Remove ads
తెలంగాణ రాష్ట్ర రాజధాని, భారతదేశం From Wikipedia, the free encyclopedia
హైదరాబాదు, తెలంగాణ రాష్ట్ర రాజధాని. హైదరాబాదు జిల్లా, రంగారెడ్డి జిల్లాల ముఖ్యపట్టణం. హైదరాబాద్ కి మరో పేరు భాగ్యనగరం. హస్తకళలకు, నాట్యానికి ప్రసిద్ధి. హైదరాబాదు భారతదేశంలో ఐదవ అతిపెద్ద మహానగరం[1]. అంతేకాదు హైదరాబాదు చుట్టు పక్కల మున్సిపాలిటీలను కలుపుకుపోతే ప్రపంచంలోని మహానగరాలలో 41వ స్థానంలో ఉంది.[2] ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం.
హైదరాబాదు
భాగ్యనగరం | |
---|---|
Nickname: ముత్యాలనగరి | |
Coordinates: 17.38405°N 78.45636°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ రీజియన్, దక్కన్ |
జిల్లాలు | |
స్థాపించినది | 1591 |
Founded by | మహమ్మద్ కులీ కుతుబ్ షా |
Government | |
• Type | నగర పాలిక సంస్థ |
• Body | గ్రేటర్ హైద్రాబాదు మునిసిపల్ కార్పోరేషన్, హైదరాబాదు మెట్రోపాలిటన్ డవలప్మెంట్ అధారిటీ |
విస్తీర్ణం | |
• మహానగరం | 900 కి.మీ2 (Formatting error: invalid input when rounding చ. మై) |
• హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం | 7,257 కి.మీ2 (2,802 చ. మై) |
Elevation | 505 మీ (1,657 అ.) |
జనాభా | |
• మహానగరం | 77,49,334 |
• Rank | 4వ |
• Metro | 1,11,00,000 |
• మెట్రో ర్యాంక్ | 6వ |
Demonym | హైద్రాబాదీ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్లు | 500 xxx, 501 xxx, 502 xxx. |
ప్రాంతపు కోడ్(లు) | +91–40, 8413, 8414, 8415, 8417, 8418, 8453, 8455 |
Vehicle registration | TS 07 to TS 15 (earlier – AP09 to AP-14 and AP 28,29) |
మెట్రో జిడిపి (PPP) | $40–$74 billion |
అధికారిక భాషలు | తెలుగు, ఉర్దూ |
హైదరాబాదు భారతదేశంలో బాగా అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి, అంతేకాదు సాఫ్టువేరు రంగంలో కూడా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. హైదరాబాదు, సికింద్రాబాద్లు జంట నగరాలుగా ప్రసిద్ధి పొందాయి. హుస్సేన్ సాగర్ ఈ రెండు నగరాలను వేరు చేస్తుంది, ట్యాంకు బండ్ వీటిని కలుపుతుంది. హుస్సేన్ సాగర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా వలీ 1562లో నిర్మించిన ఒక పెద్ద కృత్రిమ సరస్సు. హైదరాబాదుకు మధ్యలో చార్మినారును మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో అప్పటిదాకా విజృంభించిన ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నంగా నిర్మించాడు.
హైదరాబాదు నగరం డెక్కన్ డైమండ్ సిటీ, నవాబుల నగరం, ముత్యాల నగరం, సరస్సుల నగరం, రాళ్ళ నగరం మొదలైన పేర్లతో ప్రసిద్ధి చెందింది.[3]
