Remove ads
From Wikipedia, the free encyclopedia
రాష్ట్రకూటులు సా.శ. 6 -10 వ శతాబ్దాల మధ్య భారత ఉపఖండంలోని పెద్ద భాగాలను పాలించిన రాజవంశం. పురాతన రాష్ట్రకూట శాసనమైన 7 వ శతాబ్దపు రాగి పలక, మధ్య లేదా పశ్చిమ భారతదేశంలోని మనపురా అనే నగరం నుండి వారు చేసిన పాలనను వివరిస్తుంది. అదే సమయంలో అచలాపూర్, కన్నౌజ్ వంటి ఇతర ప్రాంతాలను పాలించిన రాజులు కూడా రాష్ట్రకూటులే. ఈ తొలి రాష్ట్రకూటుల మూలం గురించి, వారి మాతృభూమి, భాషల గురించీ అనేక వివాదాలు ఉన్నాయి.
మాన్యఖేట రాష్ట్రకూటులు | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
753–982 | |||||||||
Extent of Rashtrakuta Empire, 800 CE, 915 CE | |||||||||
స్థాయి | Empire | ||||||||
రాజధాని | మాన్యఖేట | ||||||||
సామాన్య భాషలు | కన్నడ సంస్కృతం | ||||||||
మతం | Hinduism Jainism Buddhism[1] | ||||||||
ప్రభుత్వం | Monarchy | ||||||||
Maharaja | |||||||||
• 735–756 | Dantidurga | ||||||||
• 973–982 | Indra IV | ||||||||
చరిత్ర | |||||||||
• Earliest Rashtrakuta records | 753 | ||||||||
• స్థాపన | 753 | ||||||||
• పతనం | 982 | ||||||||
| |||||||||
Today part of | India |
ఎలిచ్‌పూర్ తెగ బాదామి చాళుక్యులకు పాలెగాళ్ళుగా ఉండేవారు. దంతిదుర్గుడు చాళుక్య రెండవ కీర్తివర్మను అధికారం నుండి కూలదోసి, ఆధునిక కర్ణాటక లోని గుల్బర్గా ప్రాంతం కేంద్రంగా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు.సా.శ. 753 లో దక్షిణ భారతదేశంలో అధికారంలోకి వచ్చిన ఈ వంశం మాన్యఖేటకు చెందిన రాష్ట్రకూటులుగా పేరుబడింది. అదే సమయంలో బెంగాల్ యొక్క పాల వంశం, మాళ్వాకు చెందిన ప్రతీహార రాజవంశాలు తూర్పు, వాయవ్య భారతదేశంలో బలపడుతున్నాయి. అరబిక్ గ్రంథం, సిల్సిలాత్ అల్-తవారిఖ్ (851), రాష్ట్రకూటులను ప్రపంచంలోని నాలుగు ప్రధాన సామ్రాజ్యాలలో ఒకటిగా పేర్కొంది.[2]
ఈ కాలం, 8 వ 10 వ శతాబ్దాల మధ్య, సంపద్వంతమైన గంగా మైదానాల వనరుల కోసం త్రిముఖ పోరాటం జరిగింది. ఈ మూడు సామ్రాజ్యాలూ కొద్ది కొద్ది కాలాల పాటు కన్నౌజ్ వద్ద అధికార స్థానాన్ని స్వాధీనం చేసుకున్నాయి. మాన్యఖేటకు చెందిన రాష్ట్రకూటులు ఉచ్ఛస్థితిలో ఉన్న కాలంలో, ఉత్తరాన గంగా యమునల దోయబ్ నుండి దక్షిణాన కన్యాకుమారి వరకూ ఉన్న విస్తారమైన సామ్రాజ్యాన్ని పరిపాలించారు. రాజకీయ విస్తరణ, నిర్మాణ విజయాలు, ప్రసిద్ధ సాహిత్య రచనల ఫలవంతమైన కాలం అది. ఈ రాజవంశం లోని తొలి రాజులు హిందూ మతాన్ని, తరువాత రాజులు జైనమతాన్నీ అవలంబించారు.
