ఖండం From Wikipedia, the free encyclopedia
అంటార్కిటికా భూమికి అత్యంత దక్షిణ కొసన ఉన్న ఖండం. ఇక్కడే భౌగోళిక దక్షిణ ధ్రువం ఉంది. ఇది దక్షిణార్ధగోళం లోని అంటార్కిటిక్ ప్రాంతంలో ఉంది, అంటార్కిటిక్ వలయానికి దాదాపు పూర్తిగా దక్షిణంగా ఉంది. దక్షిణ మహాసముద్రం ఈ ఖండాన్ని పరివేష్ఠించి ఉంది. 1,42,00,000 చ.కి.మీ విస్తీర్ణంతో, ఇది ఐదవ అతిపెద్ద ఖండం. ఆస్ట్రేలియాకు దాదాపు రెండు రెట్లు ఉంటుంది. చదరపు కిలోమీటరుకు 0.00008 మంది జనాభాతో, ఇది తక్కువ జనసాంద్రత కలిగిన ఖండం. అంటార్కిటికా 98% ఐసుతో కప్పబడి ఉంటుంది. ఈ ఐసు సగటు మందం 1.9 కిలోమీటర్లు ఉంటుంది.[2] ఇది అంటార్కిటిక్ ద్వీపకల్పపు ఉత్తర కొస వరకూ విస్తరించి ఉంది.
వైశాల్యం | 14,200,000 కి.మీ2 (5,500,000 చ. మై.)[1] |
---|---|
జనాభా | 1,000 నుండి 5,000 - ఋతువును బట్టి |
జనసాంద్రత | 0.00008 నుండి 0.00040 inhabitants per square kilometre (0.00021 నుండి 0.00104/sq mi) |
నివసించేవారు | అంటార్కిటిక్ |
దేశాలు | 0 |
ఇంటర్నెట్ టాప్ లెవెల్ డొమైన్ | .aq |
పెద్ద నగరాలు | అంటార్కిటికా లోని పరిశోధనా కేంద్రాలు |
అంటార్కిటికా అత్యంత శీతలంగా, అత్యంత పొడిగా, అత్యంత వేగంగా వీచే గాలులతో కూడుకుని ఉన్న ఖండం. దీని సగటు ఎత్తు అన్ని ఖండాల కంటే ఎక్కువ.[3] అంటార్కిటికాలో ఎక్కువ భాగం ధ్రువ ఎడారి. తీరం వెంబడి వార్షిక అవపాతం 200 మి.మీ. ఉంటుంది. లోతట్టు ప్రాంతాల్లో ఇది ఇంకా చాలా తక్కువ. దాదాపు 20 లక్షల సంవత్సరాలుగా అక్కడ వర్షాలు పడలేదు. అయినప్పటికీ, ప్రపంచపు మొత్తం మంచినీటి నిల్వలలో 80% అక్కడే ఉన్నాయి. అంటార్కిటికాలో ఉన్న మంచు పూర్తిగా కరిగితే, ప్రపంచ సముద్ర మట్టాలను 60 మీటర్లు పెరుగుతాయి.[4] అంటార్కిటికాలో ఉష్ణోగ్రత −89.2 °C (−128.6 °F) కి చేరుకుంది. (అంతరిక్షం నుండి కొలిచినపుడు −94.7 °C (−135.8 °F) కూడా కనబడింది.[5] ), అయితే, సంవత్సరంలో అతి శీతలంగా ఉండే మూడవ త్రైమాసికంలో సగటు ఉష్ణోగ్రత −63 °C (−81 °F) ఉంటుంది. ఖండం అంతటా అక్కడక్కడా ఉన్న పరిశోధనా కేంద్రాలలో ఏడాది పొడవునా 1,000 నుండి 5,000 మంది వరకూ ప్రజలు నివసిస్తున్నారు. అంటార్కిటికాకు చెందిన జీవులలో అనేక రకాల ఆల్గే, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, మొక్కలు, ప్రొటిస్టా, పురుగులు, నెమటోడ్లు, పెంగ్విన్స్, సీల్స్, టార్డిగ్రేడ్లు వంటి కొన్ని జంతువులు ఉన్నాయి . వృక్షసంపద టండ్రాల్లోనే కనిపిస్తుంది.
భూమ్మీద కనుక్కున్న చిట్టచివరి ప్రాంతం అంటార్కిటికా. 1820 వరకు దీని గురించి తెలియదు. రష్యన్ సాహసికులు ఫాబియన్ గొట్లియేబ్ వాన్ బెల్లింగ్షౌసెన్, మిఖాయిల్ లాజరేవ్ లు వోస్టోక్, మిర్నీలపై చేసిన యాత్రలో ఫింబుల్ ఐసు పలకను కనుగొన్నారు. అయితే, మిగతా 19 వ శతాబ్దం అంతా కూడా, ఈ ఖండం గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దాని ప్రతికూల వాతావరణం, సులభంగా అందుబాటులో ఉండే వనరులు లేకపోవడం, ఒంటరిగా ఉండటం దీనికి కారణాలు. 1895 లో, నార్వేజియన్ల బృందం తొలిసారిగా అక్కడికి వెళ్ళినట్లుగా రికార్డైంది. అంటార్కిటికా ఖండం కింద ఉన్న చురుకైన అగ్నిపర్వతాలను 2013 వరకు కనుక్కోలేదు.[6] అంటార్కిటికాలోని విక్టోరియా ల్యాండ్ లో రక్త జలపాతం (బ్లడ్ ఫాల్స్) ఉంది. ఇందులోని నీళ్లు ఎర్రగా ఉంటాయి.
అంటార్కిటికా అనేది ఒక కండోమినియం. అంటార్కిటిక్ ఒప్పంద వ్యవస్థకు లోబడి ఉన్న పార్టీలు దీన్ని నిర్వహిస్తాయి. 1959 లో అంటార్కిటిక్ ఒప్పందంపై పన్నెండు దేశాలు సంతకం చేశాయి. అప్పటి నుండి ముప్పై ఎనిమిది దేశాలు సంతకం చేశాయి. సైనిక కార్యకలాపాలు, ఖనిజ త్రవ్వకాలను ఈ ఒప్పందం నిషేధించింది. అణు విస్ఫోటనాలు, అణు వ్యర్థాలను పారవేయడాన్ని నిషేధించింది. శాస్త్రీయ పరిశోధనలకు మద్దతు ఇస్తుంది. ఖండం యొక్క ఎకోజోన్‌ను రక్షిస్తుంది. ప్రస్తుతం అనేక దేశాలకు చెందిన 4,000 మందికి పైగా శాస్త్రవేత్తలు ఇక్కడ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు.
దక్షిణ ధ్రువం చుట్టూ, అంటార్కిటిక్ సర్కిల్‌కు దక్షిణాన అంటార్కిటికా విస్తరించి ఉంది. దక్షిణ కొసన ఉన్న ఈ ఖండం చుట్టూ దక్షిణ మహాసముద్రం పరివేష్ఠించి ఉంది. దీనిని దక్షిణ పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాలు చుట్టుముట్టి ఉన్నాయని కూడా చెప్పవచ్చు. లేదా ప్రపంచ మహాసముద్రపు దక్షిణ జలాలు చుట్టుముట్టి ఉన్నాయని కూడా అనవచ్చు. అంటార్కిటికాలో అనేక నదులు, సరస్సులు ఉన్నాయి, అత్యంత పొడవైన నది ఓనిక్స్ . అతిపెద్ద సరస్సు, వోస్తోక్. ప్రపంచంలో, హిమనదాల కింద ఉన్న అతిపెద్ద సరస్సుల్లో ఇది ఒకటి. 1.4 కోట్ల చ.కి.మీ. పైబడిన విస్తీర్ణంతో అంటార్కిటికా, ఐదవ పెద్ద ఖండం. ఇది ఐరోపా కంటే 1.3 రెట్లు పెద్దది. తీరరేఖ పొడవు 17,968 కి.మీ. కింది పట్టికలో చూపిన విధంగా ఖండంలో మంచు నిర్మాణాలు ఉంటాయి.
