Remove ads
భారతదేశ వ్యాపారవేత్త From Wikipedia, the free encyclopedia
ముఖేష్ ధీరూభాయ్ అంబానీ (జననం: ఏప్రిల్ 19,1957) భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్.ఐ.ఎల్) సంస్థకు అధ్యక్షుడు, యాజమాన్య సంచాలకుడు, 35%తో అత్యధిక వాటాదారుగా ఉన్నారు. రిలయన్స్ సంస్థ ఫార్చూన్ గ్లోబల్ 500 కంపెనీ చిట్టాలోనూ, భారతదేశ రెండవ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది.[6][7][8] ప్రపంచంలోనే అత్యంత విలువైన అంటిలా బిల్డింగ్ లో నివాసం ఉంటున్నరు అంబానీ. ఈ ఇల్లు సుమారు 2 బిలియన్ డాలర్ల విలువైనది.[9][10] ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీల మొదటి సంతానం ముఖేష్. ఈయన్ సోదరుడు అనిల్ అంబానీ. రిలయన్స్ సంస్థ ముఖ్యంగా పెట్రో ఉత్పత్తుల శుద్ధి, పెట్రో రసాయనాలు, ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి రంగాల్లో పనిచేస్తుంది. ఈ వ్యాపారాలకు అనుబంధంగా ఈ సంస్థ నడిపే వర్తకం భారతదేశంలోనే అతిపెద్దది.[11]
ముఖేష్ అంబానీ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు |
నికర విలువ | US$20.1 బిలియన్లు (February 2016)[3] |
జీవిత భాగస్వామి | నీతా అంబానీ (m. 1985) |
పిల్లలు | ఆకాశ్ అంబానీ అనంత్ అంబానీ ఇషా అంబానీ[4][5] |
తల్లిదండ్రులు | ధీరూభాయ్ అంబానీ కోకిలాబేన్ అంబానీ |
బంధువులు | అనిల్ అంబానీ (సోదరుడు) |
2014లో, ఫోర్బ్స్ జాబితాలో అంబానీ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా 36వ స్థానంలో నిలిచారు.[3] 2010లో ఫోర్బ్స్ లో "ముఖ్యమైన 68 మంది వ్యక్తుల" జాబితాలో చోటు దక్కింది.[12] 2013లో భారతదేశంలో అత్యంత సంపన్నమైన వ్యక్తిగా గుర్తించబడ్డారు. అదే సంవత్సరం ఆసియాలో రెండవ అత్యంత సంపన్నునిగా నిలిచారు ముఖేష్.[3] వరుసగా 9వ సంవత్సరం కూడా అంబానీ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు.[13] రిలయన్స్ సంస్థ ద్వారా భారత ప్రీమియర్ లీగ్ లోని "ముంబై ఇండియన్స్" జట్టుకు అంబానీ యజమాని. 2012లో ఫోర్బ్స్ జాబితా ఆయనను ప్రపంచంలోనే సంపన్న క్రీడా యజమానిగా పేర్కొంది.[14][15]
బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్ కు ఆయన పాలకమండలిలో, అంతార్జాతీయ విదేశీ వ్యవహారాల కౌన్సిల్ లో సలహా మండలిలోను సేవలందించారు. భారతదేశంలోని ప్రధాన బిజినెస్ స్కూల్స్ లో ఒకటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగుళూరు పాలకమండలికి అధ్యక్షునిగా కూడా వ్యవహరించారు.
ముఖేష్ ఏప్రిల్ 19 1957న ధీరూబాయ్ అంబానీ, కోకీలాబెన్ అంబానీలకు జన్మించారు. ముఖేష్ కు తమ్ముడు అనిల్ అంబానీ, ఇద్దరు చెల్లెళ్ళు దీప్తి సలగొన్కర్, నైనా కొఠారీ ఉన్నారు. 1970లలో అంబానీ కుటుంబం ముంబై లోని భులేశ్వర్ ప్రాంతంలో ఒక చిన్న రెండు పడకగదుల ఇంట్లో ఉండేవారు.[16] ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు ధీరూభాయ్ కోల్బాలో 14 అంతస్తుల భవనాన్ని కొన్నారు. దాని పేరు "సీ విండ్". మొన్న మొన్నటిదాకా ముఖేష్, అనిల్ కుటుంబాలు వేర్వేరు అంతస్తుల్లో ఆ ఇంట్లోనే కలసి ఉండేవారు.[17]
ముంబై లో పెద్దర్ రోడ్లోని హిల్ గ్రేంజ్ హైస్కూల్లో తన తమ్ముడు అనిల్ తో కలసి చదువుకున్నారు. ముఖేష్ కు అత్యంత సన్నిహితుడైన ఆనంద్ జైన్ ఆ స్కూల్లోనే ఆయన సాహాధ్యాయి.[18] ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, మాతుంగలో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో బిఈ పట్టా పొందారు.[19] ఆ తరువాత స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏలో జాయిన్ అయినా రిలయన్స్ సంస్థను నడపడంలో తండ్రి ధీరూభాయ్ కు సహాయం చేయడం కోసం చదువు మధ్యలో ఆపేసి వచ్చేశారు. అప్పటికి రిలయన్స్ వేగంగా ఎదుగుతున్న చిన్న వ్యాపార సంస్థ.[20]
