Remove ads
From Wikipedia, the free encyclopedia
మణిపురి[3] (మీటేయ్[4][5] /mənɪˈpʊri/, మీయ్థేయ్, మీటేయ్లాన్) అన్నది ఈశాన్య భారతదేశంలో ఆగ్నేయ హిమాలయన్ రాష్ట్రమైన మణిపూర్‌లో ప్రధానమైన భాష, అనుసంధాన భాష. భారత రాజ్యాంగం షెడ్యూల్ 8లో ప్రస్తావించిన అధికార భాషల్లో మణిపురి ఒకటి, మణిపూర్ రాష్ట్రానికి ఇదే అధికార భాష. మణిపురి లేక మీటేయ్ అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లోనూ, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల్లోనూ మాట్లాడుతూంటారు. యునెస్కో ప్రస్తుతం దెబ్బతినే ప్రమాదమున్న భాషల్లో ఒకటిగా దీన్ని చేర్చింది.[6]
మణిపురీ | |
---|---|
మణిపురీ, మీథేయ్, మీటేయ్ | |
ప్రాంతం | ఈశాన్య భారతదేశం, బంగ్లాదేశ్, మయన్మార్ |
స్వజాతీయత | మీటేయ్ |
స్థానికంగా మాట్లాడేవారు | 12.5 లక్షలు (2010)[1] నుంచి 14.85 లక్షలు (2001 జనగణన)[2] |
సినో-టిబెటన్
| |
వ్రాసే విధానం | మీటేయ్ లిపి, తూర్పు నాగరి లిపి లాటిన్ లిపి |
అధికారిక హోదా | |
అధికార భాష | భారతదేశం (మణిపూర్) |
భాషా సంకేతాలు | |
ISO 639-2 | mni |
ISO 639-3 | – |
మణిపురి టిబెటో-బర్మన్ భాష. అయితే దీని వర్గీకరణలో స్పష్టత లేదు.దీనికి తంగ్ఖుల్ నాగా భాష పదాలతో 60 శాతం పోలిక ఉండి, నైఘంటుక సాదృశం కనిపిస్తోంది.[7]
మణిపురి (మీటేయ్) భాష మణిపూర్‌లోని అన్ని జాతుల వారూ ఒకరితో ఒకరు సంభాషించుకునేందుకు ఉపయోపడుతూ, తద్వారా మణిపూర్‌లోని జాతులన్నిటి ఐక్యతకు కారణంగా నిలుస్తోంది. 1992లో 72వ సవరణ ద్వారా దీన్ని రాజ్యాగంలోని షెడ్యూల్డ్ భాషల జాబితాలో చేర్చి, భారత యూనియన్ గుర్తించింది. మణిపురిని మణిపూర్‌లో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకూ బోధనా మాధ్యమంగా ఉపయోగించడంతో పాటుగా భారతదేశంలోని విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, పరిశోధన స్థాయిలో ఒక సబ్జెక్టుగా బోధిస్తున్నారు.[8]
మణిపురి భాషకు దాని ప్రత్యేకమైన మీటేయ్ లిపి ఉంది, 18వ శతాబ్ది వరకూ లిపి ఉపయోగంలో ఉంది. ఎప్పటి నుంచి వినియోగంలో ఉందన్నది తెలియదు. మణిపూర్ రాజ్య పాలకుడైన పాంహేబా రాజ్యంలో హిందూ మతం ప్రవేశపెట్టి మీటేయ్ లిపి వాడకాన్ని నిషేధించి, బెంగాలీ లిపి ప్రవేశపెట్టాడు. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలల్లో క్రమేపీ బెంగాలీ లిపి బదులు మీటేయ్ లిపి వాడడం పెరుగుతోంది. స్థానిక సంస్థలు మీటేయ్ లిపి వాడమని ప్రోత్సహిస్తూ, అవగాహన కల్పించడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి.
18వ శతాబ్ది తొలినాళ్ళలో పంహేబా రాజు హిందూ మతంలోకి మారాకా బెంగాలీ హిందూ ప్రచారకర్త శాంతిదాస్ గోసాయి ప్రేరేపణతో అనేక మీటేయ్ లిపి వ్రాతప్రతులను నాశనం చేశారు. 1709 నుంచి 20వ శతాబ్ది మధ్యకాలం వరకూ మణిపురి భాషను బెంగాలీ లిపిలో రాసేవారు. 1940లు, 1950ల్లో మణిపురి పండితులు ప్రాచీన మీటేయ్ లిపిని తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి ప్రచారోద్యమం మొదలుపెట్టారు. 1976లో రచయితల సమావేశంలో ఆధునిక మణిపురి భాషలో వాడుకలో ఉన్న అనేక శబ్దాలకు ప్రాచీన మీటేయ్ లిపిలో సంకేతమైన అక్షరాలు లేకపోవడంతో సంబంధిత అక్షరాలు చేర్చి, కొత్త మీటేయ్ లిపిని స్వీకరించడానికి అంగీకరించారు. ప్రస్తుతం ఉన్న మీటేయ్ లిపి ప్రాచీన మీటేయ్ లిపికి ఆధునిక రూపం.
మీటేయ్ లిపి హల్లులు అన్నిటిలో అచ్చులు సహజసిద్ధంగా ఉండే సిలబిక్ ఆల్ఫాబెట్ పద్ధతిలో ఉంటుంది. ఇతర అచ్చులు ప్రత్యేక అక్షరాలుగా రాస్తారు, లేదంటే అచ్చులను హల్లుల పైన, కింద, పక్కన సంకేతాత్మకంగా రాస్తారు. ప్రతీ అక్షరాన్ని ఒక్కో మానవ శరీర భాగాలను బట్టి ఏర్పడింది. మణిపూర్‌లో మారింగ్, లింబు తెగల భాషల రాతప్రతులు కొన్ని మీటేయ్ లిపిలో రాస్తారు.
లాటిన్ లిపిలో మీటేయ్ భాష రాసే పద్ధతి ఒకటి అనధికారికమైనా స్థిరంగా చాలాకాలం సాగుతూ వస్తోంది. ఈ రాత విధానం ప్రధానంగా వ్యక్తి పేర్లు, ప్రదేశాల పేర్లు రాయడంలోనూ, విస్తారంగా అంతర్జాలంలోనూ వాడకంలో ఉంది. అకడమిక్ ప్రచురణల విషయంలోనూ, ప్రత్యేకించి మీటేయ్ పుస్తకాల పేర్లు వంటివి రాయడంలో కనిపిస్తుంది. వర్ణక్రమం పూర్తిగా స్పష్టంగా మీటేయ్ శబ్దాలను లాటిన్ లిపిలో రాయడంగా ఉంటుంది.
ప్రస్తుతం బంగ్లాదేశ్, భారతదేశం విస్తారంగా తూర్పు నాగరి ఉపయోగిస్తున్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.