భారత రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి From Wikipedia, the free encyclopedia
బ్రహ్మోస్, మధ్య పరిధి గల, ర్యామ్జెట్ ఇంజనుతో పనిచేసే, సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించే క్రూయిజ్ క్షిపణి. నేలపై నుండి, సముద్రంపై నుండి (యుద్ధ నౌకల నుండి), సముద్రం లోపల నుండి (జలాంతర్గాముల నుండి), ఆకాశం నుండి (యుద్ధ విమానాల నుండి) ఈ క్షిపణిని ప్రయోగించవచ్చు. భారత్‌కు చెందిన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, రష్యాకు చెందిన NPO మషినోస్ట్రోయేనియాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ భారత్‌లో ఈ క్షిపణిని తయారు చేస్తోంది.[14] ఇది ప్రపంచంలోని ఏకైక స్వల్ప శ్రేణి సూపర్ సోనిక్ మిస్సైల్ ( నౌక క్షిపణి). క్రూయిజ్ క్షిపణి P-800 ఓనిక్స్ సాంకేతికతపై ఆధారపడి ఈ క్షిపణిని తయారు చేసారు. భారత దేశంలోని బ్రహ్మపుత్ర నది, రష్యా లోని మోస్క్వా నది - ఈ రెండు పేర్లలోని మొదటి భాగాలను కలపగా ఏర్పడినదే బ్రహ్మోస్. హిందూ పురాణాల్లోని బ్రహ్మాస్త్రం ను ఈ పేరు ధ్వనింప జేస్తుంది.
బ్రహ్మోస్ | |
---|---|
రకం | క్రూయిజ్ క్షిపణి గాల్లోంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణి నౌకా విధ్వంసక క్షిపణి భూదాడి క్షిపణి భూమి నుండి భూమికి ప్రయోగించే క్షిపణి |
అభివృద్ధి చేసిన దేశం | India Russia |
సర్వీసు చరిత్ర | |
సర్వీసులో | 2006 నవంబరు |
వాడేవారు | Indian Army Indian Navy Indian Air Force |
ఉత్పత్తి చరిత్ర | |
తయారీదారు | బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్[1] |
ఒక్కొక్కదాని వెల | $ 27.3 లక్షలు |
వివిధ రకాలు | నౌక నుండి ప్రయోగించే రకం భూమి నుండి ప్రయోగించే రకం జలాంతర్గామి నుండి ప్రయోగించే రకం గాలిలో నుండి ప్రయోగించే రకం బ్రహ్మోస్-2 |
విశిష్టతలు | |
బరువు | 3,000 కి.గ్రా. (6,600 పౌ.) 2,500 కి.గ్రా. (5,500 పౌ.) (air-launched) |
పొడవు | 8.4 మీ. (28 అ.) |
వ్యాసం | 0.6 మీ. (2.0 అ.) |
వార్‌హెడ్ | 200 కి.గ్రా. (440 పౌ.) conventional semi-armour-piercing and nuclear[2][3] 300 కి.గ్రా. (660 పౌ.) (air-launched) |
ఇంజను | మొదటి దశ: ఘన ఇంధన రాకెట్ బూస్టరు రెండవ దశ: ద్రవ ఇంధన ర్యామ్జెట్ |
ఆపరేషను పరిధి | Surface/Sea Platform - 450 కి.మీ. (280 మై.; 240 nmi) (original/export)[4][5] To be upgraded to 600 కి.మీ. (370 మై.; 320 nmi)[6] Air Platform - 400 కి.మీ. (250 మై.; 220 nmi)[7] |
ఫ్లైట్ సీలింగు | 14 కి.మీ. (46,000 అ.)[3] |
ఫ్లైటు ఎత్తు | సముద్ర తలాన్ని తాకుతూ వెళ్ళే క్షిపణి: సముద్ర తలం నుండి కేవలం 3–4 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంది.[3][8] |
వేగం | Mach 2.8 – Mach 3 (3,400–3,700 km/h; 2,100–2,300 mph; 0.95–1.0 km/s)[1][9] |
గైడెన్స్ వ్యవస్థ | Mid-course guidance by INS Terminal guidance by Active radar homing GPS/GLONASS/Indian Regional Navigation Satellite System/GAGAN satellite guidance using G3OM[10][11][12] |
