స్థూల కాయం[1] అనగా శరీరంలో అవసరానికి మించి కొవ్వు చేరి ఆరోగ్యానికి చెరుపు చేసే ఒక వ్యాధి. [2] ఒక వ్యక్తి యొక్క ఎత్తుకు, బరువుకు గల సంబంధమును - శరీర భారసూచిక (బాడీ మాస్ ఇండెక్స్) సూచిస్తుంది. ఏ వ్యక్తికైనా ఇది 30 కె.జి/ చదరపు మీటరుకు పైన ఉంటే స్థూలకాయంగా లెక్కిస్తారు.[3] దీనివల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం (డయాబెటిస్), నిద్రలో సరిగా ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం (నిద్రలో శ్వాసకు అంతరాయాలు), కీళ్ళనొప్పులు, కొన్ని రకాలైన కర్కటవ్రణాలు ( క్యాన్సర్) లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మోతాదుకు మించి ఆహారం తీసుకోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, కొన్ని సార్లు వారసత్వం కూడా దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

Thumb
స్థూలకాయం గల పురుషుని శరీరం. బాడీ మాస్ ఇండెక్స్ 46 kg/m2: బరువు 146 కె.జి (322 lb), ఎత్తు 177 సెం.మీ (5 ft 10 in)

సరైన రీతిలో ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం దీనికి ముఖ్యమైన చికిత్సలు. వీటి వల్ల కాకపోతే స్థూలకాయానికి వ్యతిరేకంగా ఆకలి తగ్గించేందుకు కొవ్వులను సంగ్రహించే సామర్థ్యాన్ని తగ్గించేందుకు కొన్ని మందులు ఉన్నాయి.

Thumb
ప్రపంచ ప్రాంతాల్లో జనాభాలలో స్తూలకాయులు

వర్గీకరణ

శరీర భారసూచిక (బాడీ మాస్ ఇండెక్స్) లెక్కించుట:

ఒక వ్యక్తి కిలోగ్రాముల బరువును m ఆ వ్యక్తి యొక్క మీటర్ల ఎత్తు h వర్గముతో భాగిస్తే ఆ వ్యక్తి భారసూచిక (Body Mass Index) తెలుస్తుంది.

ఇక్కడ '' m '' అంటే బరువు ఇంకా '' h '' అంటే ఎత్తు. భారసూచికను అనుకరించి వైద్యులు క్రింది విధంగా వర్గీకరిస్తారు.

< 18.5 తక్కువ బరువు
18.5–24.9 సాధారణ బరువు
25.0–29.9 ఎక్కువ బరువు
30.0–34.9 మొదటి తరగతి స్థూలకాయం
35.0–39.9 రెండవ తరగతి స్థూలకాయం
> 40.0  మూడవ తరగతి స్థూలకాయం

స్థూలకాయం, ఎక్కువ బరువులకు కారణాలు

ఎక్కువతిండి

పాతదినాలలో ధనవంతులైన కొద్ది మందిలో బరువెక్కువైనవారు కనిపించేవారు. నవీన కాలంలో ఆహార విప్లవం వలన ఆహార పదార్థాల ఉత్పత్తి పెరిగి అవి విరివిగా లభ్యము అవుతున్నాయి. చిల్లర తిళ్ళ దుకాణాలు ఎక్కువయ్యాయి. చక్కెర సహిత శీతల పానీయాలు, చక్కెర సహిత ఫలరసాల వాడుక పెరిగింది. వేడుకలు పెరిగి శక్తిసాంద్ర ఆహార పదార్థాలు (ఎనర్జీ రిచ్ ఫుడ్స్) తీపి వస్తువులు, పానీయాలు, మద్యం, మిగిలిన చిరుతిళ్ళ వినియోగం అన్ని సమాజాలలోను పెరిగింది.

Thumb
ప్రపంచంలో రోజుకు ఒక వ్యక్తి సగటు కేలరీల వినియోగం

తిండి  ఎక్కువైతే జీర్ణాశయం సాగుతూ పరిమాణం పెరిగి వారిలో ఆకలి కూడా పెరుగుతుంది. చక్కెర సహిత పానీయాలు, పదార్థాలు సేవిస్తే వారి రక్తంలో చక్కెర విలువలు పెరిగి దానికి స్పందనగా  ఇన్సులిన్ విడుదలై  దాని ప్రభావం వలన రక్తంలో చక్కెర తగ్గగానే వారికి నీరసం ఆకలి పెరుగుతాయి. అపుడు వారు మరికొంత ఆహారాన్నో, పానీయాలనో సేవిస్తారు. ఈ విషచక్రం అలా కొనసాగుతుంది. అవసరాలకు మించి తినే తిండిపదార్థాలైవైనా శరీరంలో కొవ్వుగా నిలవ అవుతాయి.