హైదరాబాదును మూసీ నది ఒడ్డున సా.శ.1590 దశకంలో, కుతుబ్ షాహీ వంశస్థుడయిన, మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు.[4] గోల్కొండలోని నీటి సమస్యకు సమాధానంగా పరిపాలనను ఇక్కడకు మార్చారని చరిత్రకారులు చెబుతారు. ఇక్కడి నుండే కుతుబ్ షాహీ వంశస్థులు ఇప్పటి తెలంగాణ ప్రాంతాన్ని , ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలలోని కొన్ని భాగాలను పాలించారు.[5] 400 సంవత్సరా లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన అతి గొప్ప నగరమది. కుతుబ్‌షాహి నవాబులు నిర్మించిన ఈ నగరం తొలుత చించలం (ఇప్పుడు శాలిబండ ) పేరుతో చిన్న గ్రామంగా ఉండేది. 1590లో కలరా మహమ్మారి సోకి గోల్కొండ నగరం అత లాకుతలమయింది. నవాబ్ కులీ కుతుబ్ షా అక్కడి నుంచి చించలం గ్రామానికి తరలి వచ్చి తాత్కాలికంగా బస చేశాడు. వ్యాధి బెడద తగ్గిన తరువాత తిరిగి గోల్కొండ వెళుతూ తన బసకు గుర్తుగా 1591లో చార్మినార్ నిర్మించాడు. ఆ తర్వాత 1594లో నాల్గవ ఖలీఫా హజరత్ హైదర్ అలీ పేరిట నగరం నిర్మించాడు. 17వ శతాబ్దంలో హైదరాబాద్‌ను సందర్శించిన ఇటాలి యన్ యాత్రికుడు టావెర్నియర్ నగరంలోని ఉద్యానవనముల శోభకు అమితంగా ముగ్ధుడయ్యాడు. హైదరాబాద్ నిజానికి 'బాగ్‌నగర్' అని శ్లాఘించాడు. ఉద్యాన వనాలకేకాక సరస్సులకు కూడా హైదరాబాద్ పెట్టింది పేరు.దేశానికి స్వాతంత్య్రం లభించేనాటికే హైదరాబాద్ సకల వసతులు కల రాజధాని నగరం. శాసనసభా భవనం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు, విమానాశ్రయం, కంటోన్మెంటు, విశాలమైన కార్యాలయాలు, అతిథి గృహాలు, చక్కని డ్రైనేజి వ్యవస్థ, నిరంతరం ఉచిత మంచినీటి సరఫరా వ్యవస్థ, సిమెంట్ రోడ్లు, డబుల్ డెక్కర్ బస్సులు, డీజిల్ రైలు, కారు వ్యవస్థ, రేడియో స్టేషను, టంకశాల, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు మొదలైన సౌకర్యాలు అప్పటికే ఏర్పాటై ఉన్నా యి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కూడా పార్లమెంటు భవనం లేకపోవడం మినహా దేశరాజధాని కావడానికి హైదరాబాద్‌కు అన్ని అర్హతలూ ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సంవత్సరానికి ఒకసారైన పార్లమెంటు సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించాలని ఆయన సూచించారు. అంబేద్కర్ సూచన మేరకే బొల్లారంలో రాష్ట్రపతి నిలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.1956లో హైదరాబాద్ దేశంలో ఐదవ పెద్ద నగరంగా ఉండేది. ఇప్పుడు ఆరవ పెద్ద నగరంగా ఉంది. రాష్ట్రాల పునర్విభజన జరిగినప్పుడు హైదరాబాద్ రాష్ట్రం నుంచి కర్ణాటకకు మూడు జిల్లాలు, మహారాష్ట్రకు ఐదు జిల్లాలు బదిలీ అయ్యాయి. విభజన తర్వాత కర్నూలులో తగిన వసతులు లేక ప్రభుత్వ కార్యాలయాలు చాలా భాగం మద్రాసులోనే ఉండిపోయాయి. అందువల్ల అన్ని వసతులు ఉన్న హైదరాబాద్‌ను రాజధానిగా ఏర్పాటుచేశారు. పాతబస్తీకి సరిహద్దుగా హైదరాబాదు సరిహద్దు గోడ కట్టబడింది.[6]
మహమద్ కులీ కుతుబ్‌షా భాగమతి అనే బంజారా స్త్రీని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆ తరువాత ఆవిడ పేరు మీదనే భాగ్యనగర్ అని పేరు పెడతాడు. పెళ్ళయిన తరువాత భాగమతి ఇస్లాం మతం స్వీకరించి, హైదర్ మహల్ అని పేరు మార్చుకుంటుంది. దానిని అనుసరించి నగరం పేరు కూడా హైదరాబాదుగా (అనగా హైదర్ యొక్కనగరం) రూపాంతరం చెందింది[7] ఇండియా ట్రావెల్ టైంస్ సైటు నుండి మే 12, 2007న సేకరించబడింది. ఉర్దూ భాషాయుక్తంగా చూస్తే హైదరాబాదు పేరు వెనక మరొక అర్థం ఉంది. హైదర్ (రాజు పేరు) ఎక్కడయితే ఆబాదు (ప్రఖ్యాతి) అయ్యాడో ఆ నగరమే హైదరాబాదు అని ప్రతీతి.