కచ్చితత్వం | 1 మీ. వర్తుల దోష పరిధి[13] |
లాంచి ప్లాట్ఫారం | Ship, submarine, aircraft (under testing), and land-based mobile launchers. |
ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న నౌకా విధ్వంసక క్షిపణు లన్నిటిలోకీ బ్రహ్మోస్ అత్యంత వేగవంతమైనది.[15][16][17][18] ఈ క్షిపణి మ్యాక్ 2.8 - 3.0 వేగంతో ప్రయాణిస్తుంది.[9] భూమ్మీద నుండి, ఓడ మీదనుండి ప్రయోగించగల రకాలను ఈసరికే మోహరించారు. విమానం నుండి ప్రయోగించే రకం క్షిపణిని 2019 లో మోహరించారు.[19] జలాంతర్గామి నుండి ప్రయోగించగల రకాలు ప్రస్తుతం పరీక్షల్లో ఉన్నాయి.[20] బ్రహ్మోస్-2 గా పిలువబడుతున్న హైపర్సోనిక్ రకం క్షిపణి ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది. మ్యాక్ 7 వేగంతో ప్రయాణించగల ఈ క్షిపణి చేరికతో గాల్లోంచి శీఘ్రంగా దాడి చేయగల సామర్థ్యం భారత్‌కు పెరుగుతుంది. 2017 నాటికి ఇది పరీక్షలకు సిద్దమౌతుందని భావించారు.[21]
బ్రహ్మోస్ ను ఒక మధ్య పరిధి క్షిపణిగా నిర్మించాలని భారత్ ఆశించినప్పటికీ, రష్యా దీన్ని తక్కువ పరిధి క్షిపణిగా తయారు చెయ్యాలని అనుకుంది. క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థ నిబంధనలకు లోబడి ఉండడం కోసం రష్యా దీన్ని ఎంచుకుంది. క్షిపణి మార్గ నిర్దేశక వ్యవస్థను బ్రహ్మోస్ ఏరోస్పేస్ తయారు చేసింది. క్షిపణికి ఆర్డర్లు 1300 కోట్ల డాలర్ల వరకూ ఉండవచ్చని అంచనా.[22][23]
2016 లో భారత్ క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థలో సభ్యునిగా చేరడంతో క్షిపణి పరిధికి సంబంధించిన పరిమితి తొలగిపోయింది. 2019 లో భారత్, బ్రహ్మోస్ క్షిపణి పరిధిని 650 కి.మీ. లకు పెంచింది. అంతిమంగా ఈ క్షిపణి పరిధిని 1500 కి.మీ. కు పెంచాలనేది భారత్ లక్ష్యం.[24][25][26][27]
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO), రష్యాకు చెందిన ప్రభుత్వ సంస్థ NPO మషినోస్ట్రోయెనియా (NPOM) లు సంయుక్తంగా బ్రహ్మోస్‌ను అభివృద్ధి చేశాయి. ఈ సంస్థ 1998 ఫిబ్రవరి 12 న 30 కోట్ల డాలర్ల అధీకృత వాటా మూలధనంతో స్థాపించబడింది. ఈ సంయుక్త సంస్థలో భారత్ వాటా 50.5%, రష్యా వాటా 49.5%.[28]
2004 నుండి బ్రహ్మోస్ క్షిపణి వివిధ ప్లాట్‌ఫారాల మీద అనేక పరీక్షలకు లోనైంది. రాజస్థాన్, పొఖ్రాన్ లో నేలపై నుండి ప్రయోగించే పరీక్ష జరిగింది. దీనిలో మ్యాక్ 2.8 వేగంతో ప్రయాణిస్తూ 'S' మనూవర్ చెయ్యడాన్ని కూడా ప్రదర్శించారు. అలాగే సముద్రంలో లాంచి మీద నుండి నేల మీద దాడి చేసే సామర్థ్యాన్ని పరీక్షించారు.[29]
2008 లో బ్రహ్మోస్ కార్పొరేషన్, భారత ప్రభుత్వ సంస్థ అయిన కెల్టెక్ ను కొనేసింది.[30] ప్రస్తుతం దీని పేరు బ్రహ్మోస్ ఏరోస్పేస్ ట్రివేండ్రం లిమిటెడ్. బ్రహ్మోస్ పరికరాలు తయారు చేసేందుకు, క్షిపణి వ్యవస్థలను ఏకీకృతం చేసేందుకూ ఈ కంపెనీలో దాదాపు 1500 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టారు. భారత సైన్యం, నావికా దళం రెండూ కూడా ఆర్డర్లు వెయ్యడంతో ఆర్డరు బుక్ పెరిగిపోయింది.[31][32][33] అందుచేత ఈ పెట్టుబడి పెట్టవలసి వచ్చింది.
