గ్రంథచౌర్యం

From Wikipedia, the free encyclopedia

గ్రంథచౌర్యం

వేరొక కర్త భాష, ఆలోచనలు, భావాలు లేదా వ్యక్తీకరణలను తమ స్వంత రచనగా సూచించడాన్ని గ్రంథచౌర్యం అంటారు.[1][2] ఈ చర్యలను ఆంగ్లంలో ప్లేజియరిజం అని పేర్కొంటారు. శబ్ధకోష్ ఆంగ్ల-తెలుగు భాషా నిఘంటువు ప్లేజియరిజం అనే పదానికి కావ్యచోరత్వము, పదచోరత్వము, భావచౌర్యము, గ్రంథచౌర్యం అనే అర్థాలు సూచిస్తుంది.[3] గ్రంథచౌర్యం అనేమాట గ్రంథాన్ని చౌర్యం చేయడమని అర్థం సూచిస్తున్నా, 'ప్లేజియరిజం' పదం వలె ఈ పదాన్ని కూడా విస్తృతమైన పరిధిలో ఉపయోగిస్తారు. చలనచిత్రాలు, కథలు, పాటలు, స్వర రచనలు, కళాఖండాలు, ఔషధాల సూత్రాలు నకలు చేయడము, ఇంకా పరిశోధనా వ్యాసాలు/సిద్ధాంత గ్రంథాలు పరిశోధనా ఫలితాలు పూర్తిగా కానీ, కొంత భాగం కానీ చౌర్యం చేయడాన్ని గ్రంథచౌర్యంగా పరిగణిస్తారు. ఈ రకమైన చౌర్య కార్యకలాపాలు రచయితలు, కళాకారులు, పరిశోధకులకు నష్టం కలిగిస్తాయి.

Thumb

హెచ్.ఎం. పాల్, సాహిత్యంలో మూడు రకాల చౌర్యచర్యలను గమనించాడు- అబద్ధపు ప్రతులను సృష్టించటం (ఫోర్జరీ); బందిపోటుతనం; మూడవది గ్రంథచౌర్యం.[4] ఈ చర్యలను కొందరు కీర్తికోసం, మరికొందరు ధనాశతోటీ చేస్తారని ఇతడు పేర్కొన్నాడు.

శబ్దవ్యుత్పత్తి

గ్రంథచౌర్యానికి సంబంధించి ప్లేజియరిజం అనే పదం 1620లో ఆంగ్లంలోకి ప్రవేశపెట్టబడింది.[5] ఇది లాటిన్ పదం ప్లేజియారియస్ (plagiārius) అంటే అపహరించువానికి (కిడ్నాపర్), ప్లాజియం (plagium) అంటే అపహరించుటకు మూలం. అయితే ఒకటవ శతాబ్దంలో, రోమన్ కవి మార్షల్ 'ప్లాగియారియస్' (అక్షరాలా "కిడ్నాపర్") అను లాటిన్ పదాన్ని వేరొకరి పనిని దొంగిలించడాన్ని సూచించడానికి ఉపయోగించాడు. ఇతను 'తన పద్యాలను మరొక కవి అపహరించాడని ' ఫిర్యాదు చేశాడు. 1601 లో జాకోబీన్ శకంలో 'ప్లగారస్ (plagiarus) నుంచి ఏర్పడిన 'ప్లగారి (Plagiary)' అను ఒక ఉత్పన్న పదాన్ని బెన్ జాన్సన్ అను నాటక కర్త ఆంగ్లంలోకి సాహిత్య చౌర్యం వంటి నేరాన్ని చేసిన అపరాధుల గురించి వివరించడానికి పరిచయం చేశారు.[6] [7]

గ్రంథచౌర్య రూపాలు

విభిన్న వర్గీకరణలు విద్యాయుత గ్రంథచౌర్యానికి చెందిన వివిధ రూపాలను అంటే చర్యలను ప్రతిపాదించాయి. ఉదాహరణకు, 2015 వ సంవత్సరంలో 'టర్నిటిన్ ' చేసిన ఉపాధ్యాయుల, ఆచార్యుల సర్వే [8] ద్వారా విద్యార్థులు చేసే ప్రధాన గ్రంథచౌర్య చర్యలు పదింటిని గుర్తించారు:

  • వేరొకరి పనిని తమ స్వంతంగా సమర్పించడం.
  • ఉల్లేఖనాలను (సైటేషన్స్) చేర్చకుండా తమ స్వంత మునుపటి రచన నుండే కొన్ని భాగాలను తీసుకోవడం (స్వీయ-గ్రంథచౌర్యం)
  • మూలాలను సరిగ్గా ప్రస్తావించకుండా వేరొకరి పనిని వాడుకోవడం.
  • కొటేషన్లను ఉపయోగించినప్పటికీ, మూలాన్ని మాత్రం పేర్కొనకపోవడం.
  • మూలాలను పేర్కొనకుండా వివిధ వనరులను ఒకే రచనలో కలిపివేయడం.
  • ఉపయోగించిన అన్నిభాగాలనూ కాకుండా కొన్నింటిని మాత్రమే పేర్కొనడం.
  • ఒక భాగంలో పేర్కొనిన, పేర్కొనబడని విభాగాలను కలిపివేయడం.
  • సరైన అనులేఖనాలను అందించడం, కానీ వేరొకరి రచన నుంచి తీసుకున్న ఆలోచనల నిర్మాణం పదాలను తగిన విధంగా మార్చడం (పారాఫ్రేసింగ్)లో విఫలమవడం.
  • మూలాన్ని తప్పుగా పేర్కొనడం.
  • ఇతరుల పని లేదా రచన పై ఎక్కువగా ఆధారపడటం, అసలు తమ ఆలోచనను వచనంలోకి తీసుకురావడంలో విఫలమవడం

