మధ్వాచార్యులు ద్వైత వేదాంతాన్ని బోధించిన మతాచార్యులు. పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ, అని పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో మూడవ వారు. సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది మధ్వాచార్యులు. సా.శ. 1238–1317 మధ్య కాలంలో మధ్వాచార్యులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. మధ్వాచార్యులు, హనుమంతుడు, భీముడు అనంతరం వాయు దేవునకు తృతీయ అవతారమని నమ్మకం ఉంది.
పుట్టుక / బాల్యం
మద్వాచార్యులు ఉడిపి వద్ద నున్న పాజక గ్రామంలో సా.శ. 1238 సంవత్సరంలో విజయదశమి రోజున జన్మించారు. మధ్వాచార్యుని జీవిత కథను రచించినది నారాయణ పండితాచార్యులు. అతను తల్లిదండ్రుల పేర్లను మధ్యగేహ భట్ట, వేదవతి లుగా పేర్కొన్నారు. అతనుకు మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినా తరువాతి కాలంలో పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ, మధ్వాచార్యులు అనే పేర్లతో ప్రసిద్ధి పొందారు.
బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మిక విషయాలవైపు ఆసక్తి చూపుతూ వాటిని ఆకళింపు చేసుకునేవాడు. పదకొండేళ్ళ పిన్న వయసులోనే సన్యాసం వైపు ఆకర్షితుడయ్యాడు. ఉడిపి సమీపంలో నివసిస్తున్న, ఆకాలంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా పేరుగాంచిన అచ్యుతప్రజ్ఞ అనే గురువు ద్వారా సన్యాస దీక్షను స్వీకరించాడు. అప్పుడే అతను పేరు పూర్ణప్రజ్ఞుడుగా మారింది.
ఒక నెల తరువాత ఓ తర్క శాస్త్ర పండితుల బృందాన్ని తన వాదనా పటిమతో ఓడించాడు. అతను ప్రజ్ఞకు అబ్బురపడిన అచ్యుతప్రజ్ఞ అతనిని వేదాంత పరమైన అంశాలపై అధిపతిగా నియమించి ఆనందతీర్థ అనే బిరుదు కూడా ఇచ్చాడు.
దక్షిణభారత యాత్ర
యుక్తవయస్సులో ఉండగానే మధ్వాచార్యుడు దక్షిణ భారతదేశమంతా పర్యటించాలని సంకల్పించాడు. అనంతశయన, కన్యాకుమారి, రామేశ్వరం, శ్రీరంగం మొదలైన క్షేత్రాలను సందర్శించాడు. ఎక్కడికి వెళ్ళినా తాను తెలుసుకున్న తత్వాన్ని ప్రజలకు ఉపన్యాసాల రూపంలో తెలియజెప్పేవాడు. మూఢనమ్మకాల్ని వ్యతిరేకించాడు. వాటిని ఆధ్యాత్మికతతో ముడిపెట్టకూడదని భావించాడు. అలా అతను ప్రబోధించిన తత్వం దేశవ్యాప్తంగా పండితుల్లో చర్చలు రేకెత్తించగా సనాతన వాదుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. కానీ అయన వేటికీ చలించలేదు. యాత్ర పూర్తి చేసుకుని ఉడుపి చేరుకోగానే భగవద్గీత పై తన భాష్యాన్ని రాయడం ప్రారంభించాడు.పుట్టిగే మఠంలో పూజించే పాండురంగ (విఠల్) ప్రధాన విగ్రహాలను ఉపవేంద్ర తీర్థకు మధ్వాచార్య ఇచ్చాడు.[1]
రచనలు
తన ద్వైత సిద్ధాంతాన్ని నిరూపించడానికి మధ్వాచార్యుడు ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యాలు వ్రాసాడు. ఇంకా ఋగ్వేదంలోని మొదటి 40 సూక్తాలకు, భారత భాగవతాలకు వ్యాఖ్యానం వ్రాసాడు. తర్కంతోపాటు మొత్తం 37 గ్రంథాలను రచించాడు. ఇందులో ప్రముఖమైనవి
- గీతాభాష్యం
- గీతాతాత్పర్యం
- బ్రహ్మసూత్రభాష్యం
- అణువ్యాఖ్యానం
- న్యాయవివరణం
- అణుభాష్యం
- దేశోపనిషద్భాష్యం
- మహాభారతతాత్పర్యనిర్ణయం
- యమకభారతం
- దశప్రకరణం
- తంత్రసారం
- ద్వాదశస్తోత్రం
- కృష్ణార్ణవామృతం
- సదాచారస్మృతి
- జయంతినిర్ణయం
- ప్రణవకల్పం
- న్యాసపద్ధతి
- తిథినిర్ణయం
- కందుకస్తుతి
ద్వైత వాదం
జీవుడు వేరు, బ్రహ్మం వేరు. జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం.
భక్తి ఒక్కటే ముక్తిదాయకం. అది జ్ఞానపురస్కృతమైన భక్తి అయి ఉండాలి. ముక్తి నాలుగు విధాలు:
- సాలోక్యం - జీవాత్మ భగవంతుని లోకంలో భగవంతునితోపాటు నివసించడం
- సామీప్యం - భగవంతుని సన్నిధానంలో నివసిస్తూ కామితార్థాలను అనుభవించడం
- సారూప్యం - భగవంతుని రూపం పొంది ఇష్టభోగాలు అనుభవిస్తూ ఆనందించడం
- సాయుజ్యం - భక్తుడు భగవంతునిలో లీనమైనా అతను కంటే వేరుగా ఉంటూనే అతను ఆనందంలో పాలుపంచుకోవటం.
ద్వైతమత ప్రభావం
మధ్వాచార్యుడు ఆసేతుశీతనగ పర్యంతం దేశమంతా పర్యటించి ద్వైత మతాన్ని ప్రచారం చేశాడు.దేశంలో వైష్ణవమత వ్యాప్తికి, ముఖ్యంగా కృష్ణభక్తి వ్యాప్తికి మధ్వమతం ఎంతగానో తోడ్పడిందనటంలో సందేహం లేదు.
నిర్యాణం
మధ్వాచార్యుడు తన 79వ ఏట, సా.శ.1317లో శిష్య సమేతంగా బదరినారాయణుని మరోమారు దర్శించి ఒంటరిగా ఉత్తర బదరిని చేరుకొని వ్యాసభగవానుని కైంకర్యాలాలో నిమగ్నమైపోయారు.
ఇవి కూడా చూడండి
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.