From Wikipedia, the free encyclopedia
సినీ పరిశ్రమలో మొదట ఎడిటర్‌గా ప్రవేశించి, ఆ తర్వాత దర్శకుడిగా మారిన చిత్రపు నారాయణమూర్తి మొట్టమొదటగా దర్శకత్వం వహించిన చిత్రం ఈ భక్త మార్కండేయ. ఇందులో మార్కండేయగా జి.ఎన్.స్వామి, యముడుగా వేమూరి గగ్గయ్య, మృకండ మహామునిగా ఘంటసాల రాధాకృష్ణయ్య, శివుడిగా రాయప్రోలు సుబ్రహ్మణ్యం, బ్రహ్మగా ఘంటసాల శేషాచలం, నారదుడిగా టి.రామకృష్ణశాస్త్రి, విష్ణుమూర్తిగా విశ్వనాధం, మరదృతిగా శ్రీరంజని, పార్వతిగా కుమారి, భూదేవిగా రమాదేవిలు నటించారు.
భక్త మార్కండేయ (1938 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చిత్రపు నారాయణమూర్తి |
---|---|
నిర్మాణం | ఘంటసాల బలరామయ్య |
తారాగణం | వేమూరి గగ్గయ్య, శ్రీరంజని సీనియర్, జి.ఎన్.స్వామి, ఘంటసాల రాధాకృష్ణయ్య, రాయప్రోలు సుబ్రహ్మణ్యం, ఘంటసాల శేషాచలం, టి.రామకృష్ణశాస్త్రి, విశ్వనాధం, కుమారి, రమాదేవి |
సంగీతం | గాలిపెంచెల నరసింహారావు |
నిర్మాణ సంస్థ | కుబేరా పిక్చర్స్ |
భాష | తెలుగు |
కుబేరా పిక్చర్స్ పతాకంపై నిర్మించబడిన ఈ చిత్రానికి ఘంటసాల బలరామయ్య, వెంకరెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. విశ్వనాథ కవి మాటలు రాయగా, బలిజేపల్లి వినసొంపైన పాటలు రచించారు. ఎ.గోపాలరావు, జె.నన్నయ్య అద్భుతమైన సంగీతాన్ని అందించారు. బొమ్మన్ డి.ఇరానీ ఫొటోగ్రఫీని సమకూర్చారు. దర్శకులుగా వ్యవహరించిన చిత్రపునారాయణమూర్తి చిత్రరంగానికి రాకముందు నేషనల్ థియేటర్స్ అనే నాటక సంస్థను నెలకొల్పి, 'మార్కండేయ'తోపాటు పలు నాటకాలను ప్రదర్శించారు. ఆ అనుభవం ఈ సినిమాకు ఎంతో ఉపకరించింది. నారాయణమూర్తి, ఘంటసాల బలరామయ్య సోదరులిద్దరూ ఈ చిత్రంలో ప్రధానపాత్రలు పోషించడం విశేషం. 1938 జూన్ 17న విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడింది.[1]
మృకండ మహర్షి గొప్పతపశ్శాలి. చాలారోజులుగా సంతానం కోసం తపస్సు చేస్తుంటాడు. వారి దీక్షకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై, వారికో అవకాశమిస్తాడు. సకల శాస్త్ర ప్రావీణ్యుడైన అల్పాయుష్కుడు కావాలో, పరమమూర్ఖుడు, దీర్ఘాయుష్కుడైన కొడుకు కావాలో వారినే తేల్చుకోమంటాడు ఈశ్వరుడు. ఆ దంపతులు ఆలోచించి కాకిలా కలకాలం జీవించడం కంటే, హంసలా కొంతకాలం బతికినా చాలని అల్పాయుష్కుడైన కుమారుడిని ప్రసాదించమని పరమేశ్వరుని కోరుకుంటారు. అలా లభించిన పిల్లవాడికి మార్కండేయుడని పేరుపెట్టి గారాబంగా