తక్కువ వ్యాయామం

సమాజాలలో మార్పుల వలన వాహనాలు పెరిగి పిల్లలు పాఠశాలలకు నడిచి వెళ్ళరు. పెద్దలు ఉద్యోగాలకు నడిచి వెళ్ళరు. దూరదర్శినులు, గణన యంత్రాలు, చరవాణుల వాడుక హెచ్చి పిల్లలు, పెద్దలు క్రీడలకు, వ్యాయామాలకు వెచ్చించే కాలం తగ్గిపోయింది. పాఠశాలలలో క్రీడలకు, వ్యాయామాలకు ప్రోత్సాహం తగ్గింది. తక్కువ వ్యాయామం వలన శరీరంలో కేలరీలు ఖర్చు కాక కొవ్వు నిలువలు పెరుగుతాయి.

జన్యుకారణాలు

పరిసరాలు, జీవన శైలులలో మార్పులకు వేఱు వేఱు వ్యక్తులు వేఱు వేఱుగా స్పందిస్తారు. జడత్వం, వ్యాయామపు కొఱత, అధిక ఆహార వినియోగాలు కొందఱిలో ఎక్కువగా ఉంటాయి . వాటికి జన్యువులు కారణం కావచ్చు.

కేవలం జన్యు కారణాల వలనే సంక్రమించే స్థూలకాయాలు చాలా అరుదు. చాలామందిలో స్థూలకాయాలకు వివిధ కారణాలు, పెక్కు జన్యువులు కారణం అవుతాయి. కొన్ని కుటుంబాలలో ఎక్కువ బరువు, స్థూలకాయాలు సంభవించినా దానికి వారి జీవన శైలి, పరిసరాల ప్రాబల్యమే ప్రధాన కారణం. జీవన శైలులలో మార్పుల వలన వారు స్థూలకాయాలను నిరోధించ వచ్చును.

రుగ్మతలు    

కుషింగ్ సిండ్రోము , పాలీ సిస్టిక్ ఓవరీలు, మానసిక వ్యాధులు  ఎక్కువ బరువు కలిగిస్తాయి.

ఔషధాలు

కుంగువ్యాధులు (డిప్రెషన్), యితర మానసిక వ్యాధులకు వాడే మందులు (ఎటిపికల్ ఏంటి సైకోటిక్స్), ఎడ్రినల్ కార్టికో ష్టీరాయిడులు, మధుమేహవ్యాధి మందులు, గర్భనిరోధక ఔషధాలు, కొన్ని మూర్ఛ మందులు బరువు పెరుగుటకు తోడ్పడ వచ్చును. వాటి వలన ఆకలి ఎక్కువై ఎక్కువగా భుజించుట దానికి కారణం.

స్థూలకాయం వలన పరిణామాలు

ఎక్కువ బరువు, స్థూలకాయాలు కొన్ని రుగ్మతలకు దారి తీస్తాయి. ఎక్కువ బరువు ఉన్న వారిలో రక్తపుపోటు ఎక్కువగుటకు అవకాశాలు ఎక్కువ. మధుమేహం,అల్ప సాంద్రపు కొలెష్టరాలు ఎక్కువగుట, అధిక సాంద్రపు కొలెష్టరాలు తక్కువగుట, ట్రైగ్లిసెరైడులు ఎక్కువ అవుట ఎక్కువగా కలుగుతాయి.  హృద్రోగాలు, హృద్ధమనుల వ్యాధులు , మస్తిష్క ఘాతములు (స్ట్రోక్స్), పిత్తాశయ వ్యాధులు,కీళ్ళ వాతాలు (ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు,తుంటి సంధుల నొప్పులు), ఒళ్ళు నొప్పులు ఎక్కువగా కలుగుతాయి. కాలేయంలో కొవ్వు చేరి కాలేయపు కొవ్వు వ్యాధి రాగలదు. స్థూలకాయులలో ఆమ్ల తిరోగమనం (ఏసిడ్ రిఫ్లక్స్) ఎక్కువ. మూత్రాంగ వైఫల్యాలు, కుంగుదల వంటి మానసికవ్యాధులు వీరిలో ఎక్కువ.జడత్వము, నిశ్చలత్వం, మందకొడితనం ఎక్కువై జీవన రీతులు అసంపూర్ణంగా ఉంటాయి. కొన్ని పుట్టకురుపులుు (కాన్సర్స్) ; పెద్దప్రేవుల, కాలేయపు, పిత్తాశయపు, మూత్రాంగముల కర్కట వ్రణముల (కాన్సర్స్) స్త్రీలలో రొమ్ము, బిడ్డసంచీ కర్కట వ్రణాలు) కూడా స్థూలకాయులలో ఎక్కువగా కలుగుతాయి[4]. వీరిలో నిద్రలో శ్వాసభంగాలు ఎక్కువగా కలుగుతాయి.  