1947లో భారతదేశంలో ఆంగ్లేయుల పాలన అంతమయిన తరువాత అప్పటి నిజాము స్వతంత్రంగా పాలన సాగించాలని నిర్ణయించాడు. వ్యాపార, వాణిజ్యాలు స్థిరముగా ఉండేందుకు హైదరాబాదు రాజ్యానికి అన్ని వైపులా ఉన్న భారత దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటి తెలంగాణా కమ్యునిస్టులు హైదరాబాదును భారత దేశంలో కలుపుటకు, నిజాము సొంత సైన్యమయిన రజాకర్ల మీద చేసిన పోరాటం వలన శాంతి భద్రతలు క్షీణించాయి. పెరిగిన హింస కారణంగా అప్పటి మద్రాసు రాష్ట్రంలో ఉన్న కోస్తా ఆంధ్ర ప్రాంతానికి వలసలు బాగా పెరిగినాయి. అటువంటి సమయంలోనే, అప్పటి గృహమంత్రి, సర్దార్ వల్లభాయి పటేల్ నేతృత్వంలో భారతదేశం ఆపరేషన్ పోలో పేరుతో పోలీసు చర్యకు ఉపక్రమించింది. సెప్టెంబరు 17, 1948న, అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం తరువాత, హైదరాబాదులో ఐదు రోజుల పోలీసు చర్య జరపడం వల్ల హైదరాబాదు భారతదేశంలో కలిసింది. భారతదేశంలో అంతర్భాగమయిన తరువాత ఎనిమిది సంవత్సరాలపాటు (సెప్టెంబరు 17, 1948 నుండి 1956 నవంబర్ 1వరకు) హైదరాబాదు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉంది. 1956 నవంబర్ 1న భారత దేశాన్ని భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించినపుడు హైదరాబాదు రాష్ట్రం మూడు భాగాలుగా విడి ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక లలో కలిసిపోయింది. హైదరాబాదు నగరం , దాని చుట్టుపక్కల తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో కలిసాయి, అంతేకాదు హైదరాబాదు ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అయింది.
హైదరాబాదు దాదాపు తెలంగాణ రాష్ట్రము మధ్య ప్రాంతములో ఉంది. ఇది దక్కను పీఠభూమిపై సముద్రమట్టం నుండి 541 మీ. (1776 అడుగులు) ఎత్తులో ఉంది. సుమారుగా ఈ నగర వైశాల్యం 260 చ.కి.మీ. (100 చ.మైళ్ళు).
హిమాయత్ సాగర్, సింగూరు జలాశయం, కృష్ణా తాగునీటి మొదటి దశ ప్రస్తుతమున్న ప్రధాన నీటి వనరులు. కృష్ణా నది నుండి తాగునీటిని సరఫరా చేసే ప్రాజెక్టు రెండో దశ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
2011 లో హైదరాబాదు మహానగర జనాభా 68,09,970. హైదరాబాదులో ముస్లిం జనాభా 40%గా ఉంది. తెలుగు, ఉర్దూ, హిందీ ఎక్కువగా మాట్లాడే భాషలు. వ్యాపార వ్యవహారాల్లో ఇంగ్లీషు ఎక్కువగానే వాడుతారు. భారత దేశములోని అనేక ప్రాంతములనుండి ప్రజలు హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డారు.
నగర పరిపాలన హైదరాబాద్ మహానగర పాలక సంస్థ చే నిర్వహించబడుతుంది దీనికి అధిపతి మేయరు అయినప్పటికీ కార్యనిర్వాహక అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం నియమించే నగరపాలక కమిషనరు అనబడే ఒక ఐఏఎస్ అధికారి చేతిలో ఉంటాయి. నగర త్రాగునీటి సౌకర్యం, రోడ్లు, డ్రైనేజీ నిర్వహణ, చెత్త తొలిగించుట, వీధిదీపముల ఏర్పాటు, మౌలిక వసతులకు బాధ్యత ఈ సంస్థదే. నగరం 150 వార్డులుగా విభజింపబడి ఉంది. ఒక్కో వార్డుకు ఒక కార్పొరేటరు ఎన్నికై కార్పొరేషనులో తన వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. నగరప్రాంతం మొత్తం తెలంగాణ 31 జిల్లాల్లో ఒకటి - అదే హైదరాబాదు జిల్లా. ఆస్తుల దస్తావేజులు, రెవెన్యూ సమీకరణకు జిల్లా కలెక్టరు బాధ్యుడు. హైదరాబాదు జిల్లాలో ఎన్నికల నిర్వహణ బాధ్యత కూడా కలెక్టరుదే.
భారతదేశంలోని ఇతర మహానగరంలలో వలెనే, హైదరాబాదు పోలీసుకు పోలీసు కమీషనరుగా ఒక ఐపీఎస్ అధికారి ఆధిపత్యము వహిస్తుంటాడు. హైదరాబాదు పోలీసు రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ నేతృత్వములో పని చేయుస్తుంది. హైదరాబాదును ఐదు పోలీసు జోన్లుగా విభజించారు. ఒక్కొక్క జోన్‌కు ఒక డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీసు అధిపతిగా ఉంటాడు. ట్రాఫిక్ పోలీసు విభాగము హైదరాబాదు పోలీసు శాఖలో పరిమిత స్వయంప్రతిపత్తి కలిగిన ఒక విభాగము. తెలంగాణ రాష్ట్రము మొత్తము తన న్యాయ పరిధిలో ఉండే తెలంగాణ ఉన్నత న్యాయస్థానము యొక్క పీఠము హైదరాబాదు నగరంలోనే ఉంది. హైదరాబాదులో రెండు దిగువ న్యాయస్థానములు, పౌరసంబంధ సమస్యలకై చిన్న సమస్యల (small causes) న్యాయస్థానము , నేర విచారణ కొరకు ఒక సెషన్స్ న్యాయస్థానం ఉన్నాయి. హైదరాబాదు నగరానికి లోక్‌సభలో రెండు సీట్లు , రాష్ట్ర శాసనసభలో పదమూడు సీట్లు ఉన్నాయి.