రకం | భాగ |
---|---|
ఐస్ షెల్ఫ్ (తేలియాడే ఐస్ ఫ్రంట్) | 44% |
మంచు గోడలు (నేలమీద ఉంటాయి) | 38% |
ఐస్ స్ట్రీమ్ / అవుట్లెట్ హిమానీనదం (ఐస్ ఫ్రంట్ లేదా ఐస్ వాల్) | 13% |
రాయి | 5% |
మొత్తం | 100% |
అంటార్కిటికాను ట్రాన్సాంటార్కిటిక్ పర్వతాలు రెండుగా విభజిస్తున్నాయి. రాస్ సముద్రం, వెడ్డెల్ సముద్రానికి మధ్య ఉన్న మెడకు దగ్గరగా ఈ విభజన రేఖ ఉంది. వెడ్డెల్ సముద్రానికి పశ్చిమాన, రాస్ సముద్రానికి తూర్పునా ఉన్న భాగాన్ని పశ్చిమ అంటార్కిటికా అని, మిగిలిన భాగాన్ని తూర్పు అంటార్కిటికా అనీ పిలుస్తారు. ఎందుకంటే అవి గ్రీన్విచ్ మెరిడియన్‌కు సంబంధించి పశ్చిమ, తూర్పు అర్ధగోళాలకు అనుగుణంగా ఉంటాయి.
అంటార్కిటికాలో సుమారు 98% అంటార్కిటిక్ మంచు పలకతో కప్పబడి ఉంది. దీని సగటు మందం కనీసం 1.6 కిలోమీటర్లు ఉంటుంది. ప్రపంచంలోని మొత్తం ఐసులో 90% ఇక్కడే ఉంది. మంచు ఉంది (తద్వారా ప్రపంచంలోని 70% మంచినీరు కూడా ఇక్కడే ఉంది). ఈ మంచు అంతా కరిగితే ప్రపంచ సముద్ర మట్టాలు 58 మీటర్లు పెరుగుతాయి.[3] ఖండం లోపలి భాగంలో చాలా వరకు, అవపాతం (వర్షపాతం, హిమపాతం) చాలా తక్కువగా ఉంటుంది -ఏడాదికి 20 మి.మీ; కొన్ని " బ్లూ ఐస్" ప్రాంతాలలో ఉత్పతనం (సబ్లిమేషన్) ద్వారా కలిగే నీటి నష్టం కంటే అవపాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి స్థానిక ద్రవ్యరాశి సంతులనం ప్రతికూలంగా ఉంటుంది. పొడి లోయలలో, అదే ప్రభావం రాక్ బేస్ మీద సంభవిస్తుంది, ఇది నిర్జనలమైన ప్రకృతి దారితీస్తుంది.
పశ్చిమ అంటార్కిటికాపై పశ్చిమ అంటార్కిటిక్ ఐస్ షీట్ కప్పేసి ఉంటుంది. ఈ ఐసు పలక కూలిపోయే అవకాశం కనిపించి, ఇటీవలి కాలంలో ఆందోళన కలిగింది. ఈ పలక విచ్ఛిన్నమైతే, చాలా తక్కువ భౌగోళిక కాల వ్యవధిలో (బహుశా కొన్ని శతాబ్దాల్లో) సముద్ర మట్టాలు చాలా మీటర్లు పెరుగుతాయి. అనేక అంటార్కిటిక్ మంచు ప్రవాహాలు అనేక అంటార్కిటిక్ ఐస్ షెల్ఫుల్లోకి ప్రవహిస్తాయి. మొత్తం ఐసు షీట్లో ఈ మంచు ప్రవాహాల వాటా 10% ఉంటుంది.
తూర్పు అంటార్కిటికా, ట్రాన్సాంటార్కిటిక్ పర్వతాలకు హిందూ మహాసముద్రం వైపున ఉంది. కోట్స్ ల్యాండ్, క్వీన్ మౌడ్ ల్యాండ్, ఎండర్బై ల్యాండ్, మాక్ రాబర్ట్సన్ ల్యాండ్, విల్కేస్ ల్యాండ్, విక్టోరియా ల్యాండ్ లు ఈ ప్రాంతంలో ఉన్నాయి. చిన్న ముక్క మినహా మిగిలిన తూర్పు అంటార్కిటికా అంతా తూర్పు అర్ధగోళంలోనే ఉంది. తూర్పు అంటార్కిటికా ఎక్కువగా తూర్పు అంటార్కిటిక్ ఐస్ షీట్ చేత కప్పబడి ఉంటుంది.
4,892 మీటర్ల ఎత్తైన విన్సన్ మాసిఫ్, అంటార్కిటికాలోని ఎత్తైన శిఖరం. ఇది ఎల్స్‌వర్త్ పర్వతాలలో ఉంది. అంటార్కిటికా ప్రధాన ఖండం పైనా, పరిసర ద్వీపాలలోనూ అనేక ఇతర పర్వతాలు ఉన్నాయి. రాస్ ద్వీపంలోని మౌంట్ ఎరేబస్ ప్రపంచంలో అత్యంత దక్షిణాన ఉన్న చురుకైన అగ్నిపర్వతం. మరొక ప్రసిద్ధ అగ్నిపర్వతం డిసెప్షన్ ద్వీపంలో కనుగొన్నారు. ఇది 1970 లో పెద్ద విస్ఫోటనం చెందింది. చిన్న విస్ఫోటనాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇటీవలి సంవత్సరాలలో లావా ప్రవాహాన్ని గమనించారు. నిద్రాణంగా ఉన్న కొన్ని అగ్నిపర్వతాలు చురుకుగా మారవచ్చు.[8] 2004 లో, అంటార్కిటిక్ ద్వీపకల్పంలో నీటి అడుగున ఉన్న చురుగ్గా ఉండే అవకాశం ఉన్న అగ్నిపర్వతాన్ని అమెరికన్, కెనడియన్ పరిశోధకులు కనుగొన్నారు.[9]
అంటార్కిటికాలో 70 కి పైగా సరస్సులు ఉన్నాయి, ఇవి ఖండాంతర మంచు పలక పాదం వద్ద ఉన్నాయి. 1996 లో రష్యా వారి వోస్తోక్ స్టేషన్ క్రింద కనుగొన్న వోస్తోక్ సరస్సు, ఈ హిమనదీయ సరస్సులలో కెల్లా అతి పెద్దది. ఈ సరస్సు 5 నుండి 10 లక్షల సంవత్సరాలుగా కప్పబడి ఉందని భావిస్తున్నారు. కాని ఇటీవలి సర్వే ప్రకారం, తరచూ ఒక సరస్సు నుండి మరొక సరస్సు లోకి పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తుందని కనుగొన్నారు.[10]
వోస్తోక్ సరస్సు జలాల్లో సూక్ష్మజీవులు ఉండి ఉండవచ్చు. నీటి రేఖకు పైన సుమారు 400 మీ. (1,300 అ.) వరకు ఐసు లోకి డ్రిల్లింగ్ చేసి, తీసిన ఐస్ కోర్ల రూపంలో కొన్ని ఆధారాలు ఉన్నాయి. గడ్డకట్టిన ఈ సరస్సు ఉపరితలం, బృహస్పతి ఉపగ్రహమైన యూరోపాను పోలి ఉంటుంది. వోస్తోక్ సరస్సులో జీవం ఉంటే, యూరోపాపై కూడా జీవం ఉండే అవకాశం ఉందనే వాదనకు బలం చేకూరుతుంది.[11][12] 2008 ఫిబ్రవరి 7 న, నాసా బృందం అంటర్సీ సరస్సుకు ఒక యాత్రను బయల్దేరదీసింది. ఆ సరస్సు యొక్క క్షార జలాల్లో ఎక్స్‌ట్రీమోఫైల్స్ కోసం వెతుకుతుంది. అవి కనబడితే, చాలా చల్లని, మీథేన్ అధికంగా ఉండే వాతావరణాల్లో గ్రహాంతర జీవులు ఉండవచ్చనే వాదనకు బలం పెరుగుతుంది.[13]