వారి పాలనలో, జైన గణిత శాస్త్రవేత్తలు, పండితులు కన్నడ, సంస్కృతాల్లో ముఖ్యమైన రచనలు చేశారు. ఈ రాజవంశం లోని అత్యంత ప్రసిద్ధ రాజు మొదటి అమోఘవర్షుడు, కన్నడ భాషలో ఒక మైలురాయి సాహిత్య రచన అయిన కవిరాజమార్గ రాశాడు. ద్రావిడ శైలి వాస్తుశైలి ఉచ్ఛస్థితిని చేరుకుంది. దీనికి ఉత్తమ ఉదాహరణ ఆధునిక మహారాష్ట్రలోని ఎల్లోరాలోని కైలాసనాథ్ ఆలయంలో కనిపిస్తుంది. ఇతర ముఖ్యమైన నిర్మాణాలు కాశీవిశ్వనాథ ఆలయం, ఆధునిక కర్ణాటకలోని పట్టడకల్ వద్ద ఉన్న జైన నారాయణ ఆలయం, రెండూ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు .
రాష్ట్రకూట రాజవంశం యొక్క మూలం భారత చరిత్రలో ఒక వివాదాస్పద అంశం. క్రీస్తుపూర్వం 2 వ శతాబ్దంలో అశోక చక్రవర్తి కాలం నాటి [3] రాష్ట్రకూటుల పూర్వీకుల మూలం పట్ల, [3] 6 - 7 వ శతాబ్దాల్లో ఉత్తర, మధ్య భారతదేశంలోని, దక్కన్ లోని చిన్నచిన్న రాజ్యాలను పరిపాలించిన అనేక రాష్ట్రకూట రాజవంశాల మధ్య సంబంధాల పట్లా ఈ వివాదాలు ఉన్నాయి. ఈ మధ్యయుగ రాష్ట్రకూటులకు, 8 -10 వ శతాబ్దాల మధ్య పాలించిన మాన్యఖేటకు చెందిన రాష్ట్రకూటులకు (కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలోని ప్రస్తుత మల్ఖేడ్) సంబంధం కూడా చర్చనీయాంశమైంది.[4][5][6]
రాష్ట్రకూట చరిత్రకు మూలాలు మధ్యయుగ శాసనాలు, పాళీ భాషలోని ప్రాచీన సాహిత్యం, [7] సంస్కృత, కన్నడ భాషలలోని సమకాలీన సాహిత్యం, అరబ్ యాత్రికుల రచనలు.[8] రాజవంశపు పారంపర్యం (సూర్య వంశం/చంద్రవంశం), స్థానిక ప్రాంతం, పూర్వీకుల స్థానం వగైరాల గురించి వివిధ సిద్ధాంతాలున్నాయి. శాసనాలు, రాజ చిహ్నాలు, "రాష్ట్రిక" వంటి పురాతన వంశం పేర్లు, (రట్ట, రాష్ట్రకూట, లట్టాలూర పురవరాధీశ్వర వగైరాలు) యువరాజులు, యువరాణుల పేర్లు, నాణేలు వంటి అవశేషాల ఆధారంగా ఈ సిద్ధాంతాలను కాయించారు.[6][9] తొలి రాష్ట్రకూటులు ఏ జాతికి / భాషా సమూహానికి చెంది ఉండవచ్చనే విషయమై పండితులలో చర్చ ఉంది. వాయవ్య భారతదేశంలోని జాతి సమూహాలు, [10] కన్నడిగ, [11][12][13] రెడ్డి, [14] మరాఠా, [15][16] పంజాబ్ ప్రాంతానికి చెందిన తెగలు - సంభవనీయమైన జాతులు.[17]
అయితే 8 నుండి 10 వ శతాబ్దంలో ఈ రాజవంశానికి చెందిన పాలకులు కన్నడ భాషకు సంస్కృతానికి ఇచ్చినంత ప్రాముఖ్యతనిచ్చారనే విషయమై పండితుల్లో ఏకాభిప్రాయం ఉంది. రాష్ట్రకూట శాసనాల్లో కన్నడ సంస్కృతం రెండింటినీ ఉపయోగిస్తారు (చరిత్రకారులు షెల్డన్ పొల్లాక్, జాన్ హౌబెన్ వంటి వారు ఎక్కువగా కన్నడలో ఉన్నాయని పేర్కొన్నారు), [18][19][20][21][22] పాలకులు రెండు భాషలలోని సాహిత్యాన్నీ ప్రోత్సహించారు. తొట్టతొలి కన్నడ రచనలు రాష్ట్రకూటుల ఆస్థానం లోని కవులు రచించినవే.[23][24][25][26] ఈ రాష్ట్రకూటులు కన్నడిగులు అయినప్పటికీ, [6][27][28][29][30] వారొక ఉత్తర దక్కన్ భాషలో కూడా మాట్లాడగలిగేవారు.[31]
