From Wikipedia, the free encyclopedia
హుస్సేన్ సాగర్ హైదరాబాదు నగరపు నడిబొడ్డున ఒక మానవ నిర్మిత సరస్సు. ఈ జలాశయాన్ని 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనా కాలములో హజ్రత్ హుస్సేన్ షా వలీచే నిర్మింపబడింది. 24 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న ఈ సరస్సు నగరం యొక్క మంచినీటి, సాగునీటి అవసరాలను తీర్చటానికి మూసీ నది నిర్మించబడింది. చెరువు మధ్యలో హైదరాబాదు నగర చిహ్నముగా ఒక ఏకశిలా బుద్ధ విగ్రహాన్ని 1992లో స్థాపించారు. దీనికి పక్కన నెక్ లెస్ రోడ్ ఉంది.[1] ఇక్కడ 1920లో హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్ నిర్మించబడింది.
1562లో హుస్సేన్ సాగర్ నిర్మాణాన్ని ఇబ్రహీం కులీ కుతుబ్ షా కట్టించినా, దాని నిర్మాణ పర్యవేక్షణ మాత్రం ఇబ్రహీం కులీ అల్లుడు, పౌర నిర్మాణాల సూపరిండెంటైన హుస్సేన్ షా వలీ చేపట్టాడు.చెరువు తవ్వకం పూర్తయినా నీరు నిండకపోవటంతో మూసీ నదికి అనుసంధానం చేశారు. 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 32 అడుగుల లోతుతో చెరువు ఉండేది. కుతుబ్ షా ఈ సరస్సుకు ఇబ్రహీం సాగర్ అని పేరుపెట్టాలని అనుకున్నాడు, కానీ హుస్సేన్ వలీ యొక్క ప్రాచ్యుర్యము వలన ప్రజలు ఆయన పేరు మీదుగా హుస్సేన్ సాగర్ చెరువు అని పిలవటం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న సుల్తాను చెరువులకున్న ప్రజాదరణను గమనించి వెంటనే తన పేరు మీద గోల్కొండకు 16 మైళ్ళ దూరములో ఇబ్రహీంపట్నం చెరువును నిర్మింపజేశాడు.[2]
1568లో హుస్సేన్ సాగర్ చుట్టూ గట్టుగా నిర్మించబడిన రోడ్డును టాంక్ బండ్ అంటారు. ఈ రోడ్డు హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలను కలుపుతుంది. 1830లో తన కాశీయాత్రలో భాగంగా నగరాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ గట్టుగా నిర్మించిన బాట గురించి వ్రాశారు. ఆ కట్టమీద ఇంగ్లీషువారు గుర్రపుబండ్లు పొయ్యేటందుకు యోగ్యముగా భాట ముచ్చటగా చక్కచేసి మొగలాయి వాహనాలున్నూ మనుష్యులున్ను ఎక్కినడిచి చెరచకుండా భాటకు ఇరుపక్కలా తమ పారా పెట్టియున్నారు. అని ఆయన వ్రాశారు. ఏనుగుల వీరాస్వామయ్య రాసిన ప్రకారం యూరోపియన్లు మినహా మిగిలిన వారికి ముందస్తుగా అనుమతి లేకుండా ఎక్కనిచ్చేవారు.[3] ఈ గట్టుమీద నుండి వెళ్ళే ట్యాంక్ బండ్ రహదారికి, జంటనగరాలలో ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. పొద్దున్న పూట వ్యాయామంలో భాగంగా ఉదయం నడక సాగించేవారికి, సాయంకాలం వాహ్యాళికి వెళ్ళేవారికి (ముఖ్యంగా ఆదివారం, ఇతర శెలవు రోజుల సాయంత్ర సమయాలలో), స్నేహితులను కలుసుకొనేవారికి, ఇది ఒక ఇష్టమైన ప్రత్యేక స్థలం.
1985 లో " బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ " ప్రతిపాదించబడింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హుస్సేన్‌సాగర్ నడిబొడ్డున భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని భావించారు. శిల్పులు యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలం, రాయగిరి సమీపంలోని వెంకటేశ్వర గుట్టలో అనువైన రాయి ఉందని గుర్తించారు. రాయిని తొలిచే పని 1985లో ప్రారంభమైంది. గుట్ట నుంచి తొలిచిన 17 మీటర్ల పొడవు, 320 టన్నుల భారీ రాయిని బుద్ధుడి విగ్రహంగా మలిచేందుకు 1988లో హైదరాబాద్‌కు 192 చక్రాల భారీ వాహనంపై ఎంతో శ్రమకోర్చి తరలించారు. ప్రముఖ శిల్పి గణపతి సత్పతి ఆధ్వర్యంలో 40 మంది శిల్పులు బుద్ధుడి విగ్రహానికి రూపం ఇచ్చారు. గ్రానైట్‌తో చేయబడిన బుద్ధుని శిల్పం చేయడానికి 200 మంది శిల్పులు రెండు సంవత్సరాలు పనిచేసారు. శిల్పం బరువు 440 టన్నులు. శిల్పం ఎత్తు 17 మీ. 1988లో హైదరాబాదుకు తరలించబడిన బుద్ధుని శిల్పం 1992లో హుస్సేన్ సాగర్‌లో 'జిబ్రాల్టర్ రాక్' అనబడే రాతిపైన స్థాపించబడింది[4][5]. అప్పటినుంచి అదే విగ్రహం హుస్సేన్‌సాగర్, నగరం మొత్తానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ రాయిని తరలించినందుకు గుర్తుగా రాయగిరి వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేశారు.