బ్రహ్మోస్‌ను మొదటగా 2001 జూన్ 12 న చాందీపూర్ నుండి ప్రయోగాత్మకంగా పరీక్షించారు. 2004 జూన్ 14 న జరిపిన మరో పరీక్షలో బ్రహ్మోస్‌ను మొబైల్ లాంచరు నుండి ప్రయోగించారు.[34] 2008 మార్చి 5 న భూ దాడి చేసే రకం క్షిపణిని INS రాజ్‌పుత్ నుండి ప్రయోగించగా అది సరైన లక్ష్యాన్ని ఎంచుకుని ఛేదించింది.[35][36] 2008 డిసెంబరు 18 న INS రణ్వీర్ నుండి నిట్టనిలువు ప్రయోగాన్ని జరిపారు .[37] భారత సైన్యం కోసం 2004 డిసెంబరు, 2007 మార్చిల్లో బ్రహ్మోస్ 1, బ్లాక్ 1 ను కొత్త సామర్థ్యాలతో రాజస్థాన్ ఎడారుల్లో విజయవంతంగా పరీక్షించారు.[38][39]
2009 జనవరి 20 న బ్రహ్మోస్‌ను ఓ కొత్త నేవిగేషన్ వ్యవస్థతో పరీక్షించగా అది లక్ష్యాన్ని చేరలేదు. దీని గురించి బ్రహ్మోస్ ఎరోస్పేస్ డైరెక్టరు శివతాను పిళ్ళై ఇలా చెప్పాడు: "క్షిపణి పనితనం చివరిదాకా బాగానే ఉంది కానీ అది లక్ష్యాన్ని కొట్టలేదు. సమస్య సాఫ్టువేరుతోనే గానీ, హార్డువేరుతో కాదు".[40][41] "ఉపగ్రహ దిక్సూచి వ్యవస్థ నుండి డేటాను ఇనర్షియల్ గైడెన్స్ వ్యవస్థకు పంపించడంలో ఆలస్యం కావడం వలన క్షిపణి 84 సెకండ్ల పాటు ప్రయాణించాల్సింది పోయి, 112 సెకండ్ల పాటు ప్రయాణించి, లక్ష్యాన్ని దాటి 7 కి.మీ. ముందుకు పోయింది". అని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ( డిఆర్డివో) చెప్పింది.[42] బ్రహ్మోస్ కార్పొరేషన్ ప్రకారం నెల లోపే మరో పరీక్ష జరపాల్సి ఉంది.[43] కానీ అది 2009 మార్చి 4 న జరిపారు -విజయవంతంగా.[44] 2009 మార్చి 29 న బ్రహ్మోస్ ను మళ్ళీ పరీక్షించారు. ఈ పరీక్షలో క్షిపణి ఎన్నో భవనాల మధ్యన తన లక్ష్యమైన ఒక భవనాన్ని ఎంచుకుని దాన్ని ఛేదించింది.[45] మూడో పరీక్ష తరువాత, లెఫ్టెనెంట్ జనరల్ నోబుల్ తంబురాజ్, 'కచ్చితత్వం విషయంలో బ్రహ్మోస్ చాలా ఉన్నతమైన ప్రమాణాలు నెలకొల్పాలని భారత సైన్యం భావించింది. బ్రహ్మోస్ అది సాధించింది' అంటూ శాస్త్రవేత్తలను అభినందించాడు.[46] పరీక్ష విజయవంతమైందని ధ్రువీకరిస్తూ, క్షిపణి పనితనంతో తాము పూర్తిగా సంతృప్తి చెందామని భారత్ సైన్యం తెలిపింది.[47][48][49][50]
2010 మార్చి 21 న జరిపిన పరీక్షలో బ్రహ్మోస్, ఒక ఓడను నీటి తలానికి కొద్దిగా పైన కొట్టి, దాన్ని చీల్చేసి, పూర్తిగా ధ్వంసం చేసింది. లక్ష్యాన్ని కొట్టే ముందు, సూపర్సోనిక్ వేగంతో వెళ్తూ, ఒక్కసారిగా దిశను మార్చుకునే దాని సామర్థ్యాన్ని ప్రదర్శించింది.[51] 2010 సెప్టెంబరు 5 న ఈ సామర్థ్యానికి జరిపిన పరీక్ష ప్రపంచ రికార్డును సృష్టించింది. సూపర్సోనిక్ వేగంతో వెళ్ళే క్రూయిజ్ క్షిపణిని స్టీప్ డైవ్ మోడ్‌లో పరీక్షించారు. సూపర్సోనిక్ వేగంతో ప్రయాణిస్తూ, ఒక్క సారిగా దిశను కిందికి మార్చుకుని, నిట్టనిలువుగా నేల వైపు అదే వేగంతో దూసుకుపోవడాన్ని స్టీప్ డైవ్ మోడ్ అంటారు. బ్లాక్-2 సీకర్ సాఫ్టువేరుతో లక్ష్యాన్ని ఎంచుకోవడంలో విచక్షణ చూపే సామర్థ్యాన్ని సైన్యం అవసరాలకు అనుగుణంగా పరీక్షించడం దీనితో పూర్తైంది. గుంపుగా ఉన్న లక్ష్యాల్లోంచి ఒక ప్రత్యేక లక్ష్యాన్ని ఎంచుకుని ఛేదించే సామర్థ్యమున్న సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి యావత్ప్రపంచంలోనూ బ్రహ్మోస్ ఒక్కటే.[52][53]