రాష్ట్రకూట సామ్రాజ్యంలో ఆధునిక కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు పూర్తిగాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లోని కొంత భాగమూ ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని రాష్ట్రకూటులు రెండు శతాబ్దాల పాటు పాలించారు. సామన్‌గఢ్ రాగి పలక శాసనం (753) ప్రకారం, దంతిదుర్గుడనే పాళెగాడు బహుశా బేరార్ లోని అచలాపుర (మహారాష్ట్రలో ఆధునిక ఎలిచ్‌పూర్) నుండి పాలించేవాడు. 753 లో అతడు రెండవ కీర్తివర్మకు చెందిన గొప్ప కర్ణాటక సైన్యాన్ని (బాదామి చాళుక్యుల సైన్యాన్ని సూచిస్తూ) బాదామిలో ఓడించి, చాళుక్య సామ్రాజ్యపు ఉత్తర ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు.[32][33][34] ఆ తరువాత అతను తన మామ, పల్లవ రాజు నందివర్మన్ చాళుక్యుల నుండి కంచిని తిరిగి పొందటానికి సహాయం చేశాడు. మాళ్వాలోని గుర్జర్లను, కళింగ, కోసల, శ్రీశైలం పాలకులను ఓడించాడు.[35][36] ఇతనిని దంతివర్మ అని కూడా అంటారు. అద్వితీయ బలపరాక్రమ సంపన్నుడు. అతడికి ఖడ్గావలోక, వైరమేఘ అనే బిరుదులున్నాయి.
దంతిదుర్గుని వారసుడు కృష్ణ I నేటి కర్ణాటక, కొంకణాల ప్రధాన భాగాలను తన ఆధీనంలోకి తెచ్చాడు.[37][38] 780 లో నియంత్రణలోకి తీసుకున్న ధ్రువధరవర్ష పాలనలో, రాజ్యం కావేరి నదికి, మధ్య భారతదేశం మధ్య ఉన్న భూభాగాలన్నింటినీ కలుపుకొని ఒక సామ్రాజ్యంగా విస్తరించింది.[39][40][41] అతను కనౌజ్ పైకి దాడి చేసి, అక్కడి గుర్జర ప్రతీహారులను, బెంగాలు లోని పాల రాజులనూ ఓడించాడు. ఈ దండయాత్రలో అతడికి కీర్తి, సంపదలు అపారంగా లభించాయిగానీ కొత్తగా భూభాగం పొందలేదు.తూర్పు చాళుక్యులు, తాలకాడ్ లోని గాంగులను కూడా తన అధీనం లోకి తెచ్చుకున్నాడు.[42] ఆల్టేకర్, సేన్ ల ప్రకారం, అతడి పాలనలో రాష్ట్రకూటులు యావద్భారత వ్యాప్త శక్తిగా మారారు.[43]
ధ్రువ ధరవర్ష మూడవ కుమారుడు మూడవ గోవిందుడు సింహాసనం అధిరోహించడం మునుపెన్నడూ లేని విజయవంతమైన శకానికి తెరదీసింది.[44] ఈ సమయంలో రాష్ట్రకూటుల ప్రారంభ రాజధాని ఉన్న ప్రదేశం గురించి అనిశ్చితి ఉంది.[45][46][47] అతని పాలనలో గంగా మైదానాలపై నియంత్రణ కోసం రాష్ట్రకూటులు, పాలాలు ప్రతిహారుల మధ్య త్రివిధ వివాదాలు రేగాయి. ప్రతిహార చక్రవర్తి నాగభట్ట II పైన, పాలా చక్రవర్తి ధర్మపాలుడి పైనా, [37] మూడవ గోవిందుడు సాధించిన విజయాలను వివరిస్తూ, అతడి గుర్రాలు హిమాలయాల్లోని చల్లటి నీళ్ళను తాగాయని, అతని యుద్ధంలో ఏనుగులు పవిత్ర గంగా జలాలను తాగాయనీ సంజన్ శాసనం చెప్పింది.