From Wikipedia, the free encyclopedia
మలేషియాలో హిందూమతం నాల్గవ అతిపెద్ద మతం. 2010 మలేషియా జనాభా లెక్కల ప్రకారం, దాదాపు 17.8 లక్షల మంది (మొత్తం జనాభాలో 6.3%) హిందువులు. [2] ఇది 2000 నాటి 13,80,400 (మొత్తం జనాభాలో 6.2%) నుండి పెరిగింది [3]
చాలా మంది మలేషియా హిందువులు మలేషియా ద్వీపకల్పంలోని పశ్చిమ భాగాలలో స్థిరపడ్డారు. మలేషియాలో 3 రాష్ట్రాలు హిందూ ప్రాంతాలుగా అర్హత పొందాయి, ఇక్కడ హిందువుల శాతం, జనాభాలో 10% కంటే ఎక్కువ. 2010 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక శాతం హిందువులు ఉన్న మలేషియా రాష్ట్రాలు నెగెరీ సెంబిలాన్ (13.4%), సెలంగోర్ (11.6%), పెరాక్ (10.9%), కౌలాలంపూర్ కేంద్ర పాలిత ప్రాంతం (8.5%). [4] మొదటి మూడింటినీ సాంకేతికంగా హిందూ ఎన్‌క్లేవ్‌లుగా పరిగణిస్తారు. హిందూ జనాభాలో అతి తక్కువ శాతం ఉన్న రాష్ట్రం సబా (0.1%).
ప్రాచీన, మధ్యయుగంలో చైనీస్ వంటి ఇతర జాతి సమూహాలతో పాటు భారతీయులు కూడా మలేషియాకు రావడం ప్రారంభించారు. 2010లో, మలేషియా జనాభా గణన ప్రకారం 19.1 లక్షల మంది భారతీయ మూలానికి చెందిన పౌరులు ఉన్నారు. [5] హిందువుల్లో దాదాపు 16.4 లక్షల మంది భారతీయ జాతి మలేషియన్లు (86%) కాగా, 1.4 లక్షల మంది భారతీయేతర జాతి మలేషియా ప్రజలు. [6]
మలేషియా 1957లో బ్రిటిషు సామ్రాజ్యం నుండి స్వాతంత్ర్యం పొందింది. ఆ తర్వాత దాని అధికారిక మతం ఇస్లాం అని ప్రకటించుకుంది. మిశ్రమ రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఒక వైపు, ఇది మత స్వేచ్ఛను (హిందూమతం యొక్క అభ్యాసం వంటివి) రక్షిస్తూనే, మరోవైపు మత స్వేచ్ఛను పరిమితం చేస్తుంది. [7] [8] [9] ఇటీవలి దశాబ్దాలలో మలేషియాలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు షరియా కోర్టుల ద్వారా హిందువుల పైన, ఇతర మైనారిటీ మతాల పైనా మతపరమైన హింస చెయ్యడం గురించిన వార్తలు పెరుగుతున్నాయి. [7] [10] మలేషియా స్వాతంత్ర్యానికి చాలా కాలం ముందు ప్రైవేట్ ఆస్తులుగా నిర్మించిన హిందూ దేవాలయాలు ఇటీవలి సంవత్సరాలలో మలేషియా ప్రభుత్వ అధికారులు కూల్చివేసారు. [11]
ఇండోనేషియా ద్వీపసమూహం మాదిరిగానే, స్థానిక మలయ్‌లు బౌద్ధమతం, హిందూమతం, ఇస్లాం మతం రాకముందు స్వదేశీ యానిమిజం, డైనమిజం విశ్వాసాలను పాటించేవారు. బంగాళాఖాతం మీదుగా భారతదేశపు మొదటి సముద్రయానం ఎప్పుడు జరిగిందో అస్పష్టంగా ఉంది. తక్కువగా వేసిన అంచనాల ప్రకారం చూసినా, కనీసం 1,700 సంవత్సరాల క్రితం భారతదేశం నుండి మలయ్ తీరాలకు తొలి రాకపోకలు జరిగినట్లు తెలుస్తోంది. [12] భారతదేశంతో వాణిజ్యం వృద్ధి చెందడం వల్ల మలయ్ ప్రపంచంలోని తీరప్రాంత ప్రజలకు హిందూమతంతో సంబంధాలు ఉండేవి. ఆ విధంగా, హిందూమతం, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, సంస్కృత భాష భూమి అంతటా వ్యాపించడం ప్రారంభించాయి. భారతీయ శైలిలో దేవాలయాలను నిర్మించారు. స్థానిక రాజులు తమను తాము రాజాగా పేర్కొనడం ప్రారంభించారు. భారతీయ ప్రభుత్వాల్లోని మరిన్ని అభిలషణీయ అంశాలను వారు స్వీకరించారు. [13]
తదనంతరం, మలయ్ ద్వీపకల్పంలోని తీర ప్రాంతాలలో ముఖ్యంగా గంగా నెగరా (2వ శతాబ్దం), లంకాసుకా (2వ శతాబ్దం), కేదా (4వ శతాబ్దం) వంటి చిన్న హిందూ మలయ్ రాష్ట్రాలు ఏర్పడడం మొదలైంది. [14]
19వ శతాబ్దం ప్రారంభం నుండి 20వ శతాబ్దం మధ్యకాలం వరకు బ్రిటిష్ వలస పాలనలో చాలా మంది భారతీయ స్థిరనివాసులు దక్షిణ భారతదేశం నుండి మలయాకు వచ్చారు. బ్రిటిషు ఇండియాలో పేదరికం, కరువుల నుండి తప్పించుకోవడానికి చాలామంది వలస వచ్చారు. ప్రారంభంలో టిన్ మైనింగ్ కార్యకలాపాలు, కాఫీ, చెరకు తోటలు, తరువాత రబ్బరు తోటలలో ఒప్పంద కార్మికులుగా పనిచేశారు; ఇక్కడ వారు వలస వచ్చిన చైనీస్ కార్మికులతో కలిసి పనిచేశారు. [15] [16] కొంతమంది ఇంగ్లీషు-విద్యావంతులైన భారతీయులు మరిన్ని వృత్తిపరమైన స్థానాలకు నియమించబడ్డారు. చాలా మందిని నాగపట్నం లేదా మద్రాసు లోని బ్రిటిష్ వలస కార్మిక కార్యాలయాల ద్వారా నియమించుకున్నారు.
