Remove ads

శిబి చక్రవర్తి గొప్ప దాత, దయా గుణం గాలా చక్రవర్తి. ఇతడు ఉశీనరుడు అనే మహారాజు కుమారుడు. భృగుతుంగ పర్వతం మీద ఓ సారి పెద్ద ఎత్తున యజ్ఞం చేసాడు శిబి చక్రవర్తి. ఎందరో మహర్షులు ఆ యజ్ఞానికి హాజరయ్యారు. అందరికీ ఘనంగా మర్యాదలు జరిగాయి. అందర్నీ గొప్పగా సత్కరించాడు చక్రవర్తి. ఆయన ఔదార్యానికి, దాననిరతికి తాపసులందరు ఆశ్చర్యపోయారు. శిబి చక్రవర్తి దానశీలతను పదే పదే ప్రజలందరూ ప్రశంసించారు. ఈ వార్త ఇంద్రుడి వరకూ వెళ్ళింది. ఆయన చక్రవర్తి ఔదార్యాన్ని పరీక్షిద్దామనుకున్నాడు.

యజ్ఞ వేదిక మీద కూర్చుని ఉన్న శిబి చక్రవర్తి ఒడిలో ఒక పావురం వాలింది. అది మనుష్యభాషలో, "మహారాజా! రక్షించు! నన్ను ఒక డేగ తరుముకొస్తుంది. నన్ను చంపి తినాలని చూస్తుంది. దాని బారి నుంచి నన్ను కాపాడు. నాకు ప్రాణభిక్ష పెట్టు" అని దీనంగా వేడుకుంది. శిబి చక్రవర్తి పావురాన్ని ప్రేమగా నిమురుతూ, "నిన్ను కాపాడే బాధ్యత నాది. నీకు ఎవరి నుంచీ ప్రమాదం రాదు" అని హామీ ఇచ్చాడు. పావురం మనసు కుదుటపడింది. అంతలో అక్కడికి డేగ వచ్చింది. రాజుగారికి ఎదురుగా ఎత్తయిన చోట వాలి పావురం వైపు కొరకొర చూసింది. పావురం భయంతో వణికింది. డేగ కూడా మానవభాషలో, " మహారాజా! ఈ పావురం నా ఆహారం. తప్పించుకుని వచ్చి మీ శరణుజొచ్చింది. దయతో దానిని నాకు వదలిపెట్టండి" అంది. రాజుగారికీ, సభలో వున్నవారికీ అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఏమిటి పావురమూ, డేగా రెండూ మనుష్యభాషలో మాట్లాడుతున్నాయని.

"ఈ పావురానికి నేను అభయమిచ్చాను. ఆడినమాట తప్పను. అయినా నీకు మాత్రం అంత పట్టుదల ఎందుకు? దీన్ని వదలి మరో ఆహారం వెతుక్కో" అన్నాడు శిబి చక్రవర్తి. "రాజా! నీవు ధర్మప్రభువువి, న్యాయంగా ఆలోచించు. నేను ఆకలితో ఉన్నాను. ఈ పావురం దొరికినట్లే దొరికి తప్పించుకుని పారిపోయి నీ దగ్గరకు వచ్చింది. నోటి ముందరి ఆహారాన్ని తీసివేయడం ధర్మం కాదు. మహాపాపం కూడా! నా కోరికేమీ అన్యాయమైనది కాదు. పావురాలను డేగలు తినటం సహజమే . ఇప్పుడు ఈ ఆహారం లేకపోతే నేను ఆకలి బాధతో మరణిస్తాను. కనుక నా ఆహారాన్ని నాకు విడిచిపెట్టండి" అంది డేగ.

డేగ మాటలకు సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. శిబి చక్రవర్తి కూడా ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ "ఓ శ్యేనరాజమా! చూడబోతే నీవు ధర్మాధర్మ విచక్షణ తెలిసిన దానిలా ఉన్నావు. శరణన్న వారిని రక్షించటం రాజ ధర్మం. నీ ఆకలిబాధ తీరడానికి ఏ ఆహారం కావాలో చెప్పు. నువ్వు కోరిన ఆహారాన్ని నీకు ఇస్తాను. ఈ పావురాన్ని మాత్రం నీకు వదలిపెట్టను" అన్నాడు.

"నేను కోరిన ఏ ఆహారమైనా ఇస్తారా" అని గట్టిగా అడిగింది డేగ. "నిరభ్యంతరంగా!" "అలాగైతే రాజా! నీ శరీరంలో ఈ పావురమంత మాంసాన్ని కోసి నాకివ్వు" అంది డేగ. శిబి చక్రవర్తి నవ్వుతూ,"అలాగే! నీకు సంతోషం కలిగించటం కంటే నాకేం కావాలి?" అని అప్పటికప్పుడు ఒక కత్తి, త్రాసు తెప్పించాడు. సదస్యులందరూ నిశ్చేష్టులయ్యారు. శిబి చక్రవర్తి ఆ పదునైన కత్తిని తీసుకన్నాడు. తన శరీరం నుంచి మాంసాన్ని కోసి త్రాసులో వేశాడు. పావురం బరువుకు సరికాలేదు. మరికొంత మాంసం కోసి వేశాడు.అప్పుడూ సరిపోలేదు. మరికొంత జోడించాడు. ప్రయోజనం లేకపోయింది. అది చూడలేక సభలోని వారంతా కళ్ళు మూసుకున్నారు. ముఖంలో బాధను కనబడనీయకుండా చిరునవ్వు నవ్వుతూ చక్రవర్తి మరికొంత మాంసాన్ని కోసి త్రాసులో వేశాడు. ఫలితం లేకపోయింది. రాజుగారి శరీరం రక్తం ఓడుతుంది. చివరకు తానే వెళ్ళి పళ్ళెంలో కూర్చున్నాడు. తనను తానే దానంగా సమర్పించుకున్నాడు.

అప్పుడు ప్రత్యక్షమయ్యారు - ఇంద్రుడు, అగ్ని. "రాజా! నీ దానగుణం నిరుపమానమైంది. నీవంటి ఉత్తముడు ఇంతవరకూ ఈ పుడమిపై పుట్టలేదు. నీ ఔదార్యాన్ని పరీక్షించడానికి నేను డేగగా, అగ్ని పావురంగా వచ్చాము. నీ కీర్తి చిరస్థాయిగా వర్ధిల్లుతుంది" అని ఆశీర్వదించాడు ఇంద్రుడు. ఆయనకు మళ్ళీ తేజోరూపం ప్రసాదించాడు. కృతజ్ఞతగా శిబి చక్రవర్తి చేతులు జోడించాడు.[1]

Remove ads

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.

Remove ads