ్‌ హుసైన్‌ వెంట ఉన్నారు. పది రోజులు యుద్ధం జరిగింది. ఇమామ్‌ హుసైన్‌ పరివారం స్వల్పమైనా వీరోచితంగా పోరాడి అశువులు బాసింది. పదోరోజు హుసైన్‌ ఒక్కరే మిగిలారు. శుక్రవారం మధ్యాహ్నం నమాజ్‌ కోసం శత్రువునడిగి కొన్ని నిమిషాలు అనుమతి పొందారు. ప్రార్థనలో నిమగ్నమై ఉండగా శత్రువులు భీరువులై ఇమామ్‌ హుసైన్‌ను వెన్నుపోటు పొడిచి సంహరించారు. మొహర్రం పది రోజులు విషాద దినాలు.

తెలుగు ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా నిజాం పాలిత ప్రాంతాల్లో మొహర్రం పండుగను ముస్లిములే కాక అన్ని వర్గాల ప్రజలూ జరుపుకోవడం వందలాది ఏళ్ళుగా సాగుతోంది. యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య 1830 జూన్ 29న నిజాం పాలిత ప్రాంతాల్లో ప్రారంభమైన మొహర్రం పండుగను తాను రచించిన కాశీయాత్ర చరిత్రలో అభివర్ణించారు. ఆయన హైదరాబాద్ ప్రాంతంలో జరిగిన మొహర్రం పండుగ వైభవాన్ని ఇలా వర్ణించారు: షహరు(హైదరాబాదు)కు కంచికి గరుడసేవ ముఖ్యమైనట్టుగా ఆ మొహర్రం పండుగ ప్రబలమైన యుత్సవము. ఆ యుత్సవ కాలములో పరమాత్ముని చైతన్యము ఆ షహరులో నెక్కువగా ప్రకాశించుటచేత అనేక వేలమంది యితర మతస్థులుగా నుండేవారు కూడా షహరుకువచ్చి ఆ తొమ్మిదో దినము మొదలు ఆఖరువరకు నుంచున్నారు.[1]

ఆషూరా

ముహర్రంనెల పదవరోజు యౌమీ ఆషూరా. ముహమ్మద్ ప్రవక్త మనుమడైన హుసేన్ ఇబ్న్ అలీ, కర్బలా యుద్ధంలో అమరుడైన రోజు. ముహర్రం నెలను, "షహీద్ " (అమరవీరుల ) నెలగా వర్ణిస్తూ, పండుగలా కాకుండా, వర్థంతిలా జరుపుకుంటారు. షియా ఇస్లాంలో ఈ ముహర్రం నెల, "ఆషూరా", కర్బలా యుద్ధంలో మరణించిన వారి జ్ఞాపకార్థం, శోక దినాలుగా గడుపుతారు. షియాలు మాతమ్ (శోక ప్రకటన) జరుపుతారు. తెలంగాణలో పలుచోట్ల ఈ ముహర్రం పండుగను పీర్ల పండుగ అనే పేరుతో జరుపుకుంటారు. హైదరాబాద్‌ పాతబస్తీలో షియా ముస్లింలు తమను తాము హింసించుకుంటూ విషాదం వ్యక్తం చేస్తూ వూరేగింపులో పాల్గొంటారు. బీబీకా అలావానుంచి ప్రారంభమై ఈ వూరేగింపు అలీజా కోట్ల, చార్మినార్‌, గుల్జార్‌ హౌస్‌, మీరాలం మండీ, దారుల్‌ షిఫాల మీదుగా కొనసాగి చాదర్‌ ఘాట్‌ వద్ద ముగుస్తుంది. శిక్షణ ఇచ్చిన ఏనుగుపై ఈ వూరేగింపు సాగుతుంది.

అషూరా విశేషాలు

  • భూమిమీద మొదటిసారి అల్లాహ్ వర్షాన్ని కురిపిస్తాడు
  • తొలి ప్రవక్త ఆదం (ఆదాము) ప్రార్థన అల్లాహ్ అంగీకరించాడు
  • నూహ్ ఓడను జూడీ (ఆరారాతు) పర్వతాలపై అల్లాహ్ నిలిపాడు
  • ఫిరౌన్ (ఫరో) రాజు నుండిమూసా (మోషే) ను ఇశ్రాయేలు ప్రజలను అల్లాహ్ కాపాడి నైలు నదిని ఎర్రసముద్రాన్ని దాటిస్తాడు
  • ఇబ్రాహీం (అబ్రాహాము) ను నమ్రూదు రగిల్చిన అగ్నిగుండం నుండి అల్లాహ్ కాపాడుతాడు
  • ఇస్సాక్, యాఖూబ్ లకు కంటి చూపును అల్లాహ్ తిరిగి ప్రసాదిస్తాడు
  • యూసఫ్ (యోసేపు) ను చెరసాల నుండి అల్లాహ్ విడిపిస్తాడు
  • యూనుస్ (యోనా) ను తిమింగలం కడుపులోనుండి అల్లాహ్ ఒడ్డున పడేస్తాడు
  • దావూద్ (దావీదు) పశ్చాత్తాపాన్ని అంగీకరించి అల్లాహ్ క్షమిస్తాడు
  • అయూబ్ (యోబు) వ్యాధిని అల్లాహ్ స్వస్థపరుస్తాడు

ఇవీ చూడండి

మూలలు

బయటి లింకులు

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.