అరుణాచలం
తమిళనాడు లో ఉన్న పుణ్యక్షేత్రంఅరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రములో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలం అనగా అరుణ - ఎర్రని, అచలం - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యం. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధం. తమిళంలో "తిరువణ్ణామలై" అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తినొసగే క్షేత్రం. కాశీ, చిదంబరం, తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు. అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడినదనీ పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతుంది. ఈ కొండ శివుడని పురాణాలు తెల్పుచుండటం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యమీయబడుతుంది. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతుంది. ఇది తేజోలింగం గనుక అగ్ని క్షేత్రమంటారు.