From Wikipedia, the free encyclopedia
ఖర్జూరం (ఆంగ్లం Date Palm) ఎడారి ప్రాంతాల్లో పెరిగే ఒక విధమైన వృక్ష ఫలం. పామే (palm) కుటుంబానికి చెందిన ఖర్జూరం శాస్త్రీయనామం ఫీనిక్స్ డాక్టీలిఫెరా. అంతెత్తున ఆకాశంలోకి పెరిగే ఈ చెట్లు సుమారు 10 నుంచి 20 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతాయి. తాటిచెట్ల మాదిరిగానే ఆడా మగా వేర్వేరుగా ఉంటాయి. ఆడచెట్లు మాత్రమే ఫలాల్నిస్తాయి. ఒక మగచెట్టు నుంచి వచ్చే పరాగరేణువులు సుమారు 50 ఆడచెట్లను ఫలవంతం చేస్తాయట. అయితే ఇటీవల ఆపాటి మగచెట్లను పెంచడం కూడా ఎందుకనుకుని పరాగరేణువుల్ని నేరుగా మార్కెట్లో కొని ఫలదీకరించే పద్ధతిని కూడా అనుసరిస్తున్నారు. 5-8 ఏళ్ల వయసు వచ్చేసరికి ఖర్జూర చెట్టు కాపుకొస్తుంది. ఒకప్పుడు ఇది అక్టోబరు - డిసెంబరు సమయంలో మాత్రమే దొరికేది. ఇప్పుడు ఆ దశ దాటిపోయింది. ఏ సూపర్ మార్కెట్టుకెళ్లినా గింజ తీసేసి ఆకర్షణీయంగా ప్యాక్ చేసిన విభిన్న ఖర్జూరాలు ఎప్పుడూ దొరుకుతూనే ఉన్నాయి.
ఖర్జూరం | |
---|---|
మొరాకో దేశంలో 'మెర్జువొగా'లో ఖర్జూరం చెట్లు | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | ఆరెకేల్స్ |
Family: | |
Genus: | |
Species: | పి. డాక్టీలిఫెరా |
Binomial name | |
ఫీనిక్స్ డాక్టీలిఫెరా | |
ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టిందో కచ్చితంగా తెలియకున్నా మనిషికి పరిచయమైన తొలి ఆహారవృక్షంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఉత్తర ఆఫ్రికా లేదా ఆగ్నేయాసియా ఎడారుల్లోని ఒయాసిస్సు ప్రాంతాలే దీని స్వస్థలం అని కొందరంటారు. పర్షియన్ గల్ఫ్‌లో పుట్టిన ఈ చెట్టును క్రీ.పూ. సుమేరియన్లు తొలిగా పెంచారనీ తరువాత బాబిలోనియన్లూ అస్సీరియన్లూ ఈజిప్టియన్లూ మరింతగా పెంచి పోషించినట్లుగా చెబుతారు. ఆపైన అరబ్బుల ద్వారా ఉత్తర ఆఫ్రికా నుంచి స్పెయిన్‌కీ అక్కడ నుంచి కాలిఫోర్నియాకీ దీని శాఖలు విస్తరించినట్లుగా కనిపిస్తోంది. అందుకే యూదులు, ముస్లింలు, క్రైస్తవులు ఈ చెట్టును ఎంతో ముఖ్యమైనదిగా గుర్తించి గౌరవిస్తారు. శాంతికీ, న్యాయానికీ, రవాణాకీ సంకేతంగా ఖర్జూరాన్ని సుమేరియన్లు భావించేవారట. ఈ చెట్టును కేవలం పండ్ల కోసమే కాక నీడకోసం పశువుల మేతకోసం కలపకోసం ఆయుధాలు, తాళ్లకోసం సుమేరియన్లు పెంచినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
ఖర్జూరం పండించే మొదటి పది దేశాలు — 2005 (వేల టన్నుల్లో) | |
---|---|
Egypt | 1,170.00 |
సౌదీ అరేబియా | 970.49 |
ఇరాన్ | 880.00 |
United Arab Emirates | 760.00 |
Algeria | 516.29 |
పాకిస్తాన్ | 496.58 |
Sudan | 328.20 |
Libya | 150.00 |
China | 130.00 |
Tunisia | 125.00 |
మొత్తం ప్రపంచ ఉత్పత్తి | 5526.56 |
వనరు: ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) Archived 2007-03-10 at the Wayback Machine |
ఒకప్పుడు ఖర్జూరాన్ని అత్యధికంగా సాగుచేసిన దేశం ఇరాక్. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం ఖర్జూరాల్ని పెంచిన దేశం కూడా అదే. అందుకే అక్కడి నాణేలు, స్టాంపులు చివరకి బిల్లులమీద కూడా ఖర్జూరచెట్ల బొమ్మలు కనిపిస్తాయి. సౌదీ అరేబియా, మొరాకోల్లో కూడా దీన్ని ముఖ్యమైన సంప్రదాయ పంటగానే సాగుచేస్తున్నారు. ఉత్తర ఆఫ్రికా దేశాలైన లిబియా, టునీషియా, అల్జీరియా దేశాలు సైతం ఈ పంటను పండిస్తూ ఆయా దేశాల స్టాంపులు, కరెన్సీ నోట్లమీద ఈ చెట్టు బొమ్మను ముద్రిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని ఆలీస్ స్ప్రింగ్స్‌తోపాటు పశ్చిమ చైనా, పశ్చిమ భారతం, దక్షిణ పాకిస్తాన్ లలో కూడా వీటిని విరివిగా పెంచడం విశేషం. ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ఏటా 11 లక్షల టన్నుల ఖర్జూరాల్ని ఉత్పత్తి చేస్తూ నంబర్‌వన్‌గా ఈజిప్టు మన్ననలందుకుంటోంది. సహారా వాసులు మూడింట రెండొంతుల ఆదాయాన్ని ఈ పంట నుంచే పొందుతున్నారు.
