హరదనహళ్ళి దొడ్డేగౌడ దేవేగౌడ (కన్నడ: ಹರದನಹಳ್ಳಿ ದೊಡ್ಡೇಗೌಡ ದೇವೇಗೌಡ) (జ. మే 18 1933) [1][2]భారతదేశ రాజకీయనాయకుడు. అతను 11వ ప్రధానమంత్రిగా పనిచేశాడు.
హెచ్.డి.దేవెగౌడ | |||
11వ భారత ప్రధానమంత్రి | |||
పదవీ కాలం 1 జూన్ 1996 – 21 ఏప్రిల్ 1997 | |||
రాష్ట్రపతి | శంకర దయాళ్ శర్మ | ||
---|---|---|---|
ముందు | అటల్ బిహారీ వాజపేయి | ||
తరువాత | ఐ.కె.గుజ్రాల్ | ||
భారతదేశ హోంమంత్రి | |||
పదవీ కాలం 1 జూన్ 1996 – 29 జూన్ 1996 | |||
ముందు | మురళీ మనోహర్ జోషి | ||
తరువాత | ఇంద్రజిత్ గుప్తా | ||
14వ కర్ణాటక ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం 11 డిసెంబరు 1994 – 31 మే 1996 | |||
గవర్నరు | ఖుర్షేద్ ఆలం ఖాన్ | ||
ముందు | వీరప్ప మొయిలీ | ||
తరువాత | జె.హెచ్.పటేల్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | హరదనహళ్ళి, మైసూర్ రాజ్యం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం కర్నాటక, భారతదేశం) | 1933 మే 18||
రాజకీయ పార్టీ | జనతాదళ్ (సెక్యులర్) (1999–ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ (1953–1962) జనతా పార్టీ (1977–1988) జనతాదళ్ (1988–1999) | ||
జీవిత భాగస్వామి | చెన్నమ్మ (m. 1954) | ||
బంధువులు | ప్రజ్వల్ రేవణ్ణ (మనవడు) | ||
సంతానం | 6; వారిలో హెచ్.డి.రవన్న, హెచ్. డి. కుమారస్వామి | ||
వృత్తి | రైతు, రాజకీయ నాయకుడు | ||
సంతకం |
1996 జూన్ 1 నుండి 1997 ఏప్రిల్ 21 వరకు తన సేవలనందించాడు[3]. అంతకు ముందు అతను 1994 నుండి 1996 వరకు కర్నాటక రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించాడు. అతను 16వ లోక్‌సభకు కర్నాటక రాష్ట్రం లోని హసన్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. అతను జనతాదళ్ (సెక్యులర్) పార్టీకి జాతీయ అధ్యక్షుడు.[4]
ప్రారంభ జీవితం, విద్య
అతను 1933 మే 18 న మైసూర్ రాజ్యంలో హొలినరసపుర తాలూకాలోని హరదనహళ్ళి గ్రామంలో జన్మించాడు. అతను భారత ప్రభుత్వం చే గుర్తించబడిన వెలుకబడిన కులాలలోని వొక్కలిగ కులానికి చెందినవాడు.[5][6][7] అతని తండ్రి దొడ్డె గౌడ వ్యవసాయదారుడు, తల్లి దేవమ్మ గృహిణి.[8][9] రైతు కుటుంబములో పుట్టిన దేవేగౌడ[8] రైతుగా శిక్షణ పొందాడు. అతను 1950ల చివరిలో హసన్ లోని ఎల్.వి.పాలిటెక్నిక్ నుండి సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పొందాడు.[10] అతను 1954 లో చెన్నమ్మను వివాహమాడాడు. వారికి ఆరుగురు కుమారులు. ఇద్దరు కుమార్తెలు. అతని కుమారులలో హెచ్.డి.రవన్న రాజకీయ నాయకుడు. హెచ్. డి. కుమారస్వామి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.[11]
రాజకీయ జీవితం
కాంగ్రెస్ లో చేరిక
గౌడ 1953లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి అందులో సభ్యునిగా 1962 వరకు ఉన్నాడు. ఈ సమయంలో అతను హొలెనరసిపుర లోని ఆంజనేయ కో-ఆపరేటివ్ సొసైటీకి అధ్యక్షునిగా ఉన్నాడు. తరువాత అతను హొలెనరసిపుర తాలూకా డెవలప్‌మెంటు బోర్డు సభ్యునిగా ఉన్నాడు.