బ్లాగుల నుండి సమాచారాన్ని నకలు చేయడం, అతికించడం మొదలగునవి వివరించడానికి కంటెంట్ స్క్రాపింగ్ అనే పదం వాడటం మొదలయింది.[9] విరుద్ధ (రివర్స్) గ్రంథచౌర్యం అంటే నకలు చేయకుండానే ఆపాదించడం.[10] రచన చేయని వ్యక్తికి ఆ రచన చేసినట్లుగా హక్కును ఇవ్వడం లేదా మూలాన్ని తప్పుగా పేర్కొనడాన్ని ఇది సూచిస్తుంది. [11] [12]

గ్రంథచౌర్యం - చట్టపరమైన అంశాలు

గ్రంథచౌర్యాన్ని విద్యా సమగ్రతను ఉల్లంఘించడం, పాత్రికేయ నీతి అతిక్రమించడంగా భావిస్తారు. సాధారణంగా విద్యా, ప్రచురణ పరిశ్రమలలో ఇది నైతిక నేరం.[6] [13] నకిలీ తయారు చేయడము, మోసం.[14][15] గ్రంథస్వామ్య హక్కుల (కాపీరైట్) ఉల్లంఘన,[16] [17] నైతిక హక్కుల ఉల్లంఘన, [18] వంటివి న్యాయస్థానాలు అపరాధాలుగా పరిగణిస్తాయి. దీని వలన జరిమానాలు, పాఠశాల నుండి [19] లేదా పని నుండి [20] బహిష్కరించడం, గణనీయంగా అపరాధ రుసుము వసూలు చేయడం,[21] [22] జైలుశిక్ష వంటి ఆంక్షలు విధిస్తాయి.[23] [24] కొన్ని సందర్భాల్లో గ్రంథచౌర్యాన్ని దొంగతనం అని భావించినప్పటికీ, ఈ భావన చట్టపరంగా ఉనికిలో లేదు, అయినప్పటికీ చట్టరీత్యా మోసంగా, నైతిక హక్కులను ఉల్లంఘించినట్లుగా పరిగణించబడుతుంది.[25] 18వ శతాబ్దపు, కాల్పనిక సాహిత్య ఉద్యమంతో ముఖ్యంగా ఐరోపాలో ఈ చౌర్యం అనైతికము, మౌలికతే ఆదర్శం అను ఆధునిక భావన ఉద్భవించింది. అన్ని దేశాలలో గ్రంథచౌర్యంను ఒకేలా పరిగణించకపోవచ్చు. భారతదేశం, పోలాండ్ వంటి కొన్ని దేశాలు గ్రంథచౌర్యాన్ని నేరంగా భావిస్తాయి. గ్రంథచౌర్యానికి పాల్పడినందుకు కారాగార శిక్ష వేసిన సందర్భాలు ఉన్నాయి.[26]

గ్రంథచౌర్యం, గ్రంథస్వామ్య హక్కుల ఉల్లంఘన కొంతవరకూ ఒకదానికి ఒకటి పోలి ఉంటాయి, కానీ ఈ పదాలు ఒకే నిర్దిష్ట చర్యకు వర్తించినా సమానమైన భావనలు కావు.[27] గ్రంథస్వామ్యం ద్వారా పరిమితం చేయబడిన వనరులను హక్కుదారుల అనుమతి లేకుండా ఉపయోగించినప్పుడు గ్రంథస్వామ్య హక్కులను ఉల్లంఘించడం అవుతుంది. అయితే దీనికి విరుద్ధంగా, అసలు రచయితకు చెందాల్సిన విద్యా శ్రేయస్సును దొంగిలించడం, తప్పుడు వాదనల ద్వారా ప్రతిష్టను సాధించడం గ్రంథచౌర్యం అవుతుంది. అందువల్ల, ఈ గ్రంథచౌర్యం అనేది నైతిక నేరంగా పరిగణించబడుతుంది. ఇంకా అనేక రకాల గ్రంథచౌర్య కార్యక్రమాలు గ్రంథస్వామ్య హక్కుల ఉల్లంఘన పరిధిలోకి రావు.

గ్రంథచౌర్యం వివిధ రూపాలలో అన్ని రంగాలలో అగుపించినా, సృజనాత్మకతకి సంబంధించిన కళలు, పాత్రికేయ వృత్తి, విద్వత్సంబంధమైన కార్యక్రమాలు, విద్యారంగాలలో ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంటుంది. గ్రంథచౌర్యానికి శతాబ్దాల పురాతన చరిత్ర ఉన్నప్పటికీ, అంతర్జాల అభివృద్ధి, ఎలక్ట్రానిక్ మాధ్యమంలో కనిపించే ఇతరులకు సంబంధించిన మూలవాక్యాలను నకలు (కాపీ) చేసే చర్యలను చాలా సులభతరం చేసింది.[28]

పాత్రికేయ వృత్తి (జర్నలిజం)లో గ్రంథచౌర్యం

పాత్రికేయ వృత్తి ప్రజా విశ్వాసంపై ఆధారపడింది. ఒక పాత్రికేయుడు, వార్తాపత్రిక లేదా దూరదర్శన్ లలో వార్తా ప్రదర్శనలకు సంబంధించి, వాటి మూలాలను నిజాయితీగా ప్రదర్శించకపోవడం వలన వారు గ్రంథచౌర్య చర్యలకు పట్టుబడతారు, పాత్రికేయ వృత్తి సమగ్రత తగ్గుతుంది, విశ్వసనీయత బలహీనపడుతుంది. గ్రంథచౌర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న పాత్రికేయులను సంబంధిత వార్తా సంస్థ దర్యాప్తు చేస్తుంది.[29] గ్రంథచౌర్యం అనేది పాత్రికేయవృత్తిలో నైతిక నేరంగా పరిగణించబడుతుంది. గ్రంథచౌర్యానికి గురి అయిన విలేకరులు సాధారణంగా తాత్కాలిక తొలగింపు నుండి ఉపాధి రద్దు వరకు క్రమశిక్షణా చర్యలను ఎదుర్కొంటారు.[30]

