From Wikipedia, the free encyclopedia
వెలుదండ నిత్యానందరావు పేరుపొందిన రచయిత, పరిశోధకుడు, ఉపన్యాసకుడు. ఇతడు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు అధ్యక్షుడిగా పనిచేశాడు.
ఆచార్య వెలుదండ నిత్యానందరావు | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయుడు |
విద్య | ఎం.ఎ., పి.హెచ్.డి. |
విద్యాసంస్థ | ఉస్మానియా విశ్వవిద్యాలయం |
వృత్తి | తెలుగు ఆచార్యుడు |
ఉద్యోగం | ఉస్మానియా విశ్వవిద్యాలయం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | పరిశోధకుడు, వ్యాసరచయిత |
గుర్తించదగిన సేవలు | తెలుగు సాహిత్యంలో పేరడీ, హాసవిలాసం, నిత్యాన్వేషణం |
తల్లిదండ్రులు | వెలుదండ రామేశ్వరరావు, లక్ష్మమ్మ |
బంధువులు | వెలుదండ సత్యనారాయణరావు (అన్న) |
ఇతడు 1962, ఆగష్టు 9వ తేదీన నాగర్కర్నూల్ జిల్లా, మంగునూరులో రామేశ్వరరావు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి వెలుదండ రామేశ్వరరావు కవి, పండితుడు. ఇతని సోదరుడు వెలుదండ సత్యనారాయణరావు కూడా కవి. ఇతడు మంగునూరులో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని, శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ ప్రాచ్య కళాశాల, పాలెంలో డిగ్రీ వరకూ చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ., ఎం.ఫిల్., పిహెచ్.డి. పూర్తి చేసుకొని తను చదివిన విశ్వవిద్యాలయ తెలుగుశాఖలో 1988-92 వరకూ పార్ట్ టైమ్ లెక్చరరుగా చేసి, తదనంతరం లెక్చరరుగా, సహాయాచార్యుడుగా, ఆచార్యుడుగా ఎదిగాడు. డిగ్రీ స్థాయిలో రంగాచార్యులు, కపిలవాయి లింగమూర్తి మొదలైనవారు, పి.జి. స్థాయిలో సి.నా.రె, ఎల్లూరి శివారెడ్డి, ఎస్వీ రామారావు మొదలైనవారు ఇతని గురువులు. ఇతడు కవిగా, కథకుడుగా, నాటకకర్తగా, ప్రవక్తగా, సమీక్షకుడుగా, సంపాదకుడుగా, ఆచార్యుడుగా, అన్నింటికీ మించి మహావ్యాసకారుడుగా బహుముఖీనతను సంతరింపజేసుకున్నాడు.[1]
ఇతడు ఇప్పటి వరకు రెండు వేలకు పైచిలుకు పరిశోధక వ్యాసాలు, ఎన్నో గ్రంథ సమీక్షలు, మరెన్నో జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పత్ర సమర్పణలు, ముప్పాతిక దాకా పీఠికలు వ్రాశాడు. సాంకేతికాభివృద్ధి అంతా చేరువలో లేని రోజులలోనే అవిభాజ్య ఆంధ్రదేశంలో వివిధ విశ్వవిద్యాలయాలలోని తెలుగు విభాగాలలో వచ్చిన ఎం.ఫిల్, పిహెచ్.డి పరిశోధన వివరాలను ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సేకరించి 1998లో 'విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన'గా వేశాడు. 2004, 2013లో పరివర్ధిత ముద్రణలను పొందిన ఈ గ్రంథం పరిశోధక విద్యార్థులకు దిక్సూచిగా పనిచేస్తున్నది. ప్రాచీనాధునిక సాహిత్యకారులందరూ ఈసడించుకున్న చంద్రరేఖా విలాపం అనే ప్రబంధాన్ని తన ఎం.ఫిల్. పరిశోధనాంశంగా స్వీకరించి ఈ తొలి వికట ప్రబంధం పైన సమగ్ర పరిశీలన చేసి ఈ ప్రబంధంలోని ప్రౌఢమైన పదాల గుంభనాన్ని, సరస హాస్యాలను బయల్పరిచాడు. 'తెలుగు సాహిత్యంలో పేరడీ' అనే అంశంపై శోధించి డాక్టరేటు పొందాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.