2010 డిసెంబరు 2 న బ్లాక్ 3 ని విజయవంతంగా పరీక్షించారు. ఆధునిక మార్గ నిర్దేశకత్వంతో పాటు, మెరుగైన సాఫ్టువేరుతో, ప్రయాణంలో అనేక చోట్ల మనూవర్ చేసే సామర్థ్యంతో, బాగా ఎత్తుల నుండి దూకే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఎత్తు నుండి దూకే సామర్థ్యంతో, బ్రహ్మోస్ పర్వతాల వెనుక దాగిన లక్ష్యాలను ఛేదించగలదు. దీన్ని అరుణాచల్ ప్రదేశ్‌లో మోహరిస్తారు. ఇది నేలపైనున్న లక్ష్యాలను కేవలం 10 మీటర్ల ఎత్తు నుండి ఎంచుకుని, లక్ష్యం చుట్టుపక్కల వేరే ఏమీ విధ్వంసం జరక్కుండా సర్జికల్ దాడులను జరపగలదు. జలాంతర్గాములు, ఓడలు, విమానాలు, నేలపై ఉన్న మొబైల్ అటానమస్ లాంచర్లు మొదలైన వాటి నుండి దీన్ని ప్రయోగించవచ్చు.[54][55][56] 2011 ఆగస్టు 12 న, పదాతి బలగాలు దాన్ని పరీక్షించగా అది అన్ని పరీక్ష పరామితులనూ చేరుకుంది.[57] భారత సైన్యంలోని రెండో రెజిమెంటును ఆపరేషనలైజ్ చేసే క్రమంలో 2012 మార్చి 4 న సైన్యం దాన్ని పరీక్షించింది.[58] ఈ పరీక్షను పరిశీలించిన సీనియర్ సైనికాధికారుల్లో లెఫ్టెనెంట్ జనరల్ శ్రీకృష్ణ సింగ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) లెఫ్టెనెంట్ జనరల్ ఎకె చౌధురి ఉన్నారు. ఈ పరీక్షతో సైన్యంలోని బ్రహ్మోస్ రెండో యూనిట్ ఆపరేషన్లోకి వచ్చింది.[59]
2012 జూలై 29 న మరో పరీక్షను జరిపారు. ఇది 32 వ బ్రహ్మోస్ పరీక్ష. అది అన్ని పరామితులనూ చేరకపోయినా, పరీక్ష విజయవంతమైనట్లుగా భావించారు. క్షిపణి తయారీలో ఉపయోగించిన పవర్ సిస్టమ్స్, గైడెన్స్ స్కీము వంటి 25 ఉప వ్యవస్థలను పరీక్షించడం ఈ పరీక్ష లక్ష్యం.[60][61][62] భారతీయ పరిశ్రమలు తయారు చేసిన ఈ వ్యవస్థల్లో ఒక్కటి తప్ప మిగతావన్నీ అనుకున్న విధంగానే పనిచేసాయి. పనిచెయ్యని ఆ ఒక్క వ్యవస్థ కారణంగా క్షిపణి వేగం పరిమితి కంటే పెరిగిపోవడంతో యాత్రను అర్థంతరంగా ముగించేసారు. లోపాన్ని సరిచేసి మరిన్నిఅభివృద్ధి పరీక్షలను ప్రకటించారు.[63]
2014 ఏప్రిల్ 7 న, పర్వత ప్రాంత యుద్ధాల కోసం మార్పు చేర్పులు చేసిన బ్లాక్ 3 క్షిపణిని పరీక్షించారు. దీన్ని ఈస్టర్న్ ఆర్మీ కమాండ్, పనాగర్‌లో మోహరిస్తారు.[64][65]
2014 జూలై 8 న బ్రహ్మోస్ యొక్క 44 వ పరీక్ష జరిపారు. సూపర్సోనిక్ డైవ్ మోడ్‌లో భూమిపై ఉన్న లక్ష్యంపై చేసిన తొలి పరీక్ష ఇది. భారత్ తయారు చెసిన కొత్త సాఫ్టువేరు అల్గారిదమ్, బహుళ ఉపగ్రహ దిక్సూచికత్వం మొదలైన అంశాలతో మామూలుగా ఉండే హోమింగ్ వ్యవస్థ లేకుండా ఈ పరీక్ష జరిపారు.[66] మార్గ నిర్దేశకత్వం కోసం భారత్ తయారు చేసిన కొత్త చిప్ G3OM ను వాడారు. ఇది 17 గ్రాముల బరువు ఉంటుంది. ఇది అమెరికా రష్యాల ఉపగ్రహ దిక్సూచిలను వాడి 5 మీటర్ల లోపు కచ్చితత్వాన్ని ఇస్తుంది. దీన్ని ఇనర్షియల్ నేవిగేషన్ వ్యవస్థతో కలిసి పనిచేసి, సీకర్ ఎమీ లేకుండానే మెరుగైన కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుంది.[67][68]
