From Wikipedia, the free encyclopedia
ఫ్రాన్సిస్ రాడన్ హేస్టింగ్సు (1754-1826)
లార్డు హేస్టింగ్సుగా ప్రసిధ్ధి చెందిన ఫ్రాన్సిస్ రాడన్ హేస్టింగ్సు (Francis Rawdon-Hastings) బ్రిటిష్ ఇండియాకు 7వ గవర్నర్ జనరల్ గా 1813-1823 మధ్య ఇండియాలో కంపెనీ వారి రాజ్యమును పరిపాలించాడు. రాబర్టు క్లైవు, వారన్ హేస్టింగ్సు వేసిన బ్రిటిష్ వలసరాజ్య స్థాపన పునాదులపై వెల్లెస్లీ వలసరాజ్యమును విస్తరింపజేసి సామ్రాజ్య స్థాయికి తీసుకునిరాగా అతని తరువత వచ్చిన లార్డు హేస్టింగ్సు వలసరాజ్యమును ఇంకా ఎక్కువ విస్తరింపచేసి బ్రిటిష్ దేశ ప్రభుత్వము వారి అభినందనలందుకున్న ప్రముఖుడు. బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ భారతదేశములో కంపెనీ వ్యవహారములు నిర్వహించుటకు అను నెపముమీద పరిపాలనా అధికారములతో బ్రిటిష్ ప్రభుత్వము వారిచ్చు పట్టాలు అప్పుడప్పుడు (periodically) నవీకరణ చె్యుచుండిరి. చేసినప్పుడల్లా పరిపాలనా ధికారములను అధిక మోతాదులో ఆమోదించ బడుచుండెను. ఈస్టు ఇండియా వ్యాపార కంపెనీ ద్వారా భాారతదేశమును బ్రిటిష్ దేశ లాభమునకు వినియోగించుటయే ప్రధానోద్దేశ్యము. కంపెనీ డైరెక్టర్లు భారతదేశమును పరిపాలించుటకు తాబేదారులుగా నియమించి పంపించిన కంపెనీ అధికారుల సలహా ప్రకారమే భారతదేశములో కంపెనీ పరిపాలన కొనసాగుతుండెను. లార్డు హేస్టింగ్సు పదవిగ్రహణ చేయబోయే కొలది కాలముక్రిందనే భారతదేశములో వ్యాపారము చేసుకునటకు కంపెనీకిచ్చిన పట్టా బ్రిటిష్ ప్రభుత్వము వారిచే 1813లో నవీకరణ చేయబడి కంపెనీ రాజ్యాదికార సన్నదును చట్టముగా ఆమోదించబడినది బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెని చట్టము 1813 (Charter Act of 1813) . అంతకుపూర్వము పరిపాలించిన గవర్నర్ జనరల్ వెల్లెస్లీ బ్రిటిష్ వారికీ ఫ్రెంచివారికీ జరుగుతున్న ప్రపంచయుద్దములనిన్నూ, ఫ్రెంచి నాయకుడైన నెపోలియన్ భారతదేశము వచ్చి తమ ఆధిక్యతను కూలత్రోయునన్న నెపముతోనూ అనవసరపుటుద్దములు, కుతంత్రములుచేసి, అనుబంధ సమాశ్రయసంధి (subsidiary alliance) అనుసంధి వప్పందములుచేయించి వలసరాజ్య విస్తరణ చేశాడు. 1793లో కంపెనీ వారికి బ్రిటిష్ పార్లమెంటు వారు పట్టానొసగునప్పుడు దేశాక్రమణచేయుట రాజ్యమును వృధ్దిచేయట బ్రిటిష్ వారి జాతికీ, నీతికి భంగకరములని స్పష్టముచేయబడియున్నది. కానీ ఇప్పుడు 1813లో అమలైన ఆ చట్టములో అట్టి నీతి సుభాషితాలు తీసేయ బడియుండినందున, ఈ కొత్త సన్నదుచట్టము ప్రకారము లార్డు హేస్టింగ్సు గవర్నర్ జనరల్ గా పదవి చేపట్టి ఏ కారణము, నెపములేకనే రాజ్యకుతంత్రములు, యుద్దములు సలిపి కేవలము వలసరాజ్య విస్తరణయే లక్ష్యముగా పెట్టుకుని బ్రిటిష్ వలసరాజ్యమును బలపరచుచూ 1823 దాకా పరిపాలించాడు. సా.శ.. 1600నుండి ప్రారంభమైన బ్రిటిష్ ఈస్టు ఇండియాచరిత్రలో లార్డు హేస్టింగ్సు కార్యకాలము 1813-1823 చాలా ప్రముఖమైన పర్వం అందులోనూ 1818 వ సంవత్సరముతో భారతదేశములోని బ్రిటిష్ రాజ్యము బ్రిటిష్ ఇండియా రాజ్యముగా మారినదని చెప్పవచ్చును.[1]