1980లో, ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం పాలిస్టర్ ఫిలమెంట్ యార్న్ ను ప్రారంభించింది. దీనిని ప్రయివేటు రంగానికి అప్పగిస్తూ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ ఉత్తర్వులిచ్చింది. ధీరూభాయ్ అంబానీ టాటా, బిర్లా, దాదాపు మరో 43మంది వ్యాపారులతో పోటీపడుతూ లైసెన్సుకు దరఖాస్తు చేసుకున్నారు. ధీరూభాయ్ కు లైసెన్స్ రావడం[21]తో ఈ కొత్త వ్యాపారాన్ని నడిపేందుకు ధీరూభాయ్ తన పెద్ద కుమారుడు ముఖేష్ ను స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ చదువు మధ్యలో ఆపి తీసుకువచ్చారు. అలా ముఖేష్ తన చదువును అపి, వ్యాపారంలోకి అడుగుపెట్టారు. 1981లో ఈ అడుగుతోనే ముఖేష్ వ్యాపార ప్రస్థానం మొదలైంది.[6]
ముఖేష్ రిలయన్స్ ఇన్ఫోకాం లిమిటెడ్ (ప్రస్తుతం రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ గా వ్యవహరింపబడుతోంది.) ను స్థాపించారు. ఈ సంస్థ సమాచారం, సమాచార ప్రసార సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి విషయంలో పనిచేస్తుంది.[22]
జాంనగర్ లోప్రపంచంలోనే అతిపెద్ద పెట్రోలియం రిఫైనరీ సంస్థ ను అంబానీ స్థాపించారు. 2010కి రోజుకు 660,000బారెళ్ల ఉత్పత్తి ఈ కంపెనీ సామర్ధ్యం (సంవత్సరానికి 33 మిలియన్ల టన్నులు). పెట్రోకెమికల్స్, విద్యుత్ ఉత్పత్తి, ఓడరేవు, దానికి సంబంధించిన సౌకర్యాలు అనుసంధానం చేయడానికి ఈ సంస్థ పనిచేస్తుంది.[23]
2013 డిసెంబరులో మొహాలిలో జరిగిన ప్రోగ్రసివ్ పంజాబ్ సమ్మిట్ లో భారత్ ఎయిర్ టెల్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం గురించి అంబానీ ప్రకటించారు. ఈ భాగస్వామ్యంతో భారతదేశంలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను అభివృద్ధి చేయడానికి 4జి నెట్వర్క్ ను ఏర్పాటు చేశారు.[24]
2014, ఫిబ్రవరిలో ముఖేష్ అంబానీకి వ్యతిరేకంగా ఎఫ్.ఐ.అర్ ఫైలైంది. కెజిబేసిన్ లో దొరికే గ్యాస్ ను ఎక్కువ ధరకు అమ్ముతున్నారంటూ ఆ ఎఫ్.ఐ.ఆర్ లో పేర్కొన్నారు.[25] ముఖేష్ కు వ్యతిరేకంగా ఈ కంప్లయింట్ ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఇచ్చారు. రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ లను ముఖేష్ పై చర్య తీసుకోవాలని కోరారు.[26][27][28] కేజ్రివాల్ కంప్లయింట్ ప్రకారం ఒక యూనిట్ కు కంపెనీ ఒక డాలరు మాత్రమే ఖర్చు పెడుతుండగా, 8 డాలర్లకు అమ్ముతోందనీ, దీని వల్ల దేశం సంవత్సరానికి 540బిలియన్ల రూపాయలు నష్టపోతోందని ఆరోపించారు.[29][30]
జూన్ 18, 2014లో ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కి 40వ ఎజిఎంను ఎంపిక చేసిన సభలో మాట్లాడుతూ 2015నాటికి 4జి బ్రాడ్ బ్యాండ్ సర్వీసెస్ ను స్థాపిస్తామని, తమ సంస్థ వచ్చే 3 ఏళ్ళలో 1.8 ట్రిలియన్ రూపాయలు పెట్టుబడి పెడుతుందని ప్రకటించారు.[31]
సంవత్సరం | అవార్డు/గౌరవం పేరు | సంస్థ |
---|---|---|
2000 | ఆ సంవత్సరానికి గాను యువ పారిశ్రామికవేత్త[33] |
ఎర్నెస్ట్ & యంగ్ ఇండియా |
2010 | అవార్డ్స్ డిన్నర్ లో గ్లోబల్ విజన్ అవార్డు[34] | ఆసియా సొసైటీ |
2010 | బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్[34] |
ఎన్.డి.టి.వి ఇండియా |
2010 | బిజినెస్ మేన్ ఆఫ్ ది ఇయర్[35] |
ఫైనాంషియల్ క్రొనికల్ |
2010 | స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అప్లైడ్ సైన్స్ డీన్స్ మీడియా [36] |
పెన్నిసిల్వనియా విశ్వవిద్యాలయం |
2010 | గ్లోబల్ లీడర్ షిప్ అవార్డ్[37] | బిజినెస్ కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ |
2010 | డాక్టరేట్[38] |
బరోడా ఎంఎస్ విశ్వవిద్యాలయం |
2013 | మిలీనియం బిజినెస్ లీడర్ ఆఫ్ ది డికేడ్ ఎట్ ఇండియన్ ఎఫైర్స్ ఇండియా లీడర్ షిప్ కాన్క్లేవ్ అవార్డ్స్ |
ఇండియా లీడర్ షిప్ కాన్క్లేవ్ & ఇండియన్ ఎఫైర్స్ బిజినెస్ లీడర్ షిప్ అవార్డ్స్ |
ముఖేష్ నీతా అంబానీని పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు అనంత్, ఆకాష్, ఒక కూతురు ఇషా ఉన్నారు. ఈ కుటుంబం ప్రపంచంలోనే అతి ఖరీదైన భవనంగా పేరుపొందిన అంటిలా లో ఉంటారు. ఈ భవనంలో 27 అంతస్తులు ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.