కళలు, కావ్యాలలో గ్రంథచౌర్యం

Thumb
హిరోషిగే (ఎడమ) సంబంధించిన వుడ్‌బ్లాక్ ముద్రణను విన్సెంట్ వాన్ గోహ్ దాని కాపీతో పోల్చడం

సాహిత్యం, చరిత్ర, కళాకృతులు చాలావరకు సాంప్రదాయంపరంగా పునరావృతమవుతుంటాయి. కళాత్మక, సృజనాత్మకత చరిత్రలో గ్రంథచౌర్యం, సాహిత్య చౌర్యం, సముపార్జన, విలీనం, తిరిగి వ్రాయడం, పునశ్చరణ, పునర్విమర్శ, పునఃప్రచురణ, నేపథ్య వైవిధ్యం, వ్యంగ్యంగా తిరిగి ప్రస్తావించడం, పేరడీ, అనుకరణ, శైలీకృత చౌర్యం, ఒక కాలానికి చెందిన కళారూపాల అనుకరణ (పాస్టిచెస్), దృశ్య రూపకల్పన (కోల్లెజ్)‌లు వంటి అనేక రూపాలు, ఉద్దేశపూర్వక జోడింపులు కనపడుతూ ఉంటాయి.[31] [32] [33]. రుత్ గ్రాహం టి.ఎస్. ఎలియట్‌ను ఉటంకిస్తూ - "అపరిపక్వ కవులు అనుకరిస్తారు; పరిణతి చెందిన కవులు దొంగిలిస్తారు. చెడ్డ కవులు తాము తీసుకున్న వాటిని చెడగొడతారు", అని అన్నాడు. [34]

పురాతన తెలుగు కావ్యాల నుంచి ఆధునిక సాహిత్య రచనల వరకూ కూడా ఈ గ్రంథచౌర్య ప్రస్తావనలు కనపడతాయి. ఉదాహరణకి పదో శతాబ్దపు (900-950) లాక్షణికుడు రాజశేఖరుడు కావ్య మీమాంస అనే లాక్షణిక సూత్ర గ్రంథంలో, గ్రంథచౌర్యం గురించి ప్రస్తావిస్తూ శబ్దహరణప్రకరణంలో ఇలా అంటాడు:

  • "పుంసః కాలాతిపాతేన చౌర్యమన్యద్విశీర్యతి; అపి పుత్రేషు పౌత్రేషు వాక్చౌర్యం చ న శీర్యతి". (అంటే కొంత కాలం గడచిన తరువాత ఏ చౌర్యం అయినా సమసిపోవచ్చు కానీ, సాహిత్య చౌర్యం పుత్రపౌత్రాది పరంపరగా వెంటాడుతుంది)
  • నాస్త్యచౌరః కవిజనో నాస్త్య చౌరా వణిగ్జనః; స నన్దతి వినా వాచ్యం యో జానాతి నిగూహితుమ్. (అంటే గ్రంథ చౌర్యం చెయ్యని కవి ఉండడు. మోసం చెయ్యని వర్తకుడూ ఉండడు. చేసిన దొంగతనం గూఢంగా దాయగలవాడు వృద్ధిలోకి రాకుండా ఉండడు).[35]

ఇదే విధంగా బహుళ ప్రజాదరణ పొందిన 'అన్నమయ్యా పదాలను అనుకరిస్తూ కొందరు పదకవిత్వం వ్రాసారు. వారి భావ చోరత్వాన్ని నిరసిస్తూ వారిని 'ఛాయాపహరులు ' గా పేర్కొంటూ ఒక పద కవిత వ్రాసాడు.

  • ఉమిసిన తమ్మలో నొక కొంత కప్రం - సంకూర్చి చవిగొని చప్పరించనేల; అమరంగ ఛాయాపహారము చేసుక తమమాట గూర్చితే దైవము నగడా (ఒకరు తిని ఉమ్మి వేసిన దానికి కాస్త ఉప్పు కారం అద్ది చప్పరించడం ఎందుకు. అందుబాటులో ఉంది కదాని 'ఛాయాపహరము ' చేస్తే దైవము మెచ్చునా?)

ఈ విధముగా భావ చోరత్వాన్ని ఎక్కడికక్కడ ఖండిస్తూ అన్నమయ్య, కవితా రూపంలో స్పందించాడు.[36]

Thumb
హన్నా గ్లాస్సే తన పుస్తకం మొదటి అధ్యాయం, ది ఆర్ట్ ఆఫ్ కుకరీ మేడ్ ప్లెయిన్ అండ్ ఈజీ, 6 వ కూర్పు, 1758 లో పై భాగంలో కనపడుతున్న సంతకం, ప్రబలిన గ్రంథచౌర్యం నుంచి ఒక రక్షణ ప్రయత్నం.

