వేంకట శ్వేతాచలపతి రంగారావు
బొబ్బిలి జమిందారు From Wikipedia, the free encyclopedia
సర్ వేంకట శ్వేతాచలపతి రంగారావు బహదూర్ జి.సి.ఐ.ఈ (జ.1862 సెప్టెంబరు 8 - మ. 1921) జమీందారు. 1881 నుండి 1921వరకు బొబ్బిలి జమీందారీకి రాజు. ఈయన మనమడు రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు 1932 నుండి 1936 వరకు మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
తొలి దశ
వేంకట రంగారావు 1862, నవంబరు 29న వెంకటగిరిలో జన్మించాడు. ఈయన వెంకటగిరి రాజా సర్వజ్ఞ కృష్ణారావు బహదూర్ యొక్క నాలుగవ కుమారుడు. వెంకటగిరి వెలమ వంశపు యువరాజులను, వారసులు లేని ఇతర వెలమ వంశపు సంస్థానాలైన బొబ్బిలి, పిఠాపురం, జటప్రోలు సంస్థానాధీశులు దత్తత తీసుకున్నారు. వేంకట రంగారావు తొమ్మిదేళ్ల ప్రాయంలో తన అన్నాదమ్ములతో పాటు దత్తత ఇవ్వబడ్డాడు. వేంకట రంగారావును 1871లో బొబ్బిలి రాణీ లక్ష్మీ చెల్లాయమ్మ దత్తత తీసుకున్నది. 1872 డిసెంబరులో వెంకటగిరి నుండి బొబ్బిలి తరలి వచ్చాడు. ఇతర భారతీయ శిక్షకులతో పాటు ఈయన జె.మార్ష్ వద్ద చరిత్ర, ఆర్థికశాస్త్రం, సుసర్ల సీతారామాశాస్త్రి వద్ద సంస్కృత భాషలో శిక్షణ పొందాడు.[1]
వివాహం
వేంకట రంగారావుకు 1878లో వివాహమైంది. అయితే యువరాణి 1880లో వారి ఏకైక సంతానమైన వేంకట కుమార కృష్ణ రంగారావుకు పుట్టిన తర్వాత మరణించింది. ఆ తర్వాత వేంకట రంగారావు ఆమె సోదరిని ద్వితీయవివాహం చేసుకున్నాడు. నవంబర్ 30, 1881న మైనారిటీ తీరిన వెంటనే, వేంకట రంగారావు బొబ్బిలి సింహాసనాన్ని అధీష్టించాడు.
పాలనాకాలం
వేంకట రంగారావు పాలనలో బొబ్బిలి రాజ్యంలో అనేక సంస్కరణలు తెచ్చాడు. బొబ్బిలి మాధ్యమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా పెంచాడు. అంతే కాకుండా పేదలకు, మానసిక, శారీరిక వికలాంగులకు ప్రత్యేక పాఠశాలలను ఏర్పరచాడు.
1883లో, వేంకట రంగారావు కాశీ యాత్ర చేస్తుండగా, ఈయన రెండవ భార్య ప్రసవిస్తూ మరణించింది. ఆ తర్వాత 1887లో తన పెంపెడు తల్లి, రెండవ కుమారుడు కూడా మరణించడం ఈయనను మానసిక క్షోభకు గురిచేసింది. 1888 రాజావారు మూడో పెళ్ళి చేసుకున్నారు. 1892లో మూడో కుమారుడు రామకృష్ణ రంగారావు జన్మించాడు.
1888లో బొబ్బిలిలో ప్రస్తుతమున్న రాజమహల్ ను కట్టించాడు. ఆ సమయంలో వెంకటగిరి సంస్థానంలో వారసత్వపోరు తలెత్తింది. వేంకట రంగారావు చనిపోయిన రాజు కుమారులతో మధ్యవర్తిత్వం నెరపి వారసత్వ వివాదాన్ని పరిష్కరించాడు.
1893లో, వేంకట రంగారావు తన చిన్నతమ్ముడు వేణుగోపాల రంగారావుతో కలిసి ఐరోపా పర్యటనకు వెళ్ళాడు. 1893, ఏప్రిల్ 14న మార్సేల్స్ వద్ద ఓడ దిగాడు. ఆ పర్యటనలో డ్యూక్ ఆఫ్ యార్క్, ప్రింస్ ఆఫ్ వేల్స్, విక్టోరియా రాణిని కలిశాడు. తనకు అందిన ఆతిధ్యానికి సంతృప్తుడై వేంకట రంగారావు తన రాజభక్తిని చాటుతూ విక్టోరియా రాణి జ్ఞాపకార్ధం 1887లో విక్టోరియా మార్కెటును, 1894లో విక్టోరియా టౌన్ హాలును నిర్మింపజేశాడు.
1902లో లండన్లో ఏడవ ఎడ్వర్డు రాజు, మహారాణి అలెగ్జాండ్రాల పట్టాభిషేకంలో మద్రాసు ప్రెసిడెన్సీకి ప్రాతినిధ్యం వహించడానికి వేంకట రంగారావు ఎంపికయ్యాడు.[2]
సత్కారాలు
1895లో వేంకట రంగారావు, అప్పటి మద్రాసు గవర్నరు లార్డ్ వెన్‌లాక్ వేంచేసిన పురప్రజల మధ్యలో జరిగిన ఉత్సవంలో ఊటీలో నైట్ గా KCIE బిరుదుతో సత్కరించబడ్డాడు.1911లో GCIE చేయబడ్డాడు.
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.