ప్రారంభ సంవత్సరాల్లో, మలేషియాలో హిందువులు స్థిరపడడం తక్కువగా ఉండేది. తక్కువ మంది హిందువులు మలేషియాలో నివసించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవారు. వలస పాలకులు కంగనీ రిక్రూట్మెంట్ విధానాన్ని అవలంబించింది. ఇక్కడ విశ్వసనీయ హిందూ కార్మికుడు మలేషియాలో బ్రిటిష్ కార్యకలాపాలలో పని చేయడానికి భారతదేశం నుండి స్నేహితులు, కుటుంబ సభ్యులను తీసుకువచ్చినందుకు ప్రోత్సాహకాలు, బహుమతులూ పొందేవారు. కుటుంబం, స్నేహితుల తోటివారి ఒత్తిడి వలన కార్మికులు వెనక్కి తిరిగి రావడం తగ్గి, మలేషియాలో శాశ్వత వలసలు పెరిగాయి. కంగనీ వ్యవస్థ దక్షిణ భారత హిందూ సమాజంలోని కొన్ని ప్రాంతాల నుండి అత్యధిక సంఖ్యలో హిందువులు మలేషియా వచ్చేలా చేసింది. [15] అది ఎంత ఎక్కువగా ఉండేదంటే దాని కోసం ప్రత్యేకంగా చట్టాలు చేసారు. తమిళ ఇమ్మిగ్రేషన్ ఫండ్ ఆర్డినెన్స్ 1907 అనే చట్టం చేసారు. ఈ కాలంలో తక్కువ మొత్తంలో ప్రజలు ఉత్తర భారతదేశం, శ్రీలంక నుండి వచ్చారు.
బ్రిటిష్ కాలంలో మలేషియా హిందూ కార్మికులు అత్యంత అట్టడుగున ఉన్నవారు. వారు ప్లాంటేషన్ సొసైటీలలో సరిహద్దులలో నివసించవలసి వచ్చేది. తోటలే వారి ఉనికికి సరిహద్దును సూచిస్తుంది. జాతి వివక్ష అమల్లో ఉండేది. బ్రిటిషు యాంటీ-వాగ్రెన్సీ చట్టాల ప్రకారం భారతీయ హిందువులు (చైనీస్ బౌద్ధులు) అభివృద్ధి చెందిన యూరోపియన్ నివాస ప్రాంతాలలోకి ప్రవేశించడం చట్టవిరుద్ధం. హిందువులు ఇంగ్లీషు లేదా మలయ్ భాషలు మాట్లాడేవారు కాదు. తమ స్వంత సమాజం లోనే పరస్పరం మాట్లాడుకునేవారు. [16]
1957లో మలేషియా స్వాతంత్ర్యం పొందిన తరువాత, స్థానిక ప్రభుత్వాలు స్వయంకృతమైన భూమిపుత్రకు మొగ్గు చూపాయి. బ్రిటిషు వలసరాజ్యాల కాలంలో దశాబ్దాలుగా మలేషియాలో నివసిస్తున్న భారతీయులు, చైనీస్ జాతి సమూహాలకు ఆటోమాటిగ్గా పౌరసత్వం ఇవ్వడాన్ని నిరాకరించాయి. [16] [17] వారిని అక్రమ నివాసులుగా ప్రకటించారు. వారు ప్రభుత్వ ఉద్యోగాలు లేదా స్వంత భూమి కోసం దరఖాస్తు చేసుకోలేరు. భారతీయులు, చైనీయులను లక్ష్యంగా చేసుకుని పెనాంగ్‌లో 1957 చింగయ్ అల్లర్లు, 1964 మలేషియా జాతి అల్లర్లు, 1967 హర్తాళ్ అల్లర్లు, 13 మే 1969 అల్లర్లు వంటి జాతి వివక్ష అల్లర్లు జరిగాయి. [18] సింగపూర్ 1960 లో మలేషియాలో భాగంగా ఉండేది. యూనియన్ నుండి విడిపోయినపుడు, ఒక స్వతంత్ర దేశంగా మారింది. మలేషియా ప్రభుత్వం 1970 రాజ్యాంగ సవరణను ఆమోదించింది. 