స్వాతంత్ర సమరయోధుడు From Wikipedia, the free encyclopedia
ఆచార్య ఎన్.జి.రంగాగా ప్రసిద్ధుడైన గోగినేని రంగనాయకులు (నవంబరు 7, 1900 - జూన్ 9, 1995) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయ వాది, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు. రైతాంగ విధానాలకు మద్దతునిచ్చిన ఈయనను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారు.[1] 1991లో భారత ప్రభుత్వం నుండి పద్మ విభూషణ్ పురస్కారం పొందారు. 1930-1991 వరకు సుదీర్ఘ కాలం భారత పార్లమెంట్ సభ్యునిగా పనిచేసారు.[2]
గోగినేని రంగనాయకులు | |
---|---|
![]() ఎన్.జి.రంగా | |
జననం | గోగినేని రంగనాయకులు నవంబరు 7, 1900 |
మరణం | జూన్ 9, 1995 |
ఇతర పేర్లు | ఎన్.జి.రంగా భారత రైతాంగ ఉద్యమపిత |
వృత్తి | లోక్ సభ సభ్యుడు , రైతు నాయకుడు |
ప్రసిద్ధి | భారత స్వాతంత్ర సమరయోధుడు, |
రాజకీయ పార్టీ | కాంగ్రెసు పార్టీ కృషికార్ లోక్ పార్టీ |
మతం | హిందూ మతము హేతువాది |
తండ్రి | గోగినేని నాగయ్య |
తల్లి | అచ్చమాంబ |
రంగా, 1900, నవంబరు 7 న గుంటూరు జిల్లా నిడుబ్రోలులో గోగినేని నాగయ్య, అచ్చమాంబ దంపతులకు జన్మించాడు. నిడుబ్రోలులో ప్రాథమిక విద్యను ముగించుకొని, గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్ కళాశాల నుండి పట్టభద్రుడైనాడు. 1926 లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్ధిశాస్త్రములో బి.లిట్ పొంది భారతదేశానికి తిరిగివచ్చిన తర్వాత మద్రాసు లోని పచ్చయప్ప కళాశాలలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా (1927-1930) పనిచేసారు. ఇతడు హేతువాది. 1924 లో గుంటూరు జిల్లా మాచవరం గ్రామానికి చెందిన వెలగా సుబ్బయ్య, పిచ్చమ్మ దంపతుల కుమార్తె భారతీదేవి తో రంగా వివాహం జరిగింది.
1930 లో మహాత్మా గాంధీ పిలుపునకు స్పందించి, రంగా తన ఉద్యోగాన్ని వదిలి భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నాడు. 1931 డిశంబరులో వెంకటగిరి రైతాంగ ఉద్యమ కాలంలో రంగా ఒక సంవత్సరకాలం జైలు శిక్ష అనుభవించాడు. రైతు ఉద్యమాలను స్వాతంత్ర్య పొరాటంలో భాగం చేసారు. 1933 లో నిడుబ్రోలులో రామనీడు పేరుతో వయోజన రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసారు. ఈ రాజకీయ విద్యాలయాన్ని మహాత్మాగాంధీ ప్రారంభించారు. ఈ పాఠశాల గత స్మృతులకు సజీవ సాక్ష్యంగా నేటికి నిడుబ్రోలులో కొనసాగుతుంది.
తన భార్య భారతీ దేవితో కలసి వ్యక్తి గత సత్యాగ్రహంలో పాల్గోన్నారు. 1940లో మద్రాసులో శాసనోల్లంఘనజేసి చెరసాలలో ఏడాది పున్నాడు. 1941 జైలునుండి విడుదల చేసి వెనువెంటనే డెటిన్యూగా రాయవేలూరు జైలుకు తీసుకొని వెళ్ళి 1942లో విడుదల చేశారు. మరలా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు 1942 నవంబరు 4 న నిర్భంధించి రాజపుట్లనా దగ్గర దామో జైల్లో ఉంచి 1944 అక్టోబరు 9 తేదీన విడుదల చేశారు. ఈ సమయంలో ఆయన ఆనేక గ్రంథాలు రాశాడు. స్వాతంత్ర్య పొరాటంలో రంగా ఆరు సార్లు కారాగారంలో ఉన్నారు.
స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోసు, వల్లభాయ్ పటేల్, రాజాజీ, రాజేంద్ర ప్రసాదు, యం.యం.జోషి, జయప్రకాశ్ నారాయణ్, రాధాకృష్ణ, వి.వి.గిరి, ప్రకాశం పంతులు వంటి వారి సహచర్యంతో విశేషంగా కృషి చేసారు.1939 కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో నేతాజీని బలపరిచాడు. 'ధన్య జీవి నేతాజీ' అనే పేరుతో పుస్తకం రాసారు.