ఉత్తర ఐర్లాండులో డౌను అను విభాగములో (County Down) మోయిరా (Moira) అను గ్రామములో రాడన్ (Rawdon) కుటుంబములో 1754 డిసెంబరు 9తేదీన జన్మించాడు. మోయిరాకి మొదటి ప్రభువు (1st Earl of Moira) అను హోదగలిగిన అతని తండ్రి జాన్ రాడన్. తల్లి ఎలిజబెత్ హేస్టింగ్సు. ఆమె పుట్టింటివారు దక్షిణ కోస్తా ఇంగ్లాండులోని హేస్టింగ్సు అను పట్టణవాసపు హేస్టింగ్సు కుటుంబమువారు. ఆమె సోదరుడైన లార్డింఘటన్ మరణశాసనము ప్రకారము హేస్టింగ్సు కుటుంబనామమును ఫ్రాన్సిస్ రాడన్ కు 1789 లో ఇవ్వబడింది. అందువలన అప్పటినుండి ఫ్రాన్సిస్ రాడన్-హేస్టింగ్సు అని పూర్తి పేరు కలిగెను. జన్మతః ఫ్రాన్సిస్ రాడన్ అని ప్రసిధ్ధి. లార్డు రాడన్ అనియూ, తరువాత 1783 లో బరాన్ అనియ తరువాత విస్కౌంటుగాను, అటుతరువాత 1793 లో మోయిరాకి 2వ ఎర్ల్ (2వ ప్రభువు) అనీ అటుతరువాత 1816 లో హెస్టింగ్సు ప్రభువుగా ( మార్కిస్ ఆఫ్ హేస్టింగ్సు Marquess of Hastings) హోదా గ్రహితుడైనాడు. (ఇంగ్లాడు, ఐర్లాండు లోని హోదాలు: విస్కౌంటు (Viscount) అను రాజవంశీయ హోదా బరాన్ (BARON) కన్నా ఎక్కువ, కానీ ఎరల్ (EARL) కన్నా తక్కువ. ఎరల్ కన్నా పై హోదా మార్క్విస్ (Marquess). మార్క్విస్ హోదా డ్యూక్ (Duke) హోదాకన్నా తక్కువ ). ఇంగ్లండులో ప్రసిధ్దిచెందిన పాఠశాలైనట్టి హరో (Harrow) లో చదువుకుని, ఆక్సఫోర్డు యూనివర్సిటీ కాలేజీలో చదువుతూ మధ్యలోనే మానేసి 1771 లో సైన్యములో చేరాడు. 1773 లో లెఫ్టెనెంన్టు స్థాయి సైనికాధికారిగా పదోన్నతి పొంది 1774 లో అమెరికా వెళ్లి అచ్చట జరుగుతున్న అమెరికా విప్లవ యుద్దములు 1775-1781 లోనూ, తరువాత 1793 నుండి ఐరోపాపులో (Europe) జరిగిన ఫ్రెంచి విప్లవ యుద్దములు లోనూ అనుభవము గణించాడు. 1778 కల్లా కర్నల్ స్థాయికి చేరుకున్నాడు. అమెరికాయుధ్దములలో 1780 లో జనరల్ కారన్ వాలీసు అధీనతలోనున్న సైనికదళములో దక్షిణ కెరోలినా లోని బ్రిటిష్ సైనిక దళములకు కమాండరైనాడు (సర్వసైన్యాధిపతి). అమెరికా యుద్దముల తరువాత ఇంగ్లండు వచ్చేసి 1781 నుండి 1783 దాకా ఐర్లండు దేశములోని పార్లమెంటులో సభ్యుడుగానున్నాడు. 1787 నుండి వేల్సు యువరాజు (Duke of Wales) గా నుండి తరువాత ఇంగ్లాండ్ కు రాజుగానైన నాల్గవ జార్జి) (King George IV) తోటి సన్నహితుడైనాడు. ఐర్లాండు రాజకీయములలో పాత్రవహించి (జనరల్ వెల్లెస్లీ లాగనే) అచ్చటి రోమన్ కాతలిక్ క్రైస్తవ మతస్తులకు రాజకీయ హక్కులు కలుగజేయ వలెనన్న అభిమతముకలవాడైయున్నందున రాజకీయ్యాలతో ఎదురీత చేయవలసి వచ్చింది. 1793 నుండి ఇంగ్లండులో తన మేనమామ లార్డింఘటన్ తదనంతరం హెస్టింగ్సు కుటుంబనామంతో రాడన్-హేస్టింగ్సు అని ప్రసిద్ధి చెంది ఇంగ్లండులో హౌస్ ఆఫ్ కామన్సు సభ్యత్వము కలిగి చాలా సంవత్సరములు ఇంగ్లండు రాజకీయాలలో ప్రముఖ పాత్రవహించాడు. సైనికోద్యోగములో పదోన్నతి పొంది మేజర్ జనరల్ గా 1794 లో ఫ్రాన్సు దేశములోని ఆస్టెండు, అల్సాట్ లో జరిగిన యుద్దములలో ప్రవేశించి అక్కడ ఫ్రెంచి సైన్యముచేతులో పరాజయముపొందాడు. విలియంపిట్టు ప్రదానమంత్రి స్థానములో లార్డు హేస్టింగ్సును ప్రధానమంత్రిగాచేయుటకు 1797 లో వేల్సు యువరాజు సమర్దన కలిగినప్పటికీ రాజకీయబహుమతములేక ప్రదానమంత్రి కాలేకపోయినాడు. 