ప్రతి సంవత్సరం వినాయక చవితి అనంతరం హుస్సేన్ సాగర్‌లో గణేశ విగ్రహాల నిమజ్జనం జంటనగరాలలో ఒక ముఖ్యమైన వార్షిక సంభరంగా పరిణమించింది.దీనివల్ల, ఈ సరస్సును "వినాయక్ సాగర్"గా కూడా కొంతమంది పిలవటం పరిపాటయ్యింది. కోలాహలంగా, అనేక వాహనాలలో, వివిధ సైజులలో వినాయకులు ఊరేగింపుగా తెచ్చి సరస్సులో నిమజ్జనం చేస్తారు. ఏటా దాదాపుగా 30,000 పైగా విగ్రహాలు ఇలా నిమజ్జనం చేయబడుతాయని అంచనా. ట్రాపిక్ సమస్యలను నియంత్రించడానికి, మతపరమైన కల్లోలాలు తలెత్తకుండా ఉండడానికి నగర పాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం పెద్దయెత్తున ఏర్పాట్లు చేస్తారు. బందోబస్తు కోసం 30,000 పైగా పోలీసు బలగం ఈ సమయంలో విధి నిర్వహరణలో ఉంటారు. విగ్రహాల సంఖ్యను, ఊరేగింపు రూట్లను, నిమజ్జనా కార్యకలాపాలను పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవడానికి ప్రణాళిక కోసం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నారు.[6] నిమజ్జనం జరిగిన మర్నాడు చూస్తే, అంతకుముందువరకు ఎన్నో పూజలందుకున్న విగ్రహాల మీదకెక్కి వాటిని పగులగొట్టి వాటిల్లో అమర్చిన ఇనప చువ్వలు తీసుకుపోతున్నవారు కనిపిస్తారు. చివరకు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ముక్కలుగా మారిన ఆ విగ్రహాలు నీటిలో మిగిలిపోతాయి.ఈ విధంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేయబడి, రసాయనిక రంగులు పూయబడిన విగ్రహాలను ఇంత పెద్ద యెత్తున నిమజ్జనం చేయడం వల్ల సరస్సు నీరు కలుషితమౌతుందని పర్యావరణ పరిరక్షణావాదులు హెచ్చరిస్తున్నారు.[7] విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో కాకుండా మట్టితో చేస్తే పర్యావరణం మీద ప్రభావం చాలావరకు తగ్గించవచ్చని, నిపుణుల అభిప్రాయం.
హుస్సేన్ సాగర్‌లో నానాటికి పెరిగిపోతున్న కాలుష్యం నగరవాసులకు, పర్యావరణ పరిరక్షణా వాదులకు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్న విషయం. ముక్కులు బద్దలయ్యే మురుగు వాసన, దారుణంగా విస్తరించిన తూటుకాడ, గుర్రపుడెక్క మొక్కలు, బాగా కలుషితమైన చెరువు వినాశనానికి దారి తీస్తున్నాయి. అదుపు లేకుండా నగరం మురుగు నీరు సరస్సులోకి చేరుతుండడంవల్ల ఈ సమస్య నానాటికి తీవ్రతరమౌతున్నది. పాలకుల నిర్లక్ష్యం వలన పరిస్థితి నానాటికి దిగజారుతున్నది.[8] ఏటా వినాయక చవితి తరువాత జరిగే వేలాది విగ్రహాల నిమజ్జనం వల్ల కూడా చెరువు పూడిపోతున్నదనీ, అంతే కాకుండా ఆ విగ్రహాలలో వాడిన ప్లాస్టర్, ఇతర రసాయనాలు నీటిని మరింత కలుషితం చేస్తున్నాయనీ పర్యావరణ శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.
