From Wikipedia, the free encyclopedia
ఉప్పులూరి రామశర్మ గౌతమబుద్ధ నాటకంలో బుద్ధుని వేషం ద్వారా పేరు తెచ్చుకుని సినిమాలలో ప్రవేశించారు. ఇతనిది కాకినాడ. సినిమాలలో నాయక, ఉపనాయక పాత్రలు ధరించారు. అందగాడైన రామశర్మ సంభాషణలు చెప్పటంలో సైతం మేటి. కృష్ణకుమారి తొలి చిత్రం 'నవ్వితే రత్నాలు' బిఎన్ కళాత్మక చిత్రం బంగారుపాప, సావిత్రితో మేనరికం, ప్రపంచం చిత్రాల్లోనూ నటించారు.[1]
ఉప్పలూరి వీర వెంకట ప్రభాకర రామశర్మ | |
---|---|
జననం | ఉప్పలూరి వీర వెంకట ప్రభాకర రామశర్మ పిఠాపురం, ఆంధ్రప్రదేశ్. |
ఇతర పేర్లు | రామశర్మ |
వృత్తి | నటుడు, రంగస్థల కళాకారుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1950 - 1964 |
గుర్తించదగిన సేవలు | గౌతమబుద్ధ నాటకం అదృష్టదీపుడు |
రామశర్మ పూర్తి పేరు "ఉప్పులూరి వీర వెంకట ప్రభాకర రామశర్మ". ఆ పేరు చాలా పెద్దదిగా ఉందని భావించి సినిమాలలోకి వచ్చిన తర్వాత రామ శర్మగా తన పేరు కుదించుకున్నారు. ఆయన స్వస్థలం పిఠాపురం. అక్కడే హైస్కూల్ వరకూ చదువుకున్నారు. తర్వాత కాకినాడలో గణిత శాస్త్రంలో బి.ఎ. చేశారు.
సినిమాటోగ్రఫీ నేర్చుకోవాలనే కోరికతో బొంబాయి వెళ్లి ఫజల్ బాయి ఇనిస్టిట్యూట్ లో చేరారు. అక్కడ ఉండగానే ఛాయాగ్రాహకుడు బోళ్ల సుబ్బారావుతో పరిచయం ఏర్పడింది. ఆయన సలహాపై మద్రాసు వెళ్లి సినిమాల్లో అవకాశం కోసం చాలా ప్రయత్నించారు కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. కొంతకాలం చూసి ఇక లాభం లేదనుకుని పిఠాపురం తిరిగివెళ్లి పోయారు రామశర్మ ఆయనలోని ఉత్సాహాన్ని గమనించి వాళ్ల ఊరివాడే అయిన పంతం చిన్నారావు రామశర్మ హీరోగా ఒక సినిమా తీద్దామని ప్రయత్నించారు కానీ అదీ కుదరలేదు.
ఇక అప్పుడు నాటకాలపై దృష్టిని కేంద్రీకరించారు రామశర్మ, ఆ రోజులలో కమ్యూనిస్ట్ ఉద్యమం చాలా ముమ్మరంగా ఉండేది. ఆ పార్టీ ಸಿద్దాంతాలతో తను ఏకీభవిస్తూ "సంస్కృతి " అనే నాటికను రాసి దానిని ప్రదర్శించారు. ఆనాటి ఆంధ్రనాటక కళాపరిషత్‌లో రామశర్మ ప్రదర్శించిన “గౌతము బుద్ధ" నాటకానికి ఎంతో ప్రజాదరణ లభించింది. ఆ నాటకాన్ని చూసిన దర్శకుడు కురుమద్దాలి రామచంద్రరావు "మంత్రదండం" సినిమా కోసం పిలిపించారు. అలాగే మీర్జాపూరు రాజావారు "తిలోత్తమ" చిత్రంలో హీరో పాత్రకోసం రామశర్మకు మేకప్ టెస్టు చేసారు. అయితే ఆ రెండు సినిమాలలోనూ వేషాలు ఆయనకు దక్కలేదు. ఆ చిత్రాలలో అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా నటించారు.
