Remove ads
From Wikipedia, the free encyclopedia
రావిచెట్టు రంగారావు (డిసెంబర్ 10, 1877 - జూలై 3, 1910) తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన ప్రముఖుడు.
రావిచెట్టు రంగారావు | |
---|---|
జననం | డిసెంబర్ 10, 1877 దండంపల్లి, నల్లగొండ జిల్లా |
మరణం | జూలై 3, 1910 |
ప్రసిద్ధి | తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన ప్రముఖుడు |
భార్య / భర్త | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ |
పిల్లలు | Ravichettu Narsimha Rao |
తండ్రి | నరసింహారావు |
తల్లి | వేంకమాంబ |
రంగారావు 1877, డిసెంబర్ 10 న నరసింహారావు, వేంకమాంబ దంపతులకు నల్లగొండ జిల్లా, దండంపల్లి గ్రామంలో జన్మించారు.[1] తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించారు. వీరి వివాహం 13వ యేట లక్ష్మీ నరసమ్మతో జరిగింది.
యుక్తవయస్కుడైన తరువాత తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు మొత్తం రంగారావుకు వచ్చాయి. తండ్రినుంచి సంక్రమించిన ‘మున్సబుగిరి’ స్వీకరించి ‘మున్సబుదారు’ అయ్యారు. తెలుగుతోపాటు హిందీ, మరాఠీ, ఇంగ్లీషు, సంస్కృతం భాషలు నేర్చుకున్నారు. తెలుగంటే వారికి వల్లమాలిన అభిమానం. మత, సాంఘిక, రాజకీయాల్లోనూ వారికి సరైన అవగాహన ఉండేది. భర్తతో పాటు లక్ష్మీ నరసమ్మ కూడా విద్యా వికాసానికి కృషిచేసింది. సాంఘిక విద్యా కార్యక్రమాలతో భర్తతో పాటు పాల్గొనేవారు. స్త్రీ విద్యకై ఇద్దరూ పాటుపడ్డారు. ఆంధ్ర మహిళా సంఘాన్ని స్థాపించిన లక్ష్మీనరసమ్మగారే దాని మొదటి అధ్యక్షురాలుగా బాధ్యతల్ని చేపట్టారు.
రంగారావు, కొమర్రాజు లక్ష్మణరావుతో కలసి శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం, పిమ్మట విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి ని స్థాపించారు. సంస్కృత భాషపై ఎనేలేని గౌరవమున్నవారు. అందుకే ఆయన ఒక సంస్కృత గ్రంథాలయాన్ని స్థాపించి దాని అభివృద్ధికి ఎంతగానో తోడ్పడిన "శ్రీ శంకర భగవత్పూజ్యపాద గీర్వాణరత్న మంజూష" అన్న పేరుతో సంస్కృత గ్రంథాలయాన్ని ఈ గ్రంథాలయంలో కలిపేశారు. అందులో చతుర్వేదాలు, దశోపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, కావ్యాలు, నాటకాలు ఇత్యాది సంస్కృత ప్రబంధాలెన్నో కొనుగోలు చేసి సేకరించి పాఠకుల సౌకర్యార్థం ఉంచారు. ఇంతేకాకుండా ఈ గ్రంథాలయం తాలూకు రెండువేల రూపాయల విలువపై వచ్చే వడ్డీతో ప్రతియేట కొత్తగా వచ్చే సంస్కృత గ్రంథాలు కొనుగోలు చేసేవారు. ఈ గ్రంథాలయం మొదట రంగారావు ఇంట్లోనే స్థాపించబడింది. ప్రథమ కార్యదర్శిగా ఐదు సంవత్సరాలు పనిచేసి ఆ భాషా నిలయానికి స్థిరమైన పునాది వేశారు. హైదరాబాద్ లో శ్రీకృష్ణదేవరాయల పేరిట గ్రంథాలయం స్థాపించినట్టే, 1904 జనవరి 26న రాజా నాయిని వెంకటరంగారావు బహద్దూర్ సహకారంతో హనుమకొండ లో 'రాజరాజనరేంద్ర' గ్రంథాలయాన్ని 1904 లో స్థాపించారు. ఈ గ్రంథాలయంకోసం అనేక ముద్రణాల యాలకు, గ్రంథ విక్రయశాలలకు లేఖలువ్రాసి అనేక గ్రంథాలు ఉచితంగా, కొన్ని సగం ధరకు, మరికొన్ని పాతికశాతం ధరకు తెప్పించి ఇచ్చారు. హనుమకొండలో బ్రిటిష్ పోస్టాఫీసు లేనందున గ్రంథాలను, పత్రికలను తమ పేరున హైదరాబాద్‌కు తెప్పించి హనుమకొండకు పంపేవారు. అంతేకాకుండా భాషా నిలయానికి స్వంత గృహవసతి కల్పించడానికి కూడా రంగారావు చాలా కృషి చేశారు.
మునగాల రాజుతోనూ, కొమర్రాజు లక్ష్మణరావు గారితోనూ సహచర్యం గట్టిపడ్డాక రంగారావు మద్రాసుకు తరచూ వెళ్ళేవారు. అక్కడ 1905 లో విజ్ఞానచంద్రికా గ్రంథమండలిణి స్థాపించి పుస్తక ప్రచురణలు ప్రారంభించాలని నిర్ణయించారు. ముద్రణ మద్రాసులో లక్ష్మణరావు గారి పర్యవేక్షణలోనుండినా పుస్తకాలను చందాదారులకు చేర్చడం ఇతర వ్యాపార సంబంధమైన రవాణా కార్యక్రమాలను రంగారావు హైదరాబాద్ నుండి స్వయంగా చేపట్టారు. తాము సకుటుంబంగా మద్రాసుకు తరలి వెళ్లి ఆర్నెల్లపాటు అక్కడే నివసిస్తూ గ్రంతమండలిని ఒక దారిలో పెట్టారు. రావిచెట్టువారు స్వదేశీ ఉద్యమాన్ని బలపరిచారు. స్వదేశంలో తయారైన వస్తువుల ప్రచారానికి ఆయన దృఢ సంకల్పంతో పనిచేశారు.
1908 సంవత్సరంలో మూసీనదికి భయంకరమైన వరదలు వచ్చి హైదరాబాదు నగరాన్ని ముంచివేశాయి. ఎంతో ధన, ప్రాణనష్టం జరిగింది. అలాంటి ఆపదకాలంలో రంగారావు హైదరాబాద్ నగర ప్రజలకు సహాయపడి, నిరాశ్రయులైన వారికి, వసతి సౌకర్యాలు కల్పించారు. వీరు ఎంతోమంది పేద విద్యార్థులను తన ఇంట్లో వుంచుకొని ఉన్నత చదువులు చెప్పించారు. అలా వారి సహాయంతో పైకివచ్చినవారిలో ఆదిరాజు వీరభద్రరావు గారొకరు. రావిచెట్టు రంగారావు గారి జీవిత చరిత్రను ఆదిరాజు వీరభద్రరావు 1910 లో 'జీవిత చరితావళి' అనే గ్రంథంలో కథనం చేశారు. ఇది విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి పక్షాన 1911 లో ప్రచురితమైంది.
దేశానికి ఎంతో సేవ చేయవలసిన రంగారావు 1910, జూలై 3న తన 34వ యేట మరణించారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.