From Wikipedia, the free encyclopedia
భారత రక్షణ వ్యవస్థలో భాగమయిన భారత నావికా దళం (ఇండియన్ నేవీ) 55,000 సిబ్బందితో ప్రపంచంలో నాలుగవ అతి పెద్ద నావికా దళం. కేవలం దేశరక్షణకే కాకుండా మానవతా సహాయాలకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు సహాయం కొరకు భారత ప్రభుత్వం నేవీని వినియోగిస్తుంది.[1]
|
5,000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న భారతదేశంలో కీస్తు పూర్వం, 2300లో ప్రస్తుత గుజరాత్‌లోని మంగ్రోల్ దగ్గర మొట్టమొదటి నౌకాతీరం నిర్మించబడింది. క్రీ.పూ. 4వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్యంలో మొదటిసారి నౌకా విభాగాన్ని ఏర్పరిచారు. చంద్రగుప్త మౌర్యుడి ప్రధానమంత్రి అయిన చాణక్యుడు తాను రచించిన అర్థశాస్త్రంలో 'నవాధ్యక్ష' (నౌకల నిర్వాహకుడు) పేరుతో నదీజలాల వినియోగం గురించి నిర్దేశించాడు. చుట్టూ ఉన్న దేశాలతో రాకపోకలకు, పలు రకార సంస్కృతులకు ఈ జలదారులు ప్రధాన కారణం. భారతదేశ చరిత్రలో మౌర్య, శాతవాహన, చోళ, విజయనగర, కళింగ, మరాఠా, మొఘల్ సామ్రాజ్యాల నౌకా వ్యవస్థలు పేరెన్నికగన్నవి.
బ్రిటీషు ప్రభుత్వం భారతదేశాన్ని పాలిస్తున్నపుడు ది బ్రిటీష్ ఇండియన్ నేవీని ఏర్పరిచారు. ఇది 1946 నాటికి 78 ఓడలు 2,000 సిబ్బంది కలిగి ఉండేది. జనవరి 26, 1950న భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చిన రోజున నౌకాదళానికి ఇండియన్ నేవీగా, వాహకాలకు ఇండియన్ నావల్ షిప్స్ (INS)గా పేరు పెట్టారు.
1961లో జరిగిన ఆపరేషన్ విజయ్‌లో నేవీ మొట్టమొదటిసారి యుద్ధంలో పాల్గొన్నది. గోవాను పాలిస్తున్న పోర్చుగీస్ సైన్యం సముద్రంలోని ఒక ద్వీపం వద్ద ఉన్న భారత వ్యాపార నౌకల పైన దాడి చేయడంతో భారత ప్రభుత్వం నేవీని రంగంలోకి దింపగా, నౌకలు సైన్యాన్ని, ఆయుధాలను త్వరితగతిన చేరవేసాయి. INS ఢిల్లీ ఒక పోర్చుగీస్ నౌకను ముంచివేసిన కొద్దిసేపటికే పోర్చుగీసు సైన్యం ఓటమిని అంగీకరించి గోవాను వదిలి వెళ్ళారు.
1965లో జరిగిన భారత్-పాక్ యుద్దంలో నేవీ ఎక్కువ పాల్గొనకపోయినా తీరప్రాంతాల పరిరక్షణలో కీలకపాత్ర వహించింది. 1971లో జరిగిన భారత్-పాక్ యుద్దంలో నేవీ విశిష్టమయిన పాత్ర పోషించింది. పాకిస్తాన్‌కు సహాయంగా అమెరికా తన అణునౌక అయిన USS Enterpriseను పంపగా దానిని ఎదుర్కొనేందుకు సోవియట్ నేవీ సబ్మెరైన్ల సహాయంతో INS విక్రాంత్ సిద్దమయింది. చివరిక్షణంలో USS హిందూ మహాసముద్రం నుండి తప్పుకొని వెళ్ళిపోయింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ దగ్గర ఉన్న అత్యంత ప్రమాదకరమయిన పి.ఎన్.ఎస్. ఘాజీ జలాంతర్గామిని ధ్వంసం చేసి సముద్రంలో ముంచివేసిన ఘనత INS రాజ్‌పుత్‌కు దక్కుతుంది. INS నిర్ఘాట్, INS నిపత్ లు కరాచీ పోర్టును చుట్టుముట్టి మిగిలిన పాకిస్తాన్ పోర్టులతో రాకపోకలను, పాక్ సైన్యానికి సహాయాన్ని అడ్డుకొని భారతదేశానికి విజయాన్ని అందించడంలో ముఖ్యపాత్ర వహించాయి.