1971 దేశద్రోహ చట్టాన్ని కూడా ఆమోదించింది. మలేషియా పౌరసత్వ పద్ధతిని, జాతీయ భాషా విధానాన్ని, మలయ్‌లు ఆటోమాటిగ్గా ముస్లింలైపోవడం, మలేషియా రాష్ట్రంలో సుల్తానుల చట్టబద్ధత మొదలైన వాటి గురించి బహిరంగంగా చర్చించడాన్ని ఈ చట్టం నిషేధించింది. [19]
హిందూమతం సంస్థలు, హిందూ దేవాలయాల రక్షణ కోసం మలేషియా హిందూ సంగం (MHS) 1965 జనవరి 23 న ఏర్పడింది [20] మలేషియాలో హిందువుల అభ్యున్నతికి MHS చేసిన గొప్ప సేవ, 1980లలో స్థానిక యువకులను ఆలయ పూజారులుగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన గురుకుల శిక్షణా కార్యక్రమం. [21]
సిద్ధులు అప్పటి మలయాకు వెళ్ళి, తపస్సు చేసి చివరికి జీవసమాధిలోకి వెళ్లారు. అలా వెళ్ళినవారిలో రామలింగ అడిగల్ శిష్యుడైన జెగనాథ స్వామిగళ్ మొట్టమొదటి వాడు. జెగనాథ స్వామిగళ్ సమాధి పెరాక్ లోని తపాలో ఉంది. [22] ప్రస్తుతం, జెగనాథ స్వామిగళ్ సమాధిని, దాని ఆలయానికి ప్రక్కనే ఉన్న భూమినీ మలేషియా హిందూ సంఘం నిర్వహిస్తోంది. శ్రీ జెగనాథ స్వామికి ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నారు. [23]
ఇతర ప్రముఖ సమాధుల్లో చెంగ్, మలక్కా లోని సన్యాసి అండావర్, బటు గుహల్లో శనీశ్వరాలయం సమీపంలోని మౌనా స్వామిగళ్ ఉన్నాయి. [24]
మలేషియా హిందూమతం వైవిధ్యమైనది, నిర్దిష్ట దేవతలకు పెద్ద పట్టణాల్లో దేవాలయాలున్నాయి. ఎస్టేట్లలో అలాంటివే చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఎస్టేట్ దేవాలయాల్లో సాధారణంగా ఆ ఆలయాల ఆరాధకుల మూలమైన భారతీయ ప్రాంతానికి చెందిన సంప్రదాయాన్ని అనుసరిస్తారు. చాలా మంది దక్షిణ భారతదేశానికి చెందిన శైవ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. [25] అయితే, మలేషియాలో వైష్ణవ హిందువులు కూడా ఉన్నారు. వీరు ఎక్కువమంది ఉత్తర భారతదేశం నుండి వచ్చారు. ఈ హిందువులు సెక్స్యెన్ 52, పెటాలింగ్ జయా లోని గీతా ఆశ్రమం, కాంపాంగ్ కాసిపల్లి, క్వాలాలంపూర్ లోని లక్ష్మీ-నారాయణ ఆలయం వంటి ఆలయాల్లో పూజలు చేస్తారు. ఈ దేవాలయాలలో సేవలు హిందీ, ఇంగ్లీషుల్లో నిర్వహిస్తారు.
ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్‌కు మలేషియాలో అనేక మంది అనుచరులు ఉన్నారు. కౌలాలంపూర్లోను, మలేషియా అంతటా ఇది దేవాలయాలను నిర్వహిస్తోంది. [26] మలేషియా అంతటా ప్రతి దేవాలయంలోనూ ఏటా రథయాత్ర ఉత్సవం జరుగుతుంది. సాధారణంగా దీన్ని సంవత్సరం చివరలో నిర్వహిస్తారు. జగన్నాథ, బలదేవ, సుభద్ర ల విగ్రహాలను రథంపై ఉంచి, హరే కృష్ణ మహామంత్రాన్ని పఠిస్తూ భక్తులు రథాన్ని వీధుల్లో లాగుతారు. [27] హరే కృష్ణ ఉద్యమంలో మరొక సమూహం కూడా ఉంది (రిత్విక్ అనుచరులు, హంస దూత అనుచరులు). మలేషియాలో గౌడియ మఠం, సరస్వత్ మఠం కూడా ఉన్నాయి. [28]
రామానుజాచార్యులు, మధ్వాచార్య సంప్రదాయాన్ని అనుసరించే శ్రీ వైష్ణవుల భక్తులు కూడా కొంతమంది ఉన్నారు. [29]
మలేషియాలో రామకృష్ణ మఠం వంటి అనేక వైదిక సంప్రదాయాలు, సమూహాలకు కూడా పెద్ద సంఖ్యలో అనుచరులు ఉన్నారు. పెటాలింగ్ జయా లోని రామకృష్ణ మఠం 1940ల నుండి ఉనికిలో ఉంది. 2001లో భారతదేశంలోని రామకృష్ణ మఠానికి అధికారికంగా అనుబంధంగా ఉంది. 2015లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడి రామకృష్ణ మఠాన్ని సందర్శించి స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించాడు. రామకృష్ణ వివేకానంద ఉద్యమంతో దగ్గరి సంబంధం ఉన్న మరో ముఖ్యమైన కేంద్రం రామకృష్ణ ఆశ్రమం, ఇది 1938లో పెనాంగ్ లో ఏర్పడింది. వివేకానంద ఆశ్రమం, కౌలాలంపూర్ అనేది స్వామి వివేకానంద (1863-1902) గౌరవార్థం 1904లో జాఫ్నా (శ్రీలంక) తమిళ వలసదారులు నెలకొల్పిన సంస్థ. 1908లో నిర్మించిన ఈ భవనాన్ని యువతకు, సమాజానికీ విద్య, ఆధ్యాత్మిక అభివృద్ధిని అందించడంలో ఆయన చేసిన కృషికి అంకితం చేసారు. [30] వివేకానంద ఆశ్రమంలో స్వామి వివేకానంద కంచు విగ్రహం ఉంది. 2016 లో దీన్ని ఒక హెరిటేజ్ స్థలంగా ప్రకటించారు. [31]
మలేషియాలోని ఇతర ప్రముఖ వేదాంత-ఆధారిత సంస్థల్లో డివైన్ లైఫ్ సొసైటీ (దీనిని శివానంద ఆశ్రమం అని కూడా పిలుస్తారు) ఒకటి. దాని ప్రధాన కార్యాలయం బటు కేవ్స్ లో ఉంది. అలాగే ఆర్ష విజ్ఞాన గురుకులం మరొక సంస్థ. [32]
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత భారతీయ మలేషియన్లలో హిందూమత పునరుజ్జీవనం ఏర్పడింది. వారిలో ఐక్యతను తీసుకురావడానికి లేదా సంస్కరణలను ప్రోత్సహించడానికీ సంస్థలు, కౌన్సిళ్ళు ఏర్పడడంతో ఇది మొదలైంది. [33] [34]
ప్రతి సంవత్సరం జరుపుకునే కొన్ని ప్రధాన హిందూ పండుగలలో దీపావళి, తైపూసం (మురుగన్ పండుగ), పొంగల్ (సంక్రాంతి), నవరాత్రి ఉన్నాయి.
దీపావళి మలేషియాలో ప్రధానమైన హిందూ పండుగ. మలేషియా హిందువులు సాంప్రదాయకంగా దీపావళి రోజున బహిరంగ సమావేశాలు నిర్వహిస్తారు. ఇక్కడ వివిధ జాతుల, మతాల ప్రజలు హిందూ గృహాలలో దీపాల పండుగను పంచుకోవడానికి చేరుతారు. అలాగే భారతీయ ఆహారం, స్వీట్లను రుచి చూస్తారు. [35]
సారవాక్ మినహా మలేషియాలోని అన్ని రాష్ట్రాల్లో దీపావళి, తైపూసం పండుగలకు ప్రభుత్వ సెలవులున్నాయి. [36]
మలయాళీలు తమ కొత్త సంవత్సరం రోజున విషు జరుపుకుంటారు. ఇది సాధారణంగా ఏప్రిల్ నెలలో (మలయాళీ క్యాలెండర్ ప్రకారం, మేడాం నెల) వస్తుంది. మలయాళీ సమాజం జరుపుకునే అత్యంత ప్రసిద్ధ పండుగ ఓణం, సాధారణంగా ఆగస్టు సెప్టెంబరు నెలల్లో జరుపుకుంటారు. 16 నుంండి 24 శాకాహార వంటకాలు కలిగిన విందు భోజనం, సధ్య (ఉల్లిపాయలు వెల్లుల్లి లేకుండా) తో ఈ పండుగ జరుపుకుంటారు.
2010 జనాభా లెక్కల ప్రకారం, 17,77,694 మంది హిందువులు ఉన్నారు (జనాభాలో 6.27%). వీరిలో 16,44,072 మంది భారత మూలాలున్నవారు, 1,11,329 మంది పౌరేతరులు. 14.878 మంది చైనీయులు, 4.474 మంది ఇతరులు, 2,941 మంది గిరిజనులు. [37] మొత్తం భారతీయ మలేషియన్లలో 92.48% మంది హిందువులు. జనాభా గణనలో ఇచ్చిన సమాధానం ఆధారంగా ఈ సమాచారాన్ని సేకరించారు. ఏ అధికారిక పత్రాన్నీ ఇది సూచించలేదు.
