From Wikipedia, the free encyclopedia
చాద్ (ఆంగ్లం: Chad) మధ్య ఆఫ్రికా లోని ఒక భూపరివేష్టిత దేశం. అధికారిక నామం చాద్ గణతంత్రం ("రిపబ్లిక్ ఆఫ్ చాద్"). ఉత్తరాన లిబియా, తూర్పున సుడాన్, దక్షిణంగా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, వాయవ్యంగా కామెరూన్, నైజీరియా, పశ్చిమంగా నైగర్ దీనికి సరిహద్దులుగా ఉన్నాయి. ఇక్కడి జనాభా సుమారు 1.60 కోట్లు. ఇందులో 16 లక్షలమందికి పైగా రాజధాని అంజమేనా నగరంలో నివసిస్తున్నారు.
చాద్ గణతంత్ర రాజ్యం | |
---|---|
గీతం:
| |
రాజధాని and largest city | అంజమేనా (N'Djamena) 12°06′N 16°02′E |
అతిపెద్ద నగరం | రాజధాని |
అధికార భాషలు | |
జాతులు (2009 Census[1]) |
|
మతం (2015)[2] |
|
పిలుచువిధం | చాదియన్ |
ప్రభుత్వం | యూనిటరీ ప్రొవిజనల్ గవర్నమెంట్ అండర్ మిలిటరీ[3] |
• సిఎంటి ఛైర్మన్ | మహమత్ డెబీ[3] |
• ప్రధాన మంత్రి | ఆల్బర్ట్ పాహిమి పడక్ |
శాసనవ్యవస్థ | ట్రాన్సినిషనల్ మిలిటరీ కౌన్సిల్[4][5][6] |
స్వాతంత్ర్యం | |
• గణతంత్ర్య రాజ్య స్థాపన | 1958 నవంబరు 28 |
• ఫ్రాన్సు నుంచి | 1960 ఆగస్టు 11 |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,284,000 కి.మీ2 (496,000 చ. మై.)[7] (20th) |
• నీరు (%) | 1.9 |
జనాభా | |
• 2020 estimate | 16,244,513[8] (70th) |
• 2009 census | 11,039,873[9] |
• జనసాంద్రత | 8.6/చ.కి. (22.3/చ.మై.) |
GDP (PPP) | 2018 estimate |
• Total | $30 billion[10] (123rd) |
• Per capita | $2,428[10] (168th) |
GDP (nominal) | 2018 estimate |
• Total | $11 billion[10] (130th) |
• Per capita | $890[10] (151st) |
జినీ (2011) | 43.3[11] medium |
హెచ్డిఐ (2019) | 0.398[12] low · 187th |
ద్రవ్యం | సెంట్రల్ ఆఫ్రికన్ ఫ్రాంక్ (XAF) |
కాల విభాగం | UTC+1 (వెస్ట్ ఆఫ్రికా టైమ్) |
వాహనాలు నడుపు వైపు | కుడి |
ఫోన్ కోడ్ | +235 |
Internet TLD | .td |
చాద్ ను పలు ప్రాంతాలుగా విభజించవచ్చు. ఉత్తరాన ఎడారి ప్రాంతం, మధ్యలో ఉష్ణమండల సహేలియన్ ప్రాంతం, దక్షిణాన సారవంతమైన సుడాన్ సవన్నా ప్రాంతం ఉన్నాయి. ఆఫ్రికాలోని రెండవ అతిపెద్ద సరస్సు అయిన చాద్ పేరు మీదుగా ఈ దేశానికా పేరు వచ్చింది. చాద్ సరస్సు ఆఫ్రికాలోనే అతిపెద్ద తడి ప్రాంతం. చాద్ అధికార భాషలు అరబిక్, ఫ్రెంచి. ఇక్కడ సుమారు 200కి పైగా జాతుల, భాషల వారు నివసిస్తున్నారు. ఇస్లాం (51.8%), క్రైస్తవం (44.1%) ఇక్కడ ప్రధానంగా ఆచరించే మతాలు.[2]
సా.పూ 7వ సహస్రాబ్ది మొదట్లో ఇక్కడ మానవులు నివసించారు. సా.పూ 1వ సహస్రాబ్దిలో సహేలియన్ భూభాగంలో అనేక చిన్న రాజ్యాలు ఏర్పడి కొంతకాలానికి అంతరించి పోయాయి. వీరంతా ఈ ప్రాంతం గుండా వెళ్ళే సహారా రవాణా మార్గాలను నియంత్రించడానికి ప్రయత్నించారు. 1920 లో దీనిని ఫ్రాన్స్ ఆక్రమించి తమ ఫ్రెంచి ఈక్విటోరియల్ ఆఫ్రికా వలస ప్రాంతంలో భాగం చేసుకున్నది. 1960 లో ఫ్రాంకోయిస్ టొంబల్బయె నాయకత్వంలో ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఉత్తర భాగంలో ముస్లింలలో ఇతని విధానాల పట్ల వచ్చిన వ్యతిరేకత వల్ల 1965 లో అంతర్యుద్ధం ఏర్పడింది. 1979 లో విప్లవకారులు అప్పటి పాలనను అంతం చేశారు కానీ అధికారం కోసం అంతర్గతంగా కుమ్ములాటలు మొదలయ్యాయి. హిసేనీ హబ్రి వచ్చి ఈ పరిస్థితిని చక్కదిద్ది అధికారంలోకి వచ్చాడు. 1978 లో చాద్ లిబియా మధ్య యుద్ధం వచ్చింది. అప్పుడు ఫ్రాన్స్ కలుగ జేసుకుని 1987 సంవత్సరంలో ఈ యుద్ధాన్ని అణిచివేసింది. 1990 హబ్రిని అతని కింద పనిచేసే సైనికాధికారి ఇద్రిస్ దెబీ పడగొట్టి అధికారంలోకి వచ్చాడు. 1991 లో సరికొత్తగా చాద్ నేషనల్ ఆర్మీ ఏర్పాటయింది. 2003 నుంచి సుడాన్ తో ఏర్పడ్డ సరిహద్దు విభేదాల వల్ల ఆ దేశం నుంచి వలస వచ్చిన వారితో ఈ దేశం మరిన్ని కష్టాల్లో పడింది.
