స్వతంత్ర రాజకీయ నాయకులు
ఏ రాజకీయ పార్టీ తోటీ అనుబంధం లేని రాజకీయ నాయకుడు. / From Wikipedia, the free encyclopedia
ఏ రాజకీయ పార్టీ తోటీ అనుబంధం లేని రాజకీయ నాయకులు, స్వతంత్ర రాజకీయ నాయకులు. ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తారు. వీరు ఎన్నికయ్యాక సభల్లో ఏ పార్టీతోటీ అనుబంధం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. ఎన్నికల్లో ఏదైనా పార్టీ తరపున పోటీ చేసి గెలిచినప్పటికీ, ఆ తరువాత స్వతంత్రంగా వ్యవహరించడం కూడా చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో స్వతంత్రంగా పోటీ చేసి, గెలిచాక ఏదైనా పార్టీతో అనుబంధంగా వ్యవహరించవచ్చు, లేదా పార్టీలో చేరనూ వచ్చు.
కొంతమంది రాజకీయ నాయకులకు ఏ రాజకీయ పార్టీ తోటీ కలవని రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి. అందువల్ల వారు ఏ పార్టీ లోనూ చేరరు. కొంతమంది స్వతంత్ర రాజకీయ నాయకులకు ఏదో ఒక పార్టీతో అనుబంధం కలిగి ఉండవచ్చు, బహుశా దాని మాజీ సభ్యులై ఉండవచ్చు లేదా దానితో కలిసే అభిప్రాయాలను కలిగి ఉండవచ్చు కూడా, కానీ ఆ పార్టీ గుర్తు మీద నిలబడకూడదని నిర్ణయించుకోవచ్చు లేదా ఆ పార్టీ మరొక అభ్యర్థిని ఎంచుకున్నందున ఆ పార్టీ తరపున నిలబడలేరు. మరికొందరు జాతీయ స్థాయిలో ఓ రాజకీయ పార్టీకి చెందినప్పటికీ మరొక స్థాయిలో ప్రాతినిధ్యం వహించకూడదని భావిస్తారు. అప్పుడు అక్కడ స్వతంత్రులుగా పోటీ చెయ్యవచ్చు
ప్రభుత్వ పదవికి పోటీ చేయడంలో స్వతంత్రులు కొన్నిసార్లు ఇతర స్వతంత్రులతో కలిసి పార్టీనో కూటమినో ఏర్పాటు చేయవచ్చు. అధికారికంగా వారి పార్టీ లేదా కూటమిని నమోదు చేసుకోవచ్చు. "స్వతంత్ర" అనే పదాన్ని ఉపయోగించిన చోట కూడా, అటువంటి పొత్తులు రాజకీయ పార్టీతో చాలా సారూప్యతను కలిగి ఉంటాయి.