1803 నాటికి పూర్తి జనరల్ స్థాయికి చేరుకుని స్కాటలాండ్కు కమాండర్ ఇన్ ఛీఫ్ (సర్వ సైన్యాధికారి) గా నియమించబడినాడు. ఇంగ్లండులోని ప్రముఖ రాజకీయదళమైన విఘ్ పార్టీ వాడైనందున ఇంగ్లండులో 1806 లో ఆ రాజకీయ దళము అధికారములో నున్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగములో కొన్నాళ్లు పనిచేసి విరమించిన తరువాత మళ్లీ 1812 లో ఆపార్టీ అధికారములోనుండగా వారి ప్రధానమంత్రి స్పెన్సర్ పెర్సీవల్ (Spencer Perceval) హత్యచేయబడినకారణంగా ఆపార్టీవాడైన హేస్టింగ్సు ప్రభుత్వము నెలకొలపు ప్రయత్నములు చేసి విఫలుడైనాడు. 1804 లో తన యాభైవ ఏట ఫ్లోరాకాంపబెల్ (Flora Mure-Campbell) తో వివాహమైనది. హేస్టింగ్సు-ఫ్లోరా దంపతులకు ఆరుగురు సంతానము కలిగిరి. 1812 నవంబరులో వేల్సు యువరాజు శిఫారసుపై భారతదేశములోని బ్రిటిష్ వలస రాజ్యమునకు గవర్నర్ జనరల్ గా నియమించబడినా 1813 సెప్టెంబరుదాకా లార్డు హేస్టింగ్సు భారతదేశానికి రాలేక పోయినాడు. కలకత్తాలో 1813 లో పదవీ బాధ్యతలు చేపట్టిన కొలది కాలములోనే పిండారీలను, మహారాష్ట్రకూటమిలోని నాయకులను, నేపాలు రాజు ఘూర్కా సైన్యమును ఓడించి స్థిరమైన శాంతి స్థాపించి అనేక విశాల భూబాగములను బ్రిటిష్ కంపెనీ వారి రాజ్యములో కలిపినందులకు 1816 లో మార్క్విస్ అను హోద ఇవ్వబడింది. ఇంకా అనేక రాజ్యతంత్రములు, యుద్దములుచేసి బ్రిటిష్ సామ్రాజ్యమును విస్థిరింపచేస్తున్న కార్యకాలంలో అతని పెంపుడుకుమార్తె భర్త పనిచేయుచున్న కంపెనీ వారి చే హైదరాబాదు నిజాముకు పెద్దవడ్డీ పై అప్పు ఇప్పించి ఆర్థిక లభ్దిపొందాడన్న ఆరోపణపై లండను లోని కంపెనీ ప్రభువులు విచారణజరిపించి ఆక్షేపణలు తెల్పగా పదవికి 1823 లో రాజీనామాచేసి వెడలిపోయాడు. అటుతరువాత చిన్న పదవిలో మాల్టా వలసరాజ్యమునకు గవర్నరుగా పంపబడ్డాడు. హేస్టింగ్సు తన 72 వ ఏట 1826 లో పొగఓడలో సముద్రయానము చేయుచూ ఇటలీ దేశపు నేపుల్స్ (Naples) సముద్రతీర సమీపములో చనిపోయాడు. అతని మరణానంతరము అతని కుమారుని సహాయార్ధం నెలకొల్పబడ్డ ట్రస్టుకు 1828 లో కంపెనీ వారు ఆర్థిక సహాయం చేశారు.[2]
లార్డు హేస్టింగ్సు బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీకి గవర్నర్ జనరల్ గా 1813 అక్టోబరులో పదవీ చేపట్టేనాటికి భారతదేశములో బ్రిటిష్ వారి ఆధిపత్యమును ఎదురించి పోరాడుచుండిన దేశీయ రాజులలో చెప్పుకోదగ్గవారు విచ్చినమైన మహారాష్ట్ర రాజ్య కూటమిలోని నాయకులు వారి కూటమికి మిత్రులుగానుండిన పిండారీలు అనబడిన అశ్వదళములు. 1815 జూన్ లో నెపోలియన్ చనిపోయినతరువాత భారతదేశములో అప్పటికి బ్రిటిష్ కంపెనీవారి రాజ్యధిక్యత నెదుర్కోను స్తోమతకలిగిన విదేశీయనాయకులు గానీ, దేశీయ నాయకులుగానీ ఇంకెవరూ లేరు. అట్టి పరిస్థితులలో లార్డు హేస్టింగ్సు కార్యాచరణ బ్రిటిష్ వారి వలసరాజ్య విస్తరణకు సుస్థిర రాజ్యాదికారమునకు ఆటంకించు వారలనణచుట, రెండవది కంపెనీ వారి దిగజారిన ఆర్థిక పరిస్థితులు మెరుగు పరుచుట. ఆ రెండు ముఖ్య దిశలలో ముందుకు సాగిన లార్డు హేస్టింగ్సు యుద్దములతో పాటు రాజ్యతంత్రములు ప్రయేగించి కార్యము సాధించాడు. ఆప్పటికి సైనికంగా దండాయాత్రలు, ఆక్రమణులు చేయుచున్న నేపాలదేశ ఘూర్కాలు, మహారాష్ట్ర నాయకులు, పిండారీల పై యుద్దము ప్రకటించాడు. దిగవల్లి వేంకట శివరావు గారు 1938 లో రచించిన పుస్తకము "The British Rule in India లో లార్డు హేస్టింగ్సు వ్రాసిన ప్రైవేటు జర్నలు 1814 ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 16వ తారీకుల క్రింద వ్రాసియున్న విశేషములు ఉల్లేఖించబడియున్నవి (Private Journal of Moira Vol I). అవి హెస్టింగ్సు చేసిన అనేక కుతంత్రయోధములు తెలుపు గొప్ప చరిత్రాధారములు [1]