[48][49] అతని సైనిక దండయాత్రలను అలెగ్జాండర్ తోటి, మహాభారతంలోని అర్జునుడి తోటీ పోల్చారు.[50] కనౌజ్‌ను స్వాధీనం చేసుకున్నాక అతడు దక్షిణంగా కదిలాడు. గుజరాత్, కోసల (కౌశల్ ), గంగావాడి లను స్వాధీన పరచుకున్నాడు. కంచిలో పల్లవులను ఓడించాడు. వేంగిలో తనకు అనుకూలుడిని నియమించాడు. సిలోన్ రాజు లొంగిప్యి దానికి గుర్తుగా రెండు విగ్రహాలను అతడికి సమర్పించుకున్నారు ( రాజు విగ్రహం, అతని మంత్రి విగ్రహం). చోళులు, పాండ్యులు, కొంగు చేరరాజులు, అందరూ ఆయనకు లొంగి కప్పం సమర్పించుకున్నారు.[51][52][53][54] ఒక చరిత్రకారుడు చెప్పినట్లుగా, హిమాలయ గుహల నుండి మలబార్ తీరం ఒడ్డు వరకు దక్కన్ దుందుభులు మోగాయి. రాష్ట్రకూట సామ్రాజ్యం ఇప్పుడు కేప్ కొమొరిన్ నుండి కన్నౌజ్ వరకూ బనారస్ నుండి భరూచ్ వరకు విస్తరించింది .[55][56]
మూడవ గోవిందుడి వారసుడు, మొదటి అమోఘవర్షుడు మాన్యఖేటను తన రాజధానిగా చేసుకుని పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. సామ్రాజ్య పతనం వరకూ మాన్యఖేటయే రాష్ట్రకూటుల రాజధానిగా ఉంది.[57][58][59] అతను 814 లో సింహాసనానికి వచ్చాడు, కాని 821 వరకు అతను భూస్వాములు, మంత్రుల తిరుగుబాట్లను అణచానికే సరిపోయింది. అమోఘవర్ష I తన ఇద్దరు కుమార్తెలను పశ్చిమ గాంగులకు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసి వారితో శాంతి నెలకొల్పుకున్నాడు. ఆపై వింగవల్లి వద్ద ఆక్రమించిన తూర్పు చాళుక్యులను ఓడించి, వీరనారాయణ అనే బిరుదును పొందాడు .[60][61] అతని పాలన గోవింద III పాలన వలె ఉగ్రమైనది కాదు, అతను తన పొరుగువారితో, గంగా, తూర్పు చాళుక్యులు, పల్లవులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడానికి ఇష్టపడ్డాడు, వీరితో అతను వైవాహిక సంబంధాలను కూడా పెంచుకున్నాడు. అతని యుగం కళలు, సాహిత్యం, మతాల విషయంలో సుసంపన్నమైనది. రాష్ట్రకూట చక్రవర్తులలో అత్యంత ప్రసిద్ధుడిగా విస్తృతంగా కనిపించే మొదటి అమోఘవర్షుడు కన్నడ, సంస్కృతంలో నిష్ణాతుడైన పండితుడు.[62][63] అతడు రాసిన కవిరాజమార్గ ను కన్నడ సాహిత్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణిస్తారు. సంస్కృతంలో రాసిన ప్రశ్నోత్తర రత్నమాలిక ఉత్కృష్టమైన రచన. దీన్ని తరువాత టిబెటన్ భాషలోకి అనువదించారు.[64] అతని మత దృష్టి, కళలు సాహిత్యం పట్ల ఉన్న ఆసక్తి, శాంతి-ప్రేమ స్వభావం కారణంగా, అతన్ని అశోక చక్రవర్తితో పోల్చి, "దక్షిణాది అశోక" అని పిలుస్తారు.[65]