చాద్ రాజ్యాంగంలో అనేక పార్టీలకు అవకాశం ఉన్నా దెబీ విధానాలతో ప్రతిపక్షాలకు సరైన అవకాశం లేకుండా పోయింది.[13][14][15] 2021 ఏప్రిల్ లో దెబీని కొంతమంది విప్లవ కారులు చంపేయడంతో అతని కుమారుడు మహమత్ దెబీ, సైన్యాధికారులతో కలిసి మధ్యంతర సంఘం ఏర్పాటు చేసి నేషనల్ అసెంబ్లీని రద్దు చేసి తాత్కాలిక ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. చాద్ దీర్ఘకాలంగా అనేక రాజకీయ పోరాటాల మధ్య హింసను ఎదుర్కొన్నది. మానవ అభివృద్ధి సూచీ ప్రకారం అట్టడుగు స్థాయిలో ఉంది. 2003 నుంచి ఈ దేశంలో ముడి చమురు నిక్షేపాలు కనుగొని వాటి వ్యాపారం ప్రారంభించారు. అంతకుమునుపు వీరు ఎక్కువగా పత్తి ఎగుమతి చేసేవారు. మానవ హక్కుల ఉల్లంఘన కూడా ఈ దేశంలో ఎక్కువగా ఉంది.
సా.పూ 7వ సహస్రాబ్దిలోనే, ప్రకృతి సహజ వాతావరణ పరిస్థితుల వలన ఉత్తర చాద్ ప్రాంతం జనావాసాలకు ఎంతగానో అనుగుణంగా ఉండేది. అందువలన, ఆ ప్రాంతంలో త్వరితగతిన జనాభా పెరుగుదల సంభవించింది. పురాతత్వ తవ్వకాలలో ఎప్పటివో సా.పూ 2000 ముందు కాలం నాటి గుర్తులు ఈ ప్రాంతములో దొరికినవి.[16][17] ఈ ప్రాంతములో 2000 సంవత్సరములకు పైగా ముఖ్యముగా వ్యవసాయము మీద ఆధారపడి స్థిర జీవనం సాగించారు. ఇది రకరకాల సంస్కృతులకు కూడలిగా నిలిచింది. ఇటువంటి సంస్కృతులలో మొట్టమొదటిది, ఎంతో పేరొందిన "సావో" సంస్కృతి. ఈ సంస్కృతి ప్రాముఖ్యం చక్కటి చేతి పనులు, మౌఖిక చరిత్రా విధానం. కానీ, సావో సంస్కృతిని "కానెమ్" రాజరికం నాశనం చేసింది. కానెమ్ రాజరికం చాద్ లో ఎక్కువకాలం మనగలిగి పరిపాలించిన రాజరికం. ఈ రాజరికములోనే, 1వ సహస్రాబ్ది ప్రాంతములో, చాద్ లోని సహెలియన్ ప్రాంతాన్ని అభివృద్ధిపరిచారు.[18][19] ఈ రాజరికం యొక్క శక్తి, సహారా వ్యాపార మార్గాల మీద వారి అధీనము, అధిపత్యము వలన వచ్చింది.[17] వీరు సామాన్యముగా ముస్లిము మతాన్ని అవలింభించేవారు. వారెప్పుడు చాద్ దక్షిణ ప్రాంతమును తమ అధిపత్యములోనికి తెచ్చుకొనలేదు. కాని, అప్పుడప్పుడు, బానిసలను లాక్కురావటానికి మాత్రం, దక్షిణ ప్రాంతం మీద దాడులు చేస్తూ ఉండేవారు.[20]
ఫ్రెంచి వలసవాదులు చాద్ ప్రాంతీయ సైన్యం అని 1900 సంవత్సరములో ఏర్పరిచి, తద్వారా 1920 కల్లా చాద్ ను తమ పూర్తి అధీనంలోకి తెచ్చుకున్నారు.[21] ఫ్రెంచి వారెప్పుడు, చాద్ లోని వివిధ వర్గాల మధ్య సయోధ్యత తీసుకురావటాని ప్రయత్నించలేదు. వారి పరిపాలనలో సరయిన విధానాలు లేవు. ఆధునీకరణ కూడా చాల స్వల్పంగా జరిగింది.[22]