విరుద్ద గ్రంథచౌర్య పోకడలు ప్రాక్పశ్చిమ దేశాల సాహిత్యంలో కనపడుతాయి. కేవలం డబ్బుకోసం, రాసిన తమ రచనలను, మరో ప్రసిద్ధ రచయిత పేరుతో అచ్చేసి, అమ్ముకునే సంఘటనలు చాలా జరిగాయి. వోర్టిగర్న్‌ (vortigerne) అన్న నాటకం షేక్స్‌పియర్‌ రాసిందేనని ఐర్లండ్‌ (W.H. Ireland) అనే అతను చాలాకాలం మోసం చేసి ప్రజలను నమ్మించాడు. జొనాధన్ స్విఫ్ట్ ‌ (Jonathan Swift), అలెగ్జాండర్ పోప్‌ (Alexander Pope) పేర్లతో పనికిరాని సాహిత్యాన్ని అచ్చు వేసారు అని తెలుస్తొంది. తెలుగు సాహిత్యానికి సంబంధించిన కథ ప్రకారం కృష్ణదేవరాయలు కూతురు మోహనాంగి 'మరీచీపరిణయము ' అనే కావ్యం రాసిందని, దానిని సంస్కరించి, సవరించి, పరిష్కరించి పునర్ముద్రించారు. అయితే చివరకి తెలిసినదేమిటంటే, 'కూచి నరసింహం పంతులు ' అనే అతను దీనిని రాసి, 'మోహనాంగి ' పేరుకు ఆపాదించారు. అలాగే, చిన్నయసూరికి గ్రంథచౌర్యం ఆపాదించే దురుద్దేశంతో బాలవ్యాకరణానికి సంస్కృతమూలం 'హరికారికలు ' అనే గ్రంథం మూలం అని 'శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి ' అనే అతను పేర్కొనడము జరిగింది. అలాగే 'భీమఖండం ' అనే కావ్యానికి మూలం స్కాందపురాణంలో ఉన్నదని శ్రీనాథుడు రాసాడు. ఆ సంస్కృతమూలం శ్రీనాథుడే రాసాడని పేర్కొన్నారు. [35]

విద్యా వ్యవస్థలో గ్రంథచౌర్యం

విద్యా విషయాలకు సంబంధించి "విపరీతమైన చౌర్యం" సంఘటనలు (కేసు) వెలుగులోకి వస్తుంటాయి. విద్యా సంబంధిత గ్రంథచౌర్యానికి ఒక విశ్వవ్యాప్తమైన నిర్వచనం లేదు.[37]. కానీ ఈ రకమైన చౌర్యానికి వివిధ ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు తమ నిర్వచనాలు పేర్కొన్నాయి. [38]

  • స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం " ఒకరు మరొక వ్యక్తి మౌలిక రచన, రచయిత లేదా మూలం, అంటే అది స్మృతి (కోడ్), సూత్రాలు, ఆలోచనలు, భాష, పరిశోధన, వ్యూహాలు, రచన లేదా ఇతర వాటితో రూపొందించబడినప్పటికిని సహేతుకమైన గుర్తింపు ఇవ్వకుండా ఉపయోగిస్తే అది గ్రంథచౌర్యం" అని నిర్వచించింది.[39]
  • యేల్ విశ్వవిద్యాలయం గ్రంథచౌర్యాన్ని "... మరొకరి పని, పదాలు లేదా ఆలోచనలను ఆపాదింపు లేకుండా ఉపయోగించడం", అని పేర్కొనింది. ఇందులో "... ప్రస్తావించకుండా, మూల రచన భాషను ఉపయోగించడం, మూలం నుండి సమాచారాన్ని ఉపయోగించడం ఇంకా ఆపాదింపు లేకుండా ఒక రూపంలోని పదాలు, వాక్యాలు మార్చి భావానువాదం (పారాఫ్రేజింగ్) చేయడం వంటివి ఉన్నాయి".[40]
  • ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం గ్రంథచౌర్యాన్ని "వేరొకరి భాష, ఆలోచనలు లేదా అసలు విషయాన్ని దాని మూలాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రస్తావించకుండా" ఉపయోగించడం" అని వర్ణించింది. [41]
  • బ్రౌన్ విశ్వవిద్యాలయం "... వేరొక వ్యక్తి ఆలోచనలను లేదా పదాలను (మాట్లాడిన లేదా వ్రాసిన) వారి నిజమైన మూలానికి ఆపాదించకుండా తాము సముపార్జించడం" అని గ్రంథచౌర్యాన్ని పేర్కొనింది.[42]
  • యు.ఎస్.నేవల్ అకాడమీ గ్రంథచౌర్యాన్ని " అసలు వ్యక్తికి సరైన ప్రస్తావన ఆపాదించకుండా మరొకరి పదాలను, సమాచారం, అంతర్దృష్టులు లేదా ఆలోచనలను ఉపయోగించడం" అని నిర్వచించింది.[43]
  • డ్యూక్ విశ్వవిద్యాలయం "ఈ గ్రంథచౌర్య సంఘటనలు ఉద్దేశపూర్వకంగా (వ్యూహాత్మక మోసం) లేదా అనుకోకుండా అయినా జ్ఞానం లేదా అజ్ఞానం వలన అయినా ఆమోదయోగ్యం కాదు"[44] అని నిర్ధారించింది.
Thumb
విద్యా సంబంధిత ప్లాగారిజంలో ఒక రూపం ఏమంటే ప్రచురించిన వ్యాసాన్ని సముపార్జించడం, అనుమానాన్ని నివారించడానికి కొద్దిగా సవరించడం.

గ్రంథచౌర్యం అంటే "మౌలికత నిర్దేశించే విద్యాసంబంధిత నేపధ్యంలో, విద్యా ప్రయోజనం పొందటానికి మూలానికి సముచితమైన గుర్తింపు ఆపాదించకుండా దాని ఆలోచనలు, భావనలు, పదాలు లేదా వాక్య నిర్మాణాలను ఉపయోగించుకొవడం" అని పేర్కొన్నారు.[45] విద్యార్థులు వారి పనిని చేయడానికి వేరొకరికి డబ్బు చెల్లించి మోసం చేసే విధానం ఈ చౌర్యానికి విపరీతమైన రూపం.[25] మౌలిక విషయంగా భావించబడే వాటిని గ్రంథచౌర్యం చేసిన (ప్లగారిస్ట్) వారికి, ప్రయోజనం కల్పించిన వారికి (ఉదాహరణకు, రచయిత, ప్రచురణకర్త, యజమాని లేదా ఉపాధ్యాయుడు) కూడా నైతిక నేరం ఆపాదించబడుతుంది. అయితే దీనిని కొన్ని దేశాలు ఒక వృత్తి పరమైన పనిని మెరుగుపరచే చర్యగా భావించి ప్రశంసిస్తాయి.[46] ఒక అంచనా స్థాయిలో విద్యాసంబంధిత సమర్పణలలో గ్రంథచౌర్యం అనుమతించినట్లయితే సంస్థకు చెందిన అన్ని విద్యా సంబంధిత గుర్తింపులు (అకడెమిక్ అక్రిడిటేషన్) తీవ్రంగా బలహీనపడతాయి.[47] అధ్యాపకులు, పరిశోధకులకు, తమ గ్రంథచౌర్య చర్యల వలన వారిపై ఉన్న సమగ్రత, విశ్వసనీయత కోల్పోవడంతో పాటు తాత్కాలికంగా తొలగించబడడం నుండి రద్దు వరకు ఆంక్షలు శిక్షలు ఉంటాయి.[48] [49] విద్యా, పరిశోధనా వ్యాసాలు ఉపసంహరించబడటానికి గ్రంథచౌర్యం ఒక సాధారణ కారణం.[50]