2018 సెప్టెంబరులో, నేషనల్ జియోస్పేషియల్-ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పరిశోధకులు అంటార్కిటికా యొక్క అధిక రిజల్యూషన్ టెర్రైన్ మ్యాప్‌ను (కారు కూడా వివరంగా కనబడేలా, కొన్ని ప్రాంతాలలోనైతే ఇంకా చిన్న వస్తువులు కూడా కనబడేలా) విడుదల చేశారు, దీనికి " రిఫరెన్స్ ఎలివేషన్ మోడల్ ఆఫ్ అంటార్కిటికా " (రెమా) అని పేరు పెట్టారు.[14]
భూమిపై నున్న ఖండాలన్నిటి లోకీ అంటార్కిటికా అత్యంత శీతలమైనది. 3.4 కోట్ల సంవత్సరాల క్రితం వరకు దీనిపై మంచు ఉండేది కాదు. అప్పుడే మంచు కప్పడం మొదలైంది.[15] భూమిపై ఇప్పటివరకు అతి తక్కువ గాలి ఉష్ణోగ్రత −89.2 °C (−128.6 °F) 1983 జూలై 21 న అంటార్కిటికాలోని రష్యన్ వోస్తోక్ స్టేషన్ వద్ద నమోదైంది.[16] దీని కంటే తక్కువగా, −94.7 °C (−138.5 °F) గాలి ఉష్ణోగ్రత 2010 లో ఉపగ్రహం ద్వారా నమోదైంది. అయితే, ఇది భూ ఉష్ణోగ్రతల ద్వారా ప్రభావితమై ఉండవచ్చు. అధికారిక గాలి ఉష్ణోగ్రత కొలిచే 2 మీటర్ల ఎత్తులోని ఉష్ణోగ్రత కాకపోవచ్చు.[17]
అంటార్కిటికా, చాలా తక్కువ అవపాతం ఉన్న ఘనీభవించిన ఎడారి. దక్షిణ ధ్రువం వద్ద అవపాతం సగటున ఏటా 10 మి.మీ. కంటే తక్కువ. సగటు ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా శీతాకాలంలో −80 °C (−112 °F), −89.2 °C (−128.6 °F) ఖండం లోపలి భాగంలోను, గరిష్ఠంగా వేసవిలో తీరం దగ్గర 5 °C (41 °F), 15 °C (59 °F) ల మధ్య ఉంటాయి. 2020 ఫిబ్రవరి 9 న ఉత్తర అంటార్కిటికాలో 20.75 °C (69.3 °F) ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఈ ఖండంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత.[18][19] మంచు ఉపరితలం, దానిపై పడే అతినీలలోహిత కాంతిని దాదాపు అంతటినీ ప్రతిబింబిస్తుంది కాబట్టి సన్‌బర్న్ పెద్ద ఆరోగ్య సమస్య. సుదీర్ఘకాలం పాటు ఉండే చీకటి లేదా సుదీర్ఘకాలం పాటు ఉండే ఎండ వలన ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలలోని మానవులకు అనుభవం లోకి రాని శీతోష్ణస్థితి ఇక్కడ ఉంటుంది.[20]
తూర్పు అంటార్కిటికా దాని పశ్చిమ భాగం కంటే ఎత్తులో ఉంటుంది కాబట్టి, దాని కంటే చల్లగా ఉంటుంది. ఖండం మధ్యలో చల్లగా, పొడిగా ఉంటుంది. ఖండంలోని కేంద్ర భాగంలో అవపాతం లేకపోయినప్పటికీ, అక్కడ ఐసు ఎక్కువ కాలం ఉంటుంది. తీరప్రాంతంలో భారీ హిమపాతాలు కలగడం మామూలే. ఇక్కడ 48 గంటల్లో 1.22 మీటర్ల హిమపాతం నమోదైంది.
ఖండం అంచు వద్ద, ధ్రువ పీఠభూమి నుండి బలమైన కటాబాటిక్ గాలులు తరచుగా తుఫాను శక్తితో వోస్తూంటాయి. లోపలి భాగంలో, గాలి వేగం సాధారణంగా మితంగా ఉంటుంది. వేసవిలో స్పష్టంగా ఉన్న రోజులలో, ధ్రువంలో ప్రతిరోజూ 24 గంటల సూర్యరశ్మి ఉటుంది కాబట్టి, సౌర వికిరణం భూమధ్యరేఖ కంటే ఎక్కువగా ఇక్కడికి చేరుతుంది.
మూడు కారణాల వల్ల అంటార్కిటికా ఆర్కిటిక్ కంటే చల్లగా ఉంటుంది. మొదటిది, ఖండంలో ఎక్కువ భాగం సముద్ర మట్టం నుండి 3,000 మీటర్ల కంటే ఎత్తున ఉంటుంది. ట్రోపోస్పియరులో ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూంటుంది. రెండవది, ఉత్తర ధ్రువ మండలాన్నంతటినీ ఆర్కిటిక్ మహాసముద్రం కవర్ చేస్తుంది: సముద్రపు నీటిలో ఉండే వెచ్చదనం ఐస్‌ప్యాక్ ద్వారా బదిలీ అయి, ఉష్ణోగ్రతలు మరీ తగ్గిపోకుండా ఉంటాయి. మూడవది, జూలైలో భూమి అప్‌హీలియన్ వద్ద ఉంటుంది (అనగా, అంటార్కిటిక్ శీతాకాలంలో సూర్యుడి నుండి భూమి ఉన్న దూరం గరిష్ఠంగా ఉంటుంది), జనవరిలో పెరిహీలియన్ వద్ద ఉంటుంది (అనగా, అంటార్కిటిక్ వేసవిలో సూర్యుడికి నుండి భూమి ఉన్న దూరం కనిష్ఠంగా ఉంతుంది). కక్ష్యలోని ఈ దూరాలు చల్లటి అంటార్కిటిక్ శీతాకాలానికి (అలాగే వెచ్చని అంటార్కిటిక్ వేసవికి కూడా) దోహదం చేస్తాయి. అయితే మొదటి రెండు అంశాలు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి.[21]
దక్షిణ ధ్రువం దగ్గర రాత్రి పూట ఆకాశంలో కనిపించే వెలుగులను అరోరా ఆస్ట్రాలిస్ అంటారు. దక్షిణాది దీపాలు అని కూడా అంటారు. ప్లాస్మాతో నిండి ఉండే సౌర గాలులు భూమి గుండా వెళ్ళేటపుడు ఇవి ఏర్పడతాయి. మరో ప్రత్యేకమైన దృశ్యం, డైమండ్ డస్ట్. చిన్నచిన్న మంచు స్ఫటికాలతో కూడిన మేఘం నేల పైనే కనిపిస్తుంది. సాధారణంగా స్పష్టమైన ఆకాశంలో ఏర్పడుతుంది, కాబట్టి ప్రజలు దీనిని కొన్నిసార్లు మబ్బులేని వాన అని కూడా పిలుస్తారు. సన్ డాగ్ అనేది తరచూ కనిపించే మరో వాతావరణ ఆప్టికల్ దృగ్విషయం. ఆకాశంలో అసలు సూర్యుని పక్కనే మరో సూర్యుడిలా ఒక ప్రకాశవంతమైన "స్థలం" కనిపిస్తుంది, లేదా సూర్యుడికి రెండువైపులా రెండు ప్రకాశవంతమైన స్థలాలు కనిపిస్తాయి. ఇవి మరో సూర్యుడిలా భ్రమ కలిగిస్తాయి.[20]