1962లో తొలిసారిగా కర్ణాటక శాసనసభకు హోలెనరసిపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు.తరువాత అతను 1962 నుండి 1989 వరకు వరుసగా నాలుగు సార్లు అదే శాసనసభ నియోజకవర్గం నుండి గెలుపొందాడు. అతను కాంగ్రెస్ పార్టీ చీలిపోయినపుడు కాంగ్రెస్ (ఓ) పార్టీలోనికి చేరాడు. 1972 మార్చి నుండి 1976 మార్చి వరకు, 1976 నవంబరు నుండి 1977 డిసెంబరు వరకు శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా సేవలనందించాడు.[12] ఎమర్జెన్సి కాలంలో (1975-77) బెంగళూరు కేంద్రకారాగారంలో జైలుశిక్షను అనుభవించాడు.
జనతా పార్టీలో
జనతాపార్టీ రాష్ట్ర శాఖకు రెండు సార్లు అధ్యక్ష బాధ్యతలను చేపట్టాడు. 1970వ దశకము చివరలో జనతా పార్టీలో ఎదిగిన దేవేగౌడ, 1980లో పార్టీ చీలీపోయినప్పుడు దాని వారసత్వ పార్టీ అయిన జనతాదళ్ను తిరిగి సమైక్య పరచటంలో ప్రధానపాత్ర పోషించాడు. దేవేగౌడ పార్టీలోకి విభిన్న కులాలకు చెందిన వ్యక్తులను ఆకర్షించడంలో కీలకమయ్యాడు. 1983 నుండి 1988 వరకు రామకృష్ణ హెగ్డే నాయకత్వంలోని కర్నాటకలోని జనతా పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా తన సేవలనందించాడు. 1994 లో అతను జనతాదళ్ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడైనాడు. 1994 రాష్ట శాసనసభ ఎన్నికలలో జనతా దళ్ పార్టీ విజయానికి కృషిచేసాడు. అతను రామనగర నియోజకవర్గం నుండి ఎన్నుకోబడ్డాడు. కర్ణాటక రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. 1995 జనవరిలో గౌడ అంతర్జాతీయ ఆర్థిక వేత్తల పోరంలో పాల్గొనడానికి స్విడ్జర్లాండ్ వెళ్ళాడు. తరువాత కర్నాటక రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను తెప్పించడానికి సింగపూర్ కూడా వెళ్ళాడు.[2]
ప్రధానమంత్రిగా
1996 సార్వత్రిక ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రేసు ఓడిపోయి, అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు రాజీనామా చేసిన తర్వాత, జాతీయవాద పార్టీలు ప్రభుత్వము నెలకొల్పడంలో విఫలమయ్యాయి. అప్పుడు యునైటెడ్ ఫ్రంట్ (కాంగ్రెస్ యేతర, బి.జె.పి.యేతర ప్రాంతీయ పార్టీలతో కలసి) కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. అపుడు దేవెగౌడ యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వానికి నాయకునిగా ఎన్నుకోబడి దేశానికి 11వ ప్రధానమంత్రి అయ్యాడు.[4] అతను 1996 జూన్ 1 న ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టి 1997 ఏప్రిల్ 11 వరకు కొనసాగాడు. అతను యునైటెడ్ ఫ్రంటు స్టీరింగ్ కమిటీకి చైర్మన్ గా కూడా ఉన్నాడు.[4]
జనతాదళ్ (సెక్యులర్)
1977 జాతీయ ఎన్నికలలో విపక్ష పార్టీలను సంఘటితం చేసి జయప్రకాష్ నారాయణ్ స్థాపించిన జనతా పార్టీ మూలాలను తిరిగి గుర్తించి జనతాదళ్ (సెక్యులర్) పార్టీ స్థాపించబడింది.
1988లో చిన్న విపక్ష పార్టీలను జనతా పార్టీ తనలో కలుపుకొని జనతాదళ్ పార్టీగా అవతరించింది. 1989 లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని జనతాదళ్ పార్టీకి చెందిన విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ నాయకత్వం వహించి జనతాదళ్ పార్టీ నుండి మొదటి ప్రధానమంత్రి అయ్యాడు. తరువాత దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్లు యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధానమంత్రులుగా వరుసగా 1996, 1997 లలో కాగలిగారు.