హేస్టింగ్సు కార్యకాలమునాటికి మహారాష్ట్ర కూటమి లోని మహారాష్ట్ర స్వతంత్రరాజులు వారిలోవారికి ద్వేషం, విభేదముతో పోటీపడుచుండిరి. ఆట్టి పరిస్థితులే బ్రిటిష్ కంపెనీవారికి వరప్రసాదములు. సరాసరి యుద్దముచేయకుండా రాజ్యతంత్రములతో నొకరిపైనొకరిని ఉసికొలిపి సంధి వప్పందములు చేసుకుని దేశీయనాయకులని తమ చేతుల్లో కీలుబొమ్మలుగా చేసి తమ ఆధిక్యత నిరూపించారు. (చూడు బ్రిటిష్ సామ్రాజ్యము భారతదేశమునుండి నిష్క్రమించేనాటి స్వదేశ సంస్థానాధీశుల నిర్ణయములు ) పూనారాజధానిగా చేసుకుని పరిపాలించుచున్న అప్పటి పీష్వా రెండవ బాజీరావు కూటమికి సర్వాధికుడిగా నుండుటకు రాజకీయాలు చేయుచుండెను. బరోడారాజు గైక్వాడ్ ను చెరపెట్టి తనకనుకూలమైన వ్యవహారములు చేయసాగెను. పీష్వా బ్రిటిష్ వారిని పారద్రోలవలెనని కృతనిశ్చయుడైయుండెనని గ్రహించిన హేస్టింగ్సు బరోడా రాజైన గైక్వాడ్ రాజ్యమున తన కంపెనీ రెసిడెంటు గానున్న గంగాధరశాస్త్రి అనునతని ద్వారా పీష్వాతో రాయబారములు రాజకీయములు చేయుటకు పూనా పంపించాడు. పీష్వాకు మంత్రిగానుండిన త్రియంబకజీ బ్రిటిష్ కంపెనీవారి రాయబారిని హత్యచేయించాడన్న ఆరోపణతో హెస్టింగ్సు ఆదేశాలమేరకు త్రియంబకజీని పీష్వా బ్రిటిష్ వారికి అప్పగించిన తరువాత అతనిని బంధించి బొంబాయి చరసాలలో నుంచారు. కానీ అతను చెరసాలనుండి తప్పించుకుని పారిపోయాడు. ఆ నెపముతో యుద్దభయమును కలిపించి పూనాలోనున్న బ్రిటిష్ కంపెనీ ప్రతినిధి (రెసిడెంటు) ఎలిఫిన్ స్టన్ పీష్వా బాజీరావు చే 1817 జూన్ లో సంధి వప్పందముచేయించాడు. అంతటితో పీష్వా వైరములు తాత్కాలికముగా కట్టిబెట్టి కంపెనీ వారి వశమైనాడు. అలాగే నాగపూరు రాజు రెండవ మాధోజీ భొన్సలే (అప్పాసాహెబు) ను కూడా హేస్టింగ్సు రాజ్యతంత్రములచే నిస్సాహయుడుగాచేసి బందీగాగాకూడా చేసి సంధిపత్రముపై 1816 మే నెలలో సంతకముచేయించాడు. ఆ సంధి ఫలితముగా అప్పాసాహెబు బ్రిటిష్ కంపెనీ వారికి అపార ధనమునిచ్చుకొనుటయేగాక, కంపెనీవారి సైన్యమును వారి రాజప్రతినిధిని రాజ్యబత్తెముల ఖర్చులు భరించవలసివచ్చింది. మూడవ మహారాష్ట్ర యుద్దము (1817-189) తరువాత అతనినే నామమాత్రముగా నాగపూరు రాజుగానుంచాడు. కానీ కొన్నాళ్లకు తిరుగుబాటు వ్యవహారంచేశాడన్న నెపముపై అప్పాసాహెబును (రెండవ మాధోజీ భొన్సలే) పదవీబ్రష్టుని చేసి బందోబస్తీతో అల్హాబాద్కు తీసుకుని వెళ్లుతూనుండగా దారిలో పారి పోయాడు. హేస్టింగ్సు చేసిన అనేక ఇతర రాజ్య తంత్రములలో చెప్పకోతగ్గవి (1) 1818 లో ఉదయపూరు మహారాణితో చేసిన సంధి, అనేక స్వదేశ రాజుల వద్దనుండి అనుబంధ సమాశ్రయసంధి (Subsidiary Alliance) పత్రములు వ్రాయించి చేసుకున్న సంది వప్పందములతో స్వదేశరాజుల సంస్థానములో నుంచిన రెసిడెంట్లు బ్రిటిష్ కంపెనీ వారికి ఘూడచారులుగా వ్యవహిరించిరి. (2) అతని పెంపుడుకుమార్తె భర్త పనిచేయుచున్న కంపెనీ వారి చే హైదరాబాదు నిజాముకు పెద్దవడ్డీ పై అప్పు ఇప్పించి అధికార దుర్వినియోగం చేశాడు (3) 1819 లో జరిగిన సింగపూరు ద్వీపమును కొనుగోలు వ్యవహారములలో జావాకు గవర్నర్ జనరల్ గా చేసిన స్టాంఫోర్డు రాఫిల్సు (Sir Stamford Raffles) కు మదత్తు చేయుట మొదలగునవి.