రెండవ కృష్ణుడి పాలనలో, సామ్రాజ్యం తూర్పు చాళుక్యుల నుండి తిరుగుబాటును ఎదుర్కొంది. రాజ్యపు విస్తీర్ణం తగ్గి, పశ్చిమ దక్కన్, గుజరాత్‌ల వరకు పరిమితమైంది.[66] రెండవ కృష్ణుడు గుజరాత్ శాఖకు ఉన్న స్వతంత్ర హోదాను ముగించి, మాన్యఖేట ప్రత్యక్ష నియంత్రణలోకి తీసుకువచ్చాడు. మూడవ ఇంద్రుడు, పరమారను ఓడించి మధ్య భారతదేశంలో రాష్ట్రకూటుల ప్రాబల్యాన్ని తిరిగి స్థాపించాడు. తరువాత గంగా యమునల దోయబ్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. వేంగిపై తమకున్న ప్రాబల్యాన్ని కొనసాగిస్తూ, తమకు సాంప్రదాయికంగా శత్రువులైన ప్రతీహారులను, పాలాలను ఓడించాడు.[67][68] కన్నౌజ్‌లో ఆయన సాధించిన విజయాల ప్రభావం, నాల్గవ గోవింద చక్రవర్తి 930 లో వేయించిన రాగి పలక శాసనం ప్రకారం చాలాకాలం పాటు కొనసాగింది.[69][70] వరసగా పాలనకు వచ్చిన బలహీనమైన రాజుల కారణంగా, సామ్రాజ్యం ఉత్తర తూర్పు భూభాగాలపై నియంత్రణ కోల్పోయింది. ఆ తరువాత వచ్చిన చిట్టచివరి గొప్ప రాష్ట్రకూట పాలకుడు మూడవ కృష్ణుడు సామ్రాజ్యాన్ని తిరిగి ఏకీకృతం చేశాడు. దాంతో ఇది నర్మదా నది నుండి కావేరి నది వరకు విస్తరించింది. ఉత్తర తమిళ దేశం (తోండైమండలం) కూడా సామ్రాజ్యంలో భాగమైంది. సిలోన్ రాజు కూడా కప్పం కట్టేవాడు.[71][72][73][74][75]
సా.శ. 972 లో, [76] ఖొట్టిగ అమోఘవర్ష పాలనలో, పరమార రాజు సియాకా హర్షుడు సామ్రాజ్యంపై దాడి చేసి రాష్ట్రకూటుల రాజధాని మాన్యఖేటను దోచుకున్నాడు. ఇది రాష్ట్రకూట సామ్రాజ్యం యొక్క ఖ్యాతిని తీవ్రంగా దెబ్బతీసింది. తత్ఫలితంగా దాని పతనానికి దారితీసింది. ఆధునిక బీజాపూర్ జిల్లాలోని తార్దావాడి ప్రాంతాన్ని పాలించే రాష్ట్రకూటుల పాళెగాడు రెండవ తైలపుడు ఈ ఓటమిని అవకాశంగా తీసుకొని స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. దాంతో రాష్ట్రకూటుల అంతిమ పతనం చాలా వేగంగా జరిగింది.[77][78] చివరి చక్రవర్తి నాల్గవ ఇంద్రుడు శ్రావణబెళగొళ వద్ద సల్లేఖన (జైన సన్యాసులు, ఉపవాసం చేసి పొందే మరణం) కు పాల్పడ్డాడు. రాష్ట్రకూటుల పతనంతో, దక్కన్, ఉత్తర భారతదేశాల్లోని వారి పాళెగాళ్ళు, సంబంధిత వంశాలు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి. పశ్చిమ చాళుక్యులు మాన్యఖేటను స్వాధీనం చేసుకున్నారు. 1015 వరకు దీనిని తమ రాజధానిగా చేసుకున్నారు. 11 వ శతాబ్దంలో రాష్ట్రకూటుల ప్రధాన భూభాగంలో గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఆధిపత్యం యొక్క దృష్టి కృష్ణ - గోదావరి దోయబ్ లోని వేంగికి మారింది. పశ్చిమ దక్కన్లోని రాష్ట్రకూటుల పూర్వపు పాళెగాళ్ళు చాళుక్యుల నియంత్రణలోకి వచ్చారు. ఇప్పటివరకు అణచివేయబడిన తంజావూరు చోళులు దక్షిణాన వారి ప్రబల శత్రువులుగా మారారు.[79]