2004లో దక్షిణ భారతదేశాన సునామీ సంభవించినపుడు కొద్ది గంటల్లోనే నేవీ 27 నౌకలు, 19 హెలికాప్టర్లు, 6 యుద్ధ విమాన నౌకలు, 5,000 సిబ్బందితో ముందుగా సహాయ చర్యలు చేపట్టింది. నేవీ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సహాయచర్యలు చేపట్టడం ఇదే ప్రథమం. కేవలం మనదేశంలోనే కాక, చుట్టు పక్కల ఉన్న సునామీ బాధిత దేశాలలో కూడా భారత నేవీ సహాయాన్ని అందించింది.
ఇండియన్ నేవీలో ఉన్న అన్ని నౌకల పేర్లు INS (అనగా Indian Naval Ship) తో మొదలవుతాయి. స్వదేశీయంగా నిర్మించిన నౌకలే కాకుండా విదేశాలనుండి కొనుగోలు చేసిన నౌకలతో నేవీ ఎప్పటికప్పుడు యుద్ధనౌకా సంపత్తిని పెంచుకుంటున్నది. ఈ యుద్ధనౌకలను వివిధ తరగతులుగా విభజించారు. అందులో ప్రధానమయినవి:
భారతదేశంలో నిర్మించబడిన 3 అత్యాధునిక, అతిపెద్ద విధ్వంస నౌకలు ఢిల్లీ తరగతికి చెందినవి. యుద్ధ సమయంలో మిగిలిన యుద్ధనౌకల సమూహాన్ని సబ్మెరైన్ల దాడులనుండి, విమాన దాడులనుండి కాపాడుతూ రక్షణ కవచాన్ని కల్పించడం ఈ తరగతి నౌకల ముఖ్యోద్దేశం. సోవియట్, పాశ్చాత్య దేశాల సాంకేతికలను మరింత అభివృద్ధి చేసి ఈ నౌకల నిర్మాణాన్ని 1977లో ముంబాయిలో మొదలు పెట్టారు. ఒక్కో యుద్ధ నౌక బరువు 6,700 టన్నులు. ఈ నౌక తాను ఉన్న ప్రదేశమునుండి 350 కిమీ చుట్టుపక్కల ఉన్న అన్ని నౌకలను, విమానాలను, సబ్మెరైన్లను పసిగట్టిగలిగి 250 కిమీ లోపు ఉన్న వాటిని నిర్వీర్యం చేయగలదు. ప్రస్తుతం ఇందులో 30 మంది అధికారులు, 350 నావికులు పనిచేస్తున్నారు.
ఇవి సోవియట్ కషిన్ తరగతి విధ్వంస నౌకల ఆధారంగా నిర్మించబడినవి. ఇండియన్ నేవీలో బ్రహ్మోస్ సూపర్‌సానిక్ మిస్సైళ్ళను మొట్టమొదట ఈ నౌకలకే అమర్చారు. ఈ నౌకల బరువు 5,000 టన్నులు. పొడవు 147 మీటర్లు. ఇవి గంటకు 35 నాట్ల వేగంతో ప్రయాణించగలవు.
భారత నదుల పేర్లతో నిర్మింపబడిన నౌకలు ఈ తరగతికి చెందుతాయి. దీని బరువు 3,600 టన్నులు. పొడవు 126.4 మీటర్లు. ప్రస్తుతం ఈ తరగతిలో ఉన్న మూడు యుద్ధ నౌకలు: INS గోదావరి, INS గంగ, INS గోమతి.
శతృవుల సబ్మెరైన్లను సముద్ర గర్భంలో ముంచివేయడానికి, చిన్న నౌకలు లేదా గూఢచారి బోట్లను పసిగట్టి నాశనం చేయడానికి ఈ నౌకలను వినియోగిస్తారు. 3,250 టన్నుల బరువు, 124.8 మీటర్ల పొడవు ఉన్న ఈ నౌకలో ఒకేసారి ఎనిమిది మిస్సైళ్ళను శత్రునౌకల పైన ప్రయోగించగలిగే సౌకర్యం ఉంది. 16 కేజీలు బరువు కలిగిన బాంబులను ప్రయోగించగల 100 మిల్లీమీటర్ల గన్ ఎల్లవేళలా సిద్దంగా ఉంటుంది. మరి ఏ ఇతర నౌకలో లేని అత్యాధునికమైన రాడార్, సోనార్ సదుపాయాలు ఇందులో ఉన్నాయి.