2018 మార్చి 22 న మొదటిసారి భారతీయ సీకర్‌తో బ్రహ్మోస్‌ను పరీక్షించారు. [69] భారతదేశం అభివృద్ధి చేసిన ప్రొపల్షన్ సిస్టమ్, ఎయిర్‌ఫ్రేమ్, విద్యుత్ సరఫరాలతో 109 సెప్టెంబరు 30 న పరీక్షించారు.[70]
2020 సెప్టెంబరు 30 న, మరింత ఎక్కువ పరిధి గల బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి 400 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వద్ద లక్ష్యాలను ఛేదించగలదు. డిఆర్డిఓ వారి పిజె -10 ప్రాజెక్టు కింద ఈ పరీక్ష జరిగింది. దీని కింద క్షిపణిలో దేశీయ బూస్టరును వాడారు. ఒడిశాలోని భూ స్థిత సౌకర్యం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు.[71]
జలాంతర్గామి నుండి ప్రయోగించే బ్రహ్మోస్ రూపాన్ని 2013 మార్చి 20 న విశాఖపట్నం వద్ద నీటి లోపల ఒక పాంటూనుపై నుండి విజయవంతంగా ప్రయోగించారు. నీటి లోపల నుండి నిట్టనిలువుగా చేసిన మొట్టమొదటి సూపర్సోనిక్ క్షిపణి ప్రయోగం ఇది.[72][73] దీన్ని 40-50 మీ లోతు నుండి ప్రయోగించవచ్చు.[74]
బ్రహ్మోస్-A గాల్లోంచి ప్రయోగించే రకం క్షిపణి. దీన్ని ఎస్యు-30ఎమ్‌కెఐ లో అమరుస్తారు. క్షిపణి బరువును 2.55 టన్నులకు తగ్గించడం కోసం, చిన్న బూస్టరును వాడడం, గాల్లో స్థిరత్వం కోసం రెక్కలను పెంచడం, కనెక్టరు స్థానాన్ని మార్చడం వంటి అనేక మార్పులు చేసారు. దాన్ని 500 నుండి 14,000 మీటర్ల ఎత్తు నుండి ప్రయోగించవచ్చు. ప్రయోగించాక, 100–150 మీటర్లు కిందకు పడిపోయి, అ తరువాత తన ప్రయాణం మొదలుపెడుతుంది. ముందు 14,000 మీటర్ల ఎత్తుకు చేరి, అంత్య దశలో 15 మీటర్లకు దిగిపోతుంది. ఎస్యు-30ఎమ్‌కెఐ ఒక బ్రహ్మోస్ క్షిపణిని మాత్రమే మోయగలదు.[75]
భారత్ నౌకా దళపు ఇల్యూషిన్ Il-38, తుపోలెవ్ Tu-142 విమానాలకు ఒక్కొక్క దానికీ ఆరేసి క్షిపణులను అమర్చాలని భావించారు. కానీ సరిపడినంత గ్రౌండు క్లియరెన్సు లేకపోవడం వలన IL-38 లోను, విపరీతమైన ఖర్చు కారణంగా Tu-142 లోను దీన్ని చేపట్టలేదు.[76][77]
2008 నాటికి గాల్లోంచి ప్రయోగించే రూపం సిద్ధమైంది.[78] ఈ క్షిపణిని బిగించేందుకు సుఖోయ్ ఎస్యు-30ఎమ్‌కెఐ స్ట్రక్చర్‌లో మార్పులేమీ చెయ్యనక్కరలేదని డిఆర్డివో, భారతీయ వాయుసేనల నిపుణుల కమిటీ పేర్కొంది.[79] 2011 కల్లా అవసరమైన పరీక్షలు చేసి, 2012 కల్లా వాయుసేనకు అందజేస్తామని బ్రహ్మోస్ ఏరోస్పేస్ మేనేజింగ్ డైరెక్టరు శివతాను పిళ్ళై చెప్పాడు.[80]
బ్రహ్మోస్ కు అనుగుణంగా మార్పులు చేసేందుకు రెండు ఎస్యు-30ఎమ్‌కెఐ లను రష్యాకు పంపించామని భారతీయ వాయు సేన 2009 జనవరి 10 న తెలిసింది.[81] బ్రహ్మోస్ గాల్లోంచి ప్రయోగించే క్షిపణి రూపాన్ని 2012 అంతానికి సిద్ధం చేస్తామని శివతాను పిళ్ళై తెలిపాడు. ఈ రూపం గాలిని పీల్చుకునే స్క్రామ్‌జెట్ సాంకేతికను వాడుతుంది. దీని ఇంధన సామర్థ్యం సాంఫ్రదాయిక రాకెట్ చోదిత క్షిపణి కంటే ఎక్కువ.[82][83]