తామర, ఒరుపులు, సూక్ష్మాంగజీవులు కలిగించే వాపులు, పుళ్ళు వంటి చర్మవ్యాధులు కూడా స్థూలకాయాలు కలవారిలో ఎక్కువ.

ఫైన పేర్కొన్న వివిధ కారణాల వలన బరువు ఎక్కువగా కలవారిలోను, స్థూలకాయులలోను ఆయుః ప్రమాణము తగ్గుతుంది.

నివారణ మార్గాలు

స్థూలకాయము, ఎక్కువ బరువులను నివారించు మార్గములు:

తక్కువ ఆహారము తక్కువ కాలరీలను గ్రహించుట వలన, వ్యాయామముతో ఎక్కువ కాలరీలను ఖర్చు పెట్టుట వలన బరువు తగ్గుతారు. కాలరీలు భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య, పానీయాల ద్వారా దేహానికి చేరుతాయి. చక్కెరతో కూడిన శీతల పానీయాలు, చక్కెర, వెన్న, నేతులతో చేసిన చిల్లర తిళ్ళు వలన, తఱచు వివిధ రకాల చిరుతిళ్ళు తినుటవలన, అధిక పరిమాణములలో భోజనములు భుజించుట వలన కాలరీలు ఎక్కువగా గ్రహించుట జరుగుతుంది[1]. దేహము ఖర్చు పెట్టని కాలరీలు ఏ రూపములో వెళ్ళినా చివరకు కొవ్వుగా దేహములో నిలువ ఉంటాయి.

ఆహారంలో కాలరీల తగ్గింపు

అందువలన ఊబ కాయము తగ్గాలంటే చక్కెర సహిత శీతలపానీయాలు మాని మంచినీటి వాడుకను పెంచుకోవాలి. చక్కెర లేని శీతల పానీయములు 0 కాలరీలవి వాడుకొనవచ్చును. కొవ్వులు, చక్కెర, పిండిపదార్థాలతో సహా తీసుకొనే కాలరీలు మితపరచుకోవాలి. ఆరోగ్యానికి తోడ్పడే ఫలాలు. ఆకుకూరలు, కూరగాయలు, పీచుపదార్థములు, చిక్కుళ్ళు, పప్పులు పూర్ణ ధాన్యములు వినియోగించుకొని సంస్కరణ ధాన్యాల వినియోగము తగ్గించుకోవాలి. కొవ్వుతో కూడిన మాంసము బదులు చిక్కిన మాంసాలను వినియోగించుకోవాలి. తిని, త్రాగే మొత్తపు కాలరీలను పరిమితము చేసుకోవాలి. మద్యము వాడుకను మితపరచుకోవాలి.

వ్యాయామంతో కాలరీల ఖర్చు పెంచుట

జీవన శైలిని మార్చుకొని నడక, వ్యాయామము, యోగా, క్రీడలద్వారా శరీరములో నిలువ ఉన్న కాలరీలను కరిగించి ఖర్చు చెయ్యాలి. వీలయినంతగా వాహనముల వాడుక తగ్గించుకోవాలి. బయట నడచుటకు అవకాశము లేనియెడల వ్యాయామ సాధనములను యింట్లోనే వినియోగించుకోవాలి. దండీలు, బస్కీలు, యోగా, మొదలైన ప్రక్రియలతో స్వంత కండరములకు ఎదురుగా కసరత్తులు చేసుకొనవచ్చును. ఒంటరిగా వ్యాయామము చేసుకోలేనివారు సమూహములుగా చేసుకోవాలి. దీర్ఘకాలిక ప్రణాళికలతో, క్రమశిక్షణతో బరువు తగ్గగలరు.