గ్రంథచౌర్యాన్ని ప్రభావితం చేసే అంశాలు

అనేక అధ్యయనాలు గ్రంథచౌర్యాన్ని ప్రభావితం చేసే కారకాలను పరిశోధించాయి. ఉదాహరణకు, జర్మన్ విశ్వవిద్యాలయాల విద్యార్థులతో ఒక సభ్య మండలి (ప్యానెల్) ఆరు నెలల్లో నిర్వహించిన అధ్యయనం, గ్రంథచౌర్యం ఎంత తరచుగా (ఫ్రీక్వెన్సీ) సంభవిస్తుందో అని అంచనా వేసింది.[51] గ్రంథచౌర్యం ద్వారా, విద్యార్థులు తరగతులలో తక్కువ శ్రేణులు పొందడం వంటి విద్యాపరమైన ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటారని పేర్కొన్నారు. ఇంకొక అధ్యయనం ప్రకారం, విద్యార్థులు గ్రంథచౌర్యాన్ని ప్రయోజనకరంగా భావించి, అవకాశం ఉంటే, వారు చాలా తరచుగా ఈ చర్యలకు పాల్పడతారు.[52] ఉపాధ్యాయులు విధించిన పనిభారాన్ని తట్టుకోలేక విద్యార్థులు గ్రంథచౌర్యాన్ని ఆశ్రయించారని మరో అధ్యయనం తెలుపుతోంది. ఇంకా కొంతమంది సృజనాత్మక పనులు కార్యకలాపాలను ప్రతిపాదించడంలో విద్యార్థుల స్వంత వైఫల్య పరిణామమే గ్రంథచౌర్యం అని భావించారు.[53]

అచ్చు ప్రచురణలు మాత్రమే అందుబాటులో ఉండే రోజులలో ఈ అనైతిక చర్య ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు కాని తెలుసుకొనే అవకాశము ఉండేది కాదు. కాని నేటి ఆధునిక యుగములో అంతర్జాలము ద్వారా వనరుల సులభంగా లభ్యము కావడంతో విషయమును నకలు చేయడం చాల సులువయినదని అనేక అధ్యయనాలు తెలియ చేస్తున్నాయి. గ్రంథచౌర్య నివారణ, ప్రభావము, అంతర్జాల శ్రేణీకరణ (ఆన్‌లైన్ గ్రేడింగ్)పై ‘టర్నిటిన్’ అధ్యయనం "ఉన్నత విద్యా సంస్థలలో స్వేచ్ఛా వనరులు సులభంగా లభ్యమవుతున్నందున వాడకం పెరుగుతోందని" తెలియచేస్తున్నది. గ్రంథచౌర్యం గుర్తింపు పరీక్షలో స్వేచ్ఛాప్రాప్యత విషయము (కంటెంట్) ఎక్కువగా కనుగొనబడిందని ‘ఓచొల్ల & ఓచొల్ల (2016)’ విశ్లేషణ సూచించింది. ఇంకా ఉన్నత విద్యలో ఈ ధోరణులను నిరుత్సాహపరచాలి అని సూచించారు.[54]

విద్యార్థుల గ్రంథచౌర్యానికి ఆంక్షలు

సాధారణంగా విద్యా ప్రపంచంలో, విద్యార్థుల గ్రంథచౌర్యం చర్యలను చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఇది నియామకాల నిలుపుదలే కాకుండా, జరిమానాలు, మొత్తం అధ్యయనాలు, తరగతుల నుంచి లేదా సంస్థ నుండి బహిష్కరించడం వంటి శిక్షలకు దారితీస్తుంది.[19] విద్యార్థులకు గ్రంథచౌర్యం అంటే ఏమిటో, విద్యాసంస్థలు ఈ గ్రంథచౌర్యం సమస్యను పరిష్కరించే తీవ్రత ఏమిటో పూర్తిగా అర్థం కావు. విశ్వవిద్యాలయ అధ్యయనానికి కొత్తగా ప్రవేశం పొందిన విద్యార్థులకు విద్యాయుత రచనలలో మూలాలను ఎలా ఆపాదించాలి వంటి ప్రాథమిక విషయాల గురించి కూడా తగిన అవగాహన లేదని 2015 అధ్యయనం చూపించింది.[55] 2008 లో ఉన్నత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయ విద్యార్థుల గ్రంథచౌర్యం చర్యలకి జరిమానాలు విధించే విధానాలను ప్రామాణీకరించే ప్రయత్నంలో యునైటెడ్ కింగ్ డమ్ ఒక గ్రంథచౌర్యం సుంకం రూపొందించబడింది.[56] విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యుజిసి) భారతదేశ విశ్వవిద్యాలయాలకు గ్రంథచౌర్యం, స్వీయ గ్రంథచౌర్యం గురించిన ఖచ్చితమైన మార్గదర్శకాలను వెలువరించింది. వాటిలో ముఖ్యమైనవి – కొటేషన్ లో ఉంచిన విషయాన్ని, మార్చి వ్రాసిన విషయాన్ని తప్పనిసరిగా ప్రస్తావనలో చేర్చాలి, చివర సూచిక లో ఉంచాలి. సూచికలు, బిబ్లియోగ్రఫీ, విషయసూచికలు, ముందుమాట, కృతజ్ఞతలు, సాధారణ పదాలు, సంకేతాలు, సూత్రాలు, సమీకరణాలు మొదలగునవి గ్రంథచౌర్య నిర్ధారణ నుండి మినహాయించవచ్చు. యుజిసి “కేర్” (కన్సార్షియం ఫర్ ఆకడెమిక్ అండ్ రిసర్చ్ ఎథిక్స్) విభాగము” సారూప్యతను 4 స్థాయిలలో నిర్ణయించి విశ్వవిద్యాలయాలకు కార్యాచరణ రూపొందించారు. అవి - 10% వరకు (విద్యార్ధి కి ఎటువంటి సమస్య లేదు); 10-40% వరకు (6 నెలలలోపల విద్యార్ధి తమ వ్రాతప్రతిని మరల సమర్పించవలసి ఉంటుంది); 40-60% (తమ వ్రాతప్రతిని మరల సమర్పించడనికి విద్యార్థిని ఒక సంవత్సరము వరకూ నిషేధించాలి); 60% పైగా ఉంటే విద్యార్థి నమోదు రద్దు చేయబడుతుంది.[57]

