వీపు వెనుకభాగంలో వచ్చే నొప్పి. From Wikipedia, the free encyclopedia
నడుములో కలిగిన నొప్పిని నడుము నొప్పి (Back Pain) అంటారు.
90 శాతం మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో నడుము నొప్పితో బాధపతారని అంచనా. వీరిలో ఎక్కువమంది ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని ఊరుకుంటారు. చాలా సందర్భాల్లో ఈ నొప్పి దానికదే తగ్గిపోతుంది. కానీ వెన్నుపాములో సమస్య ఉంటే మాత్రం అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే కాళ్లు చచ్చుబడిపోయే ప్రమాదం కూడా ఉంది. కండరాలకు సంబంధించిన సాధారణ సమస్య నుంచి మూత్రపిండాలలో రాళ్లదాకా నడుము నొప్పికి కారణాలు చాలా ఉన్నాయి. అయితే వెన్నుపాములో సమస్యల వల్ల వచ్చే నడుమునొప్పి సర్వసాధారణం. ఎక్కువ మందిలో కనిపించేదీ... అలక్ష్యం చేస్తే ప్రమాదకరమైనదీ అయిన నడుంనొప్పి మాత్రం డిస్కు సమస్యల వల్ల వచ్చే నడుము నొప్పే.
శరీరానికి ఒక ఆకృతి రావడానికి ఉపయోగపడే వెన్నుపాములో 29 వెన్నుపూసలు ఉంటాయి. మెడ భాగంలో సి1 నుంచి సి 7 వరకు మొత్తం ఏడు వెన్నుపూసలు, ఆ తరువాత రొమ్ము భాగంలో ఉండే పన్నెండు వెన్నుపూసలు డి1 నుంచి డి12. ఇక నడుము భాగంలో ఉండే వెన్నుపూసలు అయిదు. అవి ఎల్1 నుంచి ఎల్5. ఆ తరువాత కాలి ఎముకలకు ముందు ఉండే వెన్నుపూసలను ఎస్1 నుంచి ఎస్5 గా పిలుస్తారు. ప్రతి రెండు వెన్నుపూసల మధ్య మెత్తని గిన్నె లాంటి నిర్మాణం ఉంటుంది. దీన్నే డిస్క్ (Intervertebral disc) అంటాం. దీని పై భాగం గట్టిగా ఉన్నా లోపల జెల్లీలాంటి పదార్థం ఉంటుంది. డిస్కులు వెన్నుపామును షాక్స్ నుంచి రక్షిస్తాయి. డిస్కులు జారడం వల్ల గానీ, అవి అరిగిపోవడం వల్ల గానీ నొప్పి మొదలవుతుంది. వెన్నుపూసల నుంచి బయలుదేరే నాడులన్నీ కలిసి పిరుదుల భాగంలో ఒక్క నాడిగా ఏర్పడి కాలి కింది భాగంలోకి వెళతాయి. ఈ నరాన్నే సయాటిక్ నరం అంటారు. డిస్కులో సమస్యలున్నప్పుడు ఏర్పడే ఏ నడుంనొప్పి అయినా ఈ సయాటిక్ నరం గుండా కాలిలోకి పాకుతూ వెళుతుంది. అందుకే డిస్కుల వల్ల కలిగే ఈ నడుంనొప్పిని సయాటికా (Sciatica) నొప్పి అని కూడా అంటారు.
రెండు వెన్నుపూసల మధ్య ఉండే డిస్కు జారడాన్నే డిస్క్ ప్రొలాప్స్ (Disc prolapse) లేదా స్లిప్డ్ డిస్క్ (Slipped disc) అని గానీ అంటారు. డిస్కు జారడమంటే గిన్నె లాంటి నిర్మాణం మొత్తం పక్కకు జారిపోతుందని అనుకుంటారు. కానీ డిస్కు పై భాగంలో పగులులా ఏర్పడి లోపలున్న జెల్లీ పదార్థం బయటకు వస్తుంది. ఇది డిస్కు వెనుక ఉన్న సై్పనల్ నరంపై ఒరిగిపోతుంది. దానివల్ల నరం ఒత్తిడికి గురయి నొప్పి వస్తుంది. ఏ వెన్నుపూసల మధ్య ఉన్న డిస్కు జారిందన్న దాన్ని బట్టి దాని వల్ల కనిపించే నొప్పి లక్షణాలు కూడా వేరుగా ఉంటాయి. లక్షణాలను బట్టి ఏ డిస్కు జారివుంటుందో కూడా చెప్పవచ్చు. ఉదాహరణకి ఎల్4, ఎల్5 వెన్నుపూసల మధ్య ఉండే డిస్కు జారినప్పుడు తొడ భాగంలో పక్కవైపు నుంచి కాలు కింది వరకూ నొప్పి ఉంటుంది. నడుంనొప్పి కన్నా కాళ్లలో నొప్పి ఎక్కువగా ఉంటుంది.