ఔషధాలు:

ఆకలిని తగ్గించుటకు బరువు తగ్గుటకు కొన్ని మందులు ఉన్నాయి. వాడుకలో ఉన్న మందులు సెమాగ్లుటైడ్, ఆర్లిస్టాట్ , లార్కసెరిన్, లిరగ్లూటైడ్ , ఫెంటెరమిన్ / టోపిరమేట్, నల్ ట్రెక్సోన్ / బూప్రోపియన్ లు. ఆర్లిస్టాట్ కొవ్వుపదార్థాల జీర్ణమును అరికడుతుంది. కొవ్వుపదార్థాలు భుజించినపుడు అవి జీర్ణము కాక విసర్జింపబడుతాయి. ఔషధాల వలన విపరీత ఫలితాలు కలిగే అవకాశము ఉన్నది. ఈ మందుల వలన దీర్ఘకాలిక ప్రయోజనము, దీర్ఘకాలము వాడుట వలన కలిగే నష్టముల వివరాలు పూర్తిగా తెలియవు.

శస్త్రచికిత్సలు

బరువు విపరీతమైనప్పుడు ఎక్కువ బరువు వలన హృద్రోగములు, మధుమేహము యితర రుగ్మతలు ఉన్నప్పుడు బరువు తగ్గించుటకు శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

జఠర బంధన చికిత్స ( గాస్ట్రిక్ బాండింగ్ ):

భార సూచిక 40 దాటిన వారికి, లేక 35- 40 లో ఉండి హృద్రోగము, అదుపు కాని మధుమేహవ్యాధి ఉన్నవారికి మిత ఆహార, వ్యాయామ చికిత్సలు విఫలమైనప్పుడు జఠర బంధన చికిత్సలు అవసరము అవవచ్చును. ఉదరాంతర దర్శనము ద్వారా ( లేపరోస్కోపి ) జీర్ణాశయము చుట్టూ పట్టీ అమర్చి జీర్ణాశయమును రెండు తిత్తులుగా విభజించుట వలన పై భాగపు తిత్తి కొద్ది ఆహారముతోనే నిండి ఆకలి తీరుతుంది. జఠరము, ఆంత్రములు ఉండుట వలన విటమినులు ఖనిజ లవణముల గ్రహించబడుతాయి. జఠర బంధన పరిమాణమును మార్చుతూ జీర్ణాశయపు తిత్తుల పరిమాణములు మార్చవచ్చును.

జఠర ఛేదన ( గాస్ట్రిక్ రిసెక్షన్ ):

ఈ శస్త్రచికిత్సలో, జీర్ణాశయములో చాలా భాగమును తొలగిస్తారు. జఠరములో చిన్న తిత్తినే ఉంచి దానిని ఆంత్రములకు జతపరుస్తారు. లేక నిలువుగా చాలా భాగమును తొలగించి జీర్ణాశయ పరిమాణములో కొంత భాగమునే ఉంచవచ్చును. ఈ చికిత్సలు పొందిన వారికి విటమినులు, ఖనిజ లవణములను సమకూర్చాలి. ఆంత్రములలో కొంత భాగమును తొలగించే శస్త్ర చికిత్సలు అఱుదు అయిపోయాయి.

కడుపు బుడగ, జఠర బుద్బుదము ( గాస్ట్రిక్ బెలూన్ ):

తాత్కాలికముగా జీర్ణాశయములో వ్యాకోచింపగలిగే బుడగను అంతర్దర్శిని (ఎండోస్కోప్ ) ద్వారా నిలిపి ఆరు మాసములలో తొలగించి ఆకలి తగ్గించి బరువును తగ్గింపవచ్చును.

ఎక్కువ బరువు లక్షణాలు పిన్నవయస్సులోనే పొడచూపుతాయి కనుక తల్లిదండ్రులు పూనుకొని పిల్లలను ఆరోగ్యకరమైన మితాహారములో ఉంచి, వారికి తగిన వ్యాయామము, క్రీడలు సమకూర్చి శ్రద్ధ వహిస్తే చాలా వఱకు అధిక భారములను, స్థూలకాయములను నివారింపగలుగుతాము.

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.