ముగింపులో, మాన్యఖేటకు చెందిన రాష్ట్రకూటుల పెరుగుదల భారతదేశంపై, భారతదేశం యొక్క ఉత్తరాన కూడా గొప్ప ప్రభావాన్ని చూపింది. సమకాలీన భారతదేశంలో వారి సామ్రాజ్యం అతిపెద్దదని సులైమాన్ (851), అల్ మసూడి (944), ఇబ్న్ ఖుర్దాద్బా (912) రాశారు. ప్రపంచంలోని నాలుగు గొప్ప సమకాలీన సామ్రాజ్యాలలో ఇది ఒకటని సులైమాన్ పేర్కొన్నాడు.[80][81][82] 10 వ శతాబ్దానికి చెందిన అరబ్బులు అల్ మసూది, ఇబ్న్ ఖోర్దిద్‌బిహ్ యొక్క యాత్రా కథనాల ప్రకారం, "హిందుస్తాన్ రాజులలో చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు రాష్ట్రకూట రాజు వైపు ముఖాలు తిప్పుతారు. అతని రాయబారులకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. రాష్ట్రకూట రాజును "రాజాధిరాజు" అని పిలుస్తారు. వీరు సైన్యం బహు గొప్పది. వారి సామ్రాజ్యం కొంకణ్ నుండి సింధ్ వరకు విస్తరించింది. " కొంతమంది చరిత్రకారులు ఈ సమయాన్ని "ఇంపీరియల్ కన్నౌజ్ యుగం" అని పిలుస్తారు. రాష్ట్రకూటులు కన్నౌజ్‌ను విజయవంతంగా స్వాధీనం చేసుకుని, దాని పాలకులపై కప్పం విధించి, తమను తాము ఉత్తర భారతదేశపు ప్రభులుగాగా చూపించారు కాబట్టి, ఈ యుగాన్ని "ఇంపీరియల్ కర్ణాటక యుగం" అని కూడా పిలుస్తారు. 8 వ నుండి 10 వ శతాబ్దాలలో మధ్య, ఉత్తర భారతదేశంలో వారి రాజకీయ విస్తరణ సమయంలో, రాష్ట్రకూటులులు లేదా వారి బంధువులు అనేక రాజ్యాలను సృష్టించారు. ఇవి మాతృ సామ్రాజ్యం కింద పాలించాయి లేదా పతనం తరువాత శతాబ్దాల పాటు పాలన కొనసాగించాయి లేదా చాలా కాలం తరువాత అధికారంలోకి వచ్చాయి. వీరిలో ప్రముఖులు - గుజరాత్ లోని రాష్ట్రకూటులు (757–888), [83] ఆధునిక కర్ణాటకలోని సౌందట్టికి చెందిన రట్టాలు (875–1230), [84] కన్నౌజ్ కు చెందిన గహదవాలాలు (1068–1223), [85] హస్తికుండి లేదా హత్తుండి నుండి పాలించిన రాజస్థాన్కు చెందిన రాష్ట్రకూటులు (రాజపుతానా అని పిలుస్తారు) (893-996) [86] దహల్ (జబల్పూర్ వద్ద ), [87] మండోర్ కు చెందిన రాథోడ్‌లు (జోధ్పూర్ దగ్గర), ధనోప్ కు చెందిన రాథోడ్‌లు, [88] ఆధునిక మహారాష్ట్రలోని మయూరగిరికి చెందిన రాష్ట్రకూటులు, [89] కన్నౌజ్ కు చెందిన రాష్ట్రకూటులు.[90] సా.శ. 11 వ శతాబ్దం ప్రారంభంలో రాజధిరాజ చోళుడు సిలోన్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం అక్కడ నలుగురు రాజుల పతనానికి దారితీసింది. చరిత్రకారుడు కె. పిళ్ళే ప్రకారం, జాఫ్నా రాజ్యానికి చెందిన రాజు మాదవరాజా, రాష్ట్రకూట రాజవంశం నుండి అధికారాన్ని లాక్కున్నాడు.[91]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.