బృహత్తర ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) ప్రకారం కోర్ ఏరియా 172 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 2001లో నగర జనాభా 75.86 లక్షలు కాగా... 2031 నాటికి అది 1.84 కోట్లకు పెరుగుతుందనే అంచనాలతో కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా 22 ప్రాంతాలకు మల్టిపుల్ జోన్లుగా గుర్తింపు. ఐదు ప్రాంతాల్లో అంతస్తుల (మల్టీ లెవెల్) పార్కింగ్ ఏర్పాటుచేస్తారు. 70 కమర్షియల్ రోడ్లను గుర్తించారు. 150 హెరిటేజ్ భవనాలను గుర్తించి వాటి పరిరక్షణకు ప్రణాళిక రూపకల్పనచేశారు. 29 కొత్త రోడ్లు వేస్తారు.అంతర్గత రోడ్లను 40 అడుగులకు పరిమితం చేస్తారు. కొత్తగా పది ఫ్త్లెఓవర్ల నిర్మిస్తారు . మూసీనది, హుస్సేన్‌సాగర్ నాలాలపై 13 వంతెనలకు ప్రతిపాదన చేశారు.హుస్సేన్‌సాగర్ సర్‌ప్లస్ నాలాలకు గ్రీన్ బెల్టుగా గుర్తించి, రెండు వైపులా తొమ్మిది మీటర్ల చొప్పున పచ్చదనం పెంపు చేస్తారు. ఆజామాబాద్, సనత్‌నగర్ వంటి పారిశ్రామిక ప్రాంతాలకు వర్క్ సెంటర్లుగా గుర్తించారు.జాతీయ రహదారులను 120-150 అడుగుల మేరకు విస్తరిస్తారు.ఏడు చోట్ల రైల్ అండర్ బ్రిడ్జిలు, కందికల్ గేట్ వద్ద ఆర్వోబీ, తాడ్‌బండ్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తారు. రోడ్ల విస్తరణలో స్థలాన్నిచ్చే వారికి చెల్లించే పరిహారం 100 శాతంగా ఉన్న ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్స్ రైట్స్‌ను 150 శాతానికి పెంచుతారు. ఎంజీబీఎస్ మినహా మిగిలిన ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలను బహుళ అవసరాలకు వినియోగించుకుంటారు. ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ ఫ్త్లెఓవర్ నిర్మాణం పూర్తిచేస్తారు. హుస్సేన్‌సాగర్‌లోకి రసాయనాలు మోసుకొచ్చే పికెట్, కూకట్‌పల్లి నాలాలపై మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటర్ రీసైక్లింగ్ ద్వారా ఆ నీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తారు. బాటసింగారం వద్ద 40 ఎకరాల్లో ట్రక్స్ పార్కు ఏర్పాటు చేస్తారు. సాగర్ హైవేపై మంగల్‌పల్లి వద్ద 20 ఎకరాల్లో మరో ట్రక్ పార్కు ఏర్పాటు చేస్తారు.
హైదరాబాదు దేశంలోని చాలా నగరాలతో రోడ్డుద్వారా అనుసంధానమై ఉంది. వాటిలో బెంగళూరు, ముంబాయి, పూణె, నాగ్‌పూర్, విజయవాడ, వరంగల్, గుంటూరు , కర్నూలు చెపుకోతగ్గవి. ముఖ్యంగా తెలంగాణాలోని అన్ని పట్టణాలకు ఇక్కడి నుండి రోడ్లు ఉన్నాయి. జాతీయ రోడ్లయిన జాతీయ రహదారి 44, జాతీయ రహదారి 163, జాతీయ రహదారి 65 నగరంలో నుంచే వెళ్తుంటాయి.
హైదరాబాదు నగరం లోపలకూడా మంచి రోడ్లు ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకై ఎన్నో ఫ్లైఓవర్లు నిర్మించటం జరిగింది. ముఖ్యమయినా రోడ్లు చాలావరకు 3-లేన్ సౌకర్యము ఉంది. అయినా కూడా ట్రాఫిక్ సమస్య పెరిగి పోతుండటంతో జాతీయ రహదారుల వెంట వెళ్ళే పెద్ద వాహనాలను నగరం వెలుపల నుండే పంపుటకుగాను ఔటర్ రింగు రోడ్డు నిర్మాణము జరిగింది.[11]
హైదరాబాదు నగరంలో ప్రయాణ అవసరాలకు తెలంగాణా రోడ్డు రవాణా సంస్థ,[12] లెక్కకు మిక్కిలి సిటీ బస్సులను నడుపుతుంది. ఇక్కడ ఉన్న మహత్మా గాంధీ బస్ స్టేషను 72 ప్లాట్ఫారాలతో ఆసియాలోకెల్లా అతిపెద్ద బస్‌స్టేషనుగా పేరు సంపాదించింది. బస్సులేకాక నగరం నలుమూలలకు తీసుకు వెళ్ళే ఆటోలు ఇక్కడ ఇంకో ప్రధాన రవాణా సాధనం.