అనేక ప్రభుత్వాలు ఖండంలో శాశ్వత మానవ సహిత పరిశోధన కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. ఖండంలోను, దాని సమీప ద్వీపాలలోనూ శాస్త్రీయ పరిశోధన, ఇతర పనులూ నిర్వహించేవారు, వారికి మద్దతు ఇచ్చే వారి సంఖ్య శీతాకాలంలో సుమారు 1,000 వరకు, వేసవిలో 5,000 వరకూ ఉంటుంది. ఇది మిలియన్ చదరపు కిలోమీటర్లకు 70 నుండి 350 మంది జనసాంద్రత ఉన్నట్టు. చాలా స్టేషన్లలో ఏడాది పొడవునా సిబ్బంది ఉంటారు. శీతాకాలపు సిబ్బంది సాధారణంగా తమ సొంత దేశాల నుండి ఒక సంవత్సరం పాటు పనిచెయ్యడం కోసం వస్తారు. ట్రినిటీ చర్చి అనే ఒక ఆర్థడాక్స్ చర్చి 2004 లో రష్యన్ బెల్లింగ్షౌసేన్ స్టేషన్లో మొదలైంది. ఏడాది పొడవునా ఇక్కడ ఒకరో ఇద్దరో ప్రీస్టులుంటారు. వీరు కూడా సంవత్సరాని కొకసారి మారుతూంటారు.[22]
అంటార్కిటికాకు సమీపంలో ఉన్న ప్రాంతాలలో (అంటార్కిటిక్ కన్వర్జెన్సుకు దక్షిణాన ఉన్న ప్రాంతాలు) మొదటగా సెమీ-శాశ్వత నివాసాలు ఏర్పరచుకున్నవారు బ్రిటిష్ అమెరికన్ సీలర్లు. 1786 నుండి వీరు దక్షిణ జార్జియాలో ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సమయం గడుపుతూండేవారు. అది 1966 వరకు జరిగిన తిమింగలాలను వేటాడిన కాలం. ఆ ద్వీపం జనాభా వేసవిలో 1,000 కి పైగాను (కొన్ని సంవత్సరాలలో 2,000 కు పైగా) శీతాకాలంలో 200 వరకూనూ ఉండేది. చాలా మంది తిమింగల వేటగాళ్ళు నార్వేజియన్లు. బ్రిటిషర్ల సంఖ్య అప్పట్లో పెరుగుతూండేది. ఈ స్థావరాలలో గ్రిట్వికెన్, లీత్ హార్బర్, కింగ్ ఎడ్వర్డ్ పాయింట్, స్ట్రోమ్నెస్, హుస్విక్, ప్రిన్స్ ఒలావ్ హార్బర్, ఓషన్ హార్బర్, గోడ్తుల్ లు ఉన్నాయి. తిమింగలం స్టేషన్ల నిర్వాహకులు, ఇతర సీనియర్ అధికారులు వారి కుటుంబాలతో కలిసి నివసించేవారు. వారిలో గ్రిట్వికెన్ వ్యవస్థాపకుడు, కెప్టెన్ కార్ల్ అంటన్ లార్సెన్. అతడొక ప్రముఖ నార్వేజియన్ తిమింగల వేటగాడు, అన్వేషకుడు, కుటుంబంతో సహా అతడు 1910 లో బ్రిటిష్ పౌరసత్వాన్ని స్వీకరించాడు.
దక్షిణ ధ్రువ ప్రాంతంలో జన్మించిన మొదటి బిడ్డ నార్వేజియన్ అమ్మాయి, సోల్విగ్ గున్బ్జార్గ్ జాకబ్సేన్. ఆమె 1913 అక్టోబరు 8 న గ్రిట్వికెన్లో జన్మించింది. ఆమె జననాన్ని దక్షిణ జార్జియాలోని బ్రిటిష్ మేజిస్ట్రేట్ నమోదు చేసారు. ఆమె తిమింగలం స్టేషన్ అసిస్టెంట్ మేనేజర్ ఫ్రిడ్జోఫ్ జాకబ్సెన్, క్లారా ఒలెట్ జాకబ్సెన్ ల కుమార్తె. జాకబ్సెన్ 1904 లో ఈ ద్వీపానికి చేరుకున్నాడు. గ్రిట్వికెన్ మేనేజర్ అయ్యాడు. 1914 నుండి 1921 వరకు పనిచేశాడు; అతని పిల్లల్లో ఇద్దరు ఈ ద్వీపంలో జన్మించారు.[23]
ఎమిలియో మార్కోస్ పాల్మా 60 వ దక్షిణ సమాంతరానికి (60 డిగ్రీల దక్షిణ అక్షాంశం) దక్షిణంగా జన్మించిన మొదటి వ్యక్తి. అంటార్కిటిక్ ప్రధాన భూభాగంలో జన్మించిన మొదటి వ్యక్తి కూడా. 1978 లో అంటార్కిటిక్ ద్వీపకల్పపు కొనపై ఎస్పెరంజా బేస్ వద్ద అతడు జన్మించాడు;[24][25] ఖండం కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి అతని తల్లిదండ్రులను అర్జెంటీనా ప్రభుత్వం మరో ఏడు కుటుంబాలతో పాటు అక్కడికి పంపించింది. 1984 లో, జువాన్ పాబ్లో కామాచో ఫ్రీ మోంటల్వా స్టేషన్లో జన్మించాడు. అంటార్కిటికాలో జన్మించిన మొదటి చిలీ దేశస్థుడతడు. ఇప్పుడు అనేక స్థావరాల్లో బడికెళ్ళే పిల్లలున్న కుటుంబాలున్నాయి.[26] 2009 నాటికి, పదకొండు మంది పిల్లలు అంటార్కిటికాలో (60 వ దక్షిణ సమాంతరానికి దక్షిణాన) జన్మించారు: అర్జెంటీనా ఎస్పెరంజా బేస్ వద్ద ఎనిమిది మంది [27] చిలీ ఫ్రీ మోంటాల్వా స్టేషన్ వద్ద ముగ్గురు జన్మించారు.[28]
అనేక దేశాలు కొన్ని ప్రాంతాలలో తమ సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకున్నాయి. ఈ దేశాలలో కొన్ని ఒకదాని దావాలను మరొకటి పరస్పరం గుర్తించగా,[29] ఈ దావాల ప్రామాణికతకు విశ్వవ్యాప్తంగా గుర్తింపు లేదు.
అంటార్కిటికాపై కొత్త దావాలను 1959 నుండి తాత్కాలికంగా నిలిపివేసారు. అయినప్పటికీ 2015 లో నార్వే క్వీన్ మౌడ్ ల్యాండ్‌ను దక్షిణ ధ్రువం మధ్య క్లెయిమ్ చేయని ప్రాంతంతో సహా అధికారికంగా నిర్వచించింది.[30] అంటార్కిటికా స్థితిని 1959 అంటార్కిటిక్ ఒప్పందం, ఇతర సంబంధిత ఒప్పందాలు నియంత్రిస్తున్నాయి. వీటన్నిటినీ సమష్టిగా అంటార్కిటిక్ ఒప్పంద వ్యవస్థ అని పిలుస్తారు. ఒప్పంద వ్యవస్థ యొక్క ప్రయోజనాల కోసం 60 ° S కు దక్షిణంగా ఉన్న భూమి అంతా, ఐస్ షెల్ఫులన్నీ అంటార్కిటికాయే అని నిర్వచించారు. ఈ ఒప్పందంపై సోవియట్ యూనియన్ (తరువాత రష్యా), యునైటెడ్ కింగ్డమ్, అర్జెంటీనా, చిలీ, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్ లతో సహా పన్నెండు దేశాలు సంతకం చేశాయి.[31] ఇది అంటార్కిటికాను శాస్త్రీయ సంరక్షణా స్థలంగా పక్కన పెట్టింది. శాస్త్రీయ పరిశోధనకు, పర్యావరణ పరిరక్షణకు స్వేచ్ఛ నిచ్చింది. అంటార్కిటికాపై సైనిక కార్యకలాపాలను నిషేధించింది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో నెలకొల్పిన మొదటి ఆయుధ నియంత్రణ ఒప్పందం ఇది.