మలక్కాలో ఒక చిన్న చారిత్రిక చిట్టీ కమ్యూనిటీ ఉంది. వీరిని భారతీయ పెరనాకన్స్ అని కూడా పిలుస్తారు. వారు తమ హిందూ వారసత్వాన్ని నిలుపుకుంటూనే చైనీస్, మలయ్ సాంస్కృతిక పద్ధతులను అవలంబిస్తారు. [38]
మతానికి సంబంధించిన సంతానోత్పత్తి రేటులను మలేషియా ప్రభుత్వం ప్రచురించలేదు. జాతి వారీగా సంతానోత్పత్తి రేటును మాత్రమే ప్రచురించారు. భారతీయులు సంతానోత్పత్తి రేటు 1.3కు పడిపోయింది ఇది 2010 లో 1.7 గా ఉంది 2016. [39]
లింగం | మొత్తం హిందువుల జనాభా (2010) |
హిందూ మలేషియా పౌరులు | హిందూ మలేషియాయేతరులు | ||||
---|---|---|---|---|---|---|---|
భూమిపుత్ర హిందువులు | భూమిపుత్రేతర హిందువులు | ||||||
మలయ్ హిందువులు | ఇతర భూమిపుత్ర హిందువులు | చైనీస్ హిందువులు | భారతీయ హిందువులు | మరికొందరు హిందువులు | |||
దేశవ్యాప్తంగా | 17,77,694 | 0 | 2,941 | 14,878 | 16,44,072 | 4,474 | 1,11,329 |
మగవారు | 9,21,154 | 0 | 1,524 | 7,638 | 8,21,995 | 2,402 | 87,595 |
స్త్రీలు | 8,56,540 | 0 | 1,417 | 7,240 | 8,22,077 | 2,072 | 23,724 |
మలేషియాలో 5,900 మంది బాలినీయ ప్రజలు ఉన్నారు, వీరిలో 90% మంది హిందువులు. [40] పై పట్టికలోని 'ఇతర హిందువులు' వారికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండవచ్చు.
రాష్ట్రం | మొత్తం హిందువుల జనాభా (2010 జనాభా లెక్కలు) |
రాష్ట్ర జనాభాలో % |
---|---|---|
జోహార్ | 221,128 | 6.6% |
కేదా | 130,958 | 6.7% |
కెలాంతన్ | 3,670 | 0.2% |
కౌలాలంపూర్ | 142,130 | 8.5% |
లాబువాన్ | 357 | 0.4% |
మలక్కా | 46,717 | 5.7% |
నెగెరీ సెంబిలాన్ | 136,859 | 13.4% |
పహాంగ్ | 60,428 | 4.0% |
పెనాంగ్ | 135,887 | 8.7% |
పెరాక్ | 255,337 | 10.9% |
పెర్లిస్ | 1,940 | 0.8% |
పుత్రజాయ | 708 | 1.0% |
సబా | 3,037 | 0.1% |
సారవాక్ | 4,049 | 0.2% |
సెలంగర్ | 1,231,980 | 18.6% |
తెరంగ్గాను | 2,509 | 0.2% |
సంవత్సరం | జనాభా | ±% |
---|---|---|
1961 | 7,49,831 | — |
1971 | 8,43,982 | +12.6% |
1981 | 9,20,400 | +9.1% |
1991 | 11,12,300 | +20.8% |
2001 | 13,80,400 | +24.1% |
2011 | 17,77,694 | +28.8% |
మలేషియాలో హిందువుల జనాభా గత 6 దశాబ్దాలలో చాలా తగ్గింది. ప్రధానంగా మలయా స్వాతంత్ర్యం తర్వాత, ప్రభుత్వం ఇస్లామిక్ ఛాందసవాద విధానాలు అవలంబించడం వంటివి దీనికి కారణాలు. [41] ముస్లింలకు అనుకూలంగా అనేక నియమాలు ఉన్నాయి. హిందువులు, ఇతర మైనారిటీల హక్కులను షరియా కోర్టులు నిర్లక్ష్యం చేసాయి. మలేషియా హిందువులు అధిక సంఖ్యలో క్రైస్తవం, ఇస్లాం లోకి మారినట్లు కూడా నివేదికలు ఉన్నాయి. దాదాపు 1,30,000 మంది క్రైస్తవులుగాను, 30,000 మంది ఇస్లాం మతంలోకీ మారారని (1991 వరకు) అనేక హిందూ సమూహాలు నివేదించాయి. వారిలో ఎక్కువ మంది సింగపూర్, మలేషియా తమిళులే. [42]
మలేషియాలో భారతీయ సంతతికి చెందిన వారిని " కెలింగ్" అని పిలుస్తుంటారు. [43]
ఇస్లాం మలేషియా అధికారిక మతం. మలేషియా రాజ్యాంగం ఇస్లాం మాత్రమే మలయ్ ప్రజల నిజమైన మతం అనీ, స్థానికులు ముస్లింలుగానే ఉండాలనీ ప్రకటించింది. [44] ఇస్లాం నుండి హిందూమతం (లేదా మరేదైనా మతం) లోకి మారడం చట్టవిరుద్ధం. అయితే హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు ఇస్లాంలోకి మారడాన్ని మాత్రం చట్టం స్వాగతిస్తుంది. దేశంలో ఇస్లాం వ్యాప్తిని ప్రభుత్వం చురుకుగా ప్రోత్సహిస్తుంది. [8] ముస్లింను వివాహం చేసుకున్న హిందువు (లేదా బౌద్ధులు లేదా క్రైస్తవులు) ముందుగా ఇస్లాంలోకి మారాలని చట్టం కోరుతుంది. లేకుంటే ఆ వివాహం చట్టవిరుద్ధం, చెల్లదు. [8] హిందూ తల్లిదండ్రులలో ఒకరు ఇస్లాంను స్వీకరించినట్లయితే, రెండవ వారి అనుమతి లేకుండానే పిల్లలు ఆటోమాటిగ్గా ముస్లింలుగా మారిపోతారు. [7] [45]