హైదరాబాద్ రోడ్డు అభివృద్ధి సంస్థ (హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) అనేది తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన పబ్లిక్ రోడ్ల అధికారిక సంస్థ. దీని ద్వారా హైదరాబాదు నగరంలో రోడ్ల నిర్మాణం, నిర్వాహణ పనులు నిర్వర్తించబడుతాయి.
హైదరాబాదుకు జంటనగరమైన సికింద్రాబాదులో దక్షిణమధ్య రైల్వే ముఖ్యకార్యాలయం ఉంది. ఇక్కడి నుండి దేశంలోని అన్ని ప్రాంతాలకు రైలు సౌకర్యం ఉంటుంది.[13]
హైదరాబాదు నగరంలో 2003లో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (Multi-Modal Transport System (MMTS)) ప్రవేశ పెట్టారు. సికింద్రాబాదు - లింగంపల్లి, హైదరాబాదు (నాంపల్లి) - లింగంపల్లి, సికింద్రాబాదు - ఫలక్‌నుమా, లింగంపల్లి - ఫలక్‌నుమా, హైదరాబాదు (నాంపల్లి) - ఫలక్‌నుమా దారులలో రైలు బండ్లు తిరుగుతున్నాయి. 121 ట్రిప్పులతో రోజుకు 180,000 ప్రయాణీకులకు సేవలందిస్తోంది. దీనిక జతగా సెట్విన్ సంస్థ చిన్నబస్సు సేవలు నడుపుతుంది.[14]
మెట్రోరైల్ మొదటి దశ 2017 నవంబర్ లో నాగోల్ - అమీర్పేట్- మియాపూర్ మార్గంతో ప్రారంభించబడింది. తరువాత ఎల్ బి నగర్ -అమీర్ పేట మార్గం 2018 అక్టోబరులో ప్రారంభించబడింది. అమీర్ పేట -హైటెక్ సిటీ మార్గం 2019 మార్చి న ప్రారంభించారు.[15] హైదరాబాద్ మెట్రో దేశంలో రెండవ పెద్ద మెట్రోగా గుర్తింపుపొందింది.[16]
హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్లో కొత్తగా నిర్మించిన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 2008 మార్చి 15 తేదీన ప్రారంభించబడింది.[17] ఇది ప్రపంచం లోని 5 ప్రముఖ విమానాశ్రయాలలో స్థానం సంపాదించింది. 4కిమీపైగా ఉన్న రన్‌వే సౌకర్యంతో, ప్రపంచంలోనే అతిపెద్దదయిన ఎయిర్‌బస్ A380 విమానము కూడా ఇక్కడి నుండి రాకపోకలు సాగించగలదు. ఈ విమానాశ్రయం నుండి భారతదేశంలోని అన్ని ముఖ్య పట్టణాలకు, మధ్య ప్రాచ్య ప్రాంతం నైరుతి ఆసియా, దుబాయి, సింగపూరు, మలేషియా , చికాగో, ఫ్రాంక్‌ఫర్ట్ మొదలైనటువంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన ప్రయాణ సౌకర్యము ఉంది.[18]
హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయము ప్రత్యేక విమానాల (రక్షణ , ఇతరాలు) కొరకు మాత్రమే పనిచేస్తుంది.
హైదరాబాదు మహానగరం 1591లో స్థాపించబడినందున, నిత్యం పెరుగుతున్న నగర జనాభాకు ప్రస్తుతమున్న రోడ్లు సరిపోవు. పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా తెలంగాణా ప్రభుత్వం, హైదరాబాదు మహానగరపాలక సంస్థ ల ఆధ్వర్యంలో హైదరాబాదు నగరంలోని రోడ్ల అభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. అందులో భాగంగా ప్రభుత్వం నగరం అంతటా అనేక ఫ్లైఓవర్‌లు, అండర్ పాస్‌లు నిర్మించాలని నిర్ణయించింది.
విద్య పరంగా హైదరాబాదు దక్షిణ భారతంలో ప్రముఖ కేంద్రం.
ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు చాలావరకు సిబిఎస్ఇ విద్యాపద్ధతి పాటిస్తాయి. మూడింట రెండు వంతులు విద్యార్థులు ప్రైవేట్ సంస్థలలో ఉన్నారు.[19] బోధనా మాధ్యమాలు ఇంగ్లిషు, హిందీ, తెలుగు, ఉర్దూ.[20] సంస్థని బట్టి, విద్యార్థులు సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పరీక్ష రాస్తారు.[21] లేక ఐసిఎస్ఇ (ICSE) రాస్తారు. సెకండరీ మాధ్యమిక విద్య పూర్తయిన తర్వాత, జూనియర్ కళాశాలలో ఉన్నత మాధ్యమిక విద్యకొరకు చేరుతారు. ఇంజనీరింగ్ వృత్తి విద్య కొరకు ప్రవేశ పరీక్ష (ఎమ్సెట్) (EAMCET) రాసి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ విశ్వవిద్యాలయం, (JNTUH) లేక ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) అనుబంధం గల కళాశాలలలో చేరతారు.[22][23]
13 విశ్వవిద్యాలయాలలో, రెండు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, రెండు విశ్వవిద్యాలయ అర్హతగలవిభావించబడిని విశ్వవిద్యాలయాలు, ఆరు రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, మూడు కేంద్ర విశ్వవిద్యాలయాలున్నాయి. కేంద్ర విశ్వవిద్యాలయాలలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, (HCU)[24] మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం , ఇంగ్లీషు , విదేశ భాషల విశ్వవిద్యాలయము ఉన్నాయి.[25] 1918లో ఏర్పాటు చేయబడిన ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాదులోని తొలి విశ్వవిద్యాలయం. ఇది విదేశీ విద్యార్థులని ఆకర్షించడంలో దేశంలో రెండవ స్థానంలో as of 2012[update] ఉంది.[26] 1982 లో ఏర్పాటైన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, దేశంలోనే తొలి సార్వత్రిక విశ్వవిద్యాలయం[27]
హైదరాబాదులో చాలా జీవసాంకేతికం, జీవమెడికల్ శాస్త్రం, ఔషధాల కేంద్రాలున్నాయి.[28] నేషనల్ ఇన్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER)[29] హైదరాబాదులో ఐదు వైద్యకళాశాలలున్నాయి. అవి ఉస్మానియా వైద్య కళాశాల, గాంధీ వైద్య కళాశాల, నిజాం వైద్య శాస్త్రాల సంస్థ, దక్కన్ వైద్య శాస్త్రాల సంస్థ] , షాదాన్ వైద్య శాస్త్రాల సంస్థ][30] ఎఐఐఎమ్ఎస్ (AIIMS) హైదరాబాద్ పొలిమేరలలో ప్రతిపాదించబడింది.[31] యునాని వైద్యంలో ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాల ఉంది.[32]
ఇంకా ప్రముఖ కళాశాలలు లేక సంస్థలు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (NIRD), నల్సార్ శాసనవిషయాల సంస్థ (నల్సార్), ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (NGRI), ప్రభుత్వరంగ సంస్థల సంస్థ (IPE), the భారతీయ పరిపాలన ఉద్యోగుల సంస్థ (ASCI), ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా (ESCI),సర్దార్ వల్లభభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ. సాంకేతిక కళాశాలలు ఐఐఐటి (IIITH), బిట్స్ (BITS Hyderabad), గాంధీ సాంకేతిక నిర్వహణ సంస్థ (GITAM హైదరాబాదు) , ఐఐటి,హైదరాబాదు (IIT-H), వ్యవసాయ శాస్త్ర సంస్థలు ఇక్రిశాట్ (ICRISAT), ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం.
ఫ్యాషన్ కళకు సంబంధించిన రాఫిల్స్ మిల్లెనియమ్ ఇంటర్నేషనల్, నిఫ్ట్, హైదరాబాదు (NIFT-H), విగాన్ మరియ లీ కళాశాల కూడా ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ 2015 లో పని ప్రారంభించిది. దక్షిణ భారతంలోనే అతిపెద్ద ఇస్లామిక్ విశ్వవిద్యాలయం అయిన జామియా నిజామియా కూడా ఇక్కడే ఉంది.