1983 లో అంటార్కిటికా ఒప్పందంలో ఉన్న పక్షాలు అంటార్కిటికాలో మైనింగును నియంత్రించే ప్రతిపాదనపై చర్చలు ప్రారంభించాయి.[32] అంతర్జాతీయ సంస్థల సంకీర్ణం ఒకటి [33] ఈ ప్రాంతంలో ఖనిజాల వెలికితీతను నివారించడానికి ఒక ప్రజా ప్రచారాన్ని ప్రారంభించింది. దీనికి గ్రీన్‌పీస్ ఇంటర్నేషనల్ నాయకత్వం వహించింది.[34] ఇది 1987 నుండి 19911 వరకు ాస్ సీ ప్రాంతంలో తన సొంత శాస్త్రీయ స్టేషన్- వరల్డ్ పార్క్ బేస్ -ను నిర్వహించింది.[35] అంటార్కిటికా పర్యావరణంపై మానవ ప్రభావాలను నమోదు చేయడానికి వార్షిక యాత్రలను నిర్వహించింది.[36] 1988 లో, అంటార్కిటిక్ ఖనిజ వనరుల నియంత్రణపై ఒక తీర్మానాన్ని(CRAMRA) ఆమోదించింది.[37] అయితే, మరుసటి సంవత్సరం, ఆస్ట్రేలియా, ఫ్రాన్సులు ఈ తీర్మానాన్ని ఆమోదించబోమని ప్రకటించాయి. దాంతో ఉద్దేశాలు, ప్రయోజనాల పరంగా అది చనిపోయినట్లైంది. దాని బదులు, అంటార్కిటిక్ పర్యావరణాన్ని పరిరక్షించడానికి సమగ్రమైన వ్యవస్థను నెలకొల్పేందుకు జరపాలని ఆ రెండు దేశాలు ప్రతిపాదించాయి.[38] అంటార్కిటిక్ ఒప్పందానికి పర్యావరణ పరిరక్షణపై ప్రోటోకాల్ ("మాడ్రిడ్ ప్రోటోకాల్") వెలుగు చూసింది. ఇతర దేశాలు కూడా దాన్ని అనుసరించడంతో 1998 జనవరి 14 న ఇది అమల్లోకి వచ్చింది.[38][39] అంటార్కిటికాలోని అన్ని మైనింగులను మాడ్రిడ్ ప్రోటోకాల్ నిషేధించింది. అంటార్కిటికాను "శాంతికి విజ్ఞాన శాస్త్రానికీ అంకితమైన సహజ రిజర్వు"గా పేర్కొంది.
అంటార్కిటికా ఒప్పందం అంటార్కిటికాలో సైనిక కార్యకలాపాలను నిషేధించింది. సైనిక స్థావరాలు, కోటలు, సైనిక విన్యాసాలు, ఆయుధ పరీక్షలు అన్నీ నిషిద్ధమే. సైనిక సిబ్బంది, పరికరాలు శాస్త్రీయ పరిశోధన లేదా ఇతర శాంతియుత ప్రయోజనాల కోసం మాత్రమే అనుమతించబడతాయి.[40] 1965 లో అర్జెంటీనా మిలిటరీ చేసిన చిన్న ఆపరేషన్ నైన్టీ మాత్రమే ఇప్పటివరకూ నమోదైన భూతల సైనిక విన్యాసం.[41]
తేదీ | దేశం | భూభాగం | దావా పరిమితులు | మ్యాప్ |
---|---|---|---|---|
1840 | ఫ్రాన్సు | అడెలీ ల్యాండ్ | 142 ° 02′E నుండి 136 ° 11′E వరకు | |
1908 | యునైటెడ్ కింగ్డం | బ్రిటిష్ అంటార్కిటిక్ టెరిటరీ | అతివ్యాప్తితో సహా 080 ° 00′W నుండి 020 ° 00′W వరకు :
|
|
1923 | న్యూజీలాండ్ | రాస్ డిపెండెన్సీ | 160 ° 00′E నుండి 150 ° 00′W వరకు | |
1929 | నార్వే | పీటర్ I ద్వీపం | 68°50′S 90°35′W | |
1933 | ఆస్ట్రేలియా | ఆస్ట్రేలియన్ అంటార్కిటిక్ భూభాగం | 044 ° 38′E నుండి 136 ° 11′E, 142 ° 02′E నుండి 160 ° 00′E వరకు | |
1939 | నార్వే | క్వీన్ మౌడ్ ల్యాండ్ | 020 ° 00′W నుండి 044 ° 38′E వరకు | |
1940 | చిలీ | చిలీ అంటార్కిటిక్ భూభాగం | అతివ్యాప్తితో సహా 090 ° 00′W నుండి 053 ° 00′W వరకు :
|
|
1943 | అర్జెంటీనా | అతివ్యాప్తితో సహా 074 ° 00′W నుండి 025 ° 00′W వరకు :
|
||
- | (ఎవరికీ చెందనిది) | క్లెయిమ్ చేయని భూభాగం (మేరీ బైర్డ్ ల్యాండ్) | 150 ° 00′W నుండి 090 ° 00′W వరకు
(పీటర్ I ద్వీపం తప్ప) |
అర్జెంటీనా, బ్రిటిష్, చిలీల దావాలన్నీ ఒకదానిపై ఒకటి అతివ్యాప్తి చెందాయి. దాంతో ఘర్షణలు తలెత్తాయి. 2012 డిసెంబరు 18 న, బ్రిటిష్ విదేశీ, కామన్వెల్త్ కార్యాలయం క్వీన్ ఎలిజబెత్ II వజ్రోత్సవానికి నివాళిగా గతంలో పేరులేని ప్రాంతానికి క్వీన్ ఎలిజబెత్ ల్యాండ్ అని పేరు పెట్టింది.[42] 2012 డిసెంబరు 22 న, అర్జెంటీనాలోని యుకె రాయబారి జాన్ ఫ్రీమాన్‌ను పిలిచి అర్జెంటీనా ప్రభుత్వం దీనిపై నిరసన తెలియజేసింది.[43] సమీపం లోని ఫాక్లాండ్ దీవుల సార్వభౌమత్వంపై వివాదాలు, ఫాక్లాండ్స్ యుద్ధ 30 వ వార్షికోత్సవం కారణంగా అర్జెంటీనా-యుకె సంబంధాలు 2012 అంతటా దెబ్బతిన్నాయి.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లు దావా చేస్తున్న భూభాగాలు వాటికి స్వాతంత్ర్యం రాకముందు వరకూ బ్రిటిషు భూభాగంలో భాగంగా ఉండేవి. ప్రస్తుతం ఆస్ట్రేలియా దావా చేస్తున్న ప్రాంతం అన్నిటికంటే పెద్ద భూభాగం. బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫ్రాన్స్, నార్వేలు తమతమ దావాలన్నిటినీ పరస్పరం గుర్తించుకున్నాయి.