ఫ్రెంచి వారికి, చాద్ ఒక పనికిరాని వలస ప్రాంతం మాత్రమే. చవకగా కూలీల కొరకు చాద్ వారికి ఉపయోగపడేది. 1929 కల్లా ఫ్రెంచి వారు, పత్తి ఉత్పత్తి చాద్ లో పెద్ద ఎత్తున మొదలు పెట్టించారు. ప్రెంచి వలసవాద ప్రభుత్వం సిబ్బంది కొరతతో బాధపడేది. ప్రాంతీయుల సహకారంతో పరిపాలన ఎలాగోలా నెట్టుకొచ్చేవారు. దక్షిణ ప్రాంతం మాత్రమే సవ్యంగా పరిపాలించబడేది. ఉత్తర, ప్రాచ్య ప్రాంతాలలో ఫ్రెంచి ప్రాబల్యం నామమాత్రమే. దీని మూలాన, విద్యా విధానం ఎంతగానో అశ్రద్ధ చేయబడింది.[17][22] రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఫ్రెంచివారు, చాద్ కు విదేశ ప్రాంత హోదా కలగచేసారు. చాద్ ప్రజలకు, తమ ప్రెంచి జాతీయ సభకు, చాద్ శాసనసభకి తమ ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం కలిగించారు. అప్పట్లో అతి పెద్ద రాజకీయ పార్టీ, చాదియన్ ప్రోగ్రెసివ్ పార్టీ. ఈ పార్టీ ఎక్కువగా దక్షిణ చాద్ లో ప్రాచుర్యంలో ఉండేది. ప్రాంకొయిస్ టొమ్బలబయ నాయకత్వంలో చాద్ ప్రజలు స్వాతంత్ర్యము కొరకు ఆందోళన జరిపినందువలన ఫ్రెంచి వారు, చాద్ కు 1960, ఆగస్టు 11 న స్వాతంత్ర్యం ఇచ్చి వెళ్ళిపోయారు. స్వతంత్ర చాద్ దేశపు మొదటి అధ్యక్షుడు ఆ ప్రాంతపు సారా జాతికి చెందిన పి.పి.టి. నాయకుడయిన ఫ్రాంకోయిస్ టొంబల్బయె.[17][23][24]
రెండు సంవత్సరాల తరువాత టొంబల్బయె ఇతర రాజకీయ పార్టీలన్నిటినీ నిషేధించి, తన పార్టీ ఒకటి ఉంచి, ఏక పార్టీ పాలనకు తెర తీసాడు. టొంబల్బయె నిరంకుశ పాలన, అతని చేతకాని విధానాలు, జాతుల మధ్య వైరుధ్యాన్ని పెంచి వారి మధ్య ఉద్రిక్తలకు దారి తీయటాని తోడ్పడ్డాయి. 1965 లో చాద్ దేశంలోని ముస్లిమ్ లు నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ చాద్ పార్టీ పేతురో అంతర్యుద్ధాన్ని మొదలు పెట్టారు. టొంబల్బయెను పదవీచ్యుతుణ్ణి చేసి 1975లో చంపివేశారు.[25] కానీ, అధికారం కోసం కొంతకాలం అంతర్యుద్ధం కొనసాగినది. 1979 లో హిస్సేనీ హబ్రి నేతృత్వంలోని విప్లవకారులు రాజధాని నగరాన్ని ఆక్రమించారు. దానివల్ల, కేంద్రీకృతమయిన అధికార పాలన అంతమయ్యింది. ఉత్తర ప్రాంతానికి చెందిన సాయుధ విప్లవ మూకల మధ్య అధికార పోరు కొనసాగినది.[26][27]
చాద్ ప్రాంతం ఇలా కుక్కలు చింపిన విస్తరి కావడం వల్ల ఫ్రాన్స్ కు ఆ దేశంలో పరపతి తగ్గిపోయింది. పొరుగు దేశమయిన లిబియా, చాద్ అంతర్యుద్ధములో వేలు పెట్టటానికి అవకాశం దొరికినది.[28] 1987లో లిబియా చాద్ లో చేయ తలబెట్టిన, సాహసం బెడిసికొట్టింది. మళ్ళీ, ఫ్రెంచి వారి ఆదరణతో అధ్యక్షుడు హిస్సెని హబ్రి చాద్ లో ఇంతకు మునుపెన్నడూ ఎరుగని దేశభక్తిని ప్రబోధించి, [29] లిబియా సైన్యాన్ని, చాద్ నుండి తరిమిగొట్టగలిగాడు.[30]