ఒక్కసారిగా పక్కకు తిరగడం, బరువు ఎత్తడం, వంగడం వల్ల నొప్పి మొదలవుతుంది. ఒక్కసారిగా కూర్చున్న చోట నుంచి లేచినా డిస్కు స్లిప్ అవుతుంది. జెర్క్ ఉన్న ఏ కదలిక వల్లనైనా డిస్కు జారవచ్చు. ఎల్5, ఎస్1 మధ్య ఉన్న డిస్కు జారితే తొడ వెనుక భాగం అంటే వెనుక వైపు తొడ నుంచి కాలి పాదం వరకూ నొప్పి ఉంటుంది.
డిస్కు అరిగిపోవడం ప్రారంభమైన తొలిదశలో నడుంనొప్పి అంత తీవ్రంగా ఉండదు. తరువాత ఎక్కువ అవుతుంది. ఎక్కువ సేపు కూర్చున్నా, నిల్చున్నా నొప్పి ఎక్కువ అవుతుంది. విశ్రాంతిగా ఉన్నప్పుడు తక్కువ అవుతుంది. డిస్కు అరుగుతున్నకొద్దీ సమస్య తీవ్రం అవుతుంది. డిస్కు అరిగిపోవడంతో రెండు వెన్నుపూసలు గీరుకుంటాయి. నరం ఒత్తిడికి గురవుతుంది. డిస్కు సమస్యలను ఎంఆర్ఐ స్కాన్ ద్వారా మాత్రమే క్లినికల్‌గా నిర్ధారించవచ్చు.
వయసురీత్యా కలిగే మార్పులలో వెన్నుపూసలు పక్కకు జరిగిపోవడం (స్పాండైలో లిస్థెసిస్) కూడా ఒకటి. చిన్న వయసులోనే వెన్నుపూసలు జరిగిపోయాయంటే మాత్రం ప్రమాదాలే కారణం. యాక్సిడెంట్ వల్ల వెన్నుపూసల వెనుక ఉండే లింకులో ఫ్రాక్చర్ వల్ల వెన్నుపూసలు పక్కకు జరుగుతాయి. ఇలాంటప్పుడే నడుంనొప్పి స్థిరంగా ఉంటుంది. ఇదీ సయాటికా నొప్పే. నిటారుగా ఉన్నవాళ్లు పక్కకు తిరిగినప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది. కింద కూర్చుని పైకి లేచేటప్పుడు కూడా నొప్పి పెరుగుతుంది. రెండు కాళ్లలోనూ నొప్పి ఉంటుంది. ఆడవాళ్లలో ఈ రకమైన నడుంనొప్పి ఎక్కువగా కనిపిస్తుంది.
రెండు వెన్నుపూసలను కలిపి ఉంచే కీళ్లను ఫాసెట్ జాయింట్స్ అంటారు. మోకాలి కీళ్ల లాగా ఇవి కూడా అరిగిపోవచ్చు. అలా అరిగిపోయినప్పుడు నడుంనొప్పి మొదలవుతుంది. పిరుదులు, తొడ వెనుక భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఈ నొప్పి ఉదయం లేవగానే ఎక్కువగా ఉండి క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఎముకలు కదలకుండా ఉండడానికి వాటి చుట్టుపక్కల ఉన్న కండరాలు తోడ్పడతాయి. సాధారణంగా రాత్రిపూట కండరాలన్నీ రిలాక్స్‌గా ఉంటాయి. కాబట్టి ఉదయం సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది.
వెన్నుపాము ఇన్ఫెక్షన్లలో అతి సాధారణంగా కనిపించేది క్షయ. ఎముక టిబి వల్ల కూడా కనిపించే ముఖ్య లక్షణం నడుంనొప్పే. ఎముక టిబి ఉన్నవాళ్లలోరావూతిపూట నొప్పి ఎక్కువగా ఉంటుంది. నొప్పితో పాటు జ్వరం ఉంటుంది. బరువు తగ్గిపోతారు. ఆకలి ఉండదు. చెమట ఎక్కువగా పడుతుంది. టిబి వల్ల నరాలు దెబ్బతిని కాళ్లు చచ్చుబడిపోయే అవకాశం కూడా ఉంది.