పెంచుతుంటారు. ఆ బాలుడు పున్నమి చంద్రుడిలా ఎదుగుతుంటే, కన్నవారి ముఖాల్లో దిగులు చోటు చేసుకుంటుంది. అయిదవ ఏడు వస్తుంది. విద్యనేర్చుకోవాలని ఉబలాటపడుతుంటాడు. తనను గురుకులానికి పంపమని తల్లిదండ్రులను అడుగుతాడు. ఆ మాట విని తల్లి భోరున ఏడుస్తుంది. తండ్రి కంటనీరు పెడతాడు. చదువుకోవడానికి పంపమంటే వారెందుకు ఏడుస్తున్నారో అర్థంకాక తరచి తరచి అడిగే సరికి, మార్కండేయుడికి గల పదహారేళ్ల అల్పాయుష్షును గురించి చెబుతారు. సహజజ్ఞానం గల మార్కండేయుడు తన మరణం గురించి భయపడడు. అయితే తల్లిదండ్రుల దు:ఖం చూడలేకపోతాడు. తనను పుట్టించిన ఆ పరమేశ్వరుడిని ప్రార్థించి, మెప్పించి దీర్ఘాయుష్షును పొందడానికి తల్లిదండ్రుల అనుమతి inతీసుకుంటాడు.
మార్కండేయుడు ఒంటరిగా అరణ్యానికి వెళ్లి, ఒక సెలయేరు పక్కనే మట్టితో శివలింగాన్ని చేసి, ప్రతిరోజూ పూజిస్తూ శివధ్యానంలో మునిగిపోతాడు. మార్కండేయుడి దీక్షకు ఆశ్చర్యపడి నారద మహర్షి, శివపంచాక్షరిని ఉపదేశిస్తాడు. సుమారు 11 సంవత్సరాలు ఏకాగ్రతతో, తదేకథ్యానంతో శివమంత్రాన్ని జపిస్తాడు. ఆ రోజు 16 సంవత్సరాల వయస్సు పూర్తికావస్తుంది. శివభక్తుడు కావడంతో, అతని ప్రాణాలు తీయడానికి సాక్షాత్తు యముడే మార్కండేయుడు ఉన్న చోటికి వస్తాడు.
తపస్సమాధిలో మునిగి ఉన్న మార్కండేయుడు యముని వాహనం యొక్క రంకె వినిపించి, కళ్ళు తెరుస్తాడు. ఎదురుగా ఉగ్రరూపంతో కనిపించిన కాలయముని చూసి భయంతో శివలింగాన్ని కౌగలించుకుంటాడు. విడువకుండా శివపంచాక్షరిని జపిస్తుంటాడు. ఆలస్యం భరించలేని యముడు తన పాశాన్ని మార్కండేయునిపైకి విసురుతాడు. ఒక్కసారిగా దానిని పట్టి లాగుతాడు. అయితే శివలింగాన్ని గట్టిగా వాటేసుకున్న మార్కండేయుడితోపాటు శివలింగాన్ని కూడా ఆపాశం లాగుతుంది. దిక్కులు పిక్కటిల్లేలా పెద్ద ధ్వనితో ఆ శివలింగం విచ్చుకుని ఈశ్వరుడు కోపంతో యముడి వైపు చూస్తాడు. అంతే యముడు గజగజవణికి పోతాడు. తన విధి ప్రకారం మార్కండేయుని ప్రాణాలు తీయడానికి వచ్చానని చెబుతాడు. తన పాదాలు పెనవేసుకుని భయంతో కళ్ళు మూసుకున్న మార్కండేయుని తల నిమిరి, భయం పోగొడతాడు శివుడు. ఇక ఎప్పటికీ నీకు 16 సంవత్సరాల వయసు దాటదు. చిరంజీవిగా వుంటావని దీవిస్తాడు. అంతటితో అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు, ఇతరులు శివానుగ్రహం పొందిన మార్కండేయుని ముద్దాడతారు. ఈశ్వరుని కృపకు కృతజ్ఞతలు అర్పిస్తారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.