హేస్టింగ్సు చేసిన రాజ్య సంస్కరణలలో చెప్పదగ్గవి (1) దిగుమతులపై సుంకములు తగ్గించటం (2) మద్రాసు ప్రసిడెంసీ ( రాష్ట్రము) లో థామస్ మన్రో ప్రవేశపెట్టిన రైతువారీ పద్దతి అను రాజస్వ విధానమును ఇతర ప్రాంతములలో ప్రవేశ పెట్టటం (3) దేశభాషలలో విద్యాబోధనకు పాఠశాలలు స్థాపనకు అనుమతి చేయటం (4) ఉన్నత విద్యాబోధనకై 1817లో కలకత్తాలో హిందూకాలేజి స్థాపనచేసి ఆంగ్లము, విజ్ఞాన శాస్త్రవిద్యాబోధన ప్రవేశపెట్టుట (5) 1799 లో ప్రవేశపెట్టిన వార్తాపత్రికల ప్రచురణ నిషేధమును తొలగించి వార్తా పత్రికల స్వేచ్ఛ కలిగించటం. తత్ఫలితముగా అప్పటిలో కలకత్తాలో 1818 లో సీరంపూర్లో మార్షమన్ అను క్రైస్తవ మిషనరీ దంపతులు సమాచార్ దర్పణ్ అను బంగళా పత్రిక ప్రచురణ ప్రారంభించబడినది (6) కారన్ వాలీసు కోడు (1790 లో కారన్ వాలీసు చేసిన సివిల్ క్రిమినల్ సంస్కరణలు) ఇంకా మెరుగుపరచటం. (7) వంగరాష్ట్రములోనున్న పోలీసు వ్యవస్థను దేశములోని ఇతర ప్రాంతములలో ప్రవేశపెట్టుట (8) అనుగత న్యాయాధికారులు (subordinate judicial Officers) ల జీతములను పెంచి వారి స్థాయి ఉన్నత పరచుట మొదలగునవి.
నేపాలు దేశములో ఘూర్కా అనబడిన జిల్లాలోనుండినట్టి ఘూర్కాలనబడు జాతివారు 1768 లో స్థాపించిన రాజ్యము.ప్రిధ్వీనారయణ షా అను ఘూర్కా రాజు సంతతి వారు చాలాకాలము పరిపాలించిరి. కాలక్రమేణా వారి దేశ సరిహద్దులు దాటి తూర్పువైపున వున్న భారతదేశములోని వంగరాష్ట్రము, దక్షిణమునయున్న అయోధ్య రాజ్యములలోని భూభాగముల పై దాడులు జరిపి ఆక్రమించుచుండిరి. 1757 ప్లాసీ యుద్దం తరువాత బ్రిటిష్ వారికి వంగ, బీహారు అయోధ్య రాష్ట్రములు వశమై అందుగల కొన్ని పరగణాలు బ్రిటిష్ వారి జాగీరులైయున్నవి. అట్టివాటిలో అయోధ్యలోని ఘోరక్ పూరు, బస్తి పరగణాలలోని బ్రిటిష్ స్తావరములపై ఘూర్కా సైనికులు దాడులు చేశారు. హేస్టింగ్సు పదవికి రాగానే 1814 లో ప్రకటించిన మొదటి యుద్దము నేపాలు రాజ్యముపై. అప్పటి నేపాల రాజు బిక్రమ్ షా. రెండేంట్ల పాటు జరిగిన ఆ యుద్దములో 1814-1816 మధ్య బ్రిటిష్ కంపెని సైన్యము ఘూర్కాసైన్యముతో అనేక సార్లు యుద్దములు చేసినమీదట చివరకు 1816 మార్చిలో వారి సైన్యాధిపతి అమర్ సింగ్ ధాపాతో సగౌలీ (Sagauli) సంది వప్పందముతో యుద్దము ముగిసినది. తరువాత నేపాల్ రాజుతో 1816 కాఠ్మండు సంది వప్పందములు జరిగినవి. ఆ కాఠ్మండు సంధి ప్రకారము నేపాలు రాజు తను భారతదేశములో ఆక్రమించియున్న తరాయి భూభూగములో కుమౌం మరియూ ఘరవాల్ పరగణాలు బ్రిటిష కంపెనీ వారికి స్వాదీనముచేశాడు. దాంతోనే