వికీపీడియా:విషయ ప్రాముఖ్యత
From Wikipedia, the free encyclopedia
వికీపీడియాలో ఓ విషయానికి ప్రత్యేకంగా వ్యాసం ఉండొచ్చో లేదో నిర్ణయించడానికి పనికివచ్చే పరీక్ష, విషయ ప్రాముఖ్యత. వికీపీడియాలో ఉన్న సమాచారం నిర్థారించుకోదగినదిగా ఉండాలి; విషయానికి సంబంధించి విశ్వసనీయమైన, స్వతంత్రమైన వనరులు దొరక్కపోతే, ఆ విషయానికి వ్యాసం ఉండకూడదు. వికీపీడియాలో విచక్షణారహితంగా వ్యాసాలను చేర్చకుండా ఉండటానికి ఈ మౌలిక సూత్రాన్ని వర్తింపజేస్తుంది. వ్యాసాలు, జాబితా వ్యాసాల విషయాలకు తప్పనిసరిగా విషయ ప్రాముఖ్యత ఉండాలి. కీర్తి, ప్రాముఖ్యత లేదా ప్రజాదరణ వంటివి విషయపు ప్రాముఖ్యతను పెంచుతాయేమో గానీ పూర్తిగా వాటిపై అది ఆధారపడి ఉండదు.
తెలుగు వికీపీడియాలో ఒక వ్యాసం ఉండదగినదా లేదా అన్న విషయం బేరీజు వేయడానికి
- కింద వివరించిన ప్రాముఖ్యత మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి. లేదా ఆయా సబ్జెక్టులకు ప్రత్యేకంగా ఏమైనా మార్గదర్శకాలను వివరించి ఉంటే వాటికి అనుగుణంగా ఉండాలి
- ఏది వికీపీడియా కాదు అనే విధానంలో చూపిన మినహాయింపుల్లో ఉండకూడదు.
ఏదైనా విషయం ఇక్కడ చూపిన మార్గదర్శకాలకు సరిపోయినంత మాత్రాన, దానికి ప్రత్యేకంగా ఒక పేజీ ఖచ్చితంగా ఉండొచ్చని అర్థం కాదు. మరో వ్యాసంలో భాగంగా రాసేందుకో, లేదా మరేదైనా విషయంతో కలిపి ఒకే వ్యాసంగా రాసేందుకో వాడుకరులు చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు. ఈ మార్గదర్శకాలు ఫలానా విషయానికి వికీపీడియాలో పేజీ ఉండవచ్చునా అనేది చెబుతాయే తప్ప, ఆ వ్యాసంలో కంటెంటు ఏమి ఉండాలో, ఏం ఉండకూడదో చెప్పవు. ఆ సంగతిని వివరించేందుకు తటస్థ దృక్కోణం, నిర్థారత్వం, మౌలిక పరిశోధనలు నిషిద్ధం, ఏది వికీపీడియా కాదు అనే మౌలిక నిబంధనలు ఉన్నాయి.