ప్రస్తుతం ఇండియన్ నేవీలో 16 సబ్మెరైన్లు (జలాంతర్గాములు) ఉన్నాయి. ఇందులో ఎక్కువ రష్యా, జర్మనీలనుండి కొనుగోలు చేసినవి. ఇందులో ప్రధానమయినవి సింధుఘోష్ తరగతికి చెందినవి.ఈ తరగతిలో మొత్తం 10 సబ్మెరైన్లు ఉన్నాయి. వీటి బరువు 3,000 టన్నులు. ప్రతి సబ్‌మెరైన్‌లో 220 కిమీ దూరంలోపు ఉన్న నౌకల పైన ప్రయోగించగలిగే మిస్సైళ్ళు ఉన్నాయి. ఈ సబ్మెరైన్లు సముద్రంలో 300 మీటర్ల లోతువరకు వెళ్లగలగి, 18 నాట్ల వేగంతో 45 రోజుల పాటు సముద్ర ఉపరితలాన్ని చేరుకోకుండా ప్రయాణించగలవు. 1985 నుండి అణు సబ్మెరైన్లను నిర్మించడానికి కల్పాక్కం వద్ద ఉన్న అణు కేంద్రంతో కలసి నేవీ కృషి చేస్తున్నది. 2010 నాటికి 6,000 టన్నులు బరువు కలిగి, పూర్తి అణు సామర్థ్యం కలిగిన సబ్‌మెరైన్‌ను, 2010-2025 నాటికి ఇలాంటివి మరో నాలుగు నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
భారత రక్షణ శాఖ తయారు చేసిన ఆయుధాలనే కాక విదేశాలతో, ముఖ్యంగా రష్యా, ఇజ్రాయిల్ మొదలయిన దేశాలతో సమ్యుక్తంగా నిర్మించిన ఎన్నో ఆయుధాలను నేవీ వినియోగిస్తుంది.
ప్రస్తుతం నేవీ దగ్గర ఉన్న ఆయుధాలు:
2004లో రష్యానుండి యుద్ధవిమానాలను చేరవేసే నౌక అయిన అడ్మిరల్ గోర్షకోవ్‌ను దాదాపు 1.5 బిలియన్ డాలర్లకు (~ 7,500 కోట్ల రూపాయలు) కొనుగోలు చేసింది. 800 మిలియన్ డాలర్ల (~ 4000 కొట్ల రూపాయలు) ఖర్చుతో చేపట్టిన మరమ్మత్తులు 2008-09నాటికి పూర్తి అయి ఈ నౌక నేవీలో చేరుతుంది.
2005 ఏప్రిల్‌లో భారత ప్రభుత్వం 37,500 టన్నుల బరువుకల విక్రాంత్ యుద్ధవాహకాల నౌకా నిర్మాణానికి 4,000 కోట్ల రూపాయలు కేటాయించింది. 2004లో రక్షణ శాఖ దాదాపు $5.7 బిలియన్ డాలర్లు (దాదాపు 28,500 కోట్ల రూపాయలు) విలువయిన యుద్ధ సామగ్రి కొన్నపుడు, అందులో అధికభాగం నేవీకీ కేటాయించింది.
ప్రస్తుతం సబ్‌మెరైన్ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు చర్యలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రాబోవు 30 సంవత్సరాలలో 24 సబ్మెరైన్లు నేవీ అంబులపొదిలో చేరబోతున్నాయి. ప్రస్తుత మార్పులనుబట్టి హిందూ మహాసముద్ర ప్రాంతంలోని అన్ని దేశలలో భారత నావికా దళం అత్యంత బలమయినదిగా తయారవుతున్నదని చెప్పవచ్చు.
భుజం | ||||||||||
చేతులు | ||||||||||
ర్యాంకు | అడ్మిరల్ ఆఫ్ ది ఫ్లీట్¹ |
అడ్మిరల్ | వైస్ అడ్మిరల్ | రీర్ అడ్మిరల్ | కమ్మొడోర్ | కేప్టన్ | కమాండర్ | లెఫ్టినెంట్ కమాండర్ |
లెఫ్టినెంట్ | సబ్ లెఫ్టినెంట్ |
|
మిత్రదేశాలతో కలిసి భారత నౌకాదళం 2022 మార్చి ఒకటో తేదీ నుంచి మార్చి 4 వరకు మిలాన్-2022 నిర్వహించింది. ఇందులో వివిధ దేశాలకు చెందిన 26 యుద్ధనౌకలు, 21 యుద్ధ విమానాలు, ఒక సబ్‌మెరైన్ పాల్గొన్నాయి. సముద్రంలో కదులుతున్న నౌకపైకి హెలికాప్టర్ దిగడం, ఒక నౌకపై నుంచి మరొక నౌకపైకి వెళ్లడం, సబ్మెరైన్లను ఎదుర్కోవడం వంటి విన్యాసాలను ప్రదర్శించారు.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.