హిందువులపై అధికారిక హింసకు సంబంధించి మలేషియా కోర్టుల్లో అనేక కేసులు ఉన్నాయి. ఉదాహరణకు, 2010 ఆగస్టులో, సితి హస్నా బంగార్మ అనే మలేషియన్ మహిళ హిందూమతంలోకి మారేందుకు ఒక మలేషియన్ కోర్టు తిరస్కరించింది. హిందువుగా జన్మించిన బంగార్మాను 7 సంవత్సరాల వయస్సులో బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారు. ఆమె తిరిగి హిందూమతంలోకి మారాలని కోరుకుంది. అలా మారడాన్ని గుర్తించాలని కోర్టులను ఆశ్రయించింది. ఆమే అప్పీలును కోర్టులు తిరస్కరించాయి. [46]
1998 మార్చిలో పెనాంగ్‌లో హిందువులు, ముస్లింల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగిన తరువాత, ప్రభుత్వం అనుమతి లేని హిందూ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలపై దేశవ్యాప్తంగా సమీక్షను ప్రకటించింది. అయితే, దాన్ని శక్తివంతంగా అమలు చెయ్యలేదు. ఆ కార్యక్రమంపై బహిరంగ చర్చ కూడా జరగలేదు. [47]
2006 ఏప్రిల్ 21 న, కౌలాలంపూర్‌లోని మలైమెల్ శ్రీ సెల్వ కాళియమ్మన్ ఆలయాన్ని బుల్డోజర్లతో భస్మీ పటలం చేసారు. [48]
మలేషియాలో పెరుగుతున్న ఇస్లామీకరణ పట్ల హిందూమతం వంటి మైనారిటీ మతాలను అనుసరించే చాలా మంది మలేషియన్లు ఆందోళన చెందుతున్నారు. [49]
2006 మే 11 న, కౌలాలంపూర్‌కు చెందిన సాయుధ సిటీ హాల్ అధికారులు 3,000 మందికి పైగా హిందువులు దర్శించుకునే 90 ఏళ్ల నాటి సబర్బన్ దేవాలయంలో కొంత భాగాన్ని బలవంతంగా కూల్చివేశారు. హిందూ హక్కుల కార్యాచరణ దళం (హింద్రాఫ్) మలేషియా ప్రధాన మంత్రికి ఫిర్యాదు చేసి ఈ కూల్చివేతలను నిరసించింది. [50]
హింద్రాఫ్ ఛైర్మన్, వైతా మూర్తి పొన్నుసామి మాట్లాడుతూ:
...రాజ్యం చేస్తున్న ఈ దౌర్జన్యాలు మలేషియా హిందూ సమాజంలోని అత్యంత అణగారిన, శక్తిలేని వర్గాలపైనే జరిగాయి. మలేషియాలోని ఈ దేవాలయాన్నే కాక, ఏ ఇతర హిందూ దేవాలయాన్నైనా విచక్షణారహితంగా, చట్టవిరుద్ధంగా కూల్చివేయవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాము.[50]
మలేషియాలో ఆలయాలను నాశనం చేసే ఒక క్రమబద్ధమైన ప్రణాళిక నడుస్తోందని అనేక హిందూ సమూహాలు నిరసన తెలిపాయి. ఆ ఆలయాలను "చట్టవిరుద్ధంగా" నిర్మించడమే కూల్చివేతలకు కారణమని మలేషియా ప్రభుత్వం అధికారికంగా చెప్పింది అయితే, కూల్చివేసిన అనేక దేవాలయాలు శతాబ్దాల నాటి పురాతనమైనవి. [50]
హింద్రాఫ్ తరపు న్యాయవాది ప్రకారం, మలేషియాలో ప్రతి మూడు వారాలకు ఒక హిందూ దేవాలయాన్ని కూల్చివేస్తున్నారు. [51]
2007లో మలేషియా ప్రభుత్వం హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడంపై మలేషియా హిందూ సంస్థలు నిరసన తెలిపాయి. 2007 అక్టోబర్ 30 న, పదాంగ్ జావాలోని 100 ఏళ్ల పురాతనమైన మహా మారియమ్మన్ ఆలయాన్ని మలేషియా అధికారులు కూల్చివేశారు. ఆ కూల్చివేత తరువాత, వర్క్స్ మినిస్టర్, మలేషియా ఇండియన్ కాంగ్రెస్ (ఎంఐసి) అధినేత, భారత సంతతికి చెందిన సామి వెల్లు మాట్లాడుతూ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తాను విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వ భూమిలో నిర్మించిన హిందూ దేవాలయాలు ఇప్పటికీ కూల్చివేస్తున్నారని చెప్పాడు.
