బొజ్జా తారకం
From Wikipedia, the free encyclopedia
బొజ్జా తారకం (జూన్ 27, 1939) ప్రజల నేత, హైకోర్టు న్యాయవాది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు. హేతువాది.
జీవిత విశేషాలు
తారకం తూర్పు గోదావరి జిల్లా, కాట్రేనికోన మండలం, కందికుప్ప గ్రామంలో జన్మించాడు. ఈయన తాత గోవిందదాసు తత్వాలు పాడుతూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేవాడు. ఆయనకు వేల మంది శిష్యులు ఉండేవారు. ఈయన తండ్రి బొజ్జా అప్పలస్వామి వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. 1952 నుంచి 1962 వరకు అమలాపురం శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఉన్నారు. ఈయన తండ్రి కూడా రిపబ్లికన్ పార్టీ నాయకుడే.
తారకం న్యాయవాద పట్టా తీసుకుని 1966లో కాకినాడలో ప్రాక్టీస్ మొదలెట్టాడు. బోయి భీమన్న కూతురు విజయభారతిని 1968లో పెళ్ళి చేసుకున్నాడు. భార్య నిజామాబాదులో ఉద్యోగం చేస్తుండంతో, సంసారం నిజామాబాదుకు మార్చి అక్కడే ప్రాక్టీస్ మొదలెట్టాడు. నిజామాబాదులో 'అంబేద్కర్ యువజన సంఘం' స్థాపించారు. బీసీని అధ్యక్షుడిగా, ఎస్సీని కార్యదర్శిగా పెట్టడం ద్వారా ఆ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు. 1975లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు నిజామాబాద్‌లో అరెస్టు అయ్యాడు. 1979 నుంచి హైదరాబాద్‌లో ఉంటూ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తూ అనేక దళిత సమస్యలపై పోరాడాడు. కారంచేడు సంఘటన తర్వాత హైకోర్టులో న్యాయవాద పదవి రాజీనామా చేసి కత్తి పద్మారావుతో పాటు కారంచేడు శిబిరంలో నిరసన దీక్ష చేశాడు.
పౌర హక్కుల ఉద్యమాల్లో ఎంతో క్రియాశీలంగా పాల్గొంటున్న తారకానికి రాజకీయ నాయకుడిగానే కాకుండా రచయితగా కూడా మంచి పేరుంది. ఈయన రచనల్లో పోలీసులు అరెస్టు చేస్తే, కులం-వర్గం, నది పుట్టిన గొంతుక, నేల నాగలి మూడెద్దులు, దళితులు-రాజ్యం ప్రముఖమైనవి.
భావాలు అనుభవాలు
- అన్యాయమైన పద్ధతిలో ఎవరైనా ఒకసారి తప్పించుకోవచ్చు. కానీ అక్కడితోనే ఆగిపోతే, అది వారి న్యాయమైన గెలుపుగా చలామణీ అవుతుంది. అందుకే అన్యాయాన్ని మళ్లీ మళ్లీ ప్రశ్నించడం ద్వారానే న్యాయాన్ని గెలిపించుకోవచ్చు..
- 1942లో అంబేద్కర్ చేసిన ఆంధ్రప్రదేశ్ పర్యటన తర్వాత కుల వివక్ష కొంత బలహీనపడింది. ఏ సంఘ సంస్కరణ అయినా, ఉద్యమస్థాయిలో జరిగితే తప్ప ఆశించిన మార్పు జరగదన్నది నా భావన.
- అన్యాయాన్ని ఎవరూ ధిక్కరించకపోతే, అదే పనిగా అన్యాయం చేసేవారికి అది న్యాయంగానే అనిపిస్తుంది. ఎవరో ఒకరు అది అన్యాయమని రుజువు చేయగలగిన నాడు, అన్యాయస్తులు తమ శక్తి సామర్థ్యాలను కోల్పోతారు.
- పోరాటాలు ఏం నేర్పుతాయి? గెలుపోటములను సమదృష్టితో చూసే శక్తినిస్తాయి. జీవితాన్నీ మరణాన్నీ సమదృష్టితో చూసే జ్ఞానాన్నిస్తాయి. ఏ సమస్యను అధిగమించడానికైనా, ఏ వ్యాధిని జయించడానికైనా ఆత్మవిశ్వాసాన్ని మించిన ఔషధం మరొకటి లేదనుకుంటాను.[2]
రచనలు
ఇతడు వ్రాసిన ఈ క్రింది పుస్తకాలు ప్రచురితమయ్యాయి.[3]
- పోలీసులు అరెస్టు చేస్తే (1981)
- నది పుట్టిన గొంతుక (1983)
- కులం వర్గం (1996)
- నాలాగే గోదావరి (2000)
- నేల నాగలి మూడెద్దులు (2008)
- దళితులు - రాజ్యం (2008)
- ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు (2012)
- ఎస్సీ ఎస్టీ నిధులు విదిలింపు - మళ్ళింపు (2012)
- పంచతంత్రం (నవల, 2012)
- చరిత్ర మార్చిన మనిషి - ఆది రుద్రాంధ్ర ఉద్యమంలో బొజ్జా అప్పలస్వామి (జీవిత చరిత్ర, 2016)[4]
- నలుపు సంపాదకీయాలు (2017)
- నలుపు వ్యాసాలు (2017)
- Mahad: The march that is launched everyday (2018)
- అంటరానితనం ఇంకానా?(2019)
- ఇది రిజర్వేషన్ల దేశం (2019)
పదవులు
- దళిత మహాసభ - వ్యవస్థాపకుడు
- కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పోలిటికల్ ప్రిజనర్స్ - అధ్యక్షుడు
- తెలంగాణ ప్రజాస్వామిక వేదిక - కన్వీనర్
మరణం
ఇతడు మెదడుకు సంబంధించిన కేన్సర్‌తో బాధపడుతూ 2016, సెప్టెంబరు 16వ తేదీ హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించాడు.[5]
మూలాలు
బయటి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.