ఒకింత నిరాశకు గురయినా తనని తేను సముదాయించుకుని నాటకాల మీద దృష్టి కేంద్రీకరించారు రామశర్మ. అదే సమయంలో తమిళనాడు టాకీస్ అధినేత సౌందరరాజన్ అంతా కొత్త వారితో ఒక సినిమా తీసే ప్రయత్నాలలో ఉన్నారు. ఆ విషయం తెలిసి దాసు అనే ప్రొడక్షన్ మేనేజర్ రామశర్మను సౌందరరాజన్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన్ని చూడగానే మేకప్ టెస్ట్, కాస్యూమ్స్ టెస్ట్ ఏమీ చేయకుండానే ఏకంగా హీరో పాత్రకు ఎంపిక చేశారు. అందులోనూ ద్విపాత్రాభినయం. తొలి చిత్రంలోనే రెండు పాత్రలు చేసే అవకాశం అతి అరుదుగా లభిస్తుంది. అందుకే రామశర్మ అదృష్టవంతుడని అభినందించేవారంతా. అన్నట్లు ఆయన తొలి సినిమా పేరు "అదృష్టదీపుడు" కావడం గమనార్హం. ఈ చిత్రంలో అదృష్టదీపుడు, హరిదత్తుడు పాత్రలను రామశర్మ పోషించారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రముఖ నటులు గుమ్మడి వెంకటేశ్వరరావుకు కూడా ఇదే తొలి సినిమా. ఇందులో విక్రభద్రుడు పాత్రను పోషించారాయన.
రామశర్మ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి ఒక రకంగా నాగయ్య కారకులని చెప్పాలి. అదేలాగంటే.. తన గౌతమబుద్ధ నాటకాన్ని సినీ ప్రముఖుల సమక్షంలో ప్రదర్శించాలనే కోరిక రామశర్మకు ఉండేది. ఒక తెలిసిన వ్యక్తి ద్వారా ఆనాటి ప్రముఖ నటుడు నాగయ్యను కలిశారు. రామశర్మ కోరికను మన్నించి గౌతమబుద్ద నాటక ప్రదర్శనని మద్రాసులో ఏర్పాటు చేసి చిత్ర ప్రముఖులను ఆహ్వానించారు నాగయ్య. ఈ నాటక ప్రదర్శన కారణంగానే రామశర్మకు అదృష్టదీపుడు చిత్రంలో అవకాశం దొరికిందని విని నాగయ్య ఎంతో సంతోషించారు. సిద్ధారుడు పాత్రతో అతను పాపులర్ కనుక సిద్దార్ట్ అని పేరు మార్చుకోమని నాగయ్య సూచించారు. కానీ తన అసలుపేరుతోనే నటిస్తానని చెప్పారు రామశర్మ ఆ రోజులలో దర్శకుడు కానీ, హీరో కానీ డిగ్రీ హోల్డర్ అయితే ఆ డిగ్రీతో సహా టైటిల్స్ వేయడం జక ఫ్యాషన్ గా ఉండేది. అలాగే రామశర్మ నటించిన చిత్రాల టైటిల్స్‌లో రామశర్మ బి.ఎ. అనే వేసేవారు.
అదృష్టదీపుడు చిత్రం విజయవంతమయింది. కానీ రామశర్మ రెండవ చిత్రం నవ్వితే నవరత్నాలు సక్సెస్ కాలేదు. హీరోయిన్ కృష్ణకుమారికి ఇదే తొలి సినిమా కావడం గమనార్హం. నవ్వితే నవరత్నాలు, కాంచన, మంజరి, ఆకాశరాజు, గుమాస్తా-ఆదర్శం, ఆడజన్మ, మరదలు పెళ్ళి, పరోపకారం, ప్రపంచం, నాచెల్లెలు, పల్లెపడుచు, మేనరికం, నాఇల్లు, భక్తరామదాసు, సంతోషం, బంగారుపాప ..ఇలా సుమారు ఒక 25 కి పైగా చిత్రాలలో కథానాయకునిగా రామశర్మ నటించారు.సావిత్రి, జి.వరలక్ష్మి, అంజలి, కృష్ణకుమారి, పద్మ, సూర్యకుమారి, పద్మిని తదితర నాయికల నడుమ నాయకునిగా వెలిగారు. రామశర్మతో ఎక్కువగా తమిళ నిర్మాతలు తెలుగు చిత్రాలు నిర్మించడం గమనార్హం.