1999 లో పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీతో కలసి ఎన్.డి.ఎ కూటమి ఏర్పరచినపుడు పార్టీ వర్గాలుగా విడిపోయింది. దేవెగౌడ సారథ్యంలోని జనతాదళ్ (సెక్యులర్) పార్టీలోనికి మధు దండావతే వంటి నాయకులతో పాటు అనేకమంది చేరారు. ఈ పార్టీ విభాగానికి దేవెగౌడ జాతీయ అధ్యక్షుడు అయ్యాడు.
1999 సార్వత్రిక ఎన్నికలలో అతను ఓడిపోయాడు కానీ 2002లోకనకపురలో జరిగిన ఉప ఎన్నికలో గెలిచాడు.
2004 కర్నాటక ఎన్నికలలో జనతాదళ్ (సెక్యులర్) పార్టీగా పునరుద్ధరించడంతో 58 సీట్లు గెలుచుకుంది. రాష్ట్రంలో పరిపాలించే ప్రభుత్వంలో భాగమయింది. తరువాత ఈపార్టీ బి.జె.పితో కలసి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని 2006 లో ఏర్పాటు చేసింది. అతని కూమరుడు హెచ్. డి. కుమారస్వామి బి.జె.పి-జె.డి (ఎస్) పార్టీల కూటమికి నాయకత్వం వహించి ప్రభుత్వాన్ని 20 నెలల పాటు ఏర్పాటు చేసాడు.[13][14] 2008 రాష్ట్ర ఎన్నికలలో పార్టీ 28 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కానీ దక్షిణ కర్ణాటకలో ముఖ్యమైన శక్తిగా మారింది.
సిద్దరామయ్య, సి.ఎం.ఇబ్రహీం లను జె.డి (ఎస్) పార్టీ నుండి దేవగౌడ బహిష్కరించాడు. సిద్ధరామయ్య కర్నాటక లోని దళిత, వెనుకబడిన మైనారిటీ వర్గాలను ప్రాతినిధ్యం వహిస్తున్న అహిందా (AHINDA) [15][16][17] ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాడు.[18] తరువాత సిద్ధరామయ్య, సి.ఎం.ఇబ్రహీంలు భారత జాతీయ కాంగ్రెస్ లో చేరారు.[19] 2013 విధాన సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది సిద్ధరామయ్య కర్నాటక రాష్ట్రానికి 2013లో ముఖ్యమంత్రి అయ్యాడు.[20]
2008లో జె.డి.ఎస్ ప్రారంభంలో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా బి.జె.పి. నాయకుడు బి.ఎస్.యడ్యూరప్పకు అధికారాన్ని బదిలీ చేయలేదు.[21][22] ఇది 2008 లో జరిగిన విధాన సభ ఎన్నికలో జె.డి.డి.కు పెద్ద అవరోధానికి దారితీసింది. దీని ఫలితంగా 2004 విధాన సభలో 58 స్థానాలు[23] గల పార్టీ 28 సీట్లు మాత్రమే గెలుచుకుంది.[24]
బి.ఎస్.యడ్యూరప్ప కర్నాటకలో అత్యధికంగా ఉన్న లింగాయత్ కులానికి చెందినందువల్ల జె.డి.ఎస్ పార్టీలోని అనేక మంది లింగాయత్ కులానికి చెందిన నాయకులు పార్టీని విడిచిపెట్టారు.[25] 2008 లో బి.ఎస్.యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. కర్ణాటక ముఖ్యమంత్రి అయిన బి. ఎస్. యడ్యూరప్పను దేవ్ గౌడ దూషించాడు.[26][27] ఈ సంఘటన "భారత రాజకీయాల్లో కొత్త తక్కువ" చేసినట్లు అయింది.[28] కర్ణాటక ముఖ్యమంత్రికి దుర్భాషలాడినందుకు గౌడ క్షమాపణలు చెప్పాడు.[29]
