లాచర్ సీ
జర్మనీ లోని అగ్నిపర్వత సరస్సు From Wikipedia, the free encyclopedia
జర్మనీ లోని అగ్నిపర్వత సరస్సు From Wikipedia, the free encyclopedia
లాచర్ సీ 2 కి.మీ. వ్యాసం కలిగిన అగ్నిపర్వత కాల్డెరా సరస్సు. దీన్ని లేక్ లాచ్ లేదా లాచ్ లేక్ అని కూడా అంటారు. జర్మనీ లోని రైన్‌ల్యాండ్-పాలటినేట్‌లో కోబ్లెంజ్కి వాయవ్యంగా సుమారు 24 కి.మీ., బాన్‌కు దక్షిణాన 37 కి.మీ. ఆండర్నాచ్కు పశ్చిమాన 8 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఈఫిల్ పర్వత శ్రేణిలో ఉంది. ఇది తూర్పు ఈఫిల్ అగ్నిపర్వత క్షేత్రంలో భాగం. సుమారు 13,000 సంవత్సరాలకు ముందు ప్లీనియన్ విస్ఫోటనం జరిగినపుడు ఈ సరస్సు ఏర్పడింది. 1991 నాటి పినాటుబో విస్ఫోటనం మాదిరిగానే ఈ అగ్నిపర్వత పేలుడు సూచిక (VEI) కూడా 6 గా ఉంది.[1][2][3] అగ్నిపర్వత ఉత్సర్గాలు సరస్సుకు ఆగ్నేయ ఒడ్డున మోఫెట్టాస్గా ఏర్పడడం నిద్రాణంగా ఉన్న అగ్నిపర్వతానికి సంకేతం.
లాచర్ సీ | |
---|---|
ప్రదేశం | ఆహ్ర్వీలర్, రైన్లాండ్-పలాటినేట్ |
అక్షాంశ,రేఖాంశాలు | 50°24′45″N 07°16′12″E |
రకం | అగ్నిపర్వత కాల్డెరా సరస్సు |
సరస్సులోకి ప్రవాహం | లేదు |
వెలుపలికి ప్రవాహం | ఫుల్బర్ట్-స్టోల్లెన్ (కాలువ`) |
ప్రవహించే దేశాలు | జర్మనీ |
గరిష్ట పొడవు | 1.964 కి.మీ. (1.220 మై.) |
గరిష్ట వెడల్పు | 1.186 కి.మీ. (0.737 మై.) |
ఉపరితల వైశాల్యం | 3.31 కి.మీ2 (1.28 చ. మై.) |
సరాసరి లోతు | 31 మీ. (102 అ.) |
గరిష్ట లోతు | 51 మీ. (167 అ.) |
1.03 కి.మీ3 (0.25 cu mi) | |
తీరంపొడవు1 | 7.3 కి.మీ. (4.5 మై.) |
ఉపరితల ఎత్తు | 275 మీ. (902 అ.) |
ద్వీపములు | None |
1 Shore length is not a well-defined measure. |
సరస్సు అండాకారంలో, చుట్టూ ఎత్తైన గట్టుతో ఉంటుంది. రోమన్ కాలం నుండి ధాన్యాన్ని దంచుకోడానికి అవసరమైన రోళ్ళను ఇక్కడి లావాతో తయారుచేసుకునేవారు. ఇనుప రోలర్లు రంగం లోకి వచ్చాక ఈ రోళ్ళ వాడడం తగ్గింది.[4]
ఈ సరస్సుకు సహజసిద్ధమైన అవుట్లెట్ లేదు. కానీ సా.శ 1170 కి ముందు తవ్విన సొరంగం ద్వారా నీరు బయటికి పోతుంది. ఈ సొరంగాన్ని అనేకసార్లు పునర్నిర్మించారు. 1152-1177 మధ్య ఇక్కడి మఠాధిపతిగా ఉన్న ఫుల్బర్ట్ పేరును దీనికి పెట్టారు. అతనే దీనిని నిర్మించాడని భావిస్తారు.
లక్షల సంవత్సరాల క్రితమే జర్మనీలో అగ్నిపర్వత విస్ఫోటనాలు జరిగేవి. ఇది, ఆఫ్రికన్, యురేషియన్ ఫలకాల మధ్య ఘర్షణ కారణంగా ఏర్పడిన యూరోపియన్ సెనోజోయిక్ రిఫ్ట్ సిస్టమ్ కు సంబంధించినది.
దాదాపు సా.పూ 11,000 లో వసంత ఋతువు చివరిలో గానీ, వేసవి ప్రారంభంలో గానీ జరిగిన లాచర్ సీ ప్రారంభ పేలుళ్లు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెట్లను నేలమట్టం చేశాయి. శిలాద్రవం అగ్నిపర్వతం లోపలి నుండి ఉపరితలం వరకు ఒక మార్గాన్ని తెరిచింది. అది దాదాపు పది గంటలపాటు విస్ఫోటనం చెందింది. ప్లూమ్ బహుశా 35 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుని ఉంటుంది. విస్ఫోటనాలు అనేక వారాలు లేదా నెలలపాటు కొనసాగి, పైరోక్లాస్టిక్ ప్రవాహాలు ఉత్పత్తై, పది కిలోమీటర్ల దూరంలోని లోయలలోకి ప్రవహించాయి. బిలం దగ్గర, నిక్షేపాలు యాభై మీటర్ల మందాన పేరుకున్నాయి. ఐదు కిలోమీటర్ల దూరాన కూడా అవి పది మీటర్ల మందానికి చేరుకున్నాయి. ఈశాన్యంలో అరవై కిలోమీటర్ల దూరం, ఆగ్నేయంలో నలభై కిలోమీటర్ల దూరం వరకు మొత్తం మొక్కలూ, జంతువులూ అన్నీ తుడిచిపెట్టుకుపోయి ఉండాలి.[5] 6 ఘన కిలోమీటర్ల[గమనిక 1] శిలాద్రవం విస్ఫోటనం చెంది ఉంటుందని అంచనా.[6] సుమారు 16 ఘన కిలోమీటర్ల టెఫ్రా వెలువడి ఉంటుంది.[7] ఈ 'భారీ' ప్లినియన్ విస్ఫోటనపు అగ్నిపర్వత పేలుడు సూచిక (VEI) 6 గా ఉంది.