అంటార్కిటిక్ ఒప్పందంలో సభ్యులుగా పాల్గొనే కొన్ని ఇతర దేశాలకు కూడా అంటార్కిటికాపై ప్రాదేశిక ఆసక్తి ఉంది. అయితే ఒప్పందం నిబంధనలు అమల్లో ఉండగా తమ తమ దావాలను చెప్పడానికి అనుమతించవు.[44][45]
తీరం వద్ద సముద్రంలో చేపలు పట్టడం, చిన్న తరహా పర్యాటకం మినహా, ప్రస్తుతం అంటార్కిటికాలో ఆర్థిక కార్యకలాపాలు పెద్దగా ఏమీ లేవు.
బొగ్గు, హైడ్రోకార్బన్లు, ఇనుము ధాతువు, ప్లాటినం, రాగి, క్రోమియం, నికెల్, బంగారం, ఇతర ఖనిజాలు కనుగొన్నప్పటికీ, అవి వెలికితీసేంత పరిమాణంలో లేవు.[48] పర్యావరణ పరిరక్షణపై 1991 ప్రోటోకాల్ వనరుల వాడకాన్ని పరిమితం చేసింది. మైనింగ్‌పై నిరవధిక నిషేధం విధిస్తూ, 2048 లో దాన్ని సమీక్షించేలా, ఆర్థికాభివృద్ధిని, వనరుల వాడకాన్ని మరింత పరిమితం చేస్తూ 1998 లో ఒక రాజీ ఒప్పందం కుదిరింది. చేపలను పట్టుకోవడం, ఆఫ్‌షోర్ వ్యాపారం చేయడం ఇక్కడి ప్రాథమిక ఆర్థిక కార్యకలాపం. 2000-01లో అంటార్కిటిక్ ఫిషరీస్ 112,934 టన్నుల చేపలను పట్టినట్లు నివేదించింది.[49]
చిన్న-స్థాయి "సాహస పర్యాటకం" 1957 నుండి ఇక్కడ ఉంది. ప్రస్తుతం ఇది అంటార్కిటిక్ ఒప్పందం, పర్యావరణ ప్రోటోకాల్ నిబంధనలకు లోబడి ఉంది. అయితే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అంటార్కిటికా టూర్ ఆపరేటర్స్ (IAATO) స్వీయ-నియంత్రణలో ఈ పర్యాటకం ఉంది. అంటార్కిటిక్ పర్యటకంతో సంబంధం ఉన్న ఓడలన్నీ IAATO లో సభ్యులు కావు. కాని IAATO సభ్యులే ఇక్కడి పర్యాటకంలో 95% కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ప్రయాణం ఎక్కువగా చిన్న లేదా మధ్యస్థ ఓడల ద్వారా ఉంటుంది. ఐకానిక్ వన్యప్రాణుల సాంద్రత కలిగిన నిర్దిష్ట సుందరమైన ప్రదేశాల గుండా యాత్ర సాగుతుంది. 2006-07 దక్షిణ వేసవిలో మొత్తం 37,506 మంది పర్యాటకులు సందర్శించారు. దాదాపుగా వీరందరూ వాణిజ్య నౌకల్లో వచ్చినవారే. 2015–16లో 38,478 మంది వచ్చారు.[50][51][52] 2015 నాటికి, అంటార్కిటికాలో వెల్స్ ఫార్గో వారివి రెండు ఎటిఎంలు ఉన్నాయి .[53]
సందర్శకుల ప్రవాహం వల్ల పర్యావరణ వ్యవస్థపై కలిగే ప్రతికూల ప్రభావాల పట్ల కొంత ఆందోళన ఉంది. కొంతమంది పర్యావరణవేత్తలు శాస్త్రవేత్తలు నౌకలకు కఠినమైన నిబంధనలు పెట్టాలని, పర్యాటకంలో కోటా విధించాలనీ పిలుపునిచ్చారు.[54] అంటార్కిటిక్ ఒప్పంద పార్టీలు ప్రాథమిక ప్రతిస్పందనగా, వారి పర్యావరణ పరిరక్షణ కమిటీ ద్వారా, IAATO తో కలిసి, "సైట్ వినియోగ మార్గదర్శకాల"ను అభివృద్ధి చేసింది. ల్యాండింగ్ పరిమితులు విధించడం, తరచుగా సందర్శించే సైట్లలో కొన్ని ప్రాంతాలను మూసివెయ్యడం లేదా పరిమితం చెయ్యడం. అంటార్కిటిక్ సందర్శన కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల నుండి ఫ్లైట్లను (ఇవి అంటార్కిటికాలో ల్యాండవవు, ఎగురుతూ వెళ్తాయి) నిర్వహిస్తూ ఉండేవారు. 1979 లో ఎయిర్ న్యూజిలాండ్ ఫ్లైట్ 901 మౌంట్ ఎరేబస్ మీద కూలిపోయిన గోర ప్రమాదంలో 257 మంది చనిపోయాక, వాటిని ఆపేసారు. 1990 ల మధ్యలో క్వాంటాస్, ఆస్ట్రేలియా నుండి అంటార్కిటికాకు వాణిజ్య ఓవర్‌ఫ్లైట్‌లను తిరిగి ప్రారంభించింది.
అంటార్కిటిక్ ఫిషరీస్ 1998-99లో (1 జూలై - 30 జూన్) 119,898 టన్నుల చేపలను చట్టబద్ధంగా పట్టినట్లు వెల్లడించింది.[55]
అంటార్కిటికాలో సుమారు ముప్పై దేశాలు డెబ్బై పరిశోధనా కేంద్రాలను (శాశ్వతమైనవి 40, వేసవి కాలపు స్టేషన్లు 30) నిర్వహిస్తున్నాయి. వేసవిలో సుమారు 5,000, శీతాకాలంలో 1,000 మంది జనాభా ఉండేవారు.