మలేషియాలో ఇటువంటి ఆలయ విధ్వంసాల గురించి హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) చెప్పింది. [52]
మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన (1948) లోని ఆర్టికల్ 20 కి, మలేషియా ఫెడరల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 10 కి విరుద్ధంగా మలేషియా ప్రభుత్వం 'ఫ్రీడం ఆఫ్ పీస్ఫుల్ అసెంబ్లీ అండ్ అసోసియేషన్' హక్కును అడ్డుకుంటోందని HAF పేర్కొంది. సభలు నిర్వహించడం కోసం మలేషియా హిందువులు దాఖలు చేసిన దరఖాస్తులను పోలీసులు ఏకపక్షంగా తిరస్కరించారు. యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన సివిల్ దావాకు మద్దతుగా 3,00,000 సంతకాలను సేకరించేందుకు హింద్రాఫ్ ప్రారంభించిన ప్రచారాన్నికూడా ప్రభుత్వం అణిచివేసేందుకు ప్రయత్నించింది. [52] మలేషియా ప్రభుత్వం భారతీయ సమాజాన్ని భయాందోళనలకు గురిచేస్తోందని హింద్రాఫ్ ఆరోపించింది. [53]
2007 లో హింద్రాఫ్ జరిపిన ర్యాలీ తరువాత మలేషియా ప్రభుత్వం, మలేషియా హిందూ కౌన్సిల్, మలేషియా హిందూ ధర్మ మమంద్రం, మలేషియా ఇండియన్ యూత్ కౌన్సిల్ (MIYC) వంటి వివిధ భారతీయ హిందూ సంస్థలతో చర్చలు జరిపి భారతీయ సమాజంలోని సందేహాలను పరిష్కరించే ప్రయత్నం చేసింది. [54] హింద్రాఫ్ను ఈ చర్చలకు పిలవలేదు. ఈ చర్చల వల్ల ఎటువంటి ముఖ్యమైన మార్పులూ రాలేదు. [55]
ఆవు తల నిరసనలు 2009 ఆగస్టు 28 న మలేషియాలోని షా ఆలంలోని సుల్తాన్ సలావుద్దీన్ అబ్దుల్ అజీజ్ షా బిల్డింగ్‌లోని సెలంగోర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయం ముందు జరిగాయి. హిందువులు పవిత్రంగా భావించే ఆవు తలను వెంట తెచ్చుకుని కొంతమంది నిరసన ప్రదర్శన చేసారు. అంచేత దానికి ఆ పేరు వచ్చింది. నిరసన తరువాత వారు "తిరిగి వెళ్ళే ముందు దాని తలపై తొక్కి, దానిపై ఉమ్మివేసారు". [56]
షా ఆలంలోని సెక్షన్ 19 నివాస ప్రాంతం నుండి ఓ హిందూ దేవాలయాన్ని సెక్షన్ 23కి మార్చాలని సెలంగోర్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించిన కారణంగా ఈ నిరసన జరిగింది. నిరసనకారులు ప్రధానంగా ముస్లిం తీవ్రవాదులు. సెక్షన్ 23 ముస్లిం మెజారిటీ ప్రాంతం కావడంతో వాళ్ళు పునరావాసాన్ని వ్యతిరేకించారు.