గ్రంథచౌర్యం గుర్తింపు, అవగాహన

ఏదేమైనా, ఆంక్షలు విధించడానికి, గ్రంథచౌర్యాన్ని గుర్తించడం అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు ఈ విద్యా సంబంధమైన నైతిక ధోరణులు గురించిన అవగాహన అందించడం, అవసరమైన రచనా అధ్యయనాలను నిర్వహించడం, ద్వారా ఈ సమస్యలను పరిష్కరిస్తున్నాయి.[58] గ్రంథచౌర్యాన్ని గుర్తించడంలో సహాయపడటానికి ఉచిత అంతర్జాల (ఆన్లైన్) సాధనాలు అందుబాటులోకి వస్తున్నాయి.[59] [60] కొన్ని సంస్థలు గ్రంథచౌర్యాన్ని వెలికితీసేందుకు, విద్యార్థుల ఈ చర్యలను అరికట్టడానికి అంతర్జాల ఉపకరణాలను (సాఫ్ట్‌వేర్) ఉపయోగిస్తున్నాయి. అయితే, గ్రంథచౌర్యాన్ని గుర్తించే ఉపకరణాలు ఎల్లప్పుడూ ఖచ్చితమైన పూర్తి ఫలితాలను ఇవ్వవు. దీనికి అధ్యాపకులు - విద్యార్థులు వ్రాసినవి జాగ్రత్తగా చదవడం, విద్యార్థుల రచనలో అసమానతలను గమనించడం, ఉలేఖించడంలో (సైటేషన్) లోపాలను సరిచేయడం, విద్యార్థులకు గ్రంథచౌర్య నివారణ అవగాహన అందించడం మొదలయిన వ్యూహాలను అనుసరిస్తారు. [61] (విశ్వవిద్యాలయ) ఉపాధ్యాయులు వచనాన్ని సరిపొల్చే ఉపకరణాలను (టెక్స్ట్-మ్యాచింగ్ సాఫ్ట్‌వేర్) ‌ ఉపయోగించడం వంటి పద్ధతులను గణనీయంగా ఉపయోగించరని కనుగొనబడింది.[62] మరి కొంతమంది ప్రత్యేకంగా పరీక్షా పత్రాలను (టర్మ్-పేపర్స్) చదవడం ద్వారా గ్రంథచౌర్యం గుర్తించడానికి ప్రయత్నిస్తారు, అయితే ఈ పద్ధతి ప్రత్యేకించి తెలియని మూలాల నుండి గ్రంథచౌర్యాన్ని గుర్తించడానికి అనుకూలముగా ఉండదు.[63]

విద్యార్థి భవిష్యత్తు కోసం నిజం చెప్పాలంటే, ఆరోపణల యొక్క తీవ్రతను బట్టి, గ్రంథచౌర్యం గురించిన బోధన, విషయ (డిసిప్లిన్) బోధన కంటే ముందుగానే పరిగణించాల్సిన అవసరం ఉంది. గ్రంథచౌర్యం గురించిన అవగాహన అవసరం విద్యా సిబ్బందికి కూడా విస్తరించాలి, లేకపోతే వారు తమ విద్యార్థుల దుష్ప్రవర్తన పరిణామాలను పూర్తిగా ఇవ్వలేరు.[64][61][65] విద్యార్థుల భారాన్ని తగ్గించడానికి గ్రంథచౌర్యాన్ని తగ్గించే చర్యలలో బోధనా కార్యకలాపాలను అనుగుణంగా సమన్వయం చేయడం; జ్ఞాపకశక్తి ఆధారిత అధ్యయనాలని (మెమొరైజేషన్) తగ్గించడం, వ్యక్తిగత ఆచరణాత్మక కార్యకలాపాలను పెంచడం; శిక్షపై సానుకూల మద్దత్తును ప్రోత్సహించడం వంటివి ఉన్నాయి.[53][66][67]

అంతర్జాలం నుంచి నకలుని పరిమితం చేయడానికి ప్రయత్నించే అనేక విధానాలు ఉన్నాయి, కాపీ చేయడాన్ని సులభతరం చేసే రైట్ క్లిక్ ‌ను నిలిపివేయడం, అంతర్జాల పుటలలో గ్రంథస్వామ్య హక్కు‌లకు సంబంధించి హెచ్చరిక‌లను ఉంచడం వంటివి. గ్రంథస్వామ్య హక్కు‌ల ఉల్లంఘనతో కూడిన గ్రంథచౌర్యం సందర్భాలలో అసలు హక్కుదారులు లేదా యజమానులు 'డిజిటల్ మిలీనియం కాపీరైట్ యాక్ట్' (DMCA) తొలగింపు నోటీసును ఆక్షేపణీయ అంతర్జాల వేదిక (వెబ్ సైట్) యజమానికి లేదా సంబంధిత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) కి పంపవచ్చు.[68]