అధికార పరిధితో సంబంధం లేకుండా మొత్తం అంటార్కిటికా ఖండమంతటికీ "AQ" అనే కంట్రీ కోడ్‌ను కేటాయించారు. పరిపాలనా దేశాన్ని బట్టి కాలింగ్ కోడ్లు, కరెన్సీలు [56] ఉపయోగిస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్, కెనడాలో అమ్మే సావనీర్ వస్తువైన అంటార్కిటికాన్ డాలర్, చట్టబద్ధమైన ద్రవ్యం కాదు.[57]
దక్షిణ ధ్రువంలో ఉన్న కారణంగా, అంటార్కిటికా దక్షిణ వేసవిలో మినహా చాలా తక్కువ సౌర వికిరణాన్ని పొందుతుంది. అంటే ఇది చాలా చల్లటి ఖండం, ఇక్కడ నీరు ఎక్కువగా మంచు రూపంలో ఉంటుంది. అవపాతం తక్కువగా ఉంటుంది (అంటార్కిటికాలో ఎక్కువ భాగం ఎడారి ). దాదాపు ఎల్లప్పుడూ మంచు రూపంలోనే ఉంటుంది. ఈ మంచు ఇక్కడి నేలంతటినీ కప్పేసే ఒక పెద్ద ఐసు పలకను ఏర్పరుస్తుంది. ఈ ఐసు పలక లోని కొన్ని భాగాలు మంచు ప్రవాహాలు అనే కదిలే హిమానీనదాలను ఏర్పరుస్తాయి. ఇవి ఖండం అంచుల వైపు ప్రవహించి, తీరం పక్కన మంచు ఐసు షెల్ఫులను ఏర్పరుస్తాయి. తీరం నుండి సముద్రంలో కూడా ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా ఉంటాయి. అంచేత సంవత్సరంలో ఎక్కువ కాలం సముద్రపు నీటి నుండి మంచు ఏర్పడుతుంది. సముద్ర మట్టాలపైన, ప్రపంచవ్యాప్త శీతలం పైనా అంటార్కిటిక్ ఐసు కలిగించే ప్రభావాలను అర్థం చేసుకోవాలంటే, వివిధ రకాల అంటార్కిటిక్ ఐసులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
ఏటా అంటార్కిటిక్ శీతాకాలంలో సముద్రపు మంచు విస్తరిస్తుంది. వేసవిలో ఈ మంచు చాలా వరకు కరుగుతుంది. ఈ మంచు సముద్రపు నీటి నుండి ఏర్పడి ఆ నీటిలోనే తేలుతూంటుంది. ఆ విధంగా అది సముద్ర మట్టం పెరగడానికి దోహదపడదు. అంటార్కిటికా చుట్టూ సముద్రపు మంచు విస్తీర్ణం (చదరపు కిలోమీటర్ల కవరేజ్ పరంగా) ఇటీవలి దశాబ్దాలలో సుమారుగా స్థిరంగా ఉంది. అయితే దాని మందంలో హెచ్చుతగ్గులెలా ఉన్నాయో అస్పష్టంగా ఉంది.[58][59]
తేలియాడే ఐసు షెల్ఫులు (నేలపై తయారైన మంచు) కరగడం, దానంతటదే సముద్ర మట్టం పెరగడానికి పెద్దగా దోహదం చేయదు (మంచు దాని స్వంత ద్రవ్యరాశిని మాత్రమే స్థానభ్రంశం చేస్తుంది కాబట్టి). అయితే, నేలపై నుండి ఐసు ప్రవహించి బయటకు వచ్చి ఐసు షెల్ఫ్‌ను ఏర్పరుస్తుంది. ఇదే.., ప్రపంచ సముద్ర మట్టాల పెరుగుదలకు కారణమవుతుంది. తిరిగి ఖండంలో మంచు కురవడం ద్వారా ఈ ప్రభావానికి విరుగుడు కలుగుతుంది. ఇటీవలి దశాబ్దాల్లో అంటార్కిటికా తీరం చుట్టూ, ముఖ్యంగా అంటార్కిటిక్ ద్వీపకల్పంలో పెద్ద పెద్ద ఐసు షెల్ఫులు చాలా నాటకీయంగా కూలిపోయాయి. దీని వల్ల నేలపై నున్న ఐసు పలకల నుండి హిమనదీయ ప్రవాహం పెరుగుతుందని ఆందోళనలు ఉన్నాయి.[60]
ప్రపంచపు మొత్తం మంచినీటిలో 70% అంటార్కిటికా ఖండంపైన ఉన్న మంచు రూపం లోనే ఉంది. [61]ఈ ఐసు షీట్ పై నిరంతరం మంచు కురుస్తూ ఐసు పెరుగుతూ ఉంటుంది. ఐసు ప్రవాహాల ద్వారా సముద్రంలోకి మంచు కలుస్తూ ఉంటుంది.
మంచు ద్రవ్యరాశిని, దానిలో కలిగే మార్పునూ కొలవడానికి వేర్వేరు ఉపగ్రహ పద్ధతులు ఒక లాగానే ఉన్నాయని షెపర్డ్ తదితరులు (2012) చెప్పారు. తూర్పు అంటార్కిటికా, పశ్చిమ అంటార్కిటికా, అంటార్కిటిక్ ద్వీపకల్పాల్లో ఐసు ద్రవ్యరాశిలో కలిగే మార్పులు, సంవత్సరానికి +14 ± 43, −65 ± 26, −20 ± 14 గిగా టన్నులు (జిటి) అని లెక్కవేసారు [62] అదే బృందం 2018 లో చేసిన క్రమబద్ధమైన అధ్యయనం ప్రకారం 1992 నుండి 2002 వరకు మొత్తం ఖండంలో మంచు నష్టం సగటున సంవత్సరానికి 43 గిగా టన్నులని అంచనా వేసింది. అయితే 2012 నుండి 2017 వరకు ఐదేళ్ళలో ఇది వేగవంతమై సంవత్సరానికి సగటున 220 గిగాటన్నులైంది.[63] నాసా వారి శీతోష్ణస్థితి మార్పు వెబ్సైట్, 2002 నుండి సంవత్సరానికి 100 గిగాటన్నులను మించిన మంచు నష్టం ఉంటోందని సూచిస్తోంది.[64]
హెచ్. జే జ్వాలీ తదితరులు చేసిన ఒకే ఒక్క 2015 అధ్యయనంలో మంచు ద్రవ్యరాశిలో నికర మార్పు సంవత్సరానికి సుమారు 82 గిగాటన్నులతో కొద్దిగా సానుకూలంగా ఉందని కనుగొన్నారు. దీని ఫలితంగా అంటార్కిటిక్ కార్యకలాపాల వలన ప్రపంచ సముద్ర మట్టపు పెరుగుదలలో 0.23 మి.మీ. తగ్గుతుంది.[65] అయితే, నాసా వారి జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి చెందిన ఎరిక్ రిగ్నోట్, ఈ అధ్యయనం ఫలితాలు "అన్ని ఇతర స్వతంత్ర అధ్యయనాలైన పునఃవిశ్లేషణ, గురుత్వాకర్షణ కొలతలు, మాస్ బడ్జెట్ పద్ధతి, అదే డేటాను ఉపయోగించే ఇతర సమూహాలతో విభేదిస్తున్నాయి" ప్రస్తుత సాంకేతికత, గణిత విధానాలు అనుమతించే దానికంటే మరింత కచ్చితమైన విలువలను వీరి అధ్యయనం చేరుకున్నట్లు కనిపిస్తోంది.[66]
అంటార్కిటిక్ సముద్రపు మంచు విస్తారాల మొత్తం పెరుగుదల 2014 లో తిరగబడిందని ఉపగ్రహ రికార్డు వెల్లడించింది. 2014–2017 కాలంలో వేగంగా తగ్గడంతో అంటార్కిటిక్ సముద్రపు మంచు రాశి 40- ఏళ్ళ అత్యల్ప స్థాయికి పడిపోయింది.[67]
తూర్పు అంటార్కిటికా, సముద్ర మట్టానికి పైన ఉన్న చల్లటి భూభాగం. ఖండంలో అధిక భాగం ఇదే. ఈ ప్రాంతంలో చిన్నచిన్న హిమపాతాలు సంచితమై, ఐసుగా మారుతుంది. ఈ ఐసు లోని కొంత భాగమే ఐసు ప్రవాహాలుగా మారి, సముద్రం లోకి ప్రవహిస్తుంది. మొత్తం తూర్పు అంటార్కిటిక్ ఐస్ షీట్ యొక్క ద్రవ్యరాశి సమతుల్యత కొద్దిగా సానుకూలంగా గానీ (సముద్ర మట్టాన్ని తగ్గించడం) లేదా సమతుల్యతకు దగ్గరగా గానీ ఉంటుందని భావిస్తున్నారు.[68][69][70] అయితే, కొన్ని ప్రాంతాల్లో ఐసు ప్రవాహం పెరిగినట్లుగా సూచిస్తున్నారు.[69][71]