6,000 కోట్ల రూపాయల ఖర్చుతో 200 వైమానిక రకం బ్రహ్మోస్‌లను కొనాలని 2012 అక్టోబరు 19 న రక్షణ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ తీర్మానించింది. బ్రహ్మోస్‌ను ఎస్యు-30ఎమ్‌కెఐ లో మేళవించే ఖర్చు కూడా ఇందులో కలిసి ఉంది. 2012 డిసెంబరు కల్లా మొదటి పరీక్ష జరపాలి. రెండు ఎస్యు-30ఎమ్‌కెఐ లను HAL తన నాషిక్ కేంద్రంలో తగువిధంగా మార్పులు చేస్తుంది.[84][85]
2016 జూన్ 25 న నాసిక్ లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్‌లో బ్రహ్మోస్-A యొక్క ప్రదర్శన జరిగింది. మార్పులు చెసిన సుఖోయ్ ఎస్యు-30ఎమ్‌కెఐ, బ్రహ్మోస్-A ను మోసుకుని విజయవంతంగా ఎగిరింది.[86] ఒక బరువైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఒక దూర శ్రేణి ఫైటర్ యుద్ధ విమానంతో మేళవించిన మొదటి సందర్భం అది. బ్రహ్మోస్ ను విమానాలకు అనుకూలంగా మార్చాలనే నిర్ణయం 2011 లోనే తీసుకున్నా, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, మేధో సంపత్తి హక్కుల బదిలీలలో ఎదురైన సమస్యల కారణంగా అది వెనకబడింది. క్షిపణిని మోసేందుకు ఎస్యు-30ఎమ్‌కెఐ అండర్క్యారేజీని బలోపేతం చెయ్యాల్సి వచ్చింది. 2017 నవంబరు 22 న బ్రహ్మోస్‌ను సుఖోయ్ ఎస్యు-30ఎమ్‌కెఐ నుండి విజయవంతంగా ప్రయోగించారు.[87] యుద్ధ విమానం నుండి ప్రయోగించిన తొలి ప్రయత్నంలోనే, బ్రహ్మోస్ విజయవంతంగా బంగాళాఖాతంలోని లక్ష్యాన్ని ఛేదించింది. బ్రహ్మోస్ ను విమానాలకు అనుకూలంగా మార్చడంలో ఖర్చు ఎంతో ఎక్కువ, కానీ ర్యామ్జెట్ పరిమాణాన్ని తగ్గించే ప్రయత్నం తరువాత, క్షిపణి పరిమాణాన్ని తగ్గించే ప్రయత్నాలను విరమించారు.[88] 40 ఎస్యు-30 విమానాలకు ఈ క్షిపణిని అమర్చుతారు.[89]
భారతీయ వాయుసేన ఎస్యు-30 ఎంకెఐ నుండి బ్రహ్మోస్‌ను ప్రయోగించి సముద్ర లోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన తరువాత, ఎస్యు-30 ఎంకెఐపై బ్రహ్మోస్-ఎ ను కూర్చడం పూర్తయిందని 2019 డిసెంబరు 17 న ప్రకటించింది.[90]
బ్రహ్మోస్-2 ఒక హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న ఈ క్షిపణికి 290 కి.మీ. పరిధి ఉంటుందని భావిస్తున్నారు. MTCR నిబంధనలకు లోబడి, బ్రహ్మోస్ లాగానే దీని పరిధిని కూడా 290 కి.మీ. కు పరిమితం చేసారు. మ్యాక్ 7 వేగం గల ఈ క్షిపణి, బ్రహ్మోస్ కంటే రెట్టింపు వేగంతో పోతుంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హైపర్సోనిక్ క్షిపణి ఇది.[91][92] దీని అభివృద్ధి పూర్తవడానికి 7–8 సంవత్సరాలు పట్టవచ్చు. [93]
బ్రహ్మోస్-NG (నెక్స్ట్ జనరేషన్) ప్రస్తుతం ఉన్న బ్రహ్మోస్‌కు మినీ రూపం. 290 కి.మీ. పరిధి, మ్యాక్ 3.5 వేగం, 1.5 టన్నుల బరువు, 5 మీ పొడవు, 50 సెం.మీ. వ్యాసంతో బ్రహ్మోస్-NG, బ్రహ్మోస్ కంటే 50 శాతం తేలిక గాను, 3 మీ. కురచగాను ఉంటుంది.[94][95] 2017 కల్లా ఈ వ్యవస్థ ఆపరేషన్ లోకి వస్తుంది.[96] బ్రహ్మోస్-NG కి బ్రహ్మోస్ కన్నా తక్కువ RCS (రాడార్ క్రాస్ సెక్షన్) ఉంటుంది -దీన్ని కనుక్కోవడం శత్రు రాడార్లకు కష్టం. బ్రహ్మోస్-NG కి భూమి, గాలి, ఓడ, జలాంతర్గామి రకాలు ఉంటాయి[97][98] బ్రహ్మోస్-NG ని మొదట్లో బ్రహ్మోస్-M గా పిలిచేవారు.