హుస్సేన్ సాగర్ కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం జపాన్ అంతర్జాతీయ సహకార బ్యాంకు వారి సహకారంతో ఒక పెద్ద ప్రాజెక్టు నిర్వహించాలని తలపెట్టింది. ఇందుకు 2006లో 310 కోట్ల రూపాయల ఖర్చుతో ఒప్పందం కుదుర్చుకొన్నారు[9]. 10 సంవత్సరాల పాటు నడిపే ఈ ప్రాజెక్టు కోసం 2006 జూలైలో జపాన్ బ్యాంకువారు ప్రాథమిక సర్వే నిర్వహించారు కూడాను. కాని తరువాత వివిధ ప్రభుత్వ, నగర పాలిక సంస్థలు ఈ కార్యక్రమంలో తమ తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించకపోవడం వల్ల పనులలో ప్రగతి చాలా మందకొడిగా ఉంది [10]. 2008 జనవరిలో మురుగు నీటిని శుభ్రపరచే ప్లాంటు కోసం టెండర్లు పిలవడం జరిగింది. 2010 నాటికి ఈ కర్మాగారం పని చేయడం మొదలు పెడుతుందనీ, అప్పటికల్లా చెరువు పూడిక తీయడం, బయటినుండి వచ్చే మురుగు నీరు దారి మళ్ళించడం వంటి కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి[11]
కాలుష్య కాసారంగా మారిన హుస్సేన్‌సాగర్‌లోకి ప్రధానంగా ఐదు నాలాల నుంచి వ్యర్థ రసాయన, మురుగు నీరు వచ్చి చేరుతోంది.జీడిమెట్ల, బాలానగర్, సనత్‌నగర్ పారిశ్రామిక ప్రాంతాల నుంచి శుద్ధిచేయని వ్యర్థ రసాయనాలు కూకట్పల్లి నాలాలో కలిసి, సాగర్‌కు చేరుతున్నాయి. సాగర్‌లో జలచరాలు బతకాలంటే 'కెమికల్" లీటరుకు 50 మిల్లీ గ్రాముల్లోపు ఉండాలి. కానీ అది 134 నుంచి 350 ఉంది.సాగర్ పరిసరాల్లోని భూగర్భజలంలో సీసం, కాడ్మియం, జింక్, నికెల్ తదితర విషపూరిత కారకాలు అధికస్థాయిలో ఉన్నట్లు గుర్తించారు.
హుస్సేన్ సాగర్‌లో సందర్శకుల కోసం పడవలో వెళ్ళే సదుపాయం ఉంది. ఇటీవలి కాలంలో ఈ పడవలలో పార్టీలు ఇచ్చే సంస్కృతి అధికమౌతున్నది.
వర్షాకాలంలో హుస్సేన్ సాగర్‌లో హైదరాబాద్ సెయిలింగ్ పోటీలు జరుగుతుంటాయి. సుమారుగా వారంరోజుల పాటు జరిగే ఇక్కడి 36 రేసులలో ఔత్సాహికులనుండి అనుభవజ్ఞులవరకు పాల్గొంటారు. సరస్సులో నిశ్చలంగా ఉండే నీటి కారణంగా ఇది తెరచాప పడవలు నడిపేవారికి ఆకర్షణీయమైన సరస్సు అవుతుంది. 1980 దశకంలో సి.ఎస్.ప్రదీపక్, కెప్టెన్ పిళ్ళైల మధ్య జరిగిన పోటీ చాలా ఉత్సాహభరితమైనదని చెప్పుకుంటారు. ప్రస్తుతం ఈ పోటీలు అనేక శ్రేణులలో జరుగుతున్నాయి. పిన్న వయస్కులకు, పెద్ద వారికి, చిన్న పడవలకు, పెద్ద పడవలకు ఇలా వివిధ విభాగాలున్నాయి. ప్రస్తుతం ఈ పోటీలలో ఉండే కొన్ని విభాగాలు ప్రమాణాలను అంతర్జాతీయ పోటీలకు అనుగుణంగా తీర్చి దిద్దుతున్నారు.[12]
అంతర్జాతీయ ఫార్ములా-1 పవర్ బోట్ రేసులు ఇక్కడ నిర్వహించాలని ప్రయత్నాలు జరిగాయి. ఇందుకోసం అంతర్జాతీయ కంపెనీలతో సంప్రదింపులు జరిపారు. గంటకు 180 కి.మీ. పైగా వేగంతో వెళ్ళే ఈ విధమైన పోటీలు నిర్వహించడానికి సదుపాయాలను చాలా మెరుగు పరచాలి. కాని ఈ ప్రయత్నాలు సఫలం కాలేదు.[13]
నగరవాసులను ఆహ్లాదపరిచేందుకు హుస్సేన్‌సాగర్, లుంబినీ పార్క్ సమీపంలో 17.2 కోట్ల రూపాయలతో 180మీటర్ల పొడవు, 10మీటర్ల వెడల్పు, 90మీటర్ల ఎత్తుతో హెచ్ఎండీఏ రూపొందించిన
దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటెన్ 2023 ఫిబ్రవరి 9న ప్రారంభించబడింది. వివిధ థీమ్‌లతో పొగమంచు ఫెయిరీ ఫాగ్, క్లౌడ్ ఎఫెక్ట్, సంగీతంతో కూడిన ఈ ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటెన్ షో ప్రతి రోజూ రాత్రి 7 నుంచి రాత్రి 10గంటల వరకు నిర్వహించబడుతున్నాయి.[14][15]
హుస్సేన్‌సాగర్ సమీపంలో 22 కోట్ల రూపాయలతో 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయబడిన లేక్‌ఫ్రంట్ పార్కు 2023లో ప్రారంభించబడింది.[16] ఉదయం ఐదున్నర నుంచి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఈ పార్కు తెరిచి ఉంటుంది. ఉదయం 5 నుంచి 9 గంటల వరకు మార్నింగ్ వాకర్లను అనుమతిస్తారు.[17]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.