హైదరాబాదు నగరం ముత్యాలకు, చెరువులకు పేరు సంపాదించినది, ఈ మధ్యన ఐటి రంగం వలన కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. చార్మినారుకు దగ్గరలోనే ముత్యాల మార్కెట్టు ఉంది. అందుకే ఈ నగరాన్ని ముత్యాల నగరం అని కూడా పిలుస్తారు. వెండి గిన్నెలు, చీరలు, నిర్మల్ , కలంకారి బొమ్మలు, గాజులు, పట్టు, చేనేత, నూలు వస్త్రాలు, లాంటి మరెన్నో వస్తువులతో ఇక్కడ శతాబ్దాల తరబడి వర్తకం నిర్వహిస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్దదైన చలన చిత్ర నిర్మాణ కేంద్రమైన రామోజీ ఫిలిం సిటీ ఇక్కడే ఉంది. రెండు వేల ఎకరాల సువిశాల ప్రదేశంలో ఈ కేంద్రాన్ని 1996లో నిర్మించారు.[33] అంతే కాదు ఆరు వందల లొకేషన్లను కల్పించే ఈ చలన చిత్ర నిర్మాణ కేంద్రం అతిపెద్ద చలన చిత్ర నిర్మాణ కేంద్రంగా గిన్నీసు బుక్కులో స్థానం కూడా సంపాదించింది.[34]
హైదరాబాదులో పేరెన్నికగన్న పరిశోధనాలయాలు , విద్యాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రభుత్వ రంగంలో ఉంటే మరికొన్ని ప్రైవేటు రంగంలో ఉన్నాయి. అంతేకాదు ఈ పరిశోధనాలయాలు వివిధ రంగాలకు విస్తరించాయి కూడా. వాటిలో కొన్ని:
హైదరాబాదులోనే స్థాపించబోయే మరికొన్ని ముఖ్యమయిన ప్రాజెక్టుల వివరాలు
భారత దేశంలోని మరెన్నో ఇతర నగరాల వలే హైదరాబాదులో కూడా రియల్ ఎస్టేటు రంగము మంచి అభివృద్ధి సాధిస్తోంది. అందుకు ముఖ్య కారణంగా ఇటీవల కాలంలో తామర తంపరగా వస్తున్న ఐటి సంస్థలనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వం హైటెక్ సిటీని నిర్మించిన తరువాత ఎంతోమంది ప్రైవేటు భాగస్వాములు కూడా ఐటి పరిశ్రమలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. అంతేకాదు సింగపూరులో కార్యకలాపాలు సాగించే ఎసెండాస్ 2002లో హైదరాబాదులోని హైటెక్ సిటీ దగ్గర ఐటీ పార్కుని నిర్మించటానికి ఎల్&టితో, తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.[37] అంతే కాదు ఆంధ్ర ప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ కూడా, సెస్మా ఇంటర్నెషనల్ (CESMA International) అనే సింగపూరుకు చెందిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఐటి ఉద్యోగులకు ఉపయుక్తంగా పోచారం దగ్గర 16000 గృహాల సముదాయాన్ని నిర్మించ తలపెట్టింది.[38]
1990 దశకం తరువాత హైదరాబాదులో ఐటి , ఐటిఇఎస్ కంపెనీలు తామరతంపరగా పెరిగిపోవటం మొదలయింది. అప్పటి నుండి హైదరాబాదును సైబరాబాదు అని కూడా పిలవడం మొదలుపెట్టారు. అంతేకాదు హైదరాబాదును బెంగుళూరు తరువాత రెండో సిలికాను వ్యాలీ గా పిలుస్తున్నారు. ఈ రంగం వలన హైదరాబాదుకు ఎన్నో పెట్టుబడులు రావడంతో సాంకేతిక రంగంలో హైదరాబాదు పేరు దేశమంతా వ్యాపించింది. విద్య మీద ప్రజలు చూపించే శ్రద్ధ, ఇక్కడి ఉత్పాదకత, వాణిజ్యం పెరగడానికి దోహదపడ్డాయి. భారతదేశపు నాలుగో పెద్ద సాఫ్టువేరు కంపెనీ టెక్ మహీంద్రా యొక్క ముఖ్య కార్యాలయం ఇక్కడే ఉంది. ఐ బి ఎం, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఒరాకిల్,డెల్, కాన్బే, జిఇ, సొన్స్ ఈన్దీ, డెలాయిట్, హెచ్ఎస్‌బిసి, జూనో, ఇంటర్‌గ్రాఫ్, కీన్, బాన్ ఇక్కడున్న కంపెనీలలో కొన్ని. తెలంగాణ ప్రభుత్వం ఔత్సాహవంతులకోసం ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలో సుమారు 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ హబ్ను కూడా ప్రారంభించింది.
హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు వంటి వివిధ మతాల ప్రజలు హైదరాబాదులో పెద్దసంఖ్యలో ఉన్నారు. సిక్కులు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. హైదరాబాదీయులు తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషలు మాట్లాడుతారు. హిందువులు, క్రైస్తవులు తెలుగు, ముస్లిములు ఉర్దూ మాట్లాడినప్పటికీ అధికశాతం ప్రజలు రెండు భాషలూ మాట్లాడగలిగి ఉంటారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు హైదరాబాదులో స్థిరపడటంతో అన్ని రకాల యాసల తెలుగూ ఇక్కడ వినిపిస్తుంది. అయితే ప్రధానంగా తెలంగాణా యాస ఎక్కువగా వినిపిస్తుంది. ఇక్కడి హిందీ, ఉర్దూ కూడా దేశంలోని ఇతర ప్రాంతాల వాటికంటే భిన్నమైన యాస కలిగి ఉంటాయి. హిందువులు, ముస్లిములు అన్నదమ్ముల కలిసి మెలిసి ఉంతరు
ఇక్కడి ముస్లిములు సాంప్రదాయికంగా ఉంటారు. స్త్రీలు బురఖా ధరించడం, మతపరమైన ఆచారాలను కచ్చితంగా పాటించడం వంటివి ఇక్కడ బాగా కనిపిస్తాయి. ఉత్తర భారతీయులకంటే తాము కాస్త కులాసా జీవితం గడుపుతామని మిగతా దక్షిణాది వారి వలెనే హైదరాబాదీయులు కూడా అనుకుంటారు.