ఈ క్షిపణిని సుఖోయ్ ఎస్యు-30ఎమ్‌కెఐ, మిగ్-29K, తేజస్ విమానాల్లో మోహరిస్తారు. అలాగే డస్సాల్ట్ రఫేల్ విమానాల్లో కూడా మోహరిస్తారు. జలాంతర్గామి రకం క్షిపణి P75I తరగతి జలాంతర్గాముల నుండి ప్రయోగించే వీలు ఉంటుంది. 2013 ఫిబ్రవరి 20 న బ్రహ్మోస్ కార్పొరేషన్ 15 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కొత్త రకం క్షిపణిని ప్రదర్శించారు. సుఖోయ్ SU-30ఎమ్‌కెఐ విమానాలు మూడేసి క్షిపణులను మోయగా, మిగతా విమానాలు ఒక్కొక్క క్షిపణిని మోస్తాయి.
ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న నౌకా వ్యతిరేక క్షిపణుల్లో బ్రహ్మోస్ అత్యంత వేగవంతమైనది.[16][17] ఈ క్షిపణి మ్యాక్ 2.8 - 3.0 వేగంతో ప్రయాణిస్తుంది.[9] భూమ్మీదనుండి, ఓడ మీదనుండి ప్రయోగించగల రకాలు ఈసరికే మోహరించారు. విమానం నుండి, జలాంతర్గామి నుండి ప్రయోగించగల రకాలు ప్రస్తుతం పరీక్షల్లో ఉన్నాయి.[20] బ్రహ్మోస్-2 గా పిలుస్తున్న హైపర్సోనిక్ రకం క్షిపణి ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది. మ్యాక్ 7 వేగంతో ప్రయాణించగల ఈ క్షిపణితో గాల్లోంచి శీఘ్రంగా దాడి చేయగల సామర్థ్యం భారత్‌కు పెరుగుతుంది. 2017 నాటికి ఇది పరీక్షలకు సిద్దమౌతుందని భావిస్తున్నారు.[21]
బ్రహ్మోస్ క్షిపణి ఆధునిక రూపాన్ని అభివృద్ధి చెయ్యమని అబ్దుల్ కలామ్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ కు చెప్పాడు.[99] హైపర్సోనిక్ బ్రహ్మోస్ శత్రువుపై దాడి చేసి, వెనక్కి తిరిగి రావాలి అని చెప్పాడాయన.[100][101] ప్రస్తుతానికి మాత్రం అటువంటి UAV లేదా UCAV రూపాల అభివృద్ధి ప్రణాళికలేమీ లేవు.
భూతలం నుండి కేవలం 5 మీటర్ల ఎత్తులో ప్రయాణించి భూమిపై ఉన్న లక్ష్యాలను బ్రహ్మోస్ ఛేదించగలదు. అది ప్రయాణించగలిగే ఎత్యంత ఎత్తు 14000 మీటర్లు. దాని వ్యాసం 70 సెంమీ, రెక్కల వెడల్పు 1.7 మీ [102] దానికి మ్యాక్ 2.8 వేగమూ, 290 కి.మీ. పరిధీ ఉన్నాయి. ఓడ నుండి, నేలపై నుండి ప్రయోగించే రకాలు 200 కెజి ల వార్‌హెడ్‌ను గాల్లోంచి ప్రయోగించే రకం (బ్రహ్మోస్-ఎ) 300 కెజి ల వార్‌హెడ్‌నూ మోసుకుపోగలవు. దీనికి రెండంచల ప్రొపల్షన్ వ్యవస్థ ఉంది. తొలి వేగం పుంజుకునేందుకు ఘన ఇంధన రాకెట్టు, తదుపరి సూపర్సోనిక్ ప్రయాణం కోసం ద్రవ ఇంధన ర్యామ్జెట్ ఉన్నాయి. ఈ ర్యామ్జెట్ ఇంజను సాంప్రదాయిక రాకెట్ ఇంజన్ల కంటే మెరుగైన ఇంధన సామర్థ్యం కలిగి, వాటికంటే ఎక్కువ దూరం ప్రయాణించగలవు.[16]
భారత రష్యాల సంయుక్త భాగస్వామయంలో తయారైన బ్రహ్మోస్ క్షిపణి 2004 నుండి అనేక ప్లాట్‌ఫారాల మీద అనేక పరీక్షలకు లోనైంది. రాజస్థాన్, పొఖ్రాన్ లో నేలపైనుండి ప్రయోగించే పరీక్ష జరిగింది. దీనిలో మ్యాక్ 2.8 వేగంతో ప్రయాణిస్తూ 'S' మనూవర్ చెయ్యడాన్ని కూడా ప్రదర్శించారు. అలాగే సముద్రంలో లాంచి మీద నుండి నేల మీద దాడి చేసే సామర్థ్యాన్ని పరీక్షించారు.[103]