హబ్రి కూడా నియంతే. హబ్రి తన నిరంకుశ పాలనను అవినీతి, హింసలతో బలోపేతం చేసుకున్నాడు. వేలమంది ప్రజలు అతని పాలనలో చంపబడ్డారు.[31][32] హబ్రి తన తెగ అయిన టౌబూ వారినే దగ్గరకు తీసి, తన పూర్వ మిత్రులయిన జఘావ తెగవారిమీద సవతి తల్లి ప్రేమ చూపి, వారికి అన్యాయం చేసాడు. దీంతో, అసంతృప్తి పెరిగిపోయి, అతని సైనికాధికరయిన జెనరల్ ఇద్రిస్ దెబి, 1990వ సంవత్సరములో, హెబ్రెను పదవీచ్యుతుణ్ణి చేసి అధికారం చేజిక్కించుకున్నాడు.[33] హబ్రి చేసిన నేరాలను నిరూపించే ప్రయత్నంలో 2005 లో సెనెగల్ లో అతన్ని హౌస్ అరెస్ట్ చేశారు. 2013 లో అతను పాలనలో చేయించిన యుద్ధ నేరాలు నిరూపించబడ్డాయి.[34] 2016 మేలో అతను అత్యాచారం, లైంగిక బానిసత్వం, 40 వేల మందిని చంపడానికి పురమాయించడం లాంటి మానవ హక్కుల ఉల్లంఘన నేరాలు నిరూపించబడి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది.[35]
దెబీ వివిధ వర్గాల విప్లవకారులమధ్య సంధి కుదిర్చి, బహుళ పార్టీ వ్యవస్థను మళ్ళీ ప్రవేశపెట్టాడు."ప్రజా నిర్ణయం" ద్వారా కొత్త రాజ్యాంగాన్ని, చాద్ ప్రజలు ఆమోదించారు. 1996లో దెబీ అధ్యక్ష ఎన్నికలలో సునాయాసంగా గెలిచాడు. అతను రెండవసారి కూడా అధ్యక్ష పదవికి మరో ఐదు సంవత్సరాలు ఎన్నికయ్యాడు.[36] 2003 లో ముడి చమురు నిక్షేపాల కొరకు వెతకటం మొదలయ్యింది. దీనివల్ల, ప్రగతి జరిగి, శాంతి సౌభాగ్యాలతో తులతూగుతుందనుకున్న చాద్, లోలోపల రాజుకున్న అసంతృప్తి మూలంగా మళ్ళీ అంతర్యుద్ధంలోకి నెట్టబడింది. ఈసారి దెబీ ఏకపక్షంగా రాజ్యాంగాన్ని మార్చి, అధ్యక్షుడిగా ఏవ్యక్తి అయినాసరే రెండుసార్లకన్నా ఉండకూడదన్న నిబంధనను తీసిపారేశాడు. ఈ చర్యను మిగిలిన నాగరిక ప్రపంచం నిరసించింది.[37]
దెబీ 2006లో మూడవసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆ ఎన్నికను ప్రతిపక్షాలన్నీ బహిష్కరించాయి. తూర్పు చాద్ లో జాతుల మధ్య యుద్ధం చెలరేగింది. ఐక్యరాజ్య కాందిశీకుల అతున్నత అధికారి దర్ఫుర్ మాదిరి జాతుల ఊచకోత చాద్ లో జరిగే అవకాశం ఉన్నదని హెచ్చరించాడు.[38] 2006, 2008 సంవత్సరాలలో, విప్లవ సైన్యాలు, రాజధాని నగరాన్ని తమ సైనిక బలంతో ఆక్రమించ చూశాయి గాని, ఆ రెండు సందర్భాలలోను విజయం సాధించలేకపోయారు.[39] 2010 జనవరి 15 న చాద్, సుడాన్ కి మధ్య జరిగిన ఒడంబడిక ద్వారా ఐదేళ్ళ యుద్ధానికి తెరపడింది.[40] ఏడేళ్ళ తర్వాత తెరుచుకున్న చాద్, సుడాన్ సరిహద్దు మార్గాల ద్వారా సుడాన్ లో తలదాచుకున్న చాద్ రెబెల్స్ తిరిగి తమ దేశానికి వచ్చాయి. ఆ సరిహద్దును పరిరక్షించడానికి ఉమ్మడి సైన్యం నియమించబడింది. 2013 మే నెలలో చాద్ అధ్యక్షుడు ఇద్రిస్ దెబీ కొన్ని నెలలుగా సాగిన మీద హత్యాప్రయత్నాన్ని రక్షక దళాలు నిర్వీర్యం చేశాయి.[41]