అంటార్కిటికా వేడెక్కుతోంది; మరీ ముఖ్యంగా అంటార్కిటిక్ ద్వీపకల్పం వేడెక్కడం బలంగా ఉన్నట్లు గుర్తించారు. అంటార్కిటికా ఖండ వ్యాప్తంగా సగటు ఉపరితల ఉష్ణోగ్రత ధోరణి, 1957 నుండి 2006 మధ్య కాలంలో ఒక దశాబ్దానికి సగటున > 0.05 °C ఉందని 2009 లో ప్రచురించిన ఎరిక్ స్టీగ్ అధ్యయనం గుర్తించింది. పశ్చిమ అంటార్కిటికా, గత 50 సంవత్సరాలలో దశాబ్దానికి 0.1 °C కన్నా ఎక్కువ వేడెక్కిందని ఈ అధ్యయనం పేర్కొంది. శీతాకాలం, వసంతకాలంలో ఈ వేడెక్కడం అత్యంత బలంగా ఉంటోంది. తూర్పు అంటార్కిటికాలో శరత్కాలపు శీతలీకరణ వలన ఇది కొంతవరకు మారుతోంది.[72] మానవ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల ఫలితంగా అంటార్కిటికా వేడెక్కుతున్నట్లు ఒక అధ్యయనంలో ఆధారాలు లభించాయి,[73] కానీ ఇది అస్పష్టంగానే ఉంది.[74] పశ్చిమ అంటార్కిటికాలో ఉపరితల వేడెక్కడం ఎక్కువగానే ఉన్నప్పటికీ, ఉపరితలం వద్ద గమనించదగినంత ద్రవీభవనం లేదు. సముద్ర మట్టానికి పశ్చిమ అంటార్కిటిక్ ఐస్ షీట్ దోహదం చేయలేదు. దీని బదులు హిమానీనదాల ప్రవాహంలో ఇటీవలి పెరుగుదలకు, ఖండాంతర షెల్ఫ్‌కు దగ్గరలో మహాసముద్రం నుండి వచ్చే వెచ్చని నీటి ప్రవాహం కారణమని భావిస్తున్నారు.[75][76] అంటార్కిటిక్ ద్వీపకల్పం నుండి సముద్ర మట్టం పెరగడానికి నికర సహకారం, అక్కడి వాతావరణం వేడెక్కడం యొక్క ప్రత్యక్ష ఫలితమే.[77]
2002 లో అంటార్కిటిక్ ద్వీపకల్పం లోని లార్సెన్-బి ఐసు షెల్ఫు కూలిపోయింది.[78] 28 2008 ఫిబ్రవరి మార్చి 8 మధ్య, ద్వీపకల్పంలోని నైరుతి భాగంలో ఉన్న విల్కిన్స్ ఐస్ షెల్ఫ్ నుండి సుమారు 570 చ.కి.మీ. ముక్క కూలిపోయింది. మిగిలిన 15,000 చ.కి.మీ. ఐసు షెల్ఫ్ పరిస్థితి ప్రమాదంలో పడింది. ఈ ఐసు షెల్ఫును 6 కి.మీ వెడల్పున్న ఐసు తాడు నిలకడగా నిలబెట్టి ఉంచింది.[79][80] చివరికి 2009 ఏప్రిల్ 5 న అది కూడా కూలిపోయింది.[81][82] గత 30 ఏళ్ళలో అత్యంత విస్తృతమైన అంటార్కిటిక్ ఉపరితల ద్రవీభవనం 2005 లో జరిగిందని నాసా చెప్పింది. ఆ సమయంలో కాలిఫోర్నియా అంత విస్తీర్ణం గల ఐసు కరిగి, మళ్ళీ వెంటనే గడ్డ కట్టింది. ఉష్ణోగ్రతలు 5 °C (41 °F) వరకు పెరగడం వల్లనే ఇది సంభవించి ఉండవచ్చు .[83]
నేచర్ జియోసైన్స్ 2013 లో ప్రచురించిన ఒక అధ్యయనంలో (2012 డిసెంబరులో ఆన్‌లైన్‌లోకి వచ్చింది) భూమిపై వేగంగా వేడెక్కుతున్న ప్రాంతాలలో ఒకటిగా మధ్య పశ్చిమ అంటార్కిటికాను గుర్తించింది. పరిశోధకులు అంటార్కిటికా లోని బైర్డ్ స్టేషన్ సేకరించిన పూర్తి ఉష్ణోగ్రత రికార్డును ప్రదర్శించారు. ఇది "1958 - 2010 మధ్య వార్షిక ఉష్ణోగ్రత సరళరేఖామార్గంలో 2.4 ± 1.2 °C పెరిగిందని తెలుపుతుంది".[84]
2020 ఫిబ్రవరిలో ఈ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రత 18.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయింది. ఇది 2015 మార్చి నాటి 17.5 డిగ్రీల రికార్డును మించిపోయింది.[85]
అంటార్కిటికాపై ఓజోన్ గాఢత తక్కువగా ఉన్న ప్రాంతం ఉంది. దీన్ని " ఓజోన్ రంధ్రం "ని అంటారు. ఈ రంధ్రం దాదాపు మొత్తం ఖండాన్నంతటినీ కప్పింది. 2006 సెప్టెంబరులో అత్యంత పెద్ద పరిమాణంలో ఉంది. అత్యంత దీర్ఘ కాలం పాటు ఉన్న రంధ్రం డిసెంబరు చివరి వరకూ ఉండిపోయింది.[86] ఓజోన్ రంధ్రాన్ని శాస్త్రవేత్తలు 1985 లో కనుగొన్నారు.[87] ఇది తదనంతర సంవత్సరాలలో పెరిగింది. వాతావరణంలోకి క్లోరోఫ్లోరోకార్బన్లు లేదా సిఎఫ్సిల ఉద్గారమే ఓజోన్ రంధ్రానికి కారణమని చెప్పవచ్చు. ఇవి ఓజోన్ను ఇతర వాయువులుగా మారుస్తాయి.[88] 2019 లో, ఓజోన్ రంధ్రం గత ముప్పై ఏళ్ళలో అతి చిన్న స్థాయిలో ఉంది. వెచ్చని ధ్రువ స్ట్రాటోస్ఫియరు వలన ధ్రువ సుడిగుండం బలహీనపడటం దీనికి కారణం. ఇది ఓజోన్ నష్టానికి దారితీసే రసాయనిక చర్యలను ఎనేబుల్ చేసే 'ధ్రువ స్ట్రాటో ఆవరణ మేఘాలు' ఏర్పడటాన్ని తగ్గించింది.[89]
అంటార్కిటికాలో (దక్షిణార్ధగోళంలో విస్తృత ప్రాంతం) వాతావరణ మార్పులను నియంత్రించడంలో ఓజోన్ క్షీణతకు ఆధిపత్య పాత్ర ఉందని కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి.[87] స్ట్రాటోస్ఫియరులో ఓజోన్ పెద్ద మొత్తంలో అతినీలలోహిత వికిరణాన్ని గ్రహిస్తుంది. అంటార్కిటికాపై ఓజోన్ క్షీణత 6 °C వరకు స్థానిక స్ట్రాటోస్ఫియరులో శీతలీకరణకు కారణమవుతుంది. ఈ శీతలీకరణ, ఖండం చుట్టూ ప్రవహించే పశ్చిమ గాలులను (ధ్రువ సుడి) తీవ్రతరం చేసే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. తద్వారా దక్షిణ ధ్రువం దగ్గర ఉన్న చల్లని గాలి బయటకు పోకుండా చేస్తుంది. తత్ఫలితంగా, తూర్పు అంటార్కిటిక్ మంచు పలక తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉంటుంది. అంటార్కిటికాలోని పరిధీయ ప్రాంతాలు, ముఖ్యంగా అంటార్కిటిక్ ద్వీపకల్పం అధిక ఉష్ణోగ్రతలకు గురౌతాయి. ఇవి ద్రవీభవనం మరింత వేగంగా జరగడానికి కారణమౌతాయి.[87] ఓజోన్ క్షీణత / మెరుగైన ధ్రువ సుడి ప్రభావం ఖండం యొక్క ఒడ్డున సముద్రపు మంచు ఇటీవల పెరగడానికి కారణమని మోడల్స్ సూచిస్తున్నాయి.[90]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.