స్వీయ-గ్రంథచౌర్యం

విద్యా రంగాలలో, ఒక రచయిత వారి గ్రంథ స్వామ్య హక్కులు ఏర్పడిన స్వంత రచన, ప్రచురణల భాగాలను తరువాతి ప్రచురణలలో ప్రస్తావించకుండా దానికి సంబంధించిన, సారూప్య భాగాలను తిరిగి ఉపయోగించినప్పుడు స్వీయ గ్రంథచౌర్యంగా పేర్కొంటారు.[69] [70] ఈ రకమైన మోసం చేసే పద్ధతిని వివరించడానికి "రీసైక్లింగ్ ఫ్రాడ్ " అనే పదాన్ని కూడా ఉపయోగించారు.[71] ఈ రకమైన వ్యాసాలను తరచుగా నకిలీ లేదా బహుళ ప్రచురణగా సూచిస్తారు. మునుపటి రచన గ్రంథ స్వామ్య హక్కులు మరొక సంస్థకు చెందినవి, బదిలీ చేయబడితే అదనంగా నైతిక సమస్య అవుతుంది.[72] స్వీయ-గ్రంథచౌర్యాన్ని గుర్తించడం చాలా కష్టం, ఎందుకంటే రచన పునర్వినియోగం తరచుగా పరిమితంగా, చట్టబద్ధంగా, నైతికంగా అంగీకరించబడుతుంది.[73]

మిగెల్ రోజ్ స్వీయ-గ్రంథచౌర్యం [70] [74] [75] [76] అనే అంశాన్ని, పదాన్ని పరస్పర విరుద్ధమైనవిగా భావించాడు [77] అంతకుముందు ప్రచురించిన రచన విషయ నిపుణులుచే (పీర్-రివ్యూ) విస్తృతంగా అంగీకరించబడింది. ఈ సందర్భంలో రోజ్ (Roig, 2006) “ఈ విషయం ఇంతకుముందు వాడినట్లుగా పాఠకులకు తెలియజేయకుండా రచయితలు తమ పూర్వ రచనలను లేదా డేటాను కొత్త రచనలలో తిరిగి ఉపయోగించినప్పుడు అనైతికంగా పరిగణిస్తారు, ఎందుకంటే ఇది పత్రిక విషయ నిపుణుల సమీక్ష(జర్నల్ పీర్-రివ్యూ ) ప్రక్రియను రెట్టింపు చేస్తుంది. ఇంకా రచయిత అదే విషయాన్ని లేదా ఆలోచనలను అనేక ఇతర రచనలలో ప్రచురించడం ద్వారా స్వంత ప్రయోజనం పొందుతారు". రోజ్ (2002) స్వీయ-గ్రంథచౌర్యం వ్యవస్థను - ఒకటి కంటే ఎక్కువ పత్రికలలో ఒక వ్యాసం నకిలీ ప్రచురణ; ఒక అధ్యయనాన్ని బహుళ ప్రచురణలుగా విభజించడం (దీనిని సలామి-స్లైసింగ్ అని పిలుస్తారు); వచనాన్ని పునరుపయోగించడం (టెక్స్ట్ రీసైక్లింగ్); గ్రంథస్వామ్య హక్కుల ఉల్లంఘన అను నాలుగు రకాలుగా వర్గీకరించారు. విశ్వవిద్యాలయ నిధుల సంఘం ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పడిన కమిటీ ఆన్ పబ్లికేషన్ ఎథిక్స్ వారిని అనుసరించి "తాము ఇంతకు ముందే ప్రచురించిన పూర్తి రచన కాని, కొంతభాగాన్ని కానీ మరల కొత్త రచనలో ప్రస్తావనలు లేకుండా ఉపయోగించడము నిషిద్ధము" అను నిర్దేశికాలు రూపొందించింది [57] 

అయితే స్టెఫానీ జె. బర్డ్ [78] 'స్వీయ-గ్రంథచౌర్యం ' అనేది ఒక నైతిక సమస్యగా 'ద్వంద్వ లేదా పునరావృత ప్రచురణ ' గా గుర్తిస్తుంది. ఎందుకంటే గ్రంథచౌర్యం ఇతరుల రచనల వాడకానికి సంబంధించినది. విద్య అధ్యయనాల విషయంలో, 'స్వీయ-గ్రంథచౌర్యం ' "రెండు వేర్వేరు అధ్యయనాలలో గుర్తింపు లేదా గణనల కోసం ఒకే వ్యాసాన్ని" విద్యార్థి తిరిగి సమర్పించిన సందర్భాన్ని సూచిస్తుంది. డేవిడ్ బి. రెస్నిక్ "స్వీయ-ప్లేజియరిజం లో నిజాయితీ లేదు, కానీ ఇది మేధో చౌర్యం కాదు." అని స్పష్టం చేసాడు.[79]

అయితే ఇది గ్రంథచౌర్యం కాదు అనే వాదన కూడా ఉంది. పమేలా శామ్యూల్సన్, స్వీయ-గ్రంథచౌర్యం ప్రతి అంశాన్ని నైతిక సమస్యతో జోడించింది. ఇది గ్రంథచౌర్యం కాదు అని పేర్కొనింది. గతంలో ప్రచురించిన ఒక రచన పునర్వినియోగాన్ని సమర్ధించే అనేక అంశాలను గుర్తించింది.[73]

  • రెండవ రచనకు పునాదిగా మునుపటి పనిని పునః ప్రకటన చేయాలి.
  • క్రొత్త రచనకు నిదర్శనముగా వ్యవహరించడానికి మునుపటి పని భాగాలు పునరావృతం కావాలి.
  • ప్రతి పనికి ప్రేక్షకులు చాలా భిన్నంగా ఉంటారు, ఒకే పనిని లేదా విషయాన్నివేర్వేరు ప్రదేశాల్లో ప్రచురించడానికి పునర్వినియోగం అవసరం.
  • మొదటి సారి రచయిత బాగా చెప్పారని అనుకుంటే రెండవ సారి భిన్నంగా చెప్పడంలో అర్ధం లేదు.[73] అని పేర్కొనింది.