చాద్ ప్రస్తుతం వివిధ దేశాలతో కూడిన పశ్చిమ ఆఫ్రికా కూటమిలో ప్రధాన భాగస్వామిగా బోకో హరాం,, ఇతర ఇస్లామిక్ తీవ్రవాదులతో పోరాటం జరుపుతోంది. 2021 ఏప్రిల్ 20న చాద్ అధ్యక్షుడు ఉత్తర ప్రాంతంలో యుద్ధంలో పోరాడుతుండగా మరణించాడని అధికార వర్గాలు ప్రకటించాయి.[42] దెబీ కుమారుడు మహమత్ దెబీ ఇత్నో ఆపద్ధర్మ అధ్యక్షుడిగా సైనిక వర్గాలు ప్రకటించాయి. ఆ తర్వాత సైనిక అధికారులు రాజ్యాంగంలో ఒక కొత్త అధికరణాన్ని చేర్చి మహమత్ దెబీకి అధ్యక్షుడిగా, సైన్యానికి నాయకుడిగా అధికారం కట్టబెట్టాయి.[43]
చాద్ ఉత్తర మధ్య ఆఫ్రికాలో విస్తరించిన పెద్ద భూపరివేష్టిత దేశం. దీని విస్తీర్ణం 12,84,000 చ.కి.మీ. ఇది ప్రపంచంలో 20 వ అతిపెద్ద దేశం. ఇది పరిమాణంలో పెరు కన్నా చిన్నది, దక్షిణాఫ్రికా కన్నా పెద్దది.[44][45]
ఆఫ్రికాలోని రెండవ పెద్ద సరస్సు చాద్. ఆ సరస్సు పేరుమీదగానే చాద్ దేశం ఏర్పడినది. చాద్ దేశాన్ని అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ చాద్ అని పిలుస్తారు. ఈ దేశానికి సముద్ర తీరం లేదు, అన్ని పక్కలా ఇతర దేశాల భూభాగమే. అందువలన, ఎగుమతి - దిగుమతులకు పొరుగు దేశాలమీద ఆధారపడవలసినదే. ఉత్తరాన లిబియా, తూర్పున సూడాన్, దక్షిణాన సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ ఉన్నాయి. అలాగే, కామెరూన్, నైగర్ కూడా చాద్ తో సరిహద్దుగల దేశాలు. సముద్ర ప్రాంతానికి దూరంగా ఉండటం వలన, ఈ దేశంలో ఎడారి వాతావరణం ఉంటుంది. చాద్ దేశం భౌగోళికముగా మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు. ఉత్తరాన ఎడారి ప్రాంతము. మధ్య ప్రాంతములో నిస్సారమయిన సహెలీయన్ ప్రాంతము, దక్షిణాన సారవంతమయిన సుడాన్-సవన్నా ప్రాంతము.[46] చాద్ లో పెద్ద నగరం 'ఎన్-జమీరా', అతి పెద్ద పర్వత శిఖరం 'ఎమి కౌస్సి'. చాద్ లో రెండు వందలకు పైగా జాతులు, భాషా సంబంధ సముదాయాలు ఉన్నాయి. ప్రభుత్వ భాషలు ఫ్రెంచి, అరబిక్. ఎక్కువ మంది ప్రజలు ఇస్లాం మతాన్ని అవలంభిస్తారు.
చాద్ రాజ్యాంగము ప్రకారము ఆ దేశపు అధ్యక్షునికి ఎనలేని అధికారాలు ఉన్నాయి. ఆయన రాజకీయాలలో ముఖ్య పాత్ర వహిస్తారు. అధ్యక్షుడు, ప్రధానమంత్రిని, అతని కాబినెట్ లో మంత్రులను నియమిస్తాడు. అంతేకాదు, సైనికాధికారులనూ, న్యాయమూర్తులను, ఇతర అధికారుల నియామకాలలో ఎంతో కీలక పాత్ర వహిస్తాడు.[47] దేశంలోని పరిస్థితులు బాగాలేనప్పుడు, శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం ఏర్పడినప్పుడు, అధ్యక్షుడు జాతీయ శాసనసభని సంప్రదించి, అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. అధ్యక్షుణ్ణి, ప్రజలే ఐదు సంవత్సరాల పదవీకాలానికి ఎన్నుకోవటం జరుగుతుంది. అధ్యక్షుడు రెండు సార్లకన్నా ఎన్నిక కాకూడదనే నియమం ఇదివరకు ఉండేది కాని, 2005 సంవత్సరములో ఈ నియమాన్ని తొలగించారు.[48] అంటే ఒక వ్యక్తి ఎన్ని సార్లయినా అధ్యక్షుడిగా ఎన్నిక కావచ్చును.