విస్ఫోటనంలో వెలువడ్డ టెఫ్రా నిక్షేపాలు రైన్ నదికి అడ్డుపడి ఒక ఆనకట్టగా ఏర్పడ్డాయి. దాంతో 140 చ.కి.మీ వైశాల్యమున్న సరస్సు ఏర్పడింది. ఆనకట్ట తెగిపోయినప్పుడు, వరద ప్రవాహం దిగువకు, బాన్ వరకు వరద నిక్షేపాలు చేరుకున్నాయి.[6] మధ్య ఫ్రాన్స్ నుండి ఉత్తర ఇటలీ వరకు, దక్షిణ స్వీడన్ నుండి పోలాండ్ వరకు విస్తరించి ఉన్న 3,00,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో దీని ప్రభావాన్ని గమనించారు. ఇది, ఈ ప్రాంతం అంతటా పురావస్తు, పాలియో పర్యావరణపు పొరల కాలక్రమానుసార సహసంబంధాలను గుర్తించడానికి ఒక అమూల్యమైన సాధనంగా మారింది.[8]
విస్ఫోటనం ప్రభావాలు పరిమితం గానే ఉన్నాయి. అనేక సంవత్సరాల పాటు చల్లని వేసవికాలాలు ఏర్పడ్డాయి. జర్మనీలో రెండు దశాబ్దాల వరకు పర్యావరణ అంతరాయం ఏర్పడింది. అయితే, ఫెడెర్మెసర్ సంస్కృతిగా పిలువబడే స్థానిక జనాభా జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. విస్ఫోటనానికి ముందు, వారు ఈటెలు, ధనుర్బాణాలు రెండింటినీ ఉపయోగించి ఆహారాన్ని సేకరించడం, వేటాడటం ద్వారా జీవించేవారు. సంఖ్యలో చాలా తక్కువగా ఉండేవారు. పురావస్తు శాస్త్రవేత్త ఫెలిక్స్ రైడ్ ప్రకారం, విస్ఫోటనం తర్వాత ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతమైన తురింగియన్ బేసిన్లో జనాభా చాలా వరకు నశించినట్లు కనిపిస్తోంది. అయితే నైరుతి జర్మనీ, ఫ్రాన్స్‌లలో జనాభా పెరిగింది. రెండు కొత్త సంస్కృతులు, దక్షిణ స్కాండినేవియాలో బ్రోమ్, ఈశాన్య ఐరోపాలో పెర్స్టూనియన్ సంస్కృతులు ఉద్భవించాయి. ఈ సంస్కృతుల ప్రజల పనిముట్ల తయారీ నైపుణ్యాలు, ఫెడెర్మెస్సర్ ప్రజల కంటే తక్కువ స్థాయిలో ఉన్నాయి - మరీ ముఖ్యంగా విల్లు, బాణం సాంకేతికతను కోల్పోయిన బ్రోమ్ సంస్కృతి. రైడ్ దృష్టిలో ఈ క్షీణతకు కారణం - లాచర్ సీ అగ్నిపర్వతం వల్ల ఏర్పడిన అంతరాయమే.[9]
ఈ లాచర్ సీ విస్ఫోటనమే ప్రపంచవ్యాప్త శీతలీకరణ కాలమైన యంగర్ డ్రైయాస్ కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు.[10][11] 2021లో ప్రచురించిన కొత్త రేడియోకార్బన్ తేదీ ప్రకారం, విస్ఫోటనం జరిగిన 130 సంవత్సరాల తర్వాత యంగర్ డ్రైయాస్ ప్రారంభమైందని తేలింది.[12] అయితే డెడ్ మాగ్మాటిక్ కార్బన్ కారణంగా ఈ కొత్త తేదీ అసలు తేదీ కంటే పాతదిగా చూపించే అవకాశం ఉందని దీనిపై సవాళ్ళు వచ్చాయి.[13] ప్రస్తుతం లాచర్ సీ విస్ఫోటన కాలంపై ఉన్న అత్యుత్తమ అంచనాలు 12,880 ± 40 సంవత్సరాల క్రితం.[14] లేదా 13,006 ± 9[12] రేడియోకార్బన్ తేదీ మాగ్మాటిక్ కార్బన్ డయాక్సైడ్ ద్వారా ప్రభావితమైందా అనే దానిపై ఈ తేదీలు ఆధారపడి ఉంటాయి. తేదీని మాగ్మాటిక్ కార్బన్ డయాక్సైడ్ ప్రభావితం చేసినట్లయితే, లాచర్ సీ విస్ఫోటనం యంగర్ డ్రైయాస్ ఈవెంట్ ప్రారంభానికి ముందు సంభవించి, దానికి ట్రిగ్గర్‌గా పని చేసి ఉండవచ్చు. ఈ తేదీ ప్రస్తుతానికి 13,006 క్రమాంకనం చేసిన సంవత్సరాల ముందు సరైనది అయితే, లాచర్ సీ విస్ఫోటనం ఇప్పటికీ 130 సంవత్సరాలకు ముందు జరిగిన అగ్నిపర్వత సంఘటనల పెద్ద సమూహంలో భాగంగా వాతావరణాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చు.[15]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.