కొన్ని విద్యాపత్రికల (అకాడెమిక్ జర్నల్స్)‌ లో స్వీయ-గ్రంథచౌర్యాన్ని ప్రత్యేకంగా సూచించే నియమావళులను, విధానాలను రూపొందించాయి. ఉదాహరణకు, జర్నల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్టడీస్.[80] అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మెషినరీ (ACM).[81] అమెరికన్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ (APSA), అమెరికన్ సొసైటీ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ASPA) వంటి ఇతర సంస్థలు స్వీయ-గ్రంథచౌర్యానికి ప్రత్యేకమైన సూచన ఇవ్వలేదు. [82]

సంస్థలు ప్రత్యేక వ్యక్తులకు వేర్వేరుగా గుర్తింపు‌ను కేటాయించనప్పుడు, సమిష్టిగా రచనలను జారీ చేసినప్పుడు గ్రంథచౌర్యం అను సమస్య రాదు. ఉదాహరణకు, పాఠ్యపుస్తకాలు, ఆచూకీ (రిఫరెన్స్) పుస్తకాలకు సంబంధించి అమెరికా చారిత్రక సంఘం (అమెరికన్ హిస్టారికల్ అసోసియేషన్) తమ వృత్తి పరమైన ప్రవర్తనకు సంబంధించిన ప్రమాణాల ప్రకటన "(స్టేట్మెంట్ ఆన్ స్టాండర్డ్స్ ఆఫ్ ప్రొఫెషనల్ కండక్ట్") - 2005 లో పాఠ్యపుస్తకాలు, విజ్ఞాన సర్వస్వాలు వంటి ఆచూకీ గ్రంథాలు అనేక విజ్ఞుల రచనల సారాంశాలు కాబట్టి, వేర్వేరు ఇతర రచనలపై ఆధారపడటం జరుగుతుంది కాబట్టి, అవి అసలు పరిశోధనగా ఆపాదింపు వంటి ఖచ్చితమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండవు". [83] అని భావిస్తున్నారు.

ఇంకా ప్రధానంగా తమ రచనలలో ఉపయోగించిన విషయాన్ని అసలు రచయిత, అసలు రచనకు ఆపాదించడము, మూలాన్ని మెరుగుపరచడము అవసరము. " మూలకథ నీది కాక పోయినా, నీవు చెప్పే పద్ధతిలో ప్రత్యేకత, కొత్తదనం ఉంటే, సహృదయులు మెచ్చుకుంటారు అన్న జ్ఞానం ఉంటే, ఏ విధమైన గ్రంథచౌర్యం ఉండదు" అని వేలూరి వేంకటేశ్వరరావు పేర్కొన్నాడు.[84]

వికీపీడియా నుండి చౌర్యం

అంతర్జాల విజ్ఞాన సర్వస్వమైన వికీపీడియాలో రాసేవారు, తాము సమర్పించిన కంటెంటును క్రియేటివ్ కామన్స్ లైసెన్సు క్రింద విడుదల చేస్తారు. వికీపీడియాకు తగిన ఆపాదింపు ఇచ్చి ఈ కంటెంటును ఎవరైనా వాడుకునేందుకు వికీపీడియా అనుమతిస్తుంది. అయితే, ఇలా వికీపీడియాకు శ్రేయస్సును ఆపాదించకుండా, ఆ రచన తమదే అన్నట్లుగా చూపేందుకు ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయి. ఇంగ్లీషు వికీపీడియాలో ఇలాంటి సందర్భాలు చాలానే ఉండగా తెలుగు వికీపీడియాలో కూడా కొన్ని ఉన్నాయి. ఇటువంటి మేథోచౌర్యం క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ ఉల్లంఘన అవుతుంది. ఇది బయటపడితే వృత్తిపరమైన ఆంక్షలకు, చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చు.

తెవికీలో సమాచారాన్ని దొంగిలించిన సందర్భాలు

Thumb
2021 మే 28 నాటి ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఈ-పేపరులో వచ్చిన "చరిత్రలో నేడు" శీర్షిక. ఇందు లోని కంటెంటును ఇదే రోజు వికీపీడియా మొదటిపేజీలోని "చరిత్రలో ఈ రోజు" నుండి తీసుకున్నారు
  1. అంతర్జాల తెలుగు పత్రిక "ఆదాబ్ హైదరాబాద్", వికీపీడియా మొదటి పేజీలో ఉండే "చరిత్రలో ఈ రోజు" శీర్షిక లోని అంశాలను "చరిత్రలో నేడు" పేరుతో తమ సంపాదకీయం పేజీలో ప్రచురిస్తున్నట్లుగా తెలుగు వికీపీడియా రచ్చబండలో చర్చకు వచ్చింది. ఈ విషయం 2021 మే 28 వ తేదీ నాటి ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఈ-పేపరులో గమనించబడింది. దీన్ని పక్కనున్న చిత్రంలో చూడవచ్చు. ఆనాటి తెలుగు వికీపీడియా మొదటిపేజీ, "చరిత్రలో ఈ రోజు" శీర్షిక లోని అంశాలను తమ పత్రికలో వాడుకున్నారు. తెలుగు వికీపీడియాకు తగిన శ్రేయస్సును ఆపాదించలేదు.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.