ప్రభుత్వంలో కొద్ది మంది దక్షిణ ప్రాంతానికి చెందిన వారు, ప్రతిపక్షాల వాళ్ళు ఉన్నప్పటికీ దెబీ ముఖ్య సలహాదార్లలో ఎక్కువమంది, జఘావా తెగకు చెందినవారు.[49][50] అంతర్జాతీయ అవినీతి కొలత పద్ధతులు-2005 ప్రకారం, చాద్ ప్రపంచంలోకెల్లా ఎక్కువ అవినీతి గల దేశం. తరువాతి సంవత్సరాలలో ఏదో కొద్దిగా అవినీతి తగ్గినది. పది పాయింట్లు ఉన్న అవినీతి స్కేలు మీద, చాద్ కు1.8 మించి మార్కు రాలేదు. చాద్ కంటే అవినీతిలో పై చెయ్యిగా ఉన్నదేశాలు టోంగా, ఉజ్బెకిస్తాన్, హైతి, ఇరాక్, మ్యాయన్మార్ (బర్మా), సోమాలియా. అధ్యక్షుడు దెబెను విమర్శించేవారు, అతను తన అనుచరులకు మాత్రమే మేలు చేస్తాడని, తన తెగ వాళ్ళను మాత్రమే దగ్గరకు తీస్తాడని అరోపణలు చేశారు.
కొద్ది చోట్ల చాదియ న్యాయ విషయాలు అమలులో ఉన్నప్పటికె, ఎక్కువగా చాద్ లో న్యాయ శాస్త్రము, న్యాయస్థానాలు, ప్రెంచి న్యాయ విధానలనే అనుసరిస్తాయి. నాయమూర్తులకు పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పటికి, ముఖ్య న్యాయమూర్తులను నియమించేది మాత్రము అధ్యక్షుడే. న్యాయ నిర్ణాయక విధానంలో అతున్నతమైన సుప్రీం కోర్ట్, రాజ్యాంగ సభ 2000 సంవత్సరమునుండి పూర్తిగా పని చెయ్యటం మొదలు పెట్టాయి. సుప్రీం కోర్టులో అధ్యక్షుడిచే నియమించబడిన ప్రధాన న్యాయమూర్తితో పాటు, అధ్యక్షుడు, జాతీయు శాసనసభ కలసి నియమించిన 15 జీవితకాలపు సభ్యులు ఉంటారు. రాజ్యాంగ న్యాయస్థానమునకు తొమ్మిది మంది న్యాయ మూర్తులను తొమ్మిది సంవత్సరాల పదవీ కాలమునకు ఎన్నుకుంటారు. ఈ న్యాయస్థానము, దేశమునందు చేయబడిన చట్టాలు, ఇతర దేశాలతో ఒప్పందాలను అమలు చేయటానికి ముందు పరిశీలించే అధికారం కలిగి ఉంటుంది.
జాతీయ శాసనసభ దేశానికి అవసరమయిన చట్టాలను ప్రతిపాదించి, తయారు చేస్తుంది. ఇందులో 155 మంది సభ్యులు, వారి పదవీ కాలం నాలుగు సంవత్సరాలు. ఈ జాతీయ శాసనసభ సంవత్సరంలో మూడు సార్లు సమావేశమవుతుంది. ఈ విధమయిన సమావేశాలు మార్చి, అక్టోబరు మాసాలలో జరుగుతాయి. ఎప్పుడయినా ప్రధానమంత్రి కోరినప్పుడు అత్యవసర సమావేశం కూడా జరపటానికి అవకాశం ఉంది. ఇందులోని సభ్యులు రెండేళ్ళ పదవీ కాలానికి, అసెంబ్లీ అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు. శాసనసభ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపాదించిన చట్టాలను ఒప్పుకుని సంతకం చెయ్యటమో లేదా తిరస్కరించటమో పదిహేను రోజులలో చెయ్యవలసి ఉంటుంది. ప్రధాన మంత్రి యొక్క కార్యాచరణ విధానాలను జాతీయ శాసనసభ ఒప్పుకోవచ్చు లేదా ఎక్కువమంది సభ్యుల ఓటుతో నో కాన్ఫిడెన్స్ ప్రతిపాదించి ప్రధానమంత్రిని తొలగించవచ్చు. శాసనసభ కనుక ఒక సంవత్సరములో ప్రధాన మంత్రి కార్యాచరణను రెండుసార్లు తిరస్కరించినట్లయితే దేశాధ్యక్షుడు, శాసనసభని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలను జరిపించి కొత్త శాసనసభని ఏర్పాటుచెయ్యవచ్చు. నిజానికి, దేశాధ్యక్షుడు తన పార్టీద్వారా, జాతీయ శాసనసభ మీద పట్టు బిగించి ఉంటాడు. ప్రస్తుతాని దెబే తన దేశభక్త సాల్వేషన్ పార్టీకి జాతీయ శాసనసభలో ఉన్న మెజారిటీతో శాసనసభ మీద తన ప్రభావాన్ని చూపుతున్నాడు.