పండ్లలోని తేమను బట్టి ఖర్జూరాల్ని మెత్తనివి, కాస్త ఎండినట్లుగా ఉండేవి, పూర్తిగా ఎండినట్లుగా ఉండేవి అని మూడు రకాలుగా విభజించారు. మొదటి రకంలో తేమ ఎక్కువా తీపి తక్కువా ఉంటే రెండో రకంలో తేమ తక్కువా తీపి ఎక్కువా ఉంటాయి. మూడో రకం తేమ శాతం అతి తక్కువగా ఉండి తీపి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక రంగు రుచి ఆధారంగా ఖర్జూరాలు ఎన్నో రకాలు. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఇవి పండుతున్నా కొలరాడో నదీ తీరాన ఉన్న బార్డ్ వ్యాలీలోని పామ్ స్ప్రింగ్స్‌లో పండే మెడ్జూల్ రకానికి మరేవీ సాటిరావని ప్రతీతి. ముదురురంగులో నున్నగా ఉండే ఈ ఖర్జూరాల్నే 'కింగ్ ఆఫ్ డేట్స్' అని కూడా అంటారు. తరువాత స్థానం గుండ్రంగా ఉండే బార్హీది. ఇది మృదువుగా తియ్యగా ఉంటుంది. దీన్ని 'హనీ బాల్' అని కూడా అంటారు. ఎక్కువ కాలం నిల్వ ఉండే 'డెగ్లట్ నూర్', పుడ్డింగ్‌లా కనిపించే 'ఖాద్రావి', అచ్చం తేనెలా ఉండే 'హనీ', నలుపు రంగులో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండే 'బ్లాక్ డేట్', పొడవుగా కాస్త అంబరు (amber) వర్ణంలో నమిలేటట్లుగా ఉండే 'గోల్డెన్ ప్రిన్సెస్'... ఇలా ఖర్జూరాల్లో ఎన్నెన్నో రకాలు ఉన్నాయి.
ఏ పండయినా పండుగానే బాగుంటుంది. కానీ ఖర్జూరపండు ఎండినా రుచే. నట్‌గా మారిన ఎండు ఖర్జూరంలోని నీళ్లన్నీ ఆవిరైపోవడంతో అది మరింత తియ్యగా ఉంటుంది. మెత్తని పండ్లకోసం అయితే ఇవి రంగు మారి దోరరంగులోకి రాగానే చెట్టు నుంచి తీస్తారు. అదే ఎండుఖర్జూరాల కోసం అయితే చెట్టునే బాగా ఎండనిచ్చి తెంచుతారు. కోశాక వాటిని కొంతకాలం తేమ వాతావరణంలో ఉంచి కాస్త మెత్తబడేలా చేస్తారు. వేసవిలో ఎండుఖర్జూర నీళ్లు తాగని పసిపిల్లలు అరుదే. స్వీట్లు, పుడ్డింగ్‌లు, కేకులు, డెజర్ట్‌ల తయారీలో ఖర్జూరం ఉండి తీరాల్సిందే.
సంప్రదాయఫలంగానూ నీరాజనాలందుకునేది ఖర్జూరమే. రంజాన్ మాసం వచ్చిందంటే చాలు, పరిపుష్టికరమైన ఆ పండుతోనే ముస్లింలకు ఉపవాసదీక్ష పూర్తవుతుంది. అందుకే వారికిది లేనిదే పొద్దు గడవదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు, మహమ్మద్ ప్రవక్తకు ఇది ఎంతో ఇష్టమైన ఆహారంగా పవిత్ర గ్రంథం, ఖోరాన్ పేర్కొంటోంది. ఆయన ఇంటికి కలపనిచ్చింది కూడా ఖర్జూర చెట్టేననీ చెబుతారు. అంతేగాక, ముస్లింల ప్రథమ మసీదు మదీనా లోని మస్జిద్ ఎ నబవీ (ప్రవక్త గారి మసీదు) నిర్మాణం కొరకు ఉపయోగించింది, ఖర్జూరపు చెట్టు కలప, పై కప్పులకు ఖర్జూరపు చెట్టు ఆకులు. ఇస్లామిక్ దేశాల్లో ఖర్జూర వృక్షాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
Nutritional value per 100 గ్రా. (3.5 oz) | |
---|---|
శక్తి | 1,180 కి.J (280 kcal) |
75 g | |
చక్కెరలు | 63 g |
పీచు పదార్థం | 8 g |
0.4 g | |
2.5 g | |
విటమిన్లు | Quantity %DV† |
విటమిన్ సి | 0% 0.4 mg |
ఇతర భాగాలు | పరిమాణం |
నీరు | 21 g |
| |
†Percentages are roughly approximated using US recommendations for adults. Source: USDA Nutrient Database |
ఖర్జూరం, పండుగానే కాక చెట్టుగా కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.
jirna shakthi peruguthundhi
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.