వెన్నుపాము కింది ఎముకలో క్యాన్సర్ కణుతులు ఏర్పడినప్పుడు కూడా నడుంనొప్పి ఉంటుంది. ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గుతారు. కానీ జ్వరం మాత్రం ఉండదు.
అయిదు పదులు దాటిన తరువాత కొంతమంది మెల్లమెల్లగా ముందుకు వంగిపోతారు. వెన్నుపాము నిర్మాణంలో తేడా రావడం వల్ల పిరుదులు, తొడ భాగాల్లో నొప్పిగా ఉంటుంది. పడుకుని ఉన్నప్పుడు నొప్పి ఉండదు. వెన్నుపామును సాధారణ స్థితికి తేవడానికి కండరాలన్నీ ప్రయత్నించడం వల్ల నొప్పి మొదలవుతుంది.
90 శాతం మంది జీవితంలో ఏదో ఒక సమయంలో నడుంనొప్పితో బాధపడతారు. వీరిలో 80 శాతం మందికి ఆరువారాల్లోగా నొప్పి తగ్గిపోతుంది. మిగిలిన 20 శాతం మంది మాత్రం తీవ్రమైన నడుంనొప్పితో నిత్యం బాధపడుతుంటారని అంచనా. వీరిలో 10 శాతం మందికి మాత్రం ఆపరేషన్ అవసరం అవుతుందని అమెరికా అధ్యయనాలు తెలుపుతున్నాయి. అమెరికాలాంటి దేశంలోనే గణాంకాలు ఇలా ఉంటే ఇక మన ఇండియాలాంటి దేశంలో ఈ సమస్య మరింత ఎక్కువనే చెప్పాలి.
కొన్ని సందర్భాల్లో నడుము నొప్పి ఉన్నప్పటికీ దానికి వెన్నుపాముతో ఎటువంటి సంబంధం ఉండదు. అలాగని అశ్రద్ధ చేయడం పనికిరాదు. ఇలాంటప్పుడు ఇతరత్రా సమస్యలేవైనా ఉండవచ్చు. అయితే నొప్పి లక్షణాన్ని బట్టి అది ఏ అవయవానికి సంబంధించిన సమస్యో కొంతవరకు నిర్ధారించవచ్చు.
- కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు కూడా నడుంనొప్పి ఉంటుంది. అయితే ఇది అలా వచ్చి ఇలా పోతుంది. వచ్చినప్పుడల్లా పది నుంచి 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. నొప్పితో పాటుమూవూతంలో మంట ఉంటుంది. నొప్పి ఒకేచోట ఉంటుంది. కాళ్లలోకి పాకదు. ఒక్కోసారి కిడ్నీలో నీళ్లు నిండిపోయినప్పుడు (హైవూడోనెవూఫోసిస్) కొంచెం నొప్పిగా అనిపిస్తుంది. దీంతోపాటు మూత్రం తక్కువ లేదా ఎక్కువ సార్లు రావడం, ఇతరత్రా మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఉంటాయి.
- వెన్నెము కాకుండా కేవలం కండరాలకు సంబంధించిన నొప్పే అయితే గనుక ఆ కండరాన్ని ఉపయోగించినప్పుడు మాత్రమే నొప్పి ఉంటుంది. ఆ కండరం ఒత్తిడికి గురయ్యేలా బరువు ఎత్తినా, పక్కకు తిరిగినా నొప్పి ఉంటుంది.
- పాంక్రియోటైటిస్ లాంటి జీర్ణవ్యవస్థ సంబంధమైన సమస్యలున్నప్పుడు బొడ్డు నుంచి వెనక్కి నొప్పి వ్యాపిస్తుంది.
- గర్భాశయం, ఓవరీలలో సమస్యలున్నప్పుడు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ (పిఐడి) సమస్య వల్ల పిరుదుల భాగంలో నొప్పి, బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ నొప్పితో పాటు రుతు సంబంధ సమస్యలుంటాయి..
రకరకాల కారణాల వల్ల వచ్చే నడుమునొప్పి వెన్నుపాముకి సంబంధించినది, ప్రమాదకరమైనది అని చెప్పడానికి కొన్ని సంకేతాలున్నాయి. నొప్పి అందించే ఇలాంటి సంకేతాలను ఎంతమాత్రం అలక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలవాలి. సమస్యను ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా పరిష్కరించవచ్చు. ఆపరేషన్ అవసరాన్ని కూడా తగ్గించవచ్చు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.