సిమ్లా, ముస్సోరీ, నైనితాల్, రానీఖేత్ మొదలగు వేసవి విడుదులనబడిన (శీతల) పర్వత కేంద్రములు కూడా వారికి అప్పుడు కైవశమైనవి. అంతేకాక ఘూర్కాసైన్యములు ఆక్రమించియున్న సిక్కింను వదలిపెట్టటం, బ్రిటిష్ కంపెనీ వారి ప్రతినిధిని నేపాల్ రాజ్యములో నుంచకోటము, అనుబంధ సమాశ్రయసంధి పత్రము నకు కట్టుబడి బ్రిటిష్ వారిని తప్ప ఇంక ఏ విదేశీయులనూ తన కొలువులో చేరనీయనన్న వప్పందముకూడా జరిగింది. 1816 లో గవర్నర్ జనరల్ హేస్టింగ్సు సాధించిన ఆ విజయ పరంపరలకు ఉపలబ్ధికీ బ్రిటిష ప్రభుత్వము వారు అతనికి మార్క్వస్ అను ఇంగ్లీషు హోదానిచ్చి సమ్మానించారు.
పిండారీలు అనబడిన దళములో కేవలము మహారాష్ట్రజాతివారే కాక అనేక జాతివారు, అనేక మతస్తులు యుండిరి. వారు అశ్వదళములతో దాడులు ముట్టుడులు చేయుచూ మహారాష్ట్రకూటమి నాయకులకు సైన్యములో ఖర్చులేని ఉపసైన్యముగా పరిగణింప బడి వారి సానుభూతికి పాత్రులైయుండిరి. దోపిడీ దాడుల వలన దొరికినంతదే పిండారీలకు జీవనాధారము. దేశములో ముఖ్యముగా రాజస్థాన్, మధ్యభారతదేశ ప్రాంతములలో వీరి దాడులెక్కువగానుండెను. అనేక భూభాగములను, పట్టణములను సైనిక స్తావరములనూ ముట్టడించి దాడులు జరుపుచుండిరి. 1812 లో మీర్జాపూరు, షాబాదుల జిల్లాల దాడిచేసి దోపిడీచేశారు. 1816 లో నిజాం గారి రాజ్యములోని దక్కన్ పీఠభూములలోనూ, ఉత్తర సర్కారులలో కూడా పిండారీల దాడులు జరిగినవి. గవర్నరజనరల్ లార్డు హేస్టింగ్సు ఆ పిండారీలను అణచుటకు కృతనిశ్చయుడై పెద్దసంఖ్యలో సైన్యమును సమకూర్చి, యుద్ద వ్యూహములతో దేశమునలుమూలనుంచీ పిండారీ స్తావరములు ముట్టడించి స్వాధీనముచేసుకున్నారు. కరీమ్ ఖాన్ పిండారీ, చిట్టూపిండారీ మొదలగు పిండారీల నాయకులు ఒకరి తరువాత ఒకరు వారంతట వారే బ్రిటిష్ సైన్యమునకు లొంగిపోయారు. వారి తోపాటూ వారికి సానుభూతిపరులైన మహారాష్ట్ర కూటమిలోని నాయకుల సైన్యములు: పూనాలోని పీష్వా, గ్వాలియర్ రాజు సింధియా, నాగపూరు రాజు భోన్సలే, ఇందౌర్ రాజు హేల్కర్ కూడా ఎదురు పోరాటముచేయ ప్రయత్నించినా ఓడిపోయి హేస్టింగ్సు సైన్యమునకు లొంగి పోయారు. దాంతో పిండారీల దోపీడీలు ఆగిపోయినవని చెప్పవచ్చును. ఈ యుద్దములకు హేస్టింగ్సు స్వయముగా సర్వసైన్యాధిపత్యము వహించగా జనరల్ థామస్ హిస్లాప్ (Gen. Thomas Hislop) సైన్యాధిపత్యము వహించాడు. 1816-17 జరిగిన ఆ యుద్దములనే పిండారీ యుద్దమనబడిననూ ఆ యుద్దము చివరకు మూడవమహారాష్ట్ర యుద్దముగా మారి 1819 దాకా సాగినది అందుచే పిండారీల యుద్దము మూడవ మహారాష్ట్రయుద్దములో భాగముగనే పరిగణించవలసియున్నది.