షా ఆలమ్‌లో గుడి నిర్మిస్తే రక్తం పారుతుందని నిరసన నేతలు అనడం కూడా రికార్డైంది. [57] ఈ నిరసనను ప్రముఖ మలేషియా ఆన్లైన్ న్యూస్ పోర్టల్ మలేషియాకిని వీడియో తీసింది. [58]
ముస్లిం తల్లిదండ్రులకు పుట్టి హిందువుగా పెరిగిన రేవతి మస్సోసాయి 2004లో హిందూ వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే షరియా చట్టం ప్రకారం హిందూ పురుషుడు ముస్లిం యువతిని పెళ్లి చేసుకునే వీలు లేనందున ఆమె వివాహాన్ని మలేషియా ప్రభుత్వం గుర్తించలేదు. ఇస్లాంను వీడి హిందూమతానికి మారాలని ఆమె చేసిన ప్రయత్నాల కారణంగా ఇస్లామిక్ రీ-ఎడ్యుకేషన్ క్యాంప్‌లో ఆమెను ఆరు నెలలపాటు నిర్బంధించారు. అక్కడ ఆమె గొడ్డు మాంసం తినవలసి వచ్చింది (మత విశ్వాసాల ప్రాతిపదికన చాలామంది హిందువులు గొడ్డుమాంసం తినరు), ముస్లింగా ప్రార్థన చేయవలసి వచ్చింది. తలకు స్కార్ఫ్ ధరించాల్సి వచ్చింది. ఇస్లామిక్ అధికారులు ఆ దంపతుల 18 నెలల కుమార్తెను సురేష్ (ఆమె హిందూ తండ్రి) నుండి దూరంగా తీసుకెళ్లి రేవతి తల్లికి (ఆమె ముస్లిం) అప్పగించారు. రేవతి తన తల్లితో కలిసి జీవించాలని, ఇస్లామిక్ కౌన్సెలింగ్‌ను కొనసాగించాలనీ అధికారులు ఆదేశించారు. [59] [60]
2008లో, నేషనల్ ఫత్వా కౌన్సిల్ ఆఫ్ మలేషియా యోగాకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసింది. కౌన్సిల్ చైర్మన్ అబ్దుల్ షుకోర్ హుసిమ్ ఇలా అన్నాడు: "హిందూమతంలో ఉద్భవించిన యోగా, శారీరక వ్యాయామంతో మతపరమైన అంశాలు, మంత్రాలు, ఆరాధనలను మిళితం చేసి అంతర్గత శాంతిని సాధించే ఉద్దేశ్యంతో, చివరికి భగవంతునితో ఐక్యమవడాన్ని ఉద్దేశిస్తుందని మేము భావిస్తున్నాము. మాకు సంబంధించినంత వరకూ, యోగా ముస్లిం విశ్వాసాలను నాశనం చేస్తుంది". [61] [62] [63]
2009లో, ఇందిరా గాంధీ భర్త పద్మనాథన్ ఇస్లాం మతంలోకి మారి మహమ్మద్ రిదువాన్ అబ్దుల్లా అనే పేరును స్వీకరించాడు. అప్పుడు అతను తన భార్య అనుమతి లేకుండా ఏకపక్షంగా తన ముగ్గురు పిల్లలను (వారిలో ఒకరికి 11 నెలల వయస్సు) ఇస్లాం మతంలోకి మార్చాడు. షరియా కోర్టు రిదువాన్కు పిల్లల సంరక్షణను కూడా మంజూరు చేసింది. [64]
2016లో ఫెడరల్ కోర్టు రిదువాన్కు అరెస్ట్ వారెంట్‌ని అమలు చేయాలని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ని ఆదేశించింది. కరణ్, తెవి లు తమను తాము హిందువులుగా ప్రకటించుకున్నారు. అయితే, రిదువాన్ ప్రసనను తనతో తీసుకొని తప్పించుకున్నాడు. వారిద్దరూ ఇప్పటికీ కనబడలేదు. [65] [66] [67] [68]
హిందూ హక్కుల కార్యాచరణ దళం - హింద్రాఫ్, (హిందూ రైట్స్ యాక్షన్ ఫోర్స్ - HINDRAF అనే సంక్షిప్త నామంతో ప్రసిద్ధి చెందింది) క్రియాశీల ప్రభుత్వేతర సంస్థ (NGO). ఈ సంస్థ బహుళజాతి మలేషియాలో హిందూ సమాజ హక్కులు, వారసత్వ పరిరక్షణకు కట్టుబడి ఉన్న 30 హిందూ ప్రభుత్వేతర సంస్థల సంకీర్ణం. [69] [70]
2007 లో హింద్రాఫ్, బహిరంగ ప్రదర్శన నిర్వహించి మలేషియా రాజకీయ దృశ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపింది. 2007 నవంబరులో హింద్రాఫ్ నిర్వహించిన ఆ ప్రదర్శన తరువాత, సంస్థ లోని అనేకమంది ప్రముఖ సభ్యులను దేశద్రోహ ఆరోపణలపై అరెస్టు చేసారు. ఆ అభియోగాలను కోర్టులు కొట్టివేశాయి. అంతర్గత భద్రతా చట్టం (ఐఎస్ఎ) కింద ఐదుగురిని అరెస్టు చేసి విచారణ లేకుండా నిర్బంధించారు. [71] 2000ల దశాబ్ది చివరికి, మైనారిటీ భారతీయులకు సమాన హక్కులు, అవకాశాలను సంరక్షించడానికి విస్తృత రాజకీయ కార్యక్రమాన్ని చేపట్టింది. మలేషియా ప్రభుత్వ విధానాలలోని జాత్యహంకార అంశాలపై దృష్టిని కేంద్రీకరించడంలో ఇది విజయవంతమైంది. [72]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.