ప్రతిపక్షాలు వ్యతిరేకించే వరకు దెబీకి చెందిన పార్టీ ఒక్కటే ఉండేది.[49] కాని ఇప్పుడు 78 రాజకీయ పార్టీలు చురుకుగా పనిచేస్తున్నాయి.[51] 2005వ సంవత్సరములో జరిగిన రాజ్యాంగ సవరణ ప్రజాభిప్రాయ సేకరణను (Referendum) ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. కారణమేమంటే, ఈ ప్రజాభిప్రాయ సేకరణ దేశాధ్యక్షుడు రెండుసార్ల కన్న ఎక్కువ, ఎన్నిక కాకూడదన్న రాజ్యాంగ నిబంధన తొలగించి, తద్వారా దెబీ మూడవసారి ఎన్నిక కావటానికి మార్గాన్ని సుగమం చెయ్యటానికి మాత్రమే.[52]
దెబీకు వ్యతిరేకంగా అనేక సాయుధులైన విప్లవకారులు ఉన్నారు. వారిలో వారు కుమ్ములాడుకుంటున్నప్పటికి, వారందరి ఏకైక లక్ష్యం దెబీను పదవీచ్యుతుణ్ణి చెయ్యటమే.[53] ఈ విప్లవకారులు 2006 ఏప్రిల్ 13 లో రాజధాని మీద దాడి చేశాయి కాని ప్రభుత్వ దళాలు వారిని తిప్పి కొట్టాయి. ఈవిషయంలో, దెబెకు ఫ్రెంచి వారి సహాయం ఎంతయినా ఉంది. చాద్ విదేశాంగ విధానాలమీద ఫ్రెంచి వారి ప్రభావం చాలా ఉంది. ఫ్రెంచి వారు దాదాపు 1000 మంది తమ సైనికులను చాద్ లో ఇప్పటికి ఉంచారు.
దీర్ఘకాలం అధ్యక్షుడిగా ఉన్న ఇద్రిస్ దెబీ 2021 ఏప్రిల్ 20 న మరణించడంతో ఆ దేశపు నేషనల్ అసెంబ్లీ, ప్రభుత్వం రద్దు చేయబడింది. దీని స్థానంలో దెబీ కుమారుడు మహమత్ దెబీ, సైనికాధికారులతో కూడిన మధ్యంతర కూటమి ఒకటి ఏర్పాటు అయింది.[4][5][6] అక్కడి రాజ్యాంగం ప్రస్తుతానికి తాత్కాలికంగా రద్దులో ఉంది. దీని స్థానంలో కొత్త రాజ్యాంగం తీసుకు రావడం కోసం ఈ మధ్యంతర కూటమి ఒక కమిటీ వేయదలుచుకుంది. ఈ మధ్యంతర పాలన 18 నెలల పాటు సాగిన తర్వాత ఎన్నికలు ఉంటాయని మిలిటరీ సంఘం తెలియజేసింది.[54]
యునైటెడ్ నేషన్స్ వారి మానవాభివృద్ధి సూచీ ప్రకారం చాద్ ప్రపంచంలో ఏడవ అత్యంత పేద దేశం. ఈ దేశ జనాభాలో సుమారు 80% మంది దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారు. 2009 లో వీరి జిడిపి 1651 అమెరికన్ డాలర్లు. వీరి కరెన్సీ CFA ఫ్రాంక్. 1960 వ దశకంలో ఇక్కడ మైనింగ్ పరిశ్రమలు సోడియం కార్బొనేట్ ఉత్పత్తి చేసేది. కానీ సంవత్సరాల తరబడి సాగిన అంతర్యుద్ధాల వలన విదేశీ వ్యాపారస్తులు భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. 1979-82 మధ్యలో వెనక్కి వెళ్ళిన వారు ఇటీవలే ఆ దేశ భవిష్యత్తును చూసి మరల తిరిగి వస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి ఇక్కడ చమురు పరిశ్రమలో పెద్ద ఎత్తున విదేశీ నిధులు తరలి వస్తున్నాయి. దీంతో ఆర్థిక వ్యవస్థకు కొద్దిగా బలం చేకూరినట్లయింది. చమురు పరిశ్రమ అభివృద్ధి చెందక మునుపు పత్తి పరిశ్రమ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండేది. ఇప్పటికీ ఎగుమతుల్లో పత్తిదే అగ్రస్థానం.