బి.ఎస్. యడ్యూరప్ప, సిద్దరామయ్య ఇద్దరూ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రులుగా మారారు. 2008 నుండి 2018 వరకు సార్వత్రిక ఎన్నికల వరకు దేవ్ గౌడ నేతృత్వంలోని జె.డి.ఎస్ పార్టీ కర్ణాటక రాజకీయాల్లో ప్రభావం చూపలేదు. 2018 కర్నాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్, బి.జె.పి, జె.డి.ఎస్ మధ్య పోటీ పెరిగింది. ఎన్నికల ఫలితలలో బి.జె.పికి 104 సీట్లు, కాంగ్రెస్ కు 78 సీట్లు, జె.డి.ఎస్ కు 37 సీట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు పొందినా ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ సంపాదించలేకపోయింది. బి.జె.పికి అధికారం వదలడం యిష్టం లేని కాంగ్రెస్ పార్టీ జె.డి.ఎస్ కు మద్దతు ప్రకటించింది. జె.డి.ఎస్. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి సిద్ధపడింది. అంతకు ముందు కర్నాటక గవర్నర్ బి.జె.పికి ప్రభుత్వం ఏర్పాటు చేయవలసినదిగా కోరాడు. బి.ఎస్. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు. గవర్నర్ ఆదేశాల ప్రకారం 2 వారాలలో బలపరీక్ష చేయవలసి ఉంది. దీనికి కాంగ్రెస్, జె.డి (ఎస్) పార్టిలు సుప్రీం కోర్టుకు వెళ్లాయి. సుప్రీం కోర్టు ఒక్కరోజులో బలపరీక్ష చేయాల్సిందిగా కోరాడు. బి.జె.పి పార్టీకి ఏ ఇతర పార్టీల మద్దతు లేకపోవడంతో యడ్యూరప్ప బలపరీక్షకు ముందే రాజీనామా చేసాడు. 2019 ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడంతో కర్ణాటకలోని బీజేపీ వర్గం సంకీర్ణ ప్రభుత్వంలోని 17 (14 మంది కాంగ్రెస్ 3 జేడీ (స్) ) మంది ఎమ్మెల్యేలను ఆకర్షించి ప్రభుత్వాన్ని కూల్చి వేసింది. తర్వాత యాడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.[30][31][32][33][34] జె.డి (ఎస్) సారథ్యంలోని ప్రభుత్వం కర్నాటకలో కొలువుతీరనుంది.
నిర్వహించిన పదవులు[35]
- 1962–89 : సభ్యుడు, కర్నాటక శాసనసభ (7 సార్లు)
- 1972–76: కర్నాటక శాసనసభకి ప్రతిపక్ష నాయకుడు
- 1983–88: పబ్లిక్ వర్క్స్, నీటిపారుదల శాఖామంత్రి, కర్నాటక ప్రభుత్వం.
- 1991: 10వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నుకోబడ్డాడు.
- 1991–94: సభ్యుడు, కామర్స్ కమిటీ
- సభ్యుడు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆన్ ఫెర్టిలైజర్స్
- సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, వ్యవసాయ మంత్రిత్వశాఖ
- 1994: అధ్యక్షుడు, జనతాదళ్, కర్నాటక.
- 1994–96 : కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి.
- జూన్. 1996 – ఏప్రిల్. 1997 : భారతదేశ ప్రధానమంత్రి. పెట్రోలియం, రసాయన శాఖామంత్రి, హోం మంత్రి, అణుశక్తి మంత్రి, ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రిస్ మంత్రి, పట్టణ వ్యవహారాలు, ఉపాధి శాఅఖా మంత్రి.
- 1996–98 : సభ్యుడు, రాజ్యసభ
- నవంబరు. 1996-1997 ఏప్రిల్ : రాజ్యసభ నాయకుడు ;
- 1998 : 12వ లోక్‌సభకుతిరిగి ఎన్నిక (2వసారి ).
- జాతీయ అధ్యక్షుడు, జనతాదళ్ (సెక్యులర్)
- 2002: 13వ లోక్‌సభకు తిరిగి ఎన్నిక (3వసారి)
- 2004: 14వ లోక్‌సభకు తిరిగి ఎన్నిక (4వసారి)
- 2006–2008 : సభ్యుడు, రైల్వే కమిటీ
- 2009: 15వ లోక్‌సభకు తిరిగి ఎన్నిక (5వసారి)
- 2009 ఆగస్టు 31 : సభ్యుడు, డెఫెన్స్ కమిటీ
- 2014: 16వ లోక్‌సభకు తిరిగి ఎన్నిక (6వసారి)
- 1 Sep 2014 - :సభ్యుడు, స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్
ఇవి కూడా చూడండి
మూలాలు
బయటి లంకెలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.