హైదరాబాదు రుచులు మిగతా భారతదేశపు రుచుల కంటే భిన్నంగా ఉంటాయి. మొఘలుల రుచులతో కలిసిన తెలంగాణా వంటకాలు ఇక్కడి ప్రత్యేకత. బిరియానీ, బగారాబైంగన్ (గుత్తి వంకాయ), ఖుబానీ కా మీఠా, డబల్ కా మీఠా, హలీమ్, ఇరానీ చాయ్ మొదలైనవి ఇక్కడి ప్రముఖ వంటకాల్లో కొన్ని. చాలామంది హైదరాబాదీ ముస్లింలు పని చేయడానికి మధ్య ప్రాచ్యము అందులో ప్రత్యేకముగా దుబాయి వెళ్ళడము వలన, ఇప్పుడు హలీం ఆ ప్రాంతాలలో కూడా ప్రసిద్ధి చెందినది.హైదరాబాద్ హలీం భౌగోళిక చిహ్నం (జియోగ్రాఫికల్ ఇండికేటర్)ని సొంతం చేసుకొంది.
హైదరాబాదు చారిత్రక, రాజధానిగా ఉండుట వలన ఇక్కడ ప్రచురణ , ఎలక్ట్రానిక్ మీడియా బాగా అభివృద్ధి చెందింది. దాదాపు అన్ని తెలుగు వినోద, వార్తా ఛానళ్ళు రేడియో స్టేషన్లు హైదరాబాదు కేంద్రముగా పని చేయుచున్నవి.
1780 లో స్థాపించిన దక్కన్ టైమ్స్ పత్రిక హైదరాబాద్ నుండి వెలువడిన తొలి వార్తాపత్రిక.[39] తెలుగు పత్రికలలో ప్రధానమైనవి ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ. ఆంగ్ల పత్రికలలో ప్రధానమైనవి ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందు, దక్కన్ క్రానికల్ ప్రముఖ ఉర్దూ పత్రికలు ది సియాసత్ డైలీ, ది మున్సిఫ్ డైలీ,ఇండియన్ ఇతేమాద్.[40][41] సికందరాబాదు కంటోన్మెంట్ బోర్డు తొలి రేడియో కేంద్రాన్ని 1919 లో ప్రారంభించిది. నిజాం కాలంలో దక్కన్ రేడియో కేంద్రం 1935 ఫిబ్రవరి 3 లో ప్రసారాలు ప్రారంభించింది.[42] ఎఫ్ఎమ్ ప్రసారాలు 2000లో ప్రారంభమయ్యాయి.[43] ప్రముఖ ఎఫ్ ఎమ్ రేడియో ఛానళ్లు ఆకాశవాణి, రేడియో మిర్చి, రేడియో సిటీ, రెడ్ ఎఫ్ఎమ్, బిగ్ ఎఫ్ఎమ్, ఫీవర్ 104 ఎఫ్ ఎమ్.[44] టెలివిజన్ ప్రసారాలు 1974 లో దూరదర్శన్ ప్రారంభంతో మొదలయ్యాయి.[45] 1992 జూలైన, స్టార్ టివి ప్రారంభంతో ప్రైవేట్ రంగంలో టెలివిజన్ ప్రసారాలు మొదలయ్యాయి.[46] ఉపగ్రహ టివీ ఛానళ్లు కేబుల్ టెలివిజన్, డిటిహెచ్, ఐపిటివి సేవల ద్వారా లభ్యమవుతున్నాయి.[43][47] మొదటి సారి అంతర్జాల సేవ 1990 దశకంలో కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలకు మాత్రమే వుండేవి.[48] ప్రజలకు అంతర్జాల సేవ ప్రభుత్వరంగంలో 1995 లో ప్రైవేట్ రంగంలో 1998 లో ప్రారంభమయ్యాయి.[49] 2015 లో అధిక వేగం గల ప్రజా వైఫై సేవ నగరంలోని కొన్ని భాగాలలో మొదలైంది.[50]
హైదరాబాదు నగరంలో అనేక గ్రంథాలయాలు ఉన్నాయి. వాటిల్లో నిత్యం అనేకమంది విద్యార్థులు, ఇతరులు పుస్తకాలు చదువుతున్నారు.
హైదరాబాదులో ప్రధాన కార్యాలయాన్ని కలిగివున్న ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయి.
హైదరాబాదు నగరంలో జన్మించినవారు, హైదరాబాదీ సంతతికి చెందినవారు లేదా హైదరాబాద్‌లో ఎక్కువకాలం గడిపిన వారిని హైదరాబాదీ అంటారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.