From Wikipedia, the free encyclopedia
కొలరాడో అమెరికా లోని రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం రాకీ పర్వత ప్రాంతంలో ఉంది. డెన్వర్ నగరం కొలరాడో రాష్ట్ర రాజధాని. 1861 ఫిబ్రవరి 28 న కొలరాడో ప్రాంతం ఏర్పడగా, 1876 ఆగస్టు 1 న ఇది అమెరికాలో 38 వ రాష్ట్రంగా చేరింది.[1] అమెరికా స్వాతంత్ర్య ప్రకటన చేసిన వంద సంవత్సరాల తరువాత ఇది అమెరికాలో చేరింది. అందుచేత దీన్ని సెంటెన్నియల్ రాష్ట్రం అని అంటారు.
అత్యధిక విస్తీర్ణంగల రాష్ట్రాల్లో ఇది 8 వ స్థానం లోను, అత్యధిక జనాభా గల రాష్ట్రాల్లో 21 వ స్థానం లోనూ ఉంది. 2019 నాటికి రాష్ట్ర జనాభా 57,58,736. 2010 తరువాత జనాభా 14.5% పెరిగింది.
కొలరాడో నది పేరు మీదుగా రాష్ట్రానికి ఈ పేరు వచ్చింది. పర్వతాల నుండి ఈ నదిలోకి కొట్టుకువచ్చే ఎర్రటి మట్టి కారణంగా ఈ నదికి స్పానిషు వలసదారులు రియో కొలరాడో (ఎర్రటి నది) అనే పేరు పెట్టారు.
కొలరాడోకు ఉత్తరాన వయోమింగ్, ఈశాన్యాన నెబ్రాస్కా, తూర్పున కాన్సాస్, ఆగ్నేయాన ఓక్లహోమా, దక్షిణాన న్యూ మెక్సికో, పశ్చిమాన యూటా, నైఋతి మూలన అరిజోనా ఉన్నాయి. పర్వతాలు, అడవులు, ఎత్తైన మైదానాలు, గండ్లు (కాన్యన్లు), పీఠభూములు, నదులు, ఎడారులతో కొలరాడో భౌగోళిక పరిస్థితులు వైవిధ్యంగా ఉంటాయి.
అదాయం పరంగా కొలరాడో అమెరికా రాష్ట్రాల్లో 8 వస్థానంలో ఉంది.[2] తలసరి ఆదాయం పరంగా 11వ స్థానంలో ఉంది.[3] రక్షణ పరిశ్రమలు, గనులు, వ్యవసాయం, పర్యాటకాలు ఆర్థిక వ్యవస్థ లోని ప్రధానాంగాలు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తగ్గుతున్న నీటి లభ్యత కారణంగా రాష్ట్రంలో వ్యవసాయం, అడవీ రంగం, పర్యాటకాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.[4]
కొలరాడో రాష్ట్రం దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉంటుంది. భూ అక్షాంశాలు, రేఖాంశాలు వెంబడి సరిహద్దులు కలిగిన మూడు అమెరికా రాష్ట్రాలలోనూ ఇది ఒకటి. తత్తిమా రెండూ వ్యోమింగ్ మరియూ యూటా రాష్ట్రాలు. ఈ రాష్ట్ర సరిహద్దులు 37° అక్షాంశం నుండి 47° అక్షాంశం వరకు, 102° రేఖాంశం నుండి 109° రేఖాంశం వరకు విస్తరించి ఉంది.
కొలరాడో వాతావరణం ప్రధానంగా ఛల్లగా పొడిగా ఉంటుంది.
Seamless Wikipedia browsing. On steroids.