ఎడతెరపిలేని అంతర్యుద్ధాల వలన చాద్ లో రోడ్డు రవాణా వ్యవస్థ పెద్దగా అభివృద్ధి చెందలేదు. 1987 నాటికి ఆ దేశంలో కేవలం 30 కి.మీ ల రోడ్లు మాత్రమే ఏర్పడ్డాయి. దీని తర్వాత వచ్చిన రోడ్డు సంస్కరణ ప్రాజెక్టులు రోడ్ నెట్వర్క్ ని 2004 నాటికి 550 కి.మీ వరకు అభివృద్ధి చేశాయి.[55][56] అయినప్పటికీ ఇక్కడి రహదారి సౌకర్యాలు పరిమితంగానే ఉన్నాయి. సంవత్సరంలో చాలా రోజులు ఈ రోడ్లు వాడకానికి అందుబాటులో ఉండవు. ఈ ప్రభుత్వానికి సొంత రైల్వే వ్యవస్థ లేనందున కామెరూన్ దేశం వారి రైల్వే సౌకర్యాలను ఉపయోగించుకుని వీరి ఓడరేవు దౌలా నుంచి ఎగుమతులు, దిగుమతులు చేస్తుంటారు.[57]
2013 నాటికి ఈ దేశంలో సుమారు 59 విమానాశ్రయాలు ఉన్నట్లు అంచనా. కానీ ఇందులో తొమ్మిదింటికి మాత్రమే రన్ వే వ్యవస్థ ఉంది.[58] అంజమేనా విమానాశ్రయం నుంచి ప్యారిస్ కు ఇతర ఆఫ్రికా దేశాలను విమానాలు వెళుతుంటాయి.
చాద్ లో టెలివిజన్ ప్రేక్షకులు దాని రాజధాని నగరం అంజమేనాకు మాత్రమే పరిమితం. ఇక్కడే ఒక చానల్ ఉంది. అది ప్రభుత్వం నిర్వహించే టెలి చాద్. రేడియో ఎక్కువ ప్రాబల్యంలో ఉంది. ఇక్కడ 13 ప్రైవేటు రేడియో స్టేషన్లు ఉన్నాయి.[59] వార్తా పత్రికలు ఉన్నా వాటి పంపిణీ, సర్క్యులేషన్ అంతంత మాత్రమే. దీనికి ముఖ్య కారణం వాటి రవాణా ఖర్చులు ఎక్కువ, అక్కడ అక్షరాస్యత తక్కువ కావడం, పేదరికం.[60][61][62] స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తపరిచే వీలున్నా కూడా అక్కడి ప్రభుత్వాలు వీటి మీద ఆంక్షలు విధిస్తూ ఉంటాయి. 2006 నుంచి ఇక్కడ మీడియా మీద ఆంక్షలు కూడా మొదలయ్యాయి.[63]
చాద్ వాటర్ అండ్ ఎలక్ట్రిక్ సొసైటీ సంస్థ సంవత్సరాల తరబడి వారి విద్యుచ్చక్తి వ్యవస్థను సరిగా నిర్వహించలేదు. ఇది రాజధానిలోని కేవలం 15% ప్రజలకు, మొత్తం ప్రజల్లో 1.5%కి మాత్రమే విద్యుత్ అందిస్తుంది.[64] మిగతా ప్రజలు బయో మాస్ ఇంధనాలు, పశువుల పేడ లాంటివి ఉపయోగించి శక్తి ఉత్పత్తి చేసుకుంటున్నారు.[61]
అనేక రకాల ప్రజలు, భాషల కారణంగా, చాద్ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. చాదియన్ ప్రభుత్వం చాద్ నేషనల్ మ్యూజియం, చాద్ కల్చరల్ సెంటర్ను ప్రారంభించడం ద్వారా చాదియన్ సంస్కృతి, జాతీయ సంప్రదాయాలను చురుకుగా ప్రచారం చేసింది.[65] ఇక్కడ 6 జాతీయ సెలవు దినాలతో పాటు, క్రైస్తవుల కోసం ఈస్టర్ మండే, ముస్లిముల కోసం ఈద్-ఉల్-ఫితర్, ఈద్-ఉల్-అదా, ఈద్-మిలాడి-నబి సెలవులు కూడా పాటిస్తారు.[64]
ఫుట్ బాల్ చాద్ లో అత్యంత ప్రాచుర్యమైన క్రీడ.[66] ఈదేశపు జాతీయ జట్టు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటుంది. ఈ దేశపు క్రీడాకారులు ఫ్రెంచి జట్లలో కూడా ఆడతారు. ఇంకా బాస్కెట్ బాల్, ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ కూడా ఆదరణ కలిగిన క్రీడలే. రెజ్లింగ్ ఆడేటప్పుడు జంతువుల వేషాలు వేసుకుని, శరీరానికి మట్టి పూసుకుని వారి సాంప్రదాయ పద్ధతుల్లో ఆడతారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.