రామశర్మకు ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ బాగానే ఉండేది. ముఖ్యంగా సినీ పత్రికలవారితో స్నేహంగా మెలిగేవారు. ఆ కారణం చేత విపరీత మైన పబ్లిసిటీ వచ్చేది. 'రేరాణి', 'రూపవాణి', మోహిని', 'గుండుసూది', 'సినీ జగత్ వంటి పత్రికల ముఖచిత్రాల్లో శర్మ స్టిల్స్ వేసేవారు. రామశర్మను ఎలాగయినా వార్తలలోకి ఎక్కించాలని కృష్ణ కుమారి-రామశర్మల జంటగురించి గాలివార్తలు నీలివార్తలు పోగుచేసి సినీ పత్రికలు నింపేవి. కృష్ణ కుమారి-రామశర్మల వివాహం జరగొచ్చు అన్నంతగా వార్తలు రాశాయి. ఆ రోజుల్లో హీరోల మధ్య పోటీ ఎక్కువగా ఉండేది. ఆ పోటీని తట్టుకుని నిలబడాలంటే జర్నలిస్టుల సహకారం కావాలని గ్రహించిన రామశర్మ వారితో చాలా సన్నిహితంగా మెలిగేవారు. త గురించి ఎప్పుడు పత్రికలలో ఏదో ఒక వార్త వచ్చేలా శ్రద్ధ వహించేవారు. దీని వల్ల రామశర్మకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.
ఆరోజులలో రామశర్మ, సావిత్రిల జంట చూడ ముచ్చటగా ఉండేది. వాళ్లిద్దరు పెళ్ళి చేసుకుంటారేమోనని కూడా చాలామంది చెప్పకునేవారట. రామశర్మ కెరీర్ 1956తోనే పూర్తయిందని చెప్పాలి. ఎందుకంటే హీరోగా చాలా బిజీగా ఉన్న రోజులలో కుటుంబ సమస్యల కారణంగా ఓ ఏడాది పాటు ఆయన చిత్రరంగానికి దూరం కావాల్సి వచ్చింది. ఆ సమస్యలను పరిష్కరించు కుని తిరిగి చిత్రపరిశ్రమకి వచ్చేసరికి ఆయన స్థానాన్ని అనేక మంది కొత్త తారలు ఆక్రమించడం జరిగింది.
అటువంటి పరిస్థితులలో రామశర్మ స్నేహితులైన నిర్మాతలు ఛటర్జీ, కోనేరు రవీంద్రనాథ్, జి.రామినీడు వంటివారు తమ చిత్రాలు "భక్తపోతన", "జేబుదొంగ", "విజృంభణ" లలో అవకాశాలు ఇచ్చి ఆదుకున్నారు. ఆ తర్వాత మళ్లీ గ్యాప్. కొత్త హీరోల ప్రవేశంతో రామశర్మకు అవకాశాలు తగ్గిపోయి క్రమంగా తెరమరుగు కావాల్సి వచ్చింది. అయినా తలవంచకుండా, ఒకరిని యూచించే పరిస్థితి రానివ్వకుండా రామశర్మ జాగ్రత్త పడ్డారు. ఆ సమయంలో ఆయన చదువు కున్న చదువు అక్కరకు వచ్చింది. రేస్‌కోర్సులో ఉంటూ ఏ గుర్రం గెలుస్తుందో టిప్స్ చెబుతూ కాల క్షేపం చేసేవారు. హోమియో వైద్యుడుగాను సేవలు అందించారు. సినీరంగంలో ఒక వెలుగు వెలిగిన రామశర్మ చివరకు అనామకంగానే జీవితాన్ని చాలించాల్సి వచ్చింది.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.