ప్రాథమికంగా బ్రహ్మోస్ నౌకా వ్యతిరేక క్షిపణి ఐనప్పటికీ బ్త్రహ్మోస్ బ్లాక్ 3 నేలపైని లక్ష్యాలను కూడా ఛేదించగలదు. దీన్ని నిట్టనిలువుగా గానీ, ఏటవాలుగా గానీ లేచి, 360 డిగ్రీల దిక్చక్రంపై ఎక్కడైనా లక్ష్యాలను ఛేదించగలదు ఒకే రూపంతో గల బ్రహ్మోస్‌ను నేల, నీటిపైన, నీటికింద నుండి ప్రయోగించ వచ్చు. [16][104] గాల్లోంచి ప్రయోగించే బ్రహ్మోస్‌కు బూస్టరు చిన్నదిగా ఉండి, అదనపు తోక రెక్కలు కలిగి ఉంటుంది. ప్రస్తుతం బ్రహ్మోస్‌ను ఎస్యు-30ఎమ్‌కెఐ లలో అమర్చుతున్నారు.[102] 2010 సెప్టెంబరు 5 న ప్రపంచపు మొట్టమొదటి సూపర్సోనిక్ డైవ్ చేసి రికార్డు సృష్టించింది.[105]
వచ్చే పదేళ్ళలో 2,000 బ్రహ్మోస్ క్షిపణులు తయారు చెయ్యాలని 2008 లో భారత్ రష్యాలు సంకల్పించాయి. వాటిలో దాదాపు సగాన్ని మిత్ర దేశాలకు ఎగుమతి చేస్తారు.[102][114]
2013 ఏప్రిల్ నాటికి, భారతీయ నావిక దళానికి చెందిన 8 యుద్ధ నౌకలలో చేర్చుకున్నారు.[28] అవి:
2007 జూన్ 21 న బ్రహ్మోస్ బ్లాక్ 1 సైన్యంలో చేరింది.[38] భారత సైన్యపు మూడు రెజిమెంట్లలో బ్రహ్మోస్‌ను చేర్చుకున్నారు.[124] ఈ రెజిమెంట్లన్నీ సైన్యపు 4041 ఆర్టిలరీ డివిజన్లలో భాగం:[13][125]
బ్రహ్మోస్ ను రష్యా నేవీకి చెందిన గోర్షకోవ్ తరగతి ఫ్రిగేట్లకు బిగిస్తారు.[126][127] బ్రహ్మోస్ పరిమాణం రష్యాకు చెందిన కొత్త ఓడలకు బిగించడం కష్టమౌతుందని రష్యా రక్షణ శాఖ తెలిపింది.[128]
వియత్నామ్, [129] దక్షిణాఫ్రికా, ఈజిప్టు, ఒమన్, బ్రూనై, వెనెజులా లాంటి అనేక దేశాలు ఈ క్షిపణి పట్ల ఆసక్తి చూపించాయి. బ్రహ్మోస్ కొనుగోలుపై చిలీ, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇండోనేసియా దేశాలతో చర్చలు జరుగుతున్నాయని 2010 ఫిబ్రవరిలో ఒక సీనియర్ అధికారి తెలిపాడు.[130] మలేసియా కూడా తన కెడా తరగతి యుద్ధనౌకలపై[131] యుద్ధ విమానాలపై[132] మోహరించేందుకు బ్రహ్మోస్ కొనాలని ఆలోచిస్తోంది. భారత వియత్నామ్ ల మధ్య చర్చలు జరుగుతున్నాయి.[133] అనేక ఆగ్నేయాసియా దేశాలు, లాటిన్ అమెరికా దేశాలు బ్రహ్మోస్ పట్ల ఆసక్తిగా ఉన్నాయని బ్రహ్మోస్ ఏరోస్పేస్ తెలిపింది. రష్యా, భారత్ ప్రభుత్వాల ఒప్పందం ప్రకారం ఎగుమతులను రెండు దేశాలూ ఆమోదించాలి.[134] 2016 చివరికల్లా ఒక ఏసియా పసిఫిక్ దేశంతో ఎగుమతి ఒప్పందం కుదరవచ్చని బ్రహ్మోస్ ఏరోస్పేస్ తెలిపింది.[135]
బ్రహ్మోస్‌ను ఎగుమతి ఎయ్యదలచిన దేశాలకు రష్యా మిత్ర దేశాలతో సత్సంబంధాలు లేకపోతే ఇబ్బంది అవుతుంది. చైనా తన పొరుగు దేశాలకు బ్రహ్మోస్ ఇవ్వడాన్ని అభ్యంతరపెట్టవచ్చు.[136] ఉదాహరణకు వియత్నామ్‌కు ఎగుమతి చేస్తే చైనాకు నచ్చకపోవచ్చు. [137] దక్షిణ చైనా సముద్ర వివాదంతో ముడిపెట్టి, ఈ ఎగుమతిని తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది.[138]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.