బ్రిటిష్ కంపెనీ వారు మహారాష్ట్ర రాజ్యములలో చేసిన యుద్దములను మహారాష్ట్రయుద్ధములుగా ప్రసిధ్ది. మొదటి యుద్దము (1775-1782) లోనూ, రెండవయుద్దము (1802-1805) లోనూ వారన్ హేస్టింగ్సు అటుతరువాత వెల్లెస్లీ గవర్నర్ జనరల్ గానున్న కార్యకాలములలో జరిగినవి. ప్రతి యుద్దము తరువాత మహారాష్ట్ర రాజ్యములోని భూభాగములు బ్రిటిష్ వారి వశమగుట, మహారాష్ట్రనాయకుల కూటమి విఛ్చనమగుట తత్ఫలితములు. 1817-1819 మద్యజరిగిన మూడవ మహారాష్ట్ర యుద్దము పీష్వా రెండవు బాజీరావు ప్రారంభించినదని చెప్పవచ్చును. 1817జూన్ లో చేసిన సంధి వప్పందములను త్రోసిపుచ్చి పీష్వా రెండవ బాజీరావు ఒక సంవత్సరమంతా పోరాటం సాగించాడు. మొదట 1817 నవంబరు పూనాలోని బ్రిటిష్ వారి ప్రతినిది స్థావరమును ముట్టడించాడు. అటుతరువాత ఖిర్కీ (ఇప్పటి పూనే మహాపట్టణములో మునిసిపల్ విభాగము) లో కర్నల్ బర్ అదీనంలోనున్న బ్రిటిష్ సైనిక పటాలమును ముట్టడించడంతో బ్రిటిష సైన్యము పూర్తిస్తాయి యుద్దము ప్రకటించి పీష్వాసైన్యమును ఓడించారు. ఇందౌర్ రాజు మాధవరావు హోల్కర్ నాగపూరు రాజు తోకలసి కంపెనీవారి పై యుధ్ధముప్రటించటముతో బ్రిటిష్ సైన్యము ముందుగా నాగపూరు రాజు సైన్యమును 1817 నవంబరులో సీతాబలడీ వద్ద ఎదుర్కోని చేసిన యుద్దములో అప్పాసాహెబును ఓడించారు. 1817 డిసెంబరులో మహీద్పూర్ వద్ద హోల్కరు సైన్యము జనరల్ థామస్ హిస్లాప్ తో పోరాడి ఓడిపోయెను. పీష్వా బాజీరావు సైన్యము 1818 జనేవరిలో కోరేగాం (ఇప్పటి పూనే మహాపట్టణములో మునిసిపల్ విబాగం) లో పోరాడి ఓడిపోయారు. తరువాత 1818 ఫిబ్రవరిలో పూనాకి కొద్ది దూరములోనున్నఅశ్తి వద్ద కూడా పోరాడి పరాజయము పొందగా చివరకు గవర్నర్ జనరల్ హేస్టింగ్సు పంపిన సర్ జాన్ మాక్కోలం (Sir John Malcolm) కు 1818 జూన్ లో పీష్వా లోంగి పోయాడు. బ్రిటిష్ కంపెనీ వారు అతనిచే సంధి వప్పందము ప్రకారము మనోవర్తి దారుని గాచేశారు. పీష్వా అను పదవిని రద్దుచేసి పీష్వా రాజకీయ సంపదలన్నీను బ్రిటిష్ కంపెనీ బొంబాయి గవర్నరు స్వాధీనము చేసుకున్నాడు. దాంతో మహారాష్ట్ర రాజ్యము రూపుమాసి కంపెనీరాజ్యము విస్తరించింది. బ్రిటిష్ కంపెనీ వారు ఆర్భాటముతో దేశీయ రాజుగౌర్వార్ధము మరియూ సానుభూతిచూపించుటకు పూర్వము మహారాష్ట్రరాజ్యములోని సతారా ఎక్కడైతే శివాజీ మనుమడు (శంభాజీ కుమారుడు, శాహూజీ) కాలముగడిపియుండేనో ఆ పరగణాలనును చిన్న రాజ్యముగా ప్రకటించి మహారాష్ట్రరాజ్య స్తాపకుడైన శివాజీ మహారాజు సంతతి వాడైన ప్రతాపసిహుడును సతారా రాజుగా ప్రకటించారు.
