వేదనారాయణస్వామి ఆలయం
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
శ్రీ వేదనారాయణస్వామి (మత్స్యావతార మూర్తి ) వారి ఆలయం తిరుపతి జిల్లా, చెందిన నాగలాపురంలో ఉంది[1][2]
వేదనారాయణస్వామి ఆలయం | |
---|---|
భౌగోళికాంశాలు: | 13°24′00″N 79°46′48″E |
పేరు | |
స్థానిక పేరు: | వేదనారాయణ స్వామి దేవస్థానం |
స్థానం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | ఆంధ్రప్రదేశ్ |
ప్రదేశం: | నాగలాపురం |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | శ్రీమహావిష్ణువు (మత్స్యావతారం) |
ఇది అప్పట్లో వేదపురి అని, వేదారణ్య క్షేత్రమని హరికంటాపురమని పేరు గాంచింది. సోమకాసురడనే రాక్షసుడు బ్రహ్మ దేవుని వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్రంలో దాచినపుడు, శ్రీమహావిష్ణువు మత్స్యావతారము దాల్చి సముద్ర గర్భమున సోమకాసురుని సంహరించి వేదాలను తెచ్చి ఈ స్థలంలోనే బ్రహ్మకిచ్చినట్లు స్థల పురాణంగా చెప్పబడుతుంది. దీనిని అప్పట్లో వేదపురి అని, వేదారణ్య క్షేత్రమని హరికంటాపురమని పేరు గాంచింది.[3]
శ్రీకృష్ణ దేవరాయలు హరికంటాపురములో వెలసియున్న మత్స్యావతార శ్రీ వేదనారాయణ స్వామి, ఆలయాన్ని పంచ ప్రాకారాలు, సప్త ద్వారాలతో, అత్యంత కళాత్మకమైన శిల్ప కళతో, సుందర ఆలయంగా తీర్చి దిద్ది, పునర్నిర్మించి అనేక దానములు చేసి తన తల్లి పేరున దీనిని నాగలాపురముగా నామకరణము చేసెనని ఈ ఆలయ ఉత్తర కుడ్యమునందు గల శాసనము ద్వారా తెలియుచున్నది..
ప్రతి యేడు మార్చి 23, 24, 25 వ తేదీలలో సూర్య పూజోత్సవము మిక్కిలి వైభవంగా జరుగును. 26, 27, 28 వ తేదీలలో మూడు రోజులు తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా జరుగును. అదే విధంగా ఏప్రిల్ నెలలో పౌర్ణమి నుండి 10 రోజులు బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగును. ప్రతిరోజు మూడు పూటలా నిత్య పూజలు జరుగును. ఈ ఆలయం 1967 సెప్టెంబరు 24న తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలోనికి వచ్చింది. ఆ నాటి నుండి నిత్య, వార, వక్ష, మాస, సంవత్సరోత్సవాలు కన్నుల పండుగగా జరుగుచున్నవి[4].
ఈ ఆలయ ప్రధాన గోపురమందున్న ద్వారము అతి విశాలముగా నున్నది. దానిపైనుండిన గోపురము కూలిపోగా తిరుపతి తిరుమల దేవస్థానం వారు క్రొత్తగా గోపురాన్ని నిర్మించారు. కనుక ఇది చిన్నదిగానున్నది. ఈ గోపురం నుండి సాగిన ప్రహరీలో కుడి ఎడమలకు మరో రెండు గోపురములు ఉన్నాయి. అవి ఆనాటివైనందున శిథిలావస్థలో నున్నందున, ఇనుప స్తంభాలతో భద్రపరిచారు. ఈ ప్రాకారంలో కొబ్బరి తోట, పూల తోటలు ఉన్నాయి. మరెటువంటి కట్టడాలు లేవు. ఈ ఆవరణలో వెనుకనున్న చిన్న ద్వారం పైన మత్స్యావతార చిత్రాన్ని చూడ వచ్చు. ఇది ఆలయంలోని ప్రధాన మూల విరాట్టుకు ప్రతిరూపం. ఆ తరువాత రెండో గోపురముతో చుట్టబడిన ప్రహరీ లోపల ప్రధాన ఆలయమున్నది. అందులోనే కళ్యాణ మండపము, ఇతర దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రాకారంలో నుండి గర్భాలయం లోనికి వెళ్ళవచ్చు. చాల దూరంలో స్వామి వారి మూల విరాట్టు ఉంది. మూల విరాట్టు నడుము నుండి పాదభాగము వరకు మత్స్య రూపంలో ఉండగా, శంఖు, చక్రాలు ధరించిన మూర్తిని దేవేరులతో సహా దర్శించ వచ్చు. ఈ గర్భాలయం చుట్టూ మరో ప్రాంగణము ఉంది. అందులో వరండాలలో అనేక ఉప ఆలయాలు, దేవతా మూర్తులతో అలరారు తున్నవి. గర్భాలయ ప్రదక్షిణకు ఇదే మార్గము. ఈ ఆలయ ప్రహరీ గోడలు అక్కడక్కడా కూలి పోయినందున తిరిగి నిర్మించి ఉన్నారు. ప్రధాన గోపురాల లోని శిల్ప కళ చాల అద్భుతంగా ఉంది. ప్రతి రోజు పర్యటక శాఖవారి ఆలయ దర్శన బస్సులు తిరుపతి నుండి నాగలాపురమునకు నడుపబడు చున్నవి.
ఆలయ ప్రధాన గోపుర ద్వారము చాల విశాలంగానూ, చాల ఎత్తుగానున్నది. కాని దాని పైభాగము అన గోపురం గతంలోకూలిపోయినందున చాల చిన్నదిగా ఉంది. ఆ తరువాత తిరుపతి తిరుమల దేవస్థానం వారు ప్రస్తుతమున్న ఈ చిన్న గోపురాన్ని నిర్మించారు. ఆలయ వెలుపలి ప్రాకారానికి ఉత్తర దక్షిణ దిక్కులందు కూడా పెద్ద గోపురములున్నవి. ఈ ప్రధాన గోపురము వాటికన్నా చాల ఎత్తుగా వుండ వచ్చునని భావించ వచ్చు.
ప్రతియేడు మార్చి నెల 25, 26, 27/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరించడం ఈ ఆలయ విశిష్టత. ఈ కారణంగానే ఆ మూడు రోజులు స్వామివారికి సూర్య పూజోత్సవాలు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలనుండి కూడా భక్తులు తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.