1930 లో తొలిసారి ఢిల్లీ కేంద్ర శాసనసభకు ఏన్నికైనాడు. మరలా రెండవ సారి జస్టిస్ పార్టీ అభ్యర్థి కొసరాజు రామయ్య చౌదరిపై గెలుపొంది 1934 నుండి 1946 వరకు కొనసాగాడు. ఆ రోజుల్లో అందరికి ఓటు హక్కు లేదు. పది రూపాయలు శిస్తు చెల్లించినవారికే ఓటు ఉండేది. 1946 కి చదువుకున్న వారికి కూడా ఓటు హక్కు వచ్చింది.
1946 లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్‌కు (మొదటి పార్లమెంట్) సభ్యునిగా మద్రాస్ ప్రొవిన్షియల్ నుండి ఎన్నికై, భారత రాజ్యాంగ రచనలో అనేక సలహాలు, సూచనలు ఇచ్చి క్రియాశీలంగా పాల్గొన్నారు. గ్రామీణ ఆర్థిక, సామాజక స్థితి మెరుగపర్చటానికి వీరు చేసిన సూచనలు అమూల్యమైనవి.
భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులతో 1950-52 మధ్య ఏర్పడ్డ తొలి పార్లమెంటులో రంగా సభ్యునిగా కొనసాగారు.[3]
1933 లో రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వం వహించాడు. మూడు సంవత్సరాల తర్వాత 1936 లో స్వామి సహజానంద సరస్వతితో కలసి భారతీయ కిసాన్ సభను (AIKS) స్థాపించాడు. జమిందారీ వ్యవస్థపైన అలుపెరుగని పోరాటం చేసారు. గ్రామీణ ప్రజల రుణ విముక్తికి మార్గాలను సూచించారు. కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి నిర్వహణలో 1937లో "రైతాంగ రక్షణ యాత్ర" పేరుతో ఇచ్ఛాపురం నుండి మద్రాసు వరకు రంగా ప్రారంభించిన పాదయాత్ర నాలుగు నెలలు పాటు కొనసాగి రైతాంగంలో చైతన్యస్ఫూర్తిని రగిల్చింది.
రైతాంగ ఆర్థిక పరిస్థితిపై గాంధీతో చారిత్రాత్మక చర్చలు జరిపాడు. ఈ చర్చలలోని ముఖ్యాంశాలపై "బాపు దీవెనలు" అన్న పేరుతో రంగా ఒక పుస్తకాన్ని వెలువరించాడు. గ్రామీణుల కొరకు 'వాహిని' అనే వారపత్రికను 1936లో ప్రచురించటం మొదలు పెట్టారు. దీనిలో అనేక వ్యాసాలు రాసి వారి అభిప్రాయాలను పంచుకునేవారు.
రంగా, అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్య యొక్క వ్యవస్థాపకులలో ఒకడు. 1939 లో భారతి దేవితో కలసి బర్మా దేశం వెళ్ళి అక్కడ కార్మిక సభకు అధ్యక్షత వహించి, వారిలో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చాడు. 1946 లో కోపెన్‌హేగెన్‌లో జరిగిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజెషన్ సదస్సులో, 1948 లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన అంతర్జాతీయ శ్రామిక సంస్థ సదస్సులోనూ, 1952 లో ఒట్టావాలో జరిగిన అంతర్జాతీయ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులోను, 1954 లో న్యూయార్కులో జరిగిన ఇంటర్నేషనల్ పెజెంట్ యూనియన్ లోనూ, 1955 లో టోక్యోలో జరిగిన ఆసియన్ కాంగ్రెస్ ఫర్ వరల్డ్ గవర్నమెంటులోను భారతదేశం తరఫున ప్రతినిధిగా పాల్గొన్నాడు. 1957 లో బల్గేరియా రైతు సదస్సులో పాల్గొన్నాడు.[4]
రంగా, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా 1946 నుండి 1951 వరకు పనిచేసారు. 1951 లో కాంగ్రెసు పార్టీ నుండి నిష్క్రమించి కృషికార్ లోక్ పార్టీ స్థాపించారు. 1955 లో కాంగ్రెస్, ప్రజా పార్టీలతో కలసి ఒక కూటమిగా పొటి చేసి ఆంధ్ర రాష్ట్ర శాసస సభకు జరిగిన ఎన్నికలో ఘన విజయం సాధించారు. నెహ్రు కోరికపై కృషికార్ లోక్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు. 1957లో తెనాలి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికైనారు.[5]
రైతులకు నష్టం కలిగించే రష్యా ముద్రగల సమష్టి సహకార వ్యవసాయ విధానాన్ని అంగీకరిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విధానాలను, రంగా పార్లమెంటులో తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తరువాత 1959 లో నాగపూర్ కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ ప్రవేశ పెట్టిన సహకార వ్యవసాయ చట్టాన్ని అమోదించారు. దీన్ని వ్యతిరేకిస్తూ రంగా కాంగ్రెస్ పార్టీని వీడారు.
నెహ్రూ విధానాలను వ్యతిరేకిస్తున్న చక్రవర్తి రాజగోపాలాచారి, మినూ మసాని, కె.యం.మున్షీ లతో కలిసి స్వతంత్ర పార్టీని స్థాపించాడు. రంగా, స్వతంత్ర పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడై, ఆ పదవిని ఒక దశాబ్దంపాటు నిర్వహించాడు. 1962 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ 25 స్థానాలలో గెలిచి, బలమైన ప్రతిపక్షంగా రూపుదిద్దుకొన్నది. కానీ 1971 సార్వత్రిక ఎన్నికలలో గ్రాండ్ అలెయన్స్ పేరుతో కూటమిగా పోటీ చేసిన స్వతంత్ర పార్టీ, 8 స్థానాలలో మాత్రమే గెలిచి బలహీన పడింది. ఆ తరువాత 1972లో రంగా తిరిగి ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[3]
1980 నుండి 1991 వరకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడిగా పనిచేసారు.[2]
లోక్‌సభ | పదవీకాలం | నియోజకవర్గం | పార్టీ |
---|---|---|---|
2వ లోక్‌సభ | 1957-1962 | తెనాలి | కాంగ్రెసు పార్టీ |
3వ లోక్‌సభ | 1962-1967 | చిత్తూరు | స్వతంత్ర పార్టీ |
4వ లోక్‌సభ | 1967-1970 | శ్రీకాకుళం | స్వతంత్ర పార్టీ |
7వ లోక్‌సభ | 1980-1984 | గుంటూరు | కాంగ్రెసు (ఐ) |
8వ లోక్‌సభ | 1984-1989 | గుంటూరు | కాంగ్రెసు (ఐ) |
9వ లోక్‌సభ | 1989-1991 | గుంటూరు | కాంగ్రెసు (ఐ) |
1952-57 ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి, 1977- 80 ఆంధ్ర ప్రదేశ్ నుండి రాజ్యసభకు ప్రాతినిద్యం వహించారు.
తెనాలి, చిత్తూరు, శ్రీకాకుళం, గుంటూరు లోక్‌సభ నియోజక వర్గాల నుంచి (1957-1991) లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.
1930 నుంచి 1991 వరకు, కొద్ది కాలం తప్పితే, నిరాఘాటంగా, పార్లమెంట్ లో 60 ఎళ్ళు ప్రజా ప్రతినిధిగా పనిచేసారు. సుదీర్ఘకాలం నిస్వార్ధంగా సేవలనందించిన రంగా పార్లమెంట్ సభ్యునిగా రికార్డు సృష్టించి, గిన్నీస్ బుక్‌లోకి ఎక్కారు.
1952, 1965 లలో జరిగిన కామన్ వెల్త్ పార్లమెంట్ సభలకు, 1980లో ఐక్యరాజ్య సమావేశానికి భారత ప్రతినిధిగా పాల్గొన్నాడు.
రంగా ఎందరినో ప్రజా నాయకులుగా తీర్చిదిద్దారు. గౌతు లచ్చన్న, పాతురి రాజగోపాలనాయుడు, సామాజక సేవకుడు జి. మునిరత్నం నాయుడు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, యడ్లపాటి వెంకట్రావు, కందుల ఓబుల రెడ్డి, ప్రగడ కోటయ్య, సుంకర సత్యనారాయణ, గోగినేని నాగేశ్వరరావు, బండ్లమూడి సుబ్బారావు వంటి వారితో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కొణిజేటి రోశయ్య కూడా రంగా శిష్యులే.
రంగా ఆంగ్లంలో 65 పుస్తకాలను,[6] తెలుగులో15 పుస్తకాలను రాసారు.[7] వాటిలో ముఖ్యమైనవి.
క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కారాగారంలో ఉన్నప్పుడు దిగువ మూడు పుస్తకాలను రాసారు.
ఆంధ్రా ఎకనామికల్ సీరీస్ క్రింద వెలువడిన రంగా గారి పరిశోధన గ్రంథాలు
రైతు గ్రంథమాల పేరుతో వెలువడిన రంగా పరిశోధన గ్రంథాలు
ఆచార్య యన్.జి.రంగా 95 సంవత్సరాల వయస్సులో అనారోగ్యంతో 1995 జూన్ 8వ తేదీన నిడుబ్రోలులోని ఆయన స్వగృహమైన 'గోభూమి'లో తుదిశ్వాస విడిచారు.[3] అంతకు ముందే ఈయన భార్య భారతి దేవి రంగా 1972 సెప్టెంబరు 27న చనిపోయారు.[8] వీరికి సంతానం లేదు, పదవులు ఆశించకుండా నిస్వార్ధంగా ప్రజాసేవలో తరించిన ధన్య జీవులు, ఆదర్శ దంపతులు ఆచార్య రంగా, భారతి దేవి రంగా.
Seamless Wikipedia browsing. On steroids.