లార్డు హెస్టింగ్సు 7వ గవర్నర్ జనరల్ గా భారతదేశమున బ్రిటిష్ కంపెనీ పరిపాలన సాగించిన 10 సంవత్సరములలో అతను చేసినవి చాలామట్టుకు కుతంత్రములతో కూడిన రాజకీయాలు. చేసిన యుద్దములు కూడా చాలమట్టుకు అనవసరపుటుద్దములు. ఇవన్నీ కేవలము బ్రిటిష్ కంపెనీ వారి రాజ్య విస్తారణకునూ, ఆర్థికాభివృధ్దకి చేసిన కార్యాచరణలే. పదవి చేపట్టగనే 1814-1816 మద్ద్య పిండారీలతోనూ, ఘూర్కాలతోనూ చేసిన యుద్దములు వారి వారి అక్రమ దాడులు ఆక్రమణులనరిగట్టుటకు చేసినవి క్రమబద్దమవిగా కనపడుచున్నవి. లార్డు హేస్టింగ్సు చేసిన మంచి పనులలో భారతదేశ పశ్చమతీరముననూ, పెర్షియన్ గల్ఫ (Persian Gulf) నందునూ, ఎర్ర సముద్రం తీరము (Red Sea) లో ప్రబలమైయున్న ఓడ దొంగలు (Pirates) చేయుచున్న దాడులను అణచుటకు చేసిన సాయుధ ప్రకియ గణనీయమైనది. కానీ తదుపరి మహారాష్ట్ర నాయకులతో చేసిన యుద్దములు అనవరసరపుటుద్దములే. వాటికి ధనము అవసరముకాగా అయోద్యవజీరు దగ్గర నుండి అప్పు తీసుకునటకు ఘూర్కాలదగ్గరనుండి వశముచేసుకున్న అనేక జిల్లాల లోని భూభూగములను కొన్నిటిని హామీగా అతనికిచ్చాడు. లార్డు హేస్టింగ్సు కార్యకాలము 1813-1823 చాలా ప్రముఖమైన పర్వం అందులోనూ 1818 వ సంవత్సరముతో మహారాష్ట్ర రాజ్యము పూర్తిగా మాసిపోయినది, అంతేకాక అప్పడిదాకా మొగల్ సామ్రాజ్యమునకు సామంత రాజులుగా తలవంచిన రాజపుత్ర నాయకులు కూడా 1818 లోనే బ్రిటిష్ కంపెనీ ఆదిక్యత సిరసావహించి అనుబంధసమాశ్రయ సంధి పత్రము సంతకంచేయడంతో రాజస్తాన్, కతియవాడ్ బ్రిటిష్ రాజ్యములో కలసి పోయినవి. అప్పటితో ఫశ్చమభారతదేశము మొత్తము తూర్పువైపున సట్లేజ్ మహానదీ, సింధూ నది వరకూ బ్రిటిష్ వారి రాజ్యమైనది. అందువలన 1818 సంవత్సరము భారతదేశములోని బ్రిటిష్ రాజ్యము బ్రిటిష్ ఇండియా రాజ్యముగా మారినదని చెప్పవచ్చును. లార్డు హేస్టింగ్సు చేసిన సంస్కరణలు కొన్ని మంచిచేసినట్టు కనిపించుటకు చేసి అసలు వ్యాపారలాభములు వారికే కలిగేటటుల చేశాడు. దేశ క్షేమం, ప్రజల క్షేమంకోరినటుల కనిపించినవి (1) దేశీయభాషలలో విద్యాబోధనకై పాఠశాలల స్థాపన, (2) ఉన్నత విద్య, విజ్ఞానశాస్త్రబోధనకు హిందూకాలేజి స్థాపన, (3) వార్తా పత్రికల స్వేఛ, (4) మొగల్ సామ్రాజ్యకాలమునాటి కాలువలకు మరమత్తులు చేయించుట యమునా నది నీటిని ఢిల్లీకి మళ్లించి ఢిల్లీ వాసులకు త్రాగునీరును సరఫరాచేయుట. (5) దేశీయ అనుగత న్యాయాధికారుల (subordinate judicial officers) జీతబత్తెములు పెంచుట మొదలగునవి. ఆ సంస్కరణలు దేశప్రజల క్షేమం కోరినవైనవి గానున్నవి. కానీ అసలు సూత్రధారక సంస్కరణలు వారికి కలుగు ఆర్థిక లబ్ధి నింకనూ పెంపొందించుటకు చేసినవే అట్టివి (1) దిగుమతి సుంకములు తగ్గించుట వలన బ్రిటిష్ వారి వ్యాపారమభివృధ్దికీ, ధేశీయ వ్యాపారుల నాశనమునకూ తోడ్పడినవి (2) రైదువారీ పద్దతి ప్రవేశ పెట్టి సిస్తువసూలు చేయుట వలన రైతులకు లాభముకలగక పోగా వారి దుస్థితికి దారితీసిన సంస్కరణ. 1814 లో సర్ థామస్ మన్రో చెప్పిన మాటలు ఉల్లేఖన "........రాజకీయాధిపత్యమే భారతదేశములో మన వర్తకముయొక్క అభివృధ్దికి కారణముగానున్నది. రాజకీయ బలము లేనిచో స్వదేశరాజులు మనవర్తకమును పెరుగనీయరు...". భారతదేశమును పరిపాలించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్సులో కొలదిమంది ఉదారభావు లైన వారుగా విలియం బెంటింకు, థామస్ మన్రో, ఎల్ ఫిన్సటన్ ల పేర్లు స్మరించటం పరిపాటి. కానీ అట్టివారు కూడా అసలు వ్యవహారమందు బ్రిటిష్ వారి లబ్ధికి, బ్రిటిష ప్రభుత్వమును భారతదేశములో పట్టిష్టముచేయుటయే